ప్రజల సొమ్ము దోచుకోండి, కానీ బందిపోట్లలా కాదు -యు.పి మంత్రి


శివ్‌పాల్ సింగ్ యాదవ్ (కుడి చివర)

మాయావతి అవినీతి పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అనుమతి ఇచ్చేసింది. కాకపోతే మరీ బందిపోటు దొంగల్లా దోచుకోకుండా, దొంగిలించవచ్చని సున్నితంగా బోధించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయి అయిన శివ్ పాల్ సింగ్ యాదవ్ ఈ ఆణి ముత్యాలను తన శాఖ అధికారులకు బోధించాడు. తద్వారా సర్వ వ్యాపితం అయిన అవినీతి ని నాలుగు గోడల మధ్య చట్టబద్ధం చేశాడు. పత్రికలు నిలదీసే సరికి తాను అనలేదంటూనే, వెనక్కి తీసుకుంటున్నట్లు నాలిక మడతేశాడు.

“ఎటా (Etah) లో జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ పి.డబ్ల్యూ.డి శాఖ మంత్రి శివ్ పాల్ సింగ్ ఇలా అన్నాడు. “పి.డబ్ల్యూ.డి జనానికి ఇప్పటికే బహిరంగంగానే చెప్పాను. మీరు కష్టపడి పనిచేసినట్లయితే కొద్దిగా దొంగిలించవచ్చు. కానీ బందిపోట్లలా ప్రవర్తించవద్దని.” (I have already told PWD people openly that if you work hard, you can steal a little, but don’t behave like dacoits.) ఏదో కొద్దిగా దొంగిలించే కార్యక్రమం తన శాఖ అధికారులకి, ఉద్యోగులకి అప్పజెప్పి బందిపోట్ల పాత్రను మంత్రిగారు తనకు రిజర్వ్ చేసుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చేమో.

“మీరు కష్టపడినట్లయితే, వారికి నీళ్ళు ఇచ్చినట్లయితే, తర్వాత దొంగిలించవచ్చు” (If you work hard, if you give them water then you can steal.) ఉద్యోగులకి, అధికారులకి ఇంతకంటే స్నేహశీలి అయిన మంత్రి దొరకరేమో. ప్రజల మెప్పు పొందడానికి వారి ముందు అధికారులపైనా, ఉద్యోగుల పైనా చిర్రు బుర్రు లాడుతూ భారీ డైలాగులు వల్లించే మంత్రులు, తమపని సులభతరం చేసుకునే పద్ధతుల కోసం శివ్ పాల్ సింగ్ దగ్గర ఇకనుండి ట్యూషన్ లో చేరవచ్చు.

పత్రికలు, చానెళ్లు ‘బ్రేకింగ్ న్యూస్’ తో హడావుడి చేయడంతో శివ్ పాల్ సింగ్ కూడా తన వ్యాఖ్యలు తానే ఖండించుకోవడానికి హడావుడి పడ్డాడు. మొదట తప్పు మీడియా పై నెట్టేసినా నిలదీయడంతో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కూడా ‘కింద పడ్డా పై చేయి నాదే’ అన్నట్లు మాట్లాడాడు.

“ప్రెస్ లో సందర్భ రహితంగా వచ్చింది. పాత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, మోసానికీ, దొంగతనానికీ పాల్పడిందనీ నేను చెప్పాను. దానిని 100 శాతం ఆపేయాలని చెప్పాను” అని చెబుతూ శివ్ పాల్, సమాజ్ వాదీ ప్రభుత్వం అవినీతిని అంతం చేసే లక్ష్యం తోనే అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశాడు. అయినా విలేఖరులు గుచ్చి గుచ్చి అడగడంతో “ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాను. ఇంకా దాన్నెందుకు లేవనెత్తుతారు. నేనెప్పుడూ పత్రికలతో సహకరించాను. మీడియా నన్నెందుకు టార్గెట్ చేస్తున్నదో తెలియడం లేదు” అని వాపోయాడు.

నిజానికి మంత్రి ఉన్న విషయమే మాట్లాడాడు. ఆ సంగతి మీడియాకి తెలియదా? తెలుసు. ఇదొక నాటకం. మీడియా, మంత్రులూ ‘కలిసి మాట్లాడుకుని’ కాకపోయినా, సహజాతి సహజంగా పరస్పర అవగాహనతో నడిపించే నాటకం. అప్పుడప్పుడూ పొరబాటున ఇలాంటివి జరిగినా టి.ఆర్.పి రేటింగ్ పెంచే బ్రేకింగ్ న్యూసో, లేకపోతే తాత్కాలికంగానైనా సర్క్యులేషన్ పెంచే వార్తా ముచ్చటో అవుతుంది తప్ప ఇందులో ప్రజలను దోచుకునే దుర్మార్గాలపై ఆందోళనేదీ ఉండదు. అయితే, అవినీతి అనేది పాలకులకు ఎంత సహజమో, తమ బందిపోటు అవినీతిని కాపాడుకోవడానికి ఉద్యోగుల దొంగిలింపులను మంత్రులు ఎలా ప్రోత్సహిస్తారో తెలియడానికి ఇదొక చిన్న రుజువు.

వ్యాఖ్యానించండి