ఆగస్టు 6 తేదీన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో గురుద్వారా పై జరిగిన టెర్రరిస్టు దాడిలో ఆరుగురు సిక్కులు హతులైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అమెరికా పౌరులు కాగా నలుగురు భారత పౌరులు. ఈ హత్యాకాండలో పాల్గొన్నది ఒకే ఒక్క ‘దేశీయ టెర్రరిస్టు’ అని పశ్చిమ దేశాల పత్రికలు ముక్తకంఠంతో తెలిపాయి. ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ‘వేడ్ మైఖేల్ పేజ్’ ఈ దారుణానికి పాల్పడ్డాడనీ, అతను వైట్ సూపర్ మాసిస్టు సంస్ధలో చురుకైన కార్యకర్త అనీ తెలిపాయి. విస్కాన్సిన్ రాష్ట్ర పోలీసులు, ఫెడరల్ పోలీసులు (ఎఫ్.బి.ఐ) కూడా ఇదే వాదన వినిపిస్తూ మరో షూటర్ ఉండడానికి అవకాశం లేదని నిర్ధారించాయి.
అయితే ఈ వాదన తప్పని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ స్వతంత్ర వార్తా సంస్ధలు వెల్లడి చేశాయి. ఒకరికంటే ఎక్కువమంది షూటర్లు ఉండగా, పేరు మోసిన పత్రికలు, వార్తా సంస్ధలతో పాటు రాష్ట్ర పోలీసులు, ఫెడరల్ పోలీసులు కూడా ఒక్కరే అని గట్టిగా ఎందుకు వాదిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానంలోకి వెళ్ళేముందు షూటర్లు ఒకరా లేక నలుగురా అన్న విషయాన్ని మొదట చూద్దాం.
నలుగురు షూటర్లు
ప్రముఖ స్వతంత్ర వార్తా వెబ్ సైట్ ‘ద ఇంటెల్ హబ్’ ప్రకారం సో కాల్డ్ డొమెస్టిక్ టెర్రరిస్టు కాల్పుల్లో చనిపోయినవారి బంధువులు ఒకరి కంటే ఎక్కువ మంది కాల్పుల్లో పాల్గొన్నారని తెలియజేశారు. గురుద్వారా నాయకుడు షూటింగ్ కి ప్రారంభం కావడానికి ముందు తాను కనీసం ఇద్దరు అనుమానితులను చూశానని చెప్పినట్లు ఇంటెల్ హబ్ తెలిపింది. షూటింగ్ జరగడానికి ముందు పూర్తిగా నల్లరంగు దుస్తులు ధరించిన నలుగురు షూటర్లు గురుద్వారాపై కాల్పులు జరిపారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాన్ని కింద వీడియోలో చూడవచ్చు.
పై వీడియోలో సాక్షి ఇలా చెబుతున్నాడు. “Between ten and ten-thirty, four white males who were dressed darkly, dressed in all black clothing, came in and opened fire on our congregation.” (పది, పదిన్నర మధ్య నల్ల దుస్తులు ధరించిన నలుగురు తెల్లజాతి మగవాళ్ళు, పూర్తిగా నల్ల దుస్తులు ధరించినవారు, లోపలికి వచ్చి మా కాంగ్రేగేషన్ పైన కాల్పులు ప్రారంభించారు). ఈ ఇంటర్వూ తీసుకునే సమయానికి కాల్పులు జరిపినవారిలో ఒకరు ఇంకా గురుద్వారాలో ఉన్నాడని కూడా సదరు సాక్షి చెప్పడాన్ని గమనించవచ్చు.
కింద మరో వీడియోని గమనిస్తే బహుళ సంఖ్యలో షూటర్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి నుండి వచ్చిన ఫోన్ ద్వారా తెలిసినట్లు మరో సాక్షి వివరిస్తున్న సంగతి చూడవచ్చు.
కాకేసియన్ డిస్సెంట్ కలిగి ఉన్న మల్టిపుల్ షూటర్లు కాల్పులు జరిపినట్లు పై వీడియోలో సాక్షి చెబుతున్నాడు.
కొలరాడో లో కూడా
కొద్ది రోజుల క్రితం కొలరాడో లో ‘బేట్ మేన్ రైజెస్’ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ లో జరిగిన కాల్పుల్లో సైతం ఒకరి కంటే ఎక్కువ మంది కాల్పుల్లో పాల్గొన్నారని ఇలాగే ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ విషయాన్ని కింద వీడియోలో చూడవచ్చు.
నిందితుడుగా గుర్తించిన జేమ్స్ హోమ్స్ తో పాటు మరో వ్యక్తి ధియేటర్ కాల్పుల్లో పాల్గొన్నాడని పై వీడియోలోని సాక్షి చెబుతున్నాడు. కాల్పులకు ముందు విసిరిన గ్యాస్ కేనిస్టర్ లలో కొన్ని మరో వైపు నుండి వచ్చాయనీ, అతను ప్రత్యేకంగా దుస్తులు ధరించినందున గుర్తు పట్టడం పెద్ద కష్టం కాదనీ కూడా అతను చెబుతున్నాడు.
అయినప్పటికీ ఒక్కరే కాల్పులు జరిపారని చెప్పడానికే ఎఫ్.బి.ఐ పోలీసులు ఆసక్తి చూపారు. ఒకరికంటే ఎక్కువమంది కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాన్ని కొట్టిపారేయడానికి వారు గట్టిగా ప్రయత్నించారు. కార్పొరేట్ పత్రికలు పోలీసుల వాదననే ప్రచారం చేశాయి తప్ప ప్రత్యక్ష సాక్షుల కధనాలను పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అనడం కంటే ఒక్కరే కాల్పులు జరిపాడన్న వాదనను ప్రచారం చేయడానికే అవి కట్టుబడి ఉన్నాయని చెప్పడం సముచితంగా ఉంటుంది. వార్తల చదువరులు, వీక్షకులు కార్పొరేట్ వార్తా సంస్ధలకే అలవాటు పడి ఉన్నందున అవి ఏది చెబితే అదే నిజంగా చలామణి అవుతున్నందున అసలు సంగతి వారికి చేరే అవకాశం తక్కువ.
సదరన్ పావర్టీ లా సెంటర్
ఒకరి కంటే ఎక్కువమందే కాల్పుల్లో పాల్గొన్నారని ఇప్పుడు ఒక నిర్ధారణకు రావచ్చు. కాల్పులు ఒక పధకం ప్రకారం జరిగాయనే దాని అర్ధం. పధకం ప్రకారం జరిగాయన్న నిజాన్ని దాచి ఉంచడానికే కార్పొరేట్ పత్రికలు ఒక్కొక్క వ్యక్తే ఈ ఘటనల్లో పాల్గొన్నాడని పదే పదే వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం చేశాయి. నయా-నాజీ భావాలు కలవారు ఈ హత్యాకాండలకు పాల్పడ్డారనీ, లేదా పశ్చిమ దేశాలలో తెల్లవారు తప్ప మరొకరు ఉండడానికి వీలులేదని భావించే తెల్లజాతి దురహంకారులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేయడం వెనుక కూడా అసలు విషయం దాచి పెట్టే కుట్ర దాగి ఉన్నదని ‘ఇంటెల్ హబ్’ విశ్లేషించింది.
‘వైట్ సూపర్ మాసిజం’ ముసుగులో టెర్రరిస్టు చర్యలు జరిగినపుడు వెనువెంటనే వార్తల్లో కనిపించేది ‘సదరన్ పావర్టీ లా సెంటర్’ (ఎస్.పి.ఎల్.సి) అనే సంస్ధ. వైట్ సూపర్ మాసిస్టు టెర్రరిస్టుల పైనా, వారి వెబ్ సైట్లపై నిఘా పెట్టిన ప్రవేటు సంస్ధగా ఎస్.పి.ఎల్.సి తన గురించి తాను చెప్పుకుంటుంది. గురుద్వారాలో కాల్పులకి దిగిన ‘పేజ్’ కూడా వైట్ సూపర్ మాసిస్టేననీ, సూపర్ మాసిస్టు మ్యూజిక్ బేండ్లలో అతను అనేక సంవత్సరాలుగా చురుకుగా ఉన్నాడనీ, ఇంటర్ నెట్ లో ‘వైట్ సూపర్ మాసిజం’ గురించి పేజీలు నింపడం మాని ఆచరణలోకి దిగాలని అతను కొద్ది కాలం క్రితం సూపర్ మాసిస్టు వెబ్ సైట్లలో వ్యాఖ్యలు కూడా రాశాడనీ కాల్పులు జరిగి ఆరుగురు చనిపోయాక ఎస్.పి.ఎల్.సి తీరిగ్గా చెప్పింది.
అయితే ఈ ఎస్.పి.ఎల్.సి సంస్ధకే ‘ఫాల్స్ ఫ్లాగ్ టెర్రరిజం’ (ప్రజలను మోస పుచ్చడానికి టెర్రరిస్టుల పేరుతో పశ్చిమ దేశాల ప్రభుత్వాలు వారి గూఢచారి సంస్ధల ద్వారా జరిపించే టెర్రరిస్టు చర్యలను ఫాల్స్ ఫ్లాగ్ టెర్రరిజంగా చెబుతారు. 9/11 కూడా అలాంటి టెర్రరిస్టు చర్యేననీ, అమెరికా పాలక సెక్షన్లలోని ఒక సెక్షన్ తన స్వప్రయోజనాల కోసం జరిపించిన దాడులే 9/11 దాడులని అనేక సంస్ధలు, పత్రికలు సాక్ష్యాధారాలతో వెల్లడి చేశాయి. ఇలాంటి వాస్తవాలను ‘కుట్ర సిద్ధాంతాలు’ అన్న ముద్ర వేసి కొట్టిపారేయడం ప్రభుత్వాలకు, కార్పొరేట్ పత్రికలకు పరిపాటి.) తో సంబంధాలు ఉన్నాయని ఓక్లహోమా టెర్రరిస్టు బాంబింగ్ పై విచారణ సందర్భంగా ఎఫ్.బి.ఐ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయింది. ఎఫ్.బి.ఐ కోసమే ఎస్.పి.ఎల్.సి ఈ సంబంధాలు నెరిపిందని ఈ డాక్యుమెంట్లు వెల్లడించాయి. 2005 లో ఈ విషయమై వచ్చిన వార్తను ఇక్కడ చూడవచ్చు. 160 మందికిపైగా చనిపోయిన ఓక్లహోమా దాడుల గురించి ఎఫ్.బి.ఐ కి ముందే తెలిసినా అడ్డుకోలేదని ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయిన పరిమిత సమాచారం ద్వారా తెలిసింది. దేశ భద్రత పేరుతో డాక్యుమెంట్ల వెల్లడి అడ్డుకోవడానికి ఎఫ్.బి.ఐ తీవ్రంగా ప్రయత్నించినా జడ్జి పట్టుబట్టడం వల ముఖ్యమైన సమాచారాన్నీ, అనేకమంది అధికారుల పేర్లనూ తొలగించి మొత్తంలో కొద్ది భాగాన్ని మాత్రమే కోర్టుకి ఇచ్చారు.
ఈ వాస్తవాల ద్వారా గుర్తించవలసింది ఏమిటంటే 1960 లలో అమెరికా, యూరప్ దేశాలు ‘కమ్యూనిస్టు’ భూతం పేరుతో ‘ఆపరేషన్ గ్లాడియా’ కింద సాగించిన టెర్రరిస్టు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయనే. ఏమిటీ ఆపటేషన్ గ్లాడియా? ట్రూత్ మూవ్ అనే వెబ్ సైట్ మాటల్లో చెప్పాలంటే….
Operation Gladio is undisputed historical fact. Gladio was part of a post-World War II program set up by the CIA and NATO supposedly to thwart future Soviet/communist invasions or influence in Italy and Western Europe. In fact, it became a state-sponsored right-wing terrorist network, involved in false flag operations and the subversion of democracy.
The existence of Gladio was confirmed and admitted by the Italian government in 1990, after a judge, Felice Casson, discovered the network in the course of his investigations into right-wing terrorism. Italian prime minister Giulio Andreotti admitted Gladio’s existence but tried to minimize its significance.
The main function of the Gladio-style groups, in the absence of Soviet invasion, seems to have been to discredit left-wing groups and politicians through the use of “the strategy of tension,” including false-flag terrorism. The strategy of tension is a concept for control and manipulation of public opinion through the use of fear, propaganda, agents provacateurs, terrorism, etc. The aim was to instill fear into the populace while framing communist and left-wing political opponents for terrorist atrocities.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టులను చంపేయడానికి సి.ఐ.ఏ, నాటో లు రూపొందించిన పధకమే ‘ఆపరేషన్ గ్లాడియా.’ భవిష్యత్తులో సోవియట్ దాడులను ఎదుర్కోవడానికని చెప్పి ఈ పధకం కింద ఇటలీ తదితర పశ్చిమ యూరప్ దేశాల ప్రభుత్వాలు సాగించిన దురాగతాలు అన్నీ, ఇన్నీ కాదు. ‘ఆపరేషన్ గ్లాడియా’ ఉనికిని ప్రభుత్వాలు మొదట నిరాకరించాయి. ఇటలీలో మితవాద టెర్రరిస్టు చర్యలపై విచారణ సందర్భంగా ఒక జడ్జి 1990 లో కనుగొనే వరకూ ఈ నిరాకరణ కొనసాగింది. అప్పటి ఇటలీ ప్రధాని స్వయంగా ‘ఆపరేషన్ గ్లాడియో’ ఉనికిని అంగీకరించాడని ‘ట్రూత్ మూవ్’ నుండి ఉటంకించిన పై భాగం ద్వారా తెలుస్తున్నది.
పైన ఆంగ్లంలో ఉటంకించిన సమాచారం ప్రకారం సోవియట్ భూతం ప్రమాదం తొలగిపోయాక గ్లాడియో గ్రూపుల పని తదుపరి స్ధాయికి అభివృద్ధి చెందింది. లెఫ్ట్-వింగ్ గ్రూపుల, రాజకీయ నాయకులపై దుష్ప్రచారం చేయదానికి ‘స్ట్రేటజీ ఆఫ్ టెన్షన్’ (ఉద్రిక్తత వ్యూహం?) ని వారు వినియోగిస్తున్నారు. ఇందులో ఫాల్స్ ఫ్లాగ్ టెర్రరిజం కూడా ఒకటి. ప్రజలను ఉద్రిక్తతలలోనికి, భయంలోనికి నెట్టి తద్వారా ప్రజాభిప్రాయాన్ని తమ పాలనకు అనుకూలంగా మలుచుకోవడం, నియంత్రించడం ఈ వ్యూహంలో ప్రధాన లక్ష్యం. భయపెట్టడం, ప్రాపగాండా, రెచ్చ గొట్టడం, టెర్రరిస్టు చర్యలకు పాల్పడడం… మొదలైన చర్యల ద్వారా ప్రజల్లోకి భయోత్పాతాన్ని చొప్పించి చర్యలకు బాధ్యులుగా లెఫ్ట్ ప్రత్యర్ధులపైకి నెట్టివేసే వ్యూహంలో ఇందులో దాగి ఉంది.
అమెరికాలో ‘ఆపరేషన్ గ్లాడియో’
అయితే, లెఫ్ట్ వింగ్ రాజకీయాలు పశ్చిమ దేశాల్లో ఇప్పుడొక సమస్యగా లేదు. కానీ సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు ఒక శత్రువు కావాలి. అది కూడా శక్తివంతమైన, ప్రజల్ని భయపెట్టగల శత్రువు వారికి కావాలి. అలా ముందుకు వచ్చిన శత్రువే ‘ప్రపంచ టెర్రరిజం.’ స్వతంత్రంగా వ్యవహరించే దేశాల్ని కబళించడానికి అలాంటి దేశాలనుండి తమ దేశాలకూ, ప్రజలకూ ప్రమాదం ఉందన్న అభిప్రాయం కలిగించడానికి ఉనికిలోకి వచ్చినదే ‘గ్లోబల్ టెర్రరిజం’. గ్లోబల్ టెర్రరిజం శక్తివంతమైనదని, ప్రమాదకరమైనదనీ నమ్మించడానికి 9/11 దాడులు జరిగాయన్నది వివిధ స్వతంత్ర వార్తా సంస్ధలు, పరిశీలకులు విప్పి చెప్పిన సత్యం.
9/11 దాడుల అనంతరం కూడా ‘ఆపరేషన్ గ్లాడియో’ వ్యూహం అమెరికాలో కొనసాగుతున్న ఫలితంగానే కొలరాడోలో ధియేటర్ హత్యాకాండ, విస్కాన్సిన్ లో గురుద్వారా హత్యాకాండ చోటు చేసుకున్నాయని ‘ఇంటెల్ హబ్’ విశ్లేషించింది. రెండు వారాల వ్యవధిలోనే జరిగిన ఈ జంట హత్యాకాండలు ‘ఆపరేషన్ గ్లాడియో’ లో భాగమేననీ, నవంబరు ఎన్నికలలోపు మరికొన్ని ‘వైట్ మాసిస్టు’ టెర్రరిస్తూ దాడులు జరిగే అవకాశం లేకపోలేదని ఇతర స్వతంత్ర సంస్ధలు కూడా విశ్లేషిస్తున్నాయి. స్వీడన్ ప్రధాని ఒలోఫ్ పామే హత్య, 1978లో ఇటలీ ప్రధాని ఆల్దో మోరో హత్య, పోప్ జాన్ పాల్ II పై జరిగిన కాల్పులు, జులై 2011 లో నార్వేలో బ్రీవిక్ జరిపిన హత్యాకాండ, 2012 లో బెల్జియం, ఫ్రాన్సు, ఇటలీలలో జరిగిన టెర్రరిస్టు దాడులు అన్నీ ‘ఆపరేషన్ గ్లాడియో’ ను తలపిస్తున్నాయని ‘రిచర్డ్ కోట్రెల్’ రాసిన పుస్తకం “Gladio: NATO’s Dagger At The Heart Of Europe” ని ఉటంకిస్తూ ‘ఇంటెల్ హబ్’ తెలిపింది.
9/11 టెర్రరిస్టు దాడులు జరిగి డజను సంవత్సరాలు పూర్తయినా సిక్కులు ముస్లింలు ఒకరేనని టెర్రరిస్టులు భ్రమించడం కొనసాగుతున్నదంటే నమ్మడానికి వీలు లేని విషయం. గురుద్వారాలో ఏకైక షూటర్ గా చెబుతున్న మైఖేల్ పేజ్, అనేక ఏళ్లుగా గురుద్వారాకు సమీపంలో నివసిస్తున్నప్పటికీ గురుద్వారాకీ, మసీదుకీ తేడా తెలియదంటే నమ్మలేము. పేజ్ తో పాటు మరో ముగ్గురు షూటర్లు ఉన్నారనీ, అందరూ నల్ల దుస్తులు ధరించి ఉన్నారనీ ప్రత్యక్ష సాక్షులు చెప్పినందున గురుద్వారా హత్యాకాండ విద్వేషం నిండిన వైట్ సూపర్ మాసిస్టు చేసినదని ఎఫ్.బి.ఐ నమ్మబలకడం మరింతగా అనుమానించవలసిన విషయం.
అమెరికా, యూరప్ లు సాగించిన, సాగిస్తున్న యుద్ధాలన్నీ అబద్ధాలు చెప్పి సాగిస్తున్నవే. అమెరికా చెబుతున్న టెర్రరిజం పై ప్రపంచ యుద్ధమే ఒక పెద్ద అబద్ధం. టెర్రరిజం పేరుతో తమ ప్రజలను భయోత్పాతంలో ఉంచడానికి తద్వారా మార్కెట్ల కోసం సాగించే దురాక్రమణ యుద్ధాలకు ప్రజల మద్దతు పొందడానికీ బహుళజాతి కంపెనీలు, వారి మద్దతుదారులైన ప్రభుత్వాలు ఎంతకైనా తెగిస్తాయని ‘గ్లాడియో’ ద్వారా స్పష్టం అవుతున్నది. దీనర్ధం ‘వైట్ సూపర్ మాసిజం’ ఉనికిలో లేదని కాదు. అది ఉనికిలో ఉండడానికీ కొద్దిమందైనా ప్రజల ఆదరణ పొందడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలేనని కూడా గుర్తించాలి.
====== ===== ===== ===== ===== =====
అప్ డేట్:
కింది వీడియో బి.బి.సి 1992 లో నిర్మించిన డాక్యుమెంటరీ. ‘ఆపరేషన్ గ్లాడియో’ గురించి సవివరంగా చర్చించిన డాక్యుమెంటరీ. ప్రధాన మంత్రులు, సెనేటర్లు, గూఢచార సంస్ధల అధికారులు, గ్లాడియో కోసం శిక్షణ పొందినవారు మొదలైనవారి వద్దనుండి ఇంటర్వ్యూలు సేకరించి ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. దాదాపు రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ వీడియో చూడడానికి ఓపిక కావలసిందే. చూడగలిగిన పాఠకులకి నమ్మలేని నిజాలు సొంతం అవుతాయి.
ఈ ఆర్టికల్ లో అంశాలన్నీ ఈ బ్లాగర్ కనిపెట్టిన విషయాలు కావు. వివిధ అంశాలకి కి ఆధారాలు కూడా లింక్స్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. వాటి ద్వారా వాస్తవాలైనా, అవాస్తవాలైనా పాఠకులే నిర్ధారించుకోవచ్చు.