సుప్రీం కోర్టు రాజ్యాంగవిరుద్ధ తీర్పు ప్రతిఘటిస్తాం -పాక్ మాజీ ప్రధాని


పాకిస్ధాన్ లో పాలకవర్గాల ఘర్షణ ముదురుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే దానిని ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని గిలానీ ప్రకటించాడు. కోర్టు తీర్పును తిరస్కరించి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్తామని కోర్టుకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు. కొత్త ప్రధాని అష్రాఫ్ ను ప్రధానిగా తొలగించినట్లయితే ప్రజలు ఆందోళన చేస్తారని హెచ్చరించాడు. ఆగస్టు 27 న తనముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాని ‘రాజా పర్వేజ్ అష్రాఫ్’ ను కొద్ది రోజుల క్రితం ఆదేశించిన నేపధ్యంలో మాజీ ప్రధాని యూసఫ్ రాజా గిలానీ చేసిన హెచ్చరిక పరిస్ధితిని మరింత ఉద్రిక్తపరిచింది.

“ప్రతి రోజూ ఆదివారం కాదు” అని గిలానీ పత్రికలతో వ్యాఖ్యానించాడు. ప్రధాని అష్రాఫ్ ను కోర్టు తొలగించినట్లయితే ‘పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ’ ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. “రాజ్యాంగవిరుద్ధమైన తీర్పును అంగీకరించేది లేదు… ప్రజలు దానిని అంగీకరించరు. నిర్ణయానికి తలోగ్గేబదులు ప్రతిఘటిస్తాం” అని అన్నాడు. ప్రధాని అష్రాఫ్ ను అనర్హుడుగా చేస్తే ఆ నిర్ణయాన్ని ప్రతిఘటించి సమస్యను ప్రజలవద్దకు తీసుకెళ్తామని తెలిపాడు. “అలాంటి చర్యను ప్రతిఘటిస్తాం. విషయాన్ని పాకిస్ధాన్ ప్రజల వద్దకు తీసుకెళ్తాము” అని అన్నాడు.

పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ పై అవినీతి కేసులు తిరిగి తెరవాలన్న కోర్టు ఆదేశాలను తిరస్కరించడంతో మాజీ ప్రధాని గిలానీ ని అనర్హుడుగా సుప్రీం కోర్టు నిర్ధారించింది. గిలానీ పదవినుండి తప్పుకోవాలని మరి కోద్దిరోజులకి మరో తీర్పు ఇవ్వడంతో గిలానీ స్ధానంలో అష్రాఫ్ ప్రధానిగా పార్లమెంటు సభ్యుల చేత ఎన్నికయ్యాడు. అధ్యక్షుడు జర్దారీ పై అవినీతి కేసులు తిరిగి తెరవాలని తాను స్విస్ ప్రభుత్వానికి లేఖ రాసేది లేదంటూ పదవి చేపట్టిన మరునాడే అష్రాఫ్ ప్రకటించడంతో కోర్టు, పార్లమెంటుల వివాదం తిరిగి మొదటికొచ్చింది. తన ఆదేశాలను ధిక్కరించినందుకు అష్రాఫ్ ఆగష్టు 27 న తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపధ్యంలో గిలానీ చేసిన ప్రకటనను బట్టి కోర్టుతో అమీ, తుమీకి పాలక పార్టీ సిద్ధమయినట్లు స్పష్టమవుతోంది. గిలానీ లాగా అష్రాఫ్ పై కూడా అనర్హత వేటు పడుతుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అధ్యక్షుడికి రాజ్యాంగ రక్షణ ఉన్నందున జర్దారీ కేసులపై స్విట్జర్లాండ్ కు లేఖ రాసేది లేదని గిలానీ పునరుద్ఘాటించాడు. అధ్యక్షుడిపై కేసులు తిరిగి తెరవాలన్న తన తీర్పులో తప్పునీ గుర్తించి కోర్టులే సవరించుకోవాలని ఆయన కోరాడు. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం తాను పదవిని త్యాగం చేశానని గిలానీ చెప్పుకున్నాడు. “ఈసారి పర్వేజ్ అష్రాఫ్ ను న్యాయ వ్యవస్ధ తొలగించినట్లయితే దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉంది” అని హెచ్చరించాడు.

ఆగష్టు 27 తేదీన కోర్టుకి హాజరవాలా లేదా అన్నది పూర్తిగా అష్రాఫ్ కి ఉన్న విశేషాధికారమేనని గిలానీ వివరించాడు. కోర్టుకి హాజరు కావడం వల్ల ఉపయోగం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. న్యాయ వ్యవస్ధపై ఉన్న గౌరవం వల్లనే తాను మూడు సార్లు కోర్టుకు హాజరయ్యాననీ, కానీ కోర్టు దానికి తగ్గట్లుగా స్పందించలేదనీ తెలిపాడు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగిన ఎన్నికలను కోర్టులు సంక్షోభం లోకి నెట్టాయని నిరసించాడు. జరగకూడనిది ఏదైనా జరిగితే కోర్టులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ప్రజాస్వామ్య వ్యవస్ధను రద్దు చేసేందుకు మూడో శక్తి ఎల్లప్పుడూ కాచుకుని ఉందని పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ అన్నాడు.

న్యాయ వ్యవస్ధపై గిలానీ నిప్పులు చెరిగాడు. ప్రధానిగా ఎవరినీ పని చేయనివ్వడం ఇష్టం లేకపోతే న్యాయ వ్యవస్ధే బాధ్యత తీసుకోవచ్చనీ అప్పుడిక ఎన్నికలు జరపవలసిన అవసరమే ఉండదనీ అన్నాడు. “ఎన్నికయిన ప్రతినిధులను ఈ విధంగా తొలగించినట్లయితే ఎన్నికల ప్రక్రియ వల్ల ఉపయోగం లేదు. ప్రజాస్వామిక వ్యవస్ధను చాప చుట్టేసి నామినేషన్లు జరుపుకోండి” అని వ్యాఖ్యానించాడు. అధికారానికి రావడం కోసం కోర్టులను వినియోగించుకోవడం పట్ల ఆయన రాజకీయ నాయకులను హెచ్చరించాడు. ప్రజాస్వామ్యాన్ని ఒకసారి కోల్పోతే దాన్ని పునరుద్ధరించడానికి వందల యేళ్ళు పడుతుందని, అలాంటి పొరబాటు చేయొద్దని హెచ్చరించాడు.

ప్రజాస్వామ్యం అనేది ప్రజల స్వేచ్ఛలో కాకుండా రాజకీయ నాయకుల పదవీ స్వేచ్ఛలోనే ఉన్నదన్నట్లుగా గిలానీ వ్యాఖ్యలు ఉన్నాయి. పాలక గ్రూపుల మధ్య తగాదాలే కోర్టు, పార్లమెంటుల ఘర్షణలుగా రూపుదాల్చాయన్న అవగాహనను ఆయన వ్యాఖ్యలు ధ్రువపరుస్తున్నాయి. పాలక గ్రూపుల మధ్య తగాదాలు తమలోతామే పరిష్కరించుకోలేని పక్షంలో ప్రజలను అందులోకి లాగి తమ తగాదాలకు పరిష్కారాన్ని కోరుతాయనీ, అంతోటిదానికే ప్రజాస్వామ్యంగా జబ్బలు చరుచుకుంటారని గిలానీ వెళ్లబోత స్పష్టం చేస్తున్నది. క్షీణిస్తున్న ఆదాయాలతో కున్నారిల్లుతున్న ప్రజల దుర్భర పరిస్ధుతుల బాగు కోసం ఎన్నడూ ప్రయత్నించని పాలకులు తమ పంపకాల తగాదా తీర్చమంటూ ప్రజల వద్దకి రావడం బూటకపు ప్రజాస్వామ్యంగా ప్రజలు గుర్తించవలసి ఉంది.

వ్యాఖ్యానించండి