ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ


దాదాపు దేశంలోని అన్నీ ప్రాంతాల నుండీ ఈశాన్యీయులు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళుతున్నా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చర్యలు కరువయ్యాయి. ‘మీకేం భయం లేదు, ఉన్న చోటనే ఉండండి’ అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న నోటి మాటల వాగ్దానాలు వారిలో ధైర్య, స్ధైర్యాలను నింపలేకపోతున్నాయి. అక్కడక్కడా పారామిలిటరీ బలగాల చేత ఒకటి రెండు సార్లు కవాతు చేయించినా, రాష్ట్రాల  హోమ్ మంత్రులు పత్రికల్లో, చానెళ్లలో కనబడి హామీలు గుప్పిస్తున్నా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం ఆగడం లేదు. ఒక కేంద్ర ప్రభుత్వం, 29 రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన భారత రాజ్యం ఈశాన్య ప్రజల్లో తమ భద్రతపై గుప్పెడు విశ్వాసం నింపలేకపోవడం సిగ్గు చేటు.

అస్సాం, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు అబధ్రతకు గురై స్వస్ధలాలకు తిరిగి వెళ్తున్నవారిలో ఉన్నారు. దాదాపు వీరంతా కింది స్ధాయి ఉద్యోగాల్లో శ్రమిస్తున్నవారే. హోటళ్లలో వంటవారుగా, బేరర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో కార్మికులుగా, బ్యూటీ పార్లర్ కార్మికురాళ్ళుగా, సేల్స్ గర్ల్స్ గా వీరు ప్రధానంగా పని చేస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది. ప్రారంభంలో బెంగుళూరు, హైద్రాబాద్, పూనే నగరాల్లో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఈశాన్యీయుల తిరుగు ప్రవాహానికి ప్రేరణ ఇవ్వగా అనంతరం మతం ఆధారంగా జరిగిన దుష్ప్రచారం, అబద్ధపు పుకార్లు దానిని వేగవంతం చేశాయి.

బెంగుళూరు, హైద్రాబాద్ లాంటి నగరాల్లో “మీరు ఇళ్లకు వెళ్లకపోతే ఒక మైనారిటీ మతస్ధుతులు మిమ్మల్ని బతకనివ్వరు’ అన్న హెచ్చరికలు ఈశాన్య ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. అదే రకం సందేశాలతో వారి సెల్ ఫోన్లకు ఎస్.ఎం.ఎస్ లు ప్రవాహంలా వచ్చిపడడం, ఎక్కడో ఎప్పుడో జరిగిన అల్లర్ల వీడియోలను సందర్భ శుద్ధి లేకుండా ఎం.ఎం.ఎస్ లుగా పంపడం, శ్రేయోభిలాషుల ముసుగులో వచ్చి భద్రత కోసం వెళ్ళక తప్పదని హెచ్చరించడం, సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో మార్ఫింగ్ చేసిన దృశ్యాలతో కూడిన తప్పుడు వీడియోలు వేగంగా వ్యాప్తి కావడం… ఇవన్నీ ఈశాన్య ప్రజల భయాందోళనలను అనేక రేట్లు పెంచాయి.

వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పత్రికలు, టి.వి చానెళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో ఈశాన్య ప్రజలపై దాడులు జరిగాయంటూ నిర్ధారించుకోకుండా ప్రసారం చేసిన వార్తలు అక్కడివారిపై ప్రభావం చూపాయి. దూరంగా ఉన్న తమవారికి ప్రమాదం జరగనున్నదనే ఆందోళనతో వారు తమ బంధువులను, కొడుకు కూతుళ్లనూ ఇంటికి తిరిగి వచ్చేయమని ఒత్తిడి పెంచడంతో అంతగా భయపడని వారు కూడా ప్రయాణం అవుతున్నారు. బెంగుళూరు, హైద్రాబాద్, పూణే నగరాలతో మొదలయిన ఈ తిరుగు వలసలు ఒకటి రెండు రోజుల్లోనే చెన్నై, మంగుళూరు, కోయంబత్తూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు కూడా పాకాయి.

శ్రామికుల వలస

ఇంత జరిగాక తిరిగి వెళ్ళినవారు స్వస్ధలాల్లో ఏ పని చేసి జీవనం గడపనున్నారన్నదీ వారికే అంతుబట్టని విషయంగా ఉంది. తమ ప్రాంతాల్లో పొట్ట గడుపుకునే అవకాశమే ఉంటే ఇక్కడిదాకా వచ్చే అవసరమే ఉండకపోను. వ్యవసాయ పనుల అత్తెసరు కూలీ అవసరాలను ఏ మాత్రం తీర్చలేని పరిస్ధితి ఒక వైపు, కొద్దో గొప్పో చదువుకుని గౌరవనీయ జీవనం కోసం చేసే ప్రయత్నాలు మరోవైపు యువతీ యువకులను పట్టణాలకు కొనిపోతున్నాయి. భారత ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా నూతన ఆర్ధిక విధానాలను దూకుడుగా అమలు చేస్తున్న పరిస్ధితి దీనికి ప్రధాన నేపధ్యంగా ఉంది.

పశ్చిమ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా రాజీవ్ గాంధీ ప్రారంభించిన విధానాలు మన్మోహన్ ప్రవేశంతో నూతన ఆర్ధిక విధానాలుగా, సరళీకరణ-ప్రవేటీకరణ-ప్రపంచీకరణలుగా (Liberalisation-Privatisation-Globalisation -ఎల్.పి.జి) ఊపందుకోవడంతో దేశ ఉత్పత్తి రంగాన్ని బహుళజాతి కంపెనీలు ఆక్రమించేశాయి. ఫలితంగా దేశ వ్యాపితంగా ఉద్భవించిన కింది స్ధాయి శ్రామిక పనుల్లోకి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సైతం ప్రవేశించడం పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాలతో పాటు దేశంలోని ఇతర పట్టణాలకు, నరగాలకు కూడా వీరు వలస పోవడం పెరిగింది. నూతన ఆర్ధిక విధానాల ఫలితంగా అభివృద్ధి చెందిన సాంస్కృతిక పరిశ్రమల్లో (ఆతిధ్యం, శారీరక అందం మొ.వి) ఈశాన్య మహిళలకు ఉన్న ఆదరణ వారికి కొన్ని రకాల ఉద్యోగాల్లో ప్రాధాన్యత దొరికేలా చేసింది. ఈశాన్య ప్రజలు స్వతహాగా సౌమ్యులనీ, సాధు స్వభావులనీ, సమస్యలకు దూరంగా ఉంటారనీ పేరు ఉండడం ఇటువంటి ఆదరణకు దోహదపడింది. 

ఈ విధంగా పెరిగిన వలసలు అక్కడి గ్రామీణ వ్యవసాయ పనుల్లో శ్రామికులకు ఏదో మేరకు కొరతను సృష్టించింది. ఈ కొరతలోకి బంగ్లాదేశ్ వలస కార్మికులు ప్రవేశించడం అనివార్యంగా జరిగిన పరిణామం. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న వలసలను శ్రామికుల వలసగా కాకుండా ముస్లింల వలసలుగా చూడడం ఘోరమైన తప్పిదం అవుతుంది. స్ధానిక ప్రజల అనుమతి లేకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత, ఆమోదం లేకుండా ఈ పరిణామం సాధ్యం కాదు. అయినప్పటికీ పాలకులు దీనిని ఒప్పుకోరు. విదేశీ కంపెనీలకు అనుకూలంగా అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు ఈశాన్య ప్రజల అంతర్గత వలసలను ప్రేరేపించడంతో పాటు, బంగ్లాదేశ్ ముస్లిం శ్రామికుల వలసను సుసాధ్యం చేస్తున్నదన్న వాస్తవం వారికి ఎన్నికల్లో సమస్యలను సృష్టిస్తాయి గనక వారు ఒప్పుకోరు.

జాతుల సమస్య

అస్సాం లో తలెత్తిన ఘర్షణలు ప్రధానంగా జాతుల సమస్య ఫలితం. ఆర్ధికంగా, సాంస్కృతికంగా అణచివేతకు గురవుతున్న జాతులు అనివార్యంగా తమకు తెలిసిన పద్ధతుల్లో, తమకు అర్ధమైన పద్ధతుల్లో ప్రతిఘటనకు సిద్ధపడతాయి. ఈ ప్రతిఘటనను బంగ్లాదేశ్ ముస్లిం వలస సమస్యగా మార్చడంలో భారత పాలకుల మోసం ఉన్నది. జాతుల సమస్యకు సామ్రాజ్యవాద అనుకూల పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలకుల వద్ద పరిష్కారాలేవీ ఉండవు. వారే జాతుల సమస్యకు మూలం కావడమే అందుకు కారణం. భారత దేశ ప్రధాన భూభాగం లోని పెట్టుబడిదారీ ధనికవర్గాలు ఈశాన్య రాష్ట్రాల ధనిక వర్గాలకు అవకాశం ఇవ్వకుండా అక్కడి భూమి, నీరు, ఖనిజాలు, అడవులు లాంటి సహజ వనరులను స్వాయత్తం చేసుకోవడంపై ఎదురవుతున్న ప్రతిఘటనే ఈశాన్య రాష్ట్రాల్లోని జాతుల సమస్య.

ఈ సమస్య ప్రస్తుత వ్యవస్ధ పరిధిలో తాత్కాలికంగానైనా పరిష్కారం కావాలంటే స్ధానిక ఆధిపత్య వర్గాలకు తగిన వాటా ఇవ్వడానికి ఒప్పుకోవాలి. దానికి బదులు అణచివేతను భారత పాలకవర్గాలు ఎంచుకున్నాయి. జాతి సంబంధమైన ప్రజాస్వామిక ఆకాంక్షలను శాంతి భద్రతల సమస్యగా, మతపరమైన సమస్యలుగా ముద్రవేసి దుర్మార్గ చట్టాలను అమలు చేస్తున్నాయి. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ [Armed Forces (Special Powers) Act -1958] అనే రాక్షస చట్టాన్ని వినియోగించి ఈశాన్య రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను క్రూరంగా అణచివేస్తున్నాయి. తమ అణచివేతకు మద్దతు పొందడానికి నెపాన్ని పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లపైకి నెట్టడానికి సైతం వెనుకాడడం లేదు.

పాకిస్ధాన్ లో ఎవరో తప్పుడు వార్తలను, ఫోటోలను సృష్టించడం వల్లనే సమస్య ముందుకొచ్చింది అన్నట్లుగా కేంద్ర పాలకులు కొత్తగా వాదన ప్రారంభించాయి. గాలి వార్తలు, తప్పుడు వార్తలు ఉంటే అవి ఆ స్ధాయిలోనే ఉంటాయి తప్ప రాష్ట్ర స్ధాయిలో విచక్షణారహిత హింసకు, దేశ స్ధాయిలో భయాందోళనలకు దారి తీస్తాయంటే నమ్మలేని విషయం. గాలి వార్తలకు సహకరించే పునాది వాస్తవంలో లేకుండా అవి ప్రచారం కాజాలవు. గాలి వార్తలు పుట్టాలన్నా సామాజిక పునాది ఉండవలసిందే. నూతన ఆర్ధిక విధానాల అమలు వల్ల ఈశాన్య జాతుల్లో ఛిద్రమైన సాధారణ ఆర్ధిక, సామాజిక జీవనమే గాలివార్తలకు మద్దతుగా నిలిచిన పునాది. అస్సాంలోని జాతుల సమస్య మత ఘర్షణలు గా వ్యక్తీకృతం అవుతున్నందువల్ల పాలకుల మోసాలు సులవవుతున్నాయి.

జాతుల సమస్య పరిష్కారం కాకుండా, ఈశాన్య జాతుల ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరకుండా అస్సాం లో మరోసారి ఘర్షణలు తలెత్తవన్న గ్యారంటీ లేదు. అస్సాంలో దశబ్ధాలుగా సాగుతున్న ఘర్షణలు, మిజోరం తదితర ఈశాన్య రాష్ట్రాలలో అమలవుతున్న ‘భద్రతా దళాల ప్రత్యేకాధికారాల చట్టం’, తెంపు లేకుండా సాగుతున్న నాగాల సాయుధ పోరాటం… ఇవన్నీ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

2 thoughts on “ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ

 1. ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకి గుర్తుకొచ్చేది విభిన్న జాతులు కలయిక. వాళ్ళు చాల కాలం స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అస్తిత్వనకే ముప్పు వచ్చింది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వల్ల, అది ప్రభుత్వం ఓట్లు కోసం వలసల్ని ప్రోత్శాహించడం ఈ అగ్ని కి ఇంకా పెట్రోల పోస్తున్నట్టు ఉంది. మీరు వేరే ఇంగ్లీష న్యూస్ సైట్స్, కాని బ్లాగ్స్ కాని చుస్తే , అందులో కామెంట్స్ చదివితే కనుక కేవలం వలసలు తప్ప వేరే కారణం ఉండదు. not just one or two, all are expressing the same opinion from different parts of the country and especially people from North East.. అంతే కాదు వలస వచ్చిన వాళ్ళు , వీళ్ళ మీద అధిపత్యం చెలాయించడం , వీళ్ళ వనరులు దోచుకోవడం, ఆఖరకి వీళ్ళనే తరిమి కొట్టేస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒక మతస్తులనే ఈ ప్రభుత్వం support చేయడం. వలసల గురించి ప్రభుత్వం ఎక్కడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఎక్కడ తమ వోట్ బ్యాంకు పోతుందేమో అని.

  ఇప్పుడు సౌత్ ఇండియన్ రాష్ట్రాల నుండి జరిగే ఈ వలసలు చుస్తుంటే, ఒక్కలకి కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని అనిపిస్తుంది. ఎందుకటే వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి ప్రభుత్వం ఎవరిని సపోర్ట్ చేస్తుందో. ఇన్ని వేల మంది పారిపోయేది ఒక మతస్తులని చూసి కాదు, రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాలని చూసి. మీరు చెప్పినట్టు ఇవి శ్రామిక వలసలే కాని ఇండియా లో కాదు, బంగ్లాదేశ్ లో.
  ఇండియా లో మాత్రం ఇవి ముస్లిం వలసలే, ఎందుకంటే తమ బ్రతుక్కే గండం ఏర్పడినప్పుడు అది కూడా ఒక మతస్తుల వల్ల, ఎవ్వరైనా ఆలోచించేది ఇలానే.

  పుకార్లు వచ్చేది అబద్దం కాదు, I read some news that people are receiving threatening SMSes. ఇలాంటి సంఘటలు జరిగినప్పుడు మతాలకి అతీతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం స్వార్దం తో తన బాధ్యత ని వదిలేస్తే , మిగిలిన దేశ ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో మీరు గమనించచ్చు.

 2. వెంకట్ గారూ, మీరు చెప్పిన వలసలు సమస్యలోని ఒకానొక కోణం. కాని అదే సమస్యకు మూలం కాదని నా అభిప్రాయం.

  మీరన్నట్లు ఈశాన్య జాతులు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్నారు. ఎవరినుండని మీ ఉద్దేశ్యం? వలసదారులనుండయితే కాదు కదా. ఎవరి ఆధిపత్యం వల్లనైతే స్వయం ప్రతిపత్తి భంగం అయిందని భావిస్తున్నారో వారి నుండి. నేను ఆర్టికల్ లో చెప్పినట్లు భారతదేశ ప్రధాన ధనిక వర్గాలు అక్కడి వనరులను వశం చేసుకుని స్ధానికులకు (ధనికులకు) తగిన వాటా ఇవ్వకపోవడం వల్లనే స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్ తలెత్తింది. స్వయం ప్రతిపత్తి ఉన్నట్లయితే స్ధానిక వనరులపైన నిర్ణయాధికారం తమ చేతికి వస్తుందన్న నమ్మిక వల్ల ఆ డిమాండ్ వచ్చింది. ఆర్ధిక స్వావలంబన కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆ డిమాడ్ వెనుక ఉన్నాయి. ఆర్ధిక స్వావలంబన కోసం స్ధానిక జాతులు చేస్తున్న ప్రయత్నాలు, స్టేటస్ కో కోసం బయటి వర్గాలు చేస్తున్న ప్రయత్వాలు ఘర్షణ పడడమే అక్కడి ప్రధాన సమస్య. ఇతర సమస్యలన్నీ దీనికి అనుబంధంగా తలెత్తుతున్నవని గుర్తించాలి.

  మీరు చెప్పినట్లు బంగ్లాదేశ్ వలసలు సమస్యకు కారణమని పత్రికలు చెపుతున్నాయి. వలసలు కారణం కాదని చెబుతున్న పత్రికలు కూడా ఉన్నాయి. ‘ది హిందూ’ లో కొద్ది రోజుల క్రితం వలసలు బర్నింగ్ సమస్య కాదనీ, అది సృష్టించబడిన కారణమనీ గణాంకాలతో సహా వివరిస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. కొన్ని ఇతర పత్రికల్లో కూడా అలాంటివి చూసాను. వార్తా కధనాల్లో సంఘటనల రిపోర్టింగ్ ని ఇబ్బంది లేకుండా స్వీకరించవచ్చు. కాని విశ్లేషణలకి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కార్పొరేట్ పత్రికలు గనక, వారికి కంపెనీలే స్పాన్సర్లు గనక వారికి ఉన్న వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా విశ్లేషణలు సాగే అవకాశం ఎక్కువ. అలాగని స్వీపింగ్ స్టేట్ మెంట్ తో అన్నింటినీ కొట్టిపారేయలేము గానీ జాగ్రత్త తప్పనిసరి. పత్రికల్లో వచ్చే అభిప్రాయాలే సాధారణంగా జనం కూడా అలవాటు చేసుకుంటారు. వాస్తవ పరిస్ధితులను అధ్యయనం చేసి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలన్న అవసరం, ఓపిక సాధారణంగా తక్కువ గనక పత్రికలు చొప్పించే అవగాహన చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్ధితిని గూడ గమనించాలి.

  ఈశాన్య రాష్ట్రాలనుండి ఇతర రాష్ట్రాలకు వలస వస్తున్నారంటే పని కోసమే కదా. అందువల్ల వారి వలసలు కూడా శ్రామిక వలసలే అవుతాయి కదా.

  రక్షణ కల్పించలేని ప్రభుత్వాల వల్లనే తిరుగు ప్రవాహం జరుగుతోందని మీరు చెప్పింది నిజం. మతాలకి అతీతంగా పని చేయడం అంటే ఓటు బ్యాంకులకి అతీతంగా పని చేయడం అన్నమాట. ఆ పనిని రాజకీయ పార్టీలు చస్తే చేయవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s