అమెరికా గురుద్వారాలో 6గురు సిక్కులను కాల్చి చంపిన తెల్ల దురహంకారి


అమెరికాలో సిక్కుల ప్రార్ధనామందిరం గురుద్వారా లో జొరబడిన తెల్లజాతి దురహంకారి (వైట్ సూపర్ మాసిస్ట్) ప్రార్ధనలో మునిగి ఉన్న ఆరుగురు సిక్కు మతస్ధులను కాల్చి చంపాడు. తీవ్రవాది కాల్పుల్లో కనీసం మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ‘ది హిందూ’ తెలిపింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో మిల్వాకీ సబర్బన్ ప్రాంతం అయిన ‘ఓక్ క్రీక్’ లోని సిక్కుల ప్రార్ధనామందిరం లో ఆదివారం ఉదయం ఈ హత్యాకాండ జరిగింది. విచారణ జరిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా హామీ ఇవ్వగా, ఇండియాలోని సిక్కు మతాధిపతులు సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఘటనను దేశీయ టెర్రరిస్టు చర్యగా భావిస్తున్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనను అమెరికా ఫెడరల్ పరిశోధనా సంస్ధ ఎఫ్.బి.ఐ విచారిస్తోంది. తీవ్రవాదిని చంపేసినప్పటికీ అతని పేరు ఎఫ్.బి.ఐ వెల్లడించలేదు. ‘వాషింగ్టన్ పోస్ట్’ అతనిని వేడ్ మైఖేల్ పేజ్ గా గుర్తించింది. 40 సంవత్సరాల పేజ్ అమెరికా సైన్యంలో పని చేసి రిటైరయ్యాడని ఆ పత్రిక తెలిపింది. అతని చేతిపై 9/11 టాటూ ఉందని కాల్పుల్లో చనిపోయిన వారి బంధువు కన్వర్ దీప్ సింగ్ ని ఉటంకిస్తూ సి.ఎన్.ఎన్ తెలిపింది. గురుద్వారా ఉన్న ఓక్ క్రీక్ కు 12 మైళ్ళ దూరంలోని కూదాహి లో పేజ్ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని వివరాలు తెలుసుకోవడానికి ఫ్లడ్ లైట్ల వెలుగులో అతని ఇంటిని సోదా చేస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.

సెమీ ఆటోమేటిక్ తుపాకి వినియోగించి నిందితుడు హత్యాకాండ  జరిపాడని రాయిటర్స్ తెలిపింది. నిందితుడు గురుద్వారాలో ప్రవేశించి లోపల నలుగురిని బైట ఉన్న మరో ఇద్దరినీ కాల్చి చంపాడు. కాల్పులు ప్రారంభం అయ్యాక అక్కడి వారు పోలీసు ఎమర్జెన్సీ (911) కి ఫోన్ చేయడంతో గురుద్వారాను పోలీసులు చుట్టుముట్టారు. పరస్పరం జరిగిన కాల్పుల్లో తీవ్రవాది చనిపోగా ఒక పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. గురుద్వారా పూజారి కూడా చనిపోయినవారిలో ఉన్నాడు. అమెరికా మొత్తంలో విస్కాన్సిన్ రాష్ట్రంలో అత్యంత ఉదారంగా తుపాకులకు లైసెన్సులు ఇస్తారని తెలుస్తోంది. ప్రతి పౌరుడూ తుపాకి కలిగి ఉండవచ్చని గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఆమోదించింది. బ్యాట్ మేన్ షూటింగ్ తర్వాత అమెరికాలో తుపాకుల నిరోధానికి అధ్యక్షుడు ఒబామా గానీ, ఆయనతో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మీట్ రోమ్నీ గానీ ఎలాంటి చర్య ప్రకటించలేదని విమర్శలు తలెత్తాయి.

అమెరికాలో సిక్కులకు భద్రతకు కల్పించడంలో అమెరికా ప్రభుత్వం విఫలం అయిందని ఆకల్ తఖ్త్ ప్రధాన పూజారి గ్యాని గుర్ బచన్ సింగ్ ఆరోపించాడు. అమెరికా సిక్కులు సి.సి.కెమెరాలు ఏర్పాటు చేసుకుని గురుద్వారాల వద్ద రక్షణ పొందవలసిన అవసరం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించాడు. హత్యాకాండ పట్ల భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రార్ధనా స్ధలం వద్ద మతిలేని హింస చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. “కాల్పుల ఘటన విని తీవ్రంగా షాక్ కి, విచారానికీ గురయ్యాను. ఈ మతిలేని హింస ఒక మతపరమైన ప్రార్ధనా స్ధలంలో జరగడం మరింత బాధ కలిగిస్తోంది” అని మన్మోహన్ అన్నాడు.

భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఒకింత కటువుగా స్పందించాడు. అమెరికా ప్రకటిత విధానాలకు ఈ ఘటన విరుద్ధంగా ఉన్నదని ఆయన నిరసించాడు. “తమ సామరస్యపూర్వకమైన దృక్పధం ద్వారా అమెరికా లోని సిక్కులు అమెరికా ప్రభుత్వంతో పాటు, పౌరుల మన్ననలు కూడా అందుకున్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నాను. అమెరికా ప్రకటిత విధానాలతో ఈ ధోరణి సరితూగదు. ఆ దేశంలో మత స్వేచ్ఛ ఉంది. మతనమ్మకాలతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రార్ధనలు జరుపుకునే స్వేచ్చ ఉంది. దీనిలో బైటివారు జోక్యం కేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఘోరమైన అన్యాయం. అధ్యక్షుడు ఒబామా తదితరుల ఓదార్పు సందేశాలను చూశాను. అన్ని నమ్మకాలకు రక్షణ ఉండాలని వారు నొక్కి చెప్పారు. అమెరికాకి ఏ మాత్రం పేరుతేని ఇలాంటి ధోరణి పట్ల వారు సమగ్ర దృష్టిని కనబరచవలసి ఉంది” అని కృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత, అమెరికాలో సిక్కులను ముస్లింలుగా భ్రమపడి వేధించిన ఘటనలు అనేకం జరిగాయి. విమాన ప్రయాణాలలో కూడా వారు వేధింపులు ఎదుర్కొన్నట్లు గతంలో పత్రికలు తెలిపాయి. ఆరిజోనాలో ఒక గ్యాస్ స్టేషన్ యజమాని బల్బీర్ సింగ్ ను ఇలాగే అనుమానంతో చంపేశారు.  “మేము పొడుగు గడ్డాలు పెంచుతాము. తలపాగా ధరిస్తాము. అందువల్ల మమ్మల్ని చాలామంది తప్పుగా అర్ధం చేసుకుంటారు. మమ్మల్ని ఆల్-ఖైదా గా కొంతమంది భావిస్తారు” అని ట్రక్ డ్రైవర్ గా పని  చేస్తున్న ప్రేమ్ పాల్ అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

“మేము ముస్లింలము కాదని ప్రజలకు చెప్పండి. మేము సిక్కులం” అని విస్కాన్సిన్ గురుద్వారా పూజారుల్లో ఒకరైన త్రిలోక్ సింగ్ అన్నట్లు అదే పత్రిక తెలిపింది. “ఏయ్ ఒసామా! ఇంటికి వెళ్లిపో. అని నన్నోకసారి అన్నారు” అని శివేహార్న్ ఘుమాన్ (59) పత్రికకు తెలిపాడు. 1979 లో ఇస్లామిక్ విప్లవం సమయంలో అమెరికన్లను బందీలుగా ఉంచుకున్నపుడు కూడా ఇలాగే గురుద్వారాలపై దాడులు జరిగాయని ఘుమాన్ గుర్తు చేసుకున్నాడు. 25 సిక్కు కుటుంబాలు 1997 లో స్ధాపించిన విస్కాన్సిన్ గురుద్వారా వద్ద ఇప్పుడు 350 నుండి 400 వరకూ సిక్కు కుటుంబాలు నివసిస్తున్నట్లు పోస్ట్ తెలిపింది. ముస్లింలుగా భ్రమపడి వేధించడం ఒక విషయం అయితే ముస్లింలయితే టెర్రరిస్టులుగా అనుమానించవచ్చన్న నిర్ధారణకు వచ్చేయడం మరొక విషయం.

ఆల్-ఖైదా ను అమెరికా శత్రువుగా చూస్తున్నట్లు అమెరికన్లకు ఇప్పటికీ భ్రమలు ఉన్నట్లు కనిపిస్తోంది. లిబియాలో ఆల్-ఖైదా మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని అమెరికా ప్రతిష్టించడం, సిరియాలో ఆల్-ఖైదా టెర్రరిస్టులకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తూ గూఢచార మద్దతుతో పాటు ఐక్యరాజ్యసమితి వేదికలపై రాజకీయ మద్దతు కూడా అమెరికా అందిస్తున్న సంగతి వీరు గుర్తించవలసి ఉంది. ఆఫ్ఘన్ లో రష్యాకు వ్యతిరేకంగా ఆల్-ఖైదాకు జన్మనిచ్చి పెంచి పోషీంచింది అమెరికాయే నన్న విషయం మర్చిపోవడానికే వీరు ఇష్టపడుతున్నారు.

అమెరికాలోని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులే సామాజిక ఉద్రిక్తతలకు మూల కారణం. జులై నెలలో అమెరికా నిరుద్యోగం 8.3 శాతానికి (జూన్ 8.2 శాతం) పెరిగిందని అమెరికా లేబర్ డిపార్ట్ మెంటు మూడురోజుల క్రితమే ప్రకటించింది. ఓ వైపు నిరుద్యోగ శాతం పెరిగిందని చెబుతూ ఫిబ్రవరి నుండి అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడింది జులై నెలలోనే అని లేబర్ డిపార్ట్ మెంటు ఉబ్బితబ్బిబ్బు అవడాన్ని బట్టి అమెరికా నిరుద్యోగ పరిస్ధితిని అంచనా వేయవచ్చు. 2008 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి 11 ట్రిలియన్ల డాలర్లు బెయిలౌట్లుగా భోంచేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు ప్రభుత్వ సహాయాన్ని అమెరికన్ ప్రజలకు ఏ మాత్రం తరలించకపోగా మరింత బెయిలౌట్ ఇవ్వాలని ఫెడరల్ రిజర్వ్ ను ఒత్తిడి చేస్తున్నాయి.

దేశ ఆదాయ వనరులన్నింటినీ పెట్టుబడిదారీ కంపెనీలు తమ గుప్పెట్లో పెట్టుకున్న ఫలితంగానే అమెరికాలో నిరుద్యోగం, దరిద్రం, పేదరికం పెరిగిపోయి ప్రజల్లో ఆగ్రహం ప్రజ్వరిల్లుతోంది. కంపెనీల దోపిడీని ఎదుర్కోలేని అశక్తతతో కంటికి ఎదురుగా కనిపిస్తున్న విదేశీయులను తమ సమస్యలకు కారణంగా చూసే పరిస్ధితి ఏర్పడుతోంది. విస్కాన్సిన్ గురుద్వారా పై దాడి ఈ పరిస్ధితుల నేపధ్యంలోనే  జరిగినదేనని చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో అమెరికా ప్రజలకు మరింత గడ్డు పరిస్ధితులు ఎదురుకానున్నాయి. అమెరికా కాంగ్రెస్ లో గత సంవత్సరం ఋణ పరిమితి పెంపు సందర్భంగా పాలక, ప్రతిపక్షాలకు జరిగిన ఒప్పందం మేరకు 2013 నుండి పొదుపు విధానాలు అమలుకానున్నాయి. ఈ విధానాల కోసం ప్రత్యేక చర్చ అవసరం లేకుండా ఆటోమేటిగ్గా అమలు ప్రారంభం అయ్యేలా ఒప్పందం జరిగిపోయింది. ఎన్నికల్లో ఒబామా గెలిచినా, ఓడినా ప్రజలపై మరిన్ని పన్నులు, ఉద్యోగాల కోతల రూపంలో దాడులు తప్పవు.

One thought on “అమెరికా గురుద్వారాలో 6గురు సిక్కులను కాల్చి చంపిన తెల్ల దురహంకారి

  1. ఒకవేళ అమెరికా ఆదాయం పెరిగినా అమెరికా ఆ డబ్బులని యుద్ధాలకి తగలేస్తుంది. అమెరికా ప్రభుత్వానికి ఆయుధాల కంపెనీలతో ఆ లాబీ ఉంది.

వ్యాఖ్యానించండి