55,000 మందికి పైగా పిల్లలు తప్పిపోయారనీ, వారిని వెతికి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – పిల్) దాఖలయింది. తప్పిపోయిన పిల్లలందరిని వెతకండం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని అడ్వకేట్ సర్వ మిత్ర దాఖలు చేసిన పిటిషన్ కోరింది.
“రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో విఫలం అయింది. ఫలితంగా ఈ పిల్లల జీవితం పూర్తిగా అంతమయ్యే పరిస్ధితి నెలకొంది. వీరి చేతులు, కాళ్ళు తొలగించడం, కళ్ళు పీకడం, లేదా ఏదైనా ఇతర అవయవాలను తొలగించడం వల్ల వికలాంగులుగా దుర్భర జీవనం గడుపుతున్నారు. అడుక్కునే వృత్తిలోకి, వ్యభిచారంలోకి బలవంతంగా దింపుతున్నారు” అని మిత్ర తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపాడు.
“రాష్ట్ర పోలీసులు కిడ్నాపింగ్ కేసులు పరిశోధించడంలో విఫలం అయ్యారు. తప్పిపోయిన పిల్లలను వెతకడంలోనూ విఫలం అయ్యారు. తద్వారా అలాంటి పిల్లల జీవించే హక్కును, స్వేచ్చా హక్కును పూర్తిగా నిరాకరించబడింది” అని పిటిషన్ పేర్కొంది. “ఆర్గనైజ్డ్ గ్యాంగులు సాగించిన 55,000 కి పైగా కిడ్నాపింగ్ కేసులను ఛేదించడంలో రాష్ట్రాలన్నీ విఫలం అయ్యాయి. దురదృష్టం వెన్నాడిన ఈ పిల్లలను మద్యం అమ్మడానికీ, స్మగ్లింగ్ చెయ్యడానికీ, వ్యభిచారం చెయ్యడానికీ వినియోగిస్తున్నారు. చట్ట విరుద్ధ చర్యల కోసం, లైంగిక దోపిడి కోసం, రవాణా కోసం పసి పిల్లలను అమ్మడం కొనడం జరుగుతోంది” అని తెలిపింది.
జస్టిస్ ‘అఫ్తాబ్ ఆలం’ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచి పిటిషన్ ను విచారించడానికి గురువారం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ ఈ విషయమై నోటీసులు జారీ చేసింది. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి సమాధానం కోరింది.
నోరు లేని పిల్లలు శారీరకంగా, మానసికంగా బలహీనులు. తల్లిదండ్రుల సమక్షంలో ఆలనా, పాలనా తీర్చుకోవలసిన వారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని పాప పుణ్యాలు, కష్ట నష్టాలు, కుట్రలు, మోసాలు ఏమీ తెలియనివారు. అలాంటి పసి పిల్లల అవయవాలు తొలగించి అడుక్కునే వృత్తిలోకి దింపే ధూర్తులున్న సమాజం నాగరిక సమాజం కాజాలదు. వ్యభిచారంలోకి దింపడానికే ఆడపిల్లలను కిడ్నాప్ చేసి, కొనుక్కోచ్చి సాకి పెంచి పెద్ద చేసే నిర్దయులున్న సమాజం కొనసాగడానికి వీలు లేదు. ఇవన్నీ ఇప్పటి సమాజం లోపాలు మాత్రమే కాదు, లక్షణాలు. రోగ లక్షణాన్ని రూపుమాపాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం రోగాన్ని నయం చేయడమే.