భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో, కాంగ్రెస్ నాయకులు రాహుల్ భజన ప్రారంభించారు. కొన్నేళ్లుగా జరుగుతూ వచ్చిన రాహుల్ భజన ఇటీవల కాలంలో పెరిగిపోయింది. 2014 ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ భజన తీవ్రత ఇంకా పెరగవచ్చు కూడా.
అయితే ఇది కేవలం భజన మాత్రమే కాదు. కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలు ఎదుర్కొంటున్న అభద్రతే ‘రాహుల్ భజన’ గా వ్యక్తం అవుతోంది. రాహుల్ చుట్టూ ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆయనంతటివాడు లేడన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా చొప్పించడమే ఈ భజన ముఖ్యోద్దేశ్యం. రాహుల్ ని ప్రజల నెత్తిన రుద్దడంలో సఫలం అయితే మరో తరం పాటు తమకు ఢోకా ఉండబోదన్న ఆశ కాంగ్రెస్ పెద్దలనీ, ఆ పార్టీ వెనుక ఉన్నవారినీ ఊరిస్తోంది. పాతతరం నాయకులు వృద్ధాప్యంతో తెరవెనక్కి జారిపోతున్న నేపధ్యంలో పాలకవర్గాలు తయారు చేసుకుంటున్న కొత్త ప్రతినిధే రాహుల్ గాంధీ.
