పెట్టుబడిదారులకి సంక్షోభం కనిపించేది ఇలాగే -కార్టూన్


పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే ‘చక్ర భ్రమణ సంక్షోభాలు’ (cyclic crises) ప్రజల మూలుగలని పిప్పి చేసినా పెట్టుబడిదారులకి కాసులు కురవడం మాత్రం ఆగిపోదు. సంక్షోభం పేరు చెప్పి సర్కారు ఖజానాపై మరింత దూకుడుగా ఎలా వాలిపోవాలో అనేక వంచనా మార్గాలని వారు అభివృద్ధి చేసుకున్నారు; సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకి కొత్త కాదు గనక. ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల సొమ్ము భోంచేసినప్పటికీ, కంపెనీలు దానిని ఏ మాత్రం కార్మికవర్గానికి విదల్చకపోవడం వల్ల సంక్షోభం ప్రధాన ఫలితం నిరుద్యోగమే అవుతుంది. నిరుద్యోగం పెచ్చు మీరి, చేద్దామన్నా పని దొరకని పరిస్ధితుల్లో అత్యంత హీనమైన వేతనాలకు సిద్ధపడే నిరుద్యోగ సైన్యాన్ని పెట్టుబడిదారీ సంక్షోభాలు సృష్టిస్తాయి. కుప్పలు తెప్పలుగా వీధుల్లో తిరుగాడే నిరుద్యోగులకి అల్ప వేతనాలిచ్చి మరిన్ని లాభాలనూ, తద్వారా పెట్టుబడులను పోగేసుకునే పెట్టుబడిదారులకి ‘సంక్షోభం’ అన్న ప్రశ్నే తలెత్తదు. ఇ.యు కేసినోలో పెట్టుబడిదారీ వర్గం వెట్టి కార్మికుల్ని జాక్ పాట్ గా కొట్టేసిందన్న బ్రెజిల్ కార్టూనిస్టు కార్లోస్ లాతుఫ్ కార్టూన్ అంతరార్ధం ఇదే.

(ఇ.యు కేసినో లో పెట్టుబడిదారీ వర్గానికి లభించిన జాక్ పాట్….)

సంక్షోభాలు తెచ్చిన పెట్టుబడిదారీవర్గానికే ఎదురు బెయిలౌట్లు ఇచ్చి మేపమన్న కీన్స్ సిద్ధాంతానికి ఆ వర్గం రుణపడి ఉంది. రెండు ప్రపంచ యుద్ధాలకు దారి తీసిన వరుస సంక్షోభాలు ‘మార్కెట్ కి ముందు ప్రభుత్వాన్ని నిలిపిన’ ‘మేనార్డ్ కీన్స్’ కి జన్మనిచ్చాయి. ‘మాంద్యం’ (recession)  తెచ్చిపెట్టే  సైక్లిక్ సంక్షోభాల పరిష్కారానికి ప్రభుత్వాలే (అప్పులు తెచ్చయినా) ఖర్చులు చేయాలన్న కీన్స్ సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉనికిని కొనసాగించిందంటే అతిశయోక్తి కాదు. 1999 లో 20 వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల్లో కీన్స్ ని చేరుస్తూ ‘టైమ్స్’ పత్రిక చెప్పింది అదే. “ప్రభుత్వాలు తమ వద్ద లేని డబ్బును ఖర్చు చేయాలన్న ఆయన మూల భావన ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ’ ను కాపాడి ఉండొచ్చు’ (His radical idea that governments should spend money they don’t have may have saved capitalism.) అంటూ కీన్స్ సిద్ధాంతానికి టైమ్స్ భాష్యం చెప్పింది. దాని అర్ధం “ఉన్న సొమ్మంతా ‘–‘ కింద దాచుకున్న పెట్టుబడిదారులు అప్పు పుట్టని పరిస్ధితిని (credit crunch) ప్రపంచం నెత్తిమీదికి తెచ్చిన పరిస్ధితుల్లో వారి డబ్బుని ప్రభుత్వమే అప్పుగా తీసుకుని ఖర్చు చేయాలనే.”

సంక్షోభ సమయాల్లో డబ్బు రాశులపై కూర్చుని కూడా బీద పలుకులు పలికే (పెట్టుబడిదారీ) కంపెనీల సొమ్ముని ప్రభుత్వం అప్పుగా తీసుకుని చలామణీలోకి తెస్తే, స్తంభించిపోయిన ఆర్ధిక వ్యవస్ధ చట్రం కీచు మంటూ ముందుకు కదులుతుందని కీన్స్ భావన. ఆర్ధిక స్తంభన ఏర్పడినప్పుడు ‘మదుపు’ (investment), ‘వినియోగం’  (consumption) లలో చురుకు తెప్పించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనీ, లేనట్లయితే అల్పవేతనాలు సుదీర్ఘ కాలం కొనసాగి సంక్షోభం ముదిరిపోతుందనీ కీన్స్ సిద్ధాంతీకరించాడు. సరఫరాయే తనంతట తాను డిమాండ్ ను సృష్టించుకుంటుందనీ, ప్రభుత్వాలు జోక్యం చేసుకోనంతవరకూ, సంక్షోభ సమయంలో పెట్టుబడే (మార్కెట్) ఆటో మేటిగ్గా ‘పూర్తి ఉద్యోగిత సమతుల్యత’ (full employment equlibrium) సాధిస్తుందనీ చెప్పిన నియో-క్లాసికల్ ఎకనమిక్ ధియరీ ని  కీన్స్ సిద్ధాంతం పూర్వపక్షం చేసింది.

పెట్టుబడిదారులకి పరమ ఇష్టమైన ‘క్లాసికల్ ఎకనిమిక్ ధియరీ 19 శతాబ్ధాంలోని నిర్ధిష్ట పరిస్ధితులకే పని చేసిందనీ తాను చెప్పింది సాధారణ సిద్ధాంతమనీ’ చెప్పిన కీన్స్ ని తిట్టుకున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గం సంక్షోభ కాలాల్లో మాత్రం ఆయనని ఆబగా వాటేసుకుంటుంది. మదుపు లోనూ, వినియోగంలోనూ ప్రభుత్వమే చురుకు పుట్టించాలని కీన్స్ చెప్పగా పెట్టుబడిదారీ వర్గం అందులో సగమే స్వీకరిస్తుంది. మదుపులో ప్రభుత్వ పాత్రను స్వీకరిస్తూ ప్రభుత్వానికి తానే అప్పులిచ్చి (సావరిన్ బాండ్ల ద్వారా) కాంట్రాక్టులు కొట్టేస్తుంది. కానీ వినియోగం లో చురుకు పుట్టించే ఉద్యోగిత (employment) కి వచ్చేసరికి మొఖం చాటేస్తుంది. పైగా అల్పవేతనాలను కార్మికవర్గంపై రుద్దుతుంది.

సంక్షోభాల్లో ఇప్పుడు అనేక  విధాలుగా పెట్టుబడి లాభపడుతున్నది. సంక్షోభం పేరు చెప్పి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రజల పన్నుల డబ్బుని బెయిలౌట్ల రూపంలో  కారు చౌకగా కొట్టేయడం, అదే సంక్షోభం వంకతో ‘పొదుపు విధానాల’ ద్వారా కార్మికుల వేతనాలను పాతాళానికి తోక్కేసి వారి శ్రమ శక్తి ని కారు చౌకగా కొనుగోలు చేయడం, ప్రభుత్వానికి అప్పులిచ్చి వడ్డీ సొమ్ము కాజేయడం, తమకు ఎంతో ముద్దయిన ‘క్లాసికల్ ఎకనమిక్ ధియరీ’ అప్పజెప్పిన ‘పూర్తి ఉద్యోగిత సమతుల్యత’ బాధ్యతను గాలికి వదిలేసి ఆ సోమ్మూ మిగుల్చుకోవడం, ఋణ సంక్షోభ పీడిత దేశాలకు దయతో ఇచ్చినట్లు అప్పులిచ్చి పాత బాకీలు వసూలు చేసుకోవడం (ఉదా: యూరప్ ఋణ సంక్షోభం) ఇలా…

పెట్టుబడిదారీ వర్గం క్లాసికల్ ఎకనమిక్ ధియరీ లో ‘ఆర్ధిక కార్యకలాపాలన్నీ మార్కెట్ కే అప్పజెప్పే’ భాగం స్వీకరించి ‘ఆటో మేటిగ్గా పూర్తి ఉద్యోగిత సమతుల్యత’ ను సృష్టించే బాధ్యతను ఎడమ కాలితో తన్నేస్తుంది. కీన్స్ సిద్ధాంతాన్ని తిడుతూనే ‘సంక్షోభాల్లో ప్రభుత్వాలే ఖర్చులు చేయాలన్న’ అవగాహనను నిస్సిగ్గుగా తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. [కీన్స్ సిద్ధాంతాన్ని పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఇప్పుడు విస్తృతంగా అమలు చేస్తున్నారని కీన్స్ అభిమానులు జబ్బలు చరుచుకుంటారు. బ్రిటిష్ ప్రధాని గార్డన్ బ్రౌన్, అనంతరం కామెరూన్, అమెరికా అధ్యక్షులు బుష్, ఒబామాలు కీన్స్ నే అనుసరించారనీ వారు గొప్పలు పోతారు. కానీ పెట్టుబడిదారీ వర్గం (ప్రభుత్వం ద్వారా ప్రజల సొమ్ము)  తీసుకోవడమే తప్ప (ఉద్యోగాల రూపంలో ప్రజలకు) ఇవ్వడం ఏమీ లేదన్న సత్యాన్ని మాత్రం సానుకూలంగా విస్మరిస్తారు.] పెట్టుబడిదారుల పోటీ ద్వారా సరుకుల్లో నాణ్యత పెరిగి, చవకగా ప్రజలకు అందుతాయన్న ఆడమ్ స్మిత్ పోటీ సిద్ధాంతాన్ని ‘సామ్రాజ్యవాదం, ఫైనాన్స్ పెట్టుబడి’ ల అభివృద్ధి ద్వారా పెట్టుబడిదారీ వర్గం ఏనాడో చాప చుట్టేసింది.

అంటే పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తల సిద్ధాంతాలను పెట్టుబడిదారీ వర్గమే గౌరవించదన్నమాట. ఇలా చెప్పడం కంటే పెట్టుబడి గతిని సిద్ధాంతీకరించడంలో పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ఘోరంగా విఫలం అయ్యారంటే సరిగ్గా ఉంటుంది. పెట్టుబడి గతిని, సరిగ్గా పొల్లు పోకుండా సిద్ధాంతీకరించింది ‘కారల్ మార్క్స్’ మాత్రమే. అందువల్లనే 2008 ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాలు కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగిన అమెరికా, యూరప్ ల ఆర్ధికవేత్తలు (పాల్ కృగ్ మన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్, రౌబిని మొ.) కారల్ మార్క్స్ ‘పెట్టుబడి’ ని తిరగేయక తప్పలేదు. తిరగేయనివారు కొత్తగా చెప్పగలిగేదేమీ లేదు. చెప్పింది కూడా ఏమీ లేదు.

వ్యాఖ్యానించండి