ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఢిల్లీలోని తన గదిలో ఫ్యానుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హర్యానా రాష్ట్ర హోమ్ మంత్రి గోపాల్ గోయల్ కాండా, అతని ఎక్జిక్యూటివ్ అరుణ చద్దా లే తన ఆత్మహత్యకు కారకులని ఆత్మహత్య లేఖలో రాసి చనిపోయింది. వీరిద్దరూ తన జీవితాన్ని నాశనం చేశారనీ, నమ్మకద్రోహానికి పాల్పడ్డారనీ, వారి స్వప్రయోజనాల కోసం తన జీవితాన్ని బలితీసుకున్నారనీ ఆమె తన లేఖలో ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేసిందే కాక తన తల్లిదండ్రులను తననుండి దూరం చేసి తన కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారనీ అందుకే తట్టుకోలేక చనిపోతున్నాని తన లేఖలో పేర్కొంది.
కంపెనీ మారినా, వేధింపులు తప్పలేదు
హర్యానా హోమ్ మంత్రి గోపాల్ గోయల్ కి చెందిన విమానయాన సంస్ధ ‘ఎం.డి.ఎల్.ఆర్ (మురళీధర్ లఖ్ రామ్) ఎయిర్ లైన్స్’ లో గీతిక ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. 2009 లో ఈ కంపెనీ మూత పడడంతో గీతిక యు.ఏ.ఇ కి చెందిన ‘ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్’ లో చేరి ఆ దేశం వెళ్లింది. 2011 లో ఆమె మళ్ళీ ఇండియా వచ్చి గోపాల్ గోయల్ కి చెందిన కేబుల్స్ తయారు చేసే కంపెనీ ‘సూపర్ సోనిక్’ లో చేరింది. గీతిక తల్లిదండ్రుల ప్రకారం గీతిక యు.ఎ.ఇ వెళ్ళాక గోపాల్, అరుణ్ లు ఆమెను తీవ్రంగా వేధించారు. ఆమె యు.ఎ.ఇ వెళ్లడానికి వీల్లేదనీ, తమ కంపెనీ తప్ప మరో కంపెనీలో పని చేయడానికి వీల్లేదనీ అనేకసార్లు వేధింపులకు గురి చేశారని గీతిక తల్లిదండ్రులు తెలిపారు.
గీతిక సోదరుడు ఇలా చెప్పాడు. “ఎయిర్ లైన్స్ ఆపరేషన్లు సస్పెండ్ అయ్యాక గీతికకు కాండా మరొక ఉద్యోగం ఇవ్వజూపాడు. దానిని నిరాకరించి ఆమె దుబాయ్ లోని ఎమిరేట్స్ (ఎయిర్ లైన్స్) లో చేరింది. తర్వాత ఆయన, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఎమిరేట్స్ కి ఉత్తరం రాశాడు. దానితో ఆమె ఉద్యోగం ఊడిపోయింది” అని గౌరవ్ శర్మ తెలిపాడు. ఆదివారం తెల్లవారు ఝామున ఆత్మహత్య చేసుకునే ముందు కూడా గోపాల్ నుండి ఆమెకు ఫోన్ వచ్చిందనీ, ఆ ఫోనే గీతిక ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో గోపాల్ హోమ్ మంత్రిగా పని చేస్తున్నాడు. గీతిక లేఖలో మంత్రి పేరు ఉండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. గతిలేని పరిస్ధితుల్లో రాజీనామా చేసి కూడా ‘విచారణకు ఆటంకం కలగరాదన్న సదాశయంతో రాజీనామా చేస్తున్నట్లు’ గొప్పగా ప్రకటించాడు. ఆత్మహత్యకు పురికొల్పాడన్న నేరాన్ని పోలీసులు గోపాల్ పై మోపారు. అయితే పోలీసులు ఇంకా ఆయనను ప్రశ్నించలేదు. అన్నీ వివరాలూ సంపాదించాక ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. “అన్నీ సాక్ష్యాలు సేకరించాక అతన్ని ప్రశ్నిస్తాము. కేసు గురించి, ఆయన పాత్ర గురించీ సరయిన అవగాహన మాకు రావాలి” అని కేసును పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారి చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది.
పెట్టుబడి + రాజకీయాలు + నేరాలు
47 యేళ్ళ గోపాల్ పెద్ద ధనిక వ్యాపారి. చెప్పులు తయారు చేసే కంపెనీతో మొదలుపెట్టిన ఈయన ఇప్పుడు రియల్ ఎస్టేట్, హోటల్స్ రంగాల్లో పెద్ద పెట్టుబడిదారుడుగా ఎదిగాడు. చౌతాలా పార్టీ అయిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐ.ఎన్.ఎల్.డి) లో సభ్యుడుగా, చౌతాలా లకు నమ్మకస్ధుడిగా ఉంటూ వచ్చిన గోపాల్ 2005 లో పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ తో సంబంధాలు పెంచుకున్నాడు. 2009 లో ఐ.ఎన్.ఎల్.డి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సిర్సా నుండి గెలిచాడు. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ కి 40 సీట్లు మాత్రమే రావడంతో గోపాల్ లాంటి వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పరించింది. మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ ఏకంగా అతనికి హోమ్ మంత్రి పదవి కట్టబెట్టింది.
ఆయుధం ధరించి అల్లర్లకు పాల్పడడం, ప్రభుత్వోద్యోగులపై దాడి చేయడం మొ.న కేసులతో పాటు మూడు తీవ్ర నేరాలతో కూడిన కేసులు గోపాల్ పై అప్పటికే ఉన్నాయి. అయినప్పటికీ ఆయనకి హోమంత్రి పదవి ఇచ్చి తన కేసుల విషయం తానే చూసుకునే వసతిని కాంగ్రెస్ కల్పించింది. హోమ్ మంత్రి అయ్యాక కూడా గోపాల్ నేరాల పర్వం కొనసాగింది. 2010 లో ఒక కాంగ్రెస్ ర్యాలీలో ఐ.ఎన్.ఎల్.డి కార్యకర్తలను బూతులు తిడుతూ ఆయన కెమెరాకి చిక్కాడు. జులై 2011 లో గుర్ గావ్ టోల్ ప్లాజా వద్ద తన కారుని ఓవర్ టేక్ చేసిన మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ ను సెక్యూరిటీ గార్డులతో కొట్టించాడు. ఇండియా టి.వి వార్తాకధనం ప్రకారం గోవాలోని తన కేసినో వ్యాపారాలకు గీతిక ను డైరెక్టర్ గా నియమించాడనీ, వీరిరువురి సాన్నిహిత్యం అక్కడ చాలామందికి తెలుసని తెలుస్తోంది.
కంపెనీలు పెట్టి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే గొప్ప పెట్టుబడిదారుడైన గోపాల్ గోయల్ బుద్ధి ఎంత నేలబారుదో ఈ ఘటనలు, అతని వ్యాపారాలు కొద్ది మేరకు వివరిస్తే ఇతని ఆర్ధిక ఎదుగుదల ఎందరి జీవితాలను ఫణంగా పెడితే సాధ్యం అయిందో గీతిక శర్మ ఆత్మ హత్య స్పష్టం చేస్తున్నది. పెట్టుబడి అండగా రాజకీయాల్లో ఎదిగి, రాజకీయాలు అండగా నేరాలు చేసి, నేర రాజకీయాల అండగా హోమ్ మంత్రిత్వాన్ని నెరిపిన గోపాల్ గోయల్ విషయంలో నేర ప్రస్ధానం, పెట్టుబడి సంచయం (capital accumulation) జమిలిగా కలిసి ప్రయాణించాయి. దాని ఫలితంగా గోపాల్ పై సాగే నేర విచారణ రాజకీయ నేరస్ధ ఒప్పందాలతో కనుమరుగై పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
గుట్టు విప్పిన సూసైడ్ నోట్
గోపాల్ గోయల్ వికృత రూపం గీతిక ఆత్మ హత్య లేఖ వివరిస్తుంది. గీతిక మే నెలలో కూడా రాసిన ఒక లేఖను బట్టి గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న అనుమానం కలుగుతోంది. “నా చావుకి కారకులైన ఇద్దరు అరుణ చద్దా మరియు గోపాల్ గోయల్ కాండా లు. వీరిద్దరూ నన్ను నమ్మించి మోసం చేశారు. తమ స్వంత ప్రయోజనాల కోసం నన్ను వాడుకున్నారు. వారు నా జీవితం నాశనం చేసిందేకాక నా కుటుంబాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు” అని గీతిక చనిపోకముందు రాసిన లేఖలో పేర్కొంది. అరుణ చద్దా, గోపాల్ కంపెనీల్లో ఒక అధికారి. తన ఉద్యోగం కోసం గోపాల్ తో కలిసి కుట్రలు చేసిందని గీతిక తన లేఖలో ఆరోపించింది.
మే 4 తేదీన లేఖలో ఆమె ఇలా పేర్కొంది. “గోపాల్ గోయల్ ఒక ఫ్రాడ్. అమ్మాయిల పట్ల ఎల్లపుడూ చెడ్డ ఉద్దేశ్యాలు కలిగి ఉంటాడు. సిగ్గు అనేది ఎరగని, తప్పు గుర్తించని వ్యక్తి. ఇతరులను ఎల్లప్పుడూ తనకు అనువుగా వాడుకుంటాడు. ‘____’ అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని పాపని కన్నాడు. అయినప్పటికీ అమ్మాయిల వెంట పడుతుంటాడు. నా జీవితంలో ఇలాంటి సిగ్గుమాలిన, అత్యంత చెడ్డ వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. సంబంధాల పేరుతో, నమ్మకం పేరుతో, దేవుడు పేరుతో అందరినీ మోసం చేస్తుంటాడు. వేధిస్తాడు. ఎప్పుడూ అబద్ధాలు చెబుతాడు. తన కుటుంబానికి, పిల్లలకి, ప్రజలకీ, తన చుట్టూ ఉన్నవారందరికీ, ప్రతి ఒక్కరికీ అబద్ధాలు చెబుతాడు” అని గీతిక వివరించింది. ఆమె లేఖలను స్కాన్ చేసి ఎన్.డి.టి.వి తన వెబ్ సైట్ లో ఉంచింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
భారత దేశంలో ఒక పెట్టుబడిదారుడి ఎదుగుదల వెనుక ఎన్ని కుట్రలు, ఎన్ని నేరాలు, మరెన్ని భగ్న జీవితాలు ఉంటాయో గోపాల్ గోయల్ జీవితం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. పెట్టుబడి అంటే డబ్బు మాత్రమేనని భ్రమించేవారు దాని చుట్టూ ఉండే వ్యవస్ధను చూడడంలో విఫలం అవుతున్నారు. బాల గోపాల్ మాటల్లో చెప్పాలంటే “పెట్టుబడి అంటే డబ్బు కాదు. పెట్టుబడి అనేది ఒక సామాజిక సంబంధం, ఒక వ్యవస్ధ. ఉత్పత్తి సాధనాలను, పనిముట్లను కోల్పోయి ‘బజారునపడ్డ’ శ్రామికుల శ్రమ శక్తిని స్వేచ్ఛా వినిమయంలో కొనుగోలు చేసి లాభార్జన దృష్టితో అమ్మకపు సరుకులను ఉత్పత్తిచేసి తనను తాను పునర్వ్యాప్తి చేసుకుంటుంది పెట్టుబడి.”
ఈ వ్యాప్తి పునర్వ్యాప్తిల క్రమంలో పెట్టుబడి తనకు అడ్డు వచ్చిన అన్ని సంబంధాలను, వ్యవస్ధలనూ, వ్యక్తులను, జీవితాలనూ నేలమట్టం చేస్తుంది. పెట్టుబడికి (దాని సొంతదారులకి) దయా దాక్షిణ్యాలు, తన-పర బేధాలు, మానవత లాంటి మానవోద్వేగాలు ఏవీ ఉండవు. నీతి, నియమాలకు అది బహుదూరం. భూస్వామి భూముల్లో వెట్టి చాకిరీల నుండి రైతులను, కూలీలను విముక్తం చేసినపుడు అప్పటివరకూ ప్రపంచం ఎరగని అభ్యుదయాన్ని ప్రదర్శించిన పెట్టుబడి తన మనుగడ కోసం, అభివృద్ధి కోసం సమస్త మానవ సంబంధాలను కూల్చి వేయడానికి సిద్ధపడుతుంది. మానవజాతి కోసం పెట్టుబడి నిర్వహించిన అభ్యుదయ పాత్ర ఎన్నడో ముగిసిపోయింది. దానికి మిగిలింది ఇక విధ్వంసకర పాత్రే. దేశాల ఎల్లల మాత్రమే కాక మానవత ఎల్లలు కూడా దాటి వికటాట్టహాసం చేస్తున్న పెట్టుబడిని మానవ నాగరికతనుండి బహిష్కరించవలసిన దశ కూడా ఎన్నడో దాటిపోయింది. కంటికి ప్రత్యక్షంగా కనిపించని పెట్టుబడి రాక్షసత్వాన్ని అర్ధం చేసుకుని, చైతన్యంతో వ్యవహరించవలసిన బుద్ధి జీవులు పెట్టుబడికి సేవకులుగా మారి భజన చేయడం నేటి వైపరీత్యాలలో ఒకటి.