అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు


రింకిల్ కుమారి

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియాలో అయినా, మిలట్రీ కనుసన్నల్లో ఎదుగుతున్నపాకిస్ధాన్ నామమాత్ర ప్రజాస్వామ్యంలో అయినా మైనారిటీలకు  ఎక్కడా రక్షణ లేదు. మైనారిటీ మతస్ధుల ఆస్తులు లాక్కోవడానికి మతం అడ్డు పెట్టుకునే దుర్మార్గాలు రెండు చోట్లా కొనసాగుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ‘రింకిల్ కుమారి’ కేసు ద్వారా పాక్ సుప్రీం కోర్టు కూడా మత ఛాందస శక్తుల ముసుగులో దాక్కున్న భూస్వామ్య పాలకవర్గాల చేతిలో బందీ అని స్పష్టం అయింది. ఫలితంగా తమ ఆస్తులను భక్షించడానికి జరుగుతున్న నిరంతర దాడులకు భయపడి ఇండియాకు తరలిస్తున్న హిందువుల ఉదంతాలు పెరుగుతున్నాయి.

రింకిల్ కుమారి, లత, ఆశ

పాకిస్ధాన్ లో ఇతర చోట్ల కంటే అప్పర్ సింధ్ లో మైనారిటీలకు ఎక్కువ స్నేహసంబంధాలు ఉంటాయని ప్రతీతి కాగా రింకిల్ కుమారి ఉదంతం అందుకు విరుద్ధంగా ఉంది. ఇతర రాజకీయ పార్టీల కంటే భుట్టోల నేతృత్వంలోని ‘పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ’ (పి.పి.పి) మైనారిటీల పట్ల సుహృద్భావంతో ఉంటుందన్న అవగాహన కూడా తప్పని రుజువయింది.

రింకిల్ తో పాటు లత, ఆశ పేరుగల యువతులు అప్పర్ సింధ్ లో ఇటీవల కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత వారిని ‘ఇస్లాం’ లోకి బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లిం యువకులతో  పెళ్లి జరిపించారు. కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అమ్మాయిల చుట్టూ ఉన్న బలవంతపు బందిఖానా పరిస్ధితులను విస్మరించిన పాక్ సుప్రీం కోర్టు అత్యంత హాస్యాస్పదంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారో, ముస్లిం భర్తల వద్ద కొనసాగుతారో మీరే నిర్ణయించుకోండి అంటూ నిస్సహాయ యువతులను కోరింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ఎం.పి ‘మియాన్ మితు’ యువతులను ముందే బెదిరించడంతో వారు భర్తల దగ్గరే ఉంటామని కోర్టుముందు చెప్పక తప్పలేదు. న్యాయాన్యాయాలు నిర్ణయించి తీర్పు చెప్పవలసిన కోర్టు క్రూర మృగాలు కాపలాగా ఉన్న లేడి కూనకి ‘ఛాయిస్’ ఇచ్చినట్లు తీర్పు చెప్పడం మోసపూరితంగా కనిపిస్తోంది.

పాక్ లో మాజీ కేంద్ర మంత్రి అమర్ లాల్ ప్రకారం రింకిల్ కుమారి, లత లను వారి భర్తలకు, కుటుంబాలకు దూరంగా ఒక షెల్టర్ హోమ్ లో ఉంచినప్పటికీ మియాన్ మితు వారిని ఫోన్ ద్వారా బెదిరించగలిగాడు. తల్లిదండ్రుల వద్దకి వెళ్లడానికి నిర్ణయిస్తే ఆ తల్లిదండ్రులనే చంపేస్తామంటూ మియాన్ మితు యువతులను బెదిరించాడు. పాక్ లోని సంస్ధలన్నీ తనకు రక్షణ కల్పించడంలో విఫలం అయినందున తనకు ఏ సంస్ధపైనా నమ్మకం లేదని ‘ఫర్యాల్ బీబీ’ గా మార్చబడిన రింకిల్ కుమారి చెప్పిందని అమర్ లాల్ ని ‘ది హిందూ’ ఉటంకించింది. “తాను తీవ్ర ఒత్తిడి (మజ్ బూర్)లో ఉన్నానని రింకిల్ చెప్పింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపింది” అని అమర్ లాల్ తెలిపాడు. తన బంధువులను కాపాడడానికే తాను భర్త దగ్గరికి వెళ్లవలసి వచ్చిందని కూడా తనతో చెప్పినట్లు ఆయన తెలిపాడు.

పౌర హక్కుల కార్యకర్త మార్వి సిర్మద్ ప్రకారం మూడో అమ్మాయి ‘ఆశ’ కు ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి తగిన సమయం కూడా దొరకలేదు. సుప్రీం తీర్పుతో ‘ఆశ’ తీవ్ర నిరాశకు గురయింది. నిర్ణయం తమకే వదిలి పెట్టినప్పటికీ కేసుకు సంబంధించిన పరిస్ధితులను కోర్టు పరిగణించలేదని ఆమె భావించినట్లు మార్వి తెలిపాడు. ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో ఉన్న హిందువులు అక్కడి నుండి వెళ్లిపోయేలా చేయడానికి ఈ విధంగా బలవంతం చేసి టెర్రరైజ్ చేసే ఎత్తుగడులు అనుసరిస్తున్న విషయాన్ని సుప్రీం కోర్టు పరిగణించలేదు. మియాన్ మితు బెదిరింపు వ్యవహారం పైన విచారణ జరపాలని ఎవరూ భావించకపోవడం పట్ల హక్కుల కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. కోర్టు తీర్పుతో మియాన్ మితు లాంటి వారు మరింత శక్తి పొందడమే కాక హిందూ మతస్ధులకు చెప్పుకోవడానికి ఇక ఎవరూ మిగల్లేదని ‘ది హిందూ’ వ్యాఖ్యానించింది. అది నిజం కూడా. దేశ అత్యున్నత న్యాయస్ధానమే మతం ముసుగులో ఉన్న భూస్వామ్య శక్తులకు పరోక్షంగా అవకాశం ఇస్తే బాధితులకు మధ్య యుగాల న్యాయమే దక్కుతుంది. కాగా రింకిల్, లత, ఆశల విషయంలో మత ఛాందసుల, భూస్వామ్య శక్తుల ఆధిపత్యం స్ధిరపరచుకోవడానికి మహిళలు సాధనంగా మారడం పత్రికలు చర్చించని మరొక దుర్మార్గకోణం.

అయితే మరో వాదన కూడా ఇక్కడ వినిపిస్తోంది. హిందూ యువతులు ముస్లింలను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే వారి పెద్దలు ‘బలవంతపు మతమార్పిడి’ కేసు ను సృష్టించగలిగారని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అమర్ లాల్, మార్వి లు చెప్పినదాని ప్రకారం ఈ వాదనలు నిజం కాదని అనిపించక మానదు. బాధితురాళ్లే తమ అసంతృప్తిని, వేదనను తెలియజేయడం నిజమే అయితే సదరు వాదనలు నిజం కావన్నది స్పష్టమే.

హిందువుల వలస?

ఈ పరిస్ధితుల్లో అప్పర్ సింధ్ నుండి హిందువుల కుటుంబాలు తరలిపోతున్నాయని పత్రికలు వార్తలు ప్రచురిస్తున్నాయి. అప్పర్ సింధ్ లోని జాకోబాబాద్ నుండి ఈ వలస కొంత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. జాకోబాబాద్ లో కొన్ని హిందూ కుటుంబాలు తమ షాపులు మూసేసుకుని ఆస్తులు అమ్ముకుని ఇతర చోట్లకు వెళ్లిపోయారని తెలుస్తోంది. తమ అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతారనీ, వారికి బలవంతపు పెళ్లిళ్లు చేస్తారని భయపడడడం వల్ల ఇలాంటి వలసలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

‘హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్ధాన్’ సంస్ధకు చెందిన సింధ్ విభాగం ఛైర్మన్ అమర్ నాధ్ ప్రకారం అప్పర్ సింధ్ జిల్లాలోని హిందువులలో 50 శాతం మంది అక్కడినుండి తరలిపోయారు. వీరిలో ఎక్కువమంది కరాచీ కి వెళ్ళారని, కొందరు ఇతర దేశాలకు కూడా వెళ్లారనీ ఆయన తెలిపాడు. ఈ విషయం సింధి వార్తా పత్రికలు ప్రచురించడంతో పాక్ జాతీయ పత్రికలు ఆ వార్తను అందిపుచ్చుకుని సంచలనంగా మార్చాయి. ఇది కుట్ర అనీ భారత రాయబార కార్యాలయం దీనికి వివరణ ఇచ్చుకోవాలనీ పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్ మాలిక్ ప్రకటించి విషయాన్ని మరింత రచ్చ చేశాడు. దానితో ఇండియాలో యాత్రా స్ధలాలకు వస్తున్న 200 మంది హిందూ యాత్రీకులను కొద్ది గంటలపాటు లాహోర్ లో శుక్రవారం నిర్బంధంలోకి తీసుకున్నారు.

అమర్ నాధ్ ప్రకారం గత మూడేళ్లలో 3,000 కుటుంబాలు పాక్ నుండి ఇండియాకి తరలి వచ్చాయి. యాత్రీకులుగా శుక్రవారం బయలుదేరినవారు కొద్ది కాలం పాటు ఇండియాలో గడపడానికి వీసాలు పొందినప్పటికీ కొందరు మళ్ళీ పాక్ కి తిరిగి వస్తారోలేదో అనుమానమేనని అమర్ నాధ్ చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. గత సంవత్సరం 300 కుటుంబాలు ఇండియాకి యాత్రల నిమిత్తం రాగా అందులో 60 కుటుంబాలు తిరిగి వెళ్లలేదు.

ఆస్తులు నొక్కెయడానికే

అప్పర్ సింధ్ లో హిందువులు ఇతర ప్రాంతాలలోని హిందువులతో పోలిస్తే ఇన్నాళ్లూ భద్రంగా గడిపారని ఒక ప్రచారం. ఇటీవల కాలంలో వారు కూడా టార్గెట్ గా మారారు. దానికి కారణం అక్కడి హిందువులలో కొన్ని సెక్షన్లు ధనికులుగా అభివృద్ధి చెందడమే. వారి ఆస్తులు సింధ్ రాష్ట్రంలోని ‘వధేరా’ ఫ్యూడల్ ప్రభువులకు కన్ను కుట్టేలా చేశాయి. తాము ఆ ప్రాంతం వదిలిపోతే తమ ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చన్న కుట్రతోనే వధేరాలు తమను టార్గెట్ చేసుకున్నారని గత 24 గంటల్లో టి.వి టాక్ షోలలో పాల్గొన్న హిందువులు చెప్పారని పత్రిక తెలిపింది.

హిందూ కుటుంబాలను వేధిస్తున్న వధేరాలు పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీకి గట్టి మద్దతుదారులు. ఈ పార్టీ పాక్ లో మైనారిటీలకు అత్యంత స్నేహపాత్రురాలు అన్న పేరు ఉండడం ఇంకో దారుణం. నిజానికి ఆధునిక రూపాల్లో ఫ్యూడల్ పభువులు కొనసాగుతున్న అర్ధ భూస్వామ్య దేశంలో మైనారిటీలు, స్త్రీలు, దళిత కులాలు లాంటి అణచివేతకు గురవుతున్న ప్రజలకు స్నేహపాత్రమైన పార్టీలేవీ ఉండజాలవు. మైనారిటీల ఓట్ల కోసం స్నేహం నటిస్తే నటించవచ్చు గానీ వారి పునాది ఫ్యూడల్, పెట్టుబడిదారీ వర్గాలని గుర్తిస్తే అలాంటి పార్టీలు ఎన్నడూ నిమ్న వర్గాలకు స్నేహితులు కానేరవు. వధేరాల మద్దతు ఉన్న పి.పి.పి యే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.

గోధ్రా రైలు దహనం దరిమిలా గుజరాత్ ముస్లిం లపై జరిగిన మారణహోమంలో కూడా ముస్లింల ఆస్తులు వశం చేసుకునే  కుట్రలు జరిగాయని ‘కమ్యూనలిజం కాంబాట్’ లాంటి పత్రికలు ససాక్ష్యాలతో వివరించి చెప్పాయి. ముస్లింలకు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, వారి షాపులను, భవనాలనూ వశం చేసుకోవడానికి కుట్రలు జరిగిన చోట్ల తీవ్ర స్ధాయిలో అల్లర్లు జరిగాయని సదరు పత్రిక తెలిపింది. సోమ్ నాధ్ దేవాలయంపై పదే పదే జరిగిన దాడులకు కూడా దేవాలయంలోని సంపదలే ప్రధాన కారణమని చరిత్రకారులు చెప్పిన సత్యం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

పాకిస్ధాన్ లో వధేరాల పర్యవేక్షణలో సంపన్న హిందూ కుటుంబాలపై సాగుతున్న దురన్యాయాలు కూడా ఈ కోవలోనివేనని అర్ధం అవుతోంది. మతం ముసుగు లేకుండా కూడా ఆస్తుల దురాక్రమణ కార్యకలాపాలను భారత దేశంలోని వివిధ పార్టీల నేతలు సాగిస్తుండడం అందరికీ తెలిసినదే. కాకపోతే ‘సెక్యులరిజం’ అనే ఆధునిక ముసుగులో వీరి దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఒక వర్గం సెక్యులరిజం ముసుగు ధరించాక వైరి వర్గానికి దానికి వ్యతిరేక ముసుగు ధరించడం అనివార్యం. ఆదివాసీల కాళ్ళకింద ఉన్న లక్షల కోట్లు ఖరీదు చేసే సహజవనరులు దోచుకోవడానికి ‘సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ’ నినాదాల వెలుగులోని ‘అభివృద్ధి’ ముసుగుని పాలకవర్గాలన్నీ తరతమ భేదం లేకుండా ధరిస్తున్నాయి. ‘సెక్యులరిజం’, ‘హిందూ మత పరిరక్షణ’ లాంటి ముసుగులు ప్రజల ఓట్లను పోగేసి అధికారం సంపాదించి పెడితే ‘అభివృద్ధి’ ముసుగు ఆ ప్రజల కన్నుగప్పి వారి వనరులను దోచుకోవడానికి ఉపయోగపడుతోంది. ఈ ముసుగులన్నింటివల్లా అంతిమంగా నష్టపోతున్నది తమను తాము ‘హిందువులు’ గానూ, ‘ముస్లింలు’ గానూ భావించుకుంటున్న అమాయక ప్రజలే.

5 thoughts on “అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు

  1. If muslims are cancer, those surviving on religious fanaticism are like AIDS.

    “As such communal violence is a multilayered phenomenon. The foundation of this phenomenon lies in the negative perceptions about the ‘others’, the prevalence of ‘social common sense’ about the minorities in particular. ‘They are invaders, more loyal to Pakistan, beef eaters, they convert by force fraud or allurement, they are infiltrators etc’ are a few from list of perceptions about minorities prevalent in our society and many firmly believe these to be true. These perceptions based on half truth are made to become part of social common sense, through various mechanisms. Noam Chomsky, while talking about such perceptions amongst the people shows how in United States, state gets popular sanction for its aggression on other countries, by ‘manufacturing the consent’ of the people all around. US state does it particularly through media. In case of social common sense in India, it is propagated by the dominant communal forces through the word of mouth, through media and through school books. This negative perception of ‘others’, in turn leads to a sort of hatred for the ‘other community’. The hate for other community is like an inflammable mindset, which gets sparked into communal violence either due to small accidents or due to the agenda of some political forces which get the violence orchestrated for communal polarization which helps them strengthen their political base.” – From Ram Puniyani’s article.

    http://communalism.blogspot.in/2012/08/communal-violence-prevention-bill.html

వ్యాఖ్యానించండి