టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్


అన్నా బృందం రెండో నిరాహార దీక్ష ఎంత చప్పగా ప్రారంభం అయిందో అంతే చప్పగా ముగిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా, జనం కోసం అన్నా కూడా ఆయనతో జత కలిసినా పట్టించుకున్నవారు లేరు. అన్నా హజారే గత సంవత్సరం చేసిన నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పత్రికలు, ఛానెళ్ళు ఈసారి అంతగా పట్టించుకోలేదు. అన్నా దీక్ష విరమణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి అసలు ‘జంతర్ మంతర్’ వద్ద ఏం జరుగుతోందో తనకు తెలియనట్లే వ్యవహరించింది. మువ్వన్నెల జెండా రెపరెపలతో, భారత్ మాతా కీ జై, వందేమాతరం లాంటి నినాదాలతో హోరెత్తించిన మధ్యతరగతి జనం ఈసారి దూరంగానే ఉండిపోయారు. ఫలితంగా ప్రభుత్వం నుండి ఎటువంటి హామీలు లేకపోయినా, కనీసం పలకరింపులకైనా నోచుకోకపోయినా మాజీ సైన్యాధిపతిని చేత ‘మమ’ అనిపించి దీక్షను ముగించుకున్నారు అన్నా బృందం.

అయితే చప్పగా ముగిసిన నిరాహార దీక్షకు అసలు ట్విస్టు చివర్లో వచ్చింది. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నామంటూ అన్నా బృందం చేసిన ప్రకటనతో పత్రికలు, చానెళ్ళు మళ్ళొకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమం పై విశ్లేషణలు ప్రారంభించాయి. రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ తాను పోటీ చేసేది లేదని అన్నా ప్రకటించాడు. కానీ పోటీ చేసినవారి తరపున ప్రచారం చేస్తానని తెలిపాడు. తమ పార్టీకే ప్రజలే పేరు పెడతారని అరవింద్ ప్రకటించాడు. ‘పారదర్శకత, మెరుగైన విద్య, సెక్యులరిజం, పేద రైతు, దోచుకోబడుతున్న సగటు జీవి’ ఇవే తమ పార్టీకి ముఖ్యమని ప్రకటించాడు. ఎన్నికల్లో గెలవాలని తాము కోరుకోమనీ, ఇప్పుడు ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలను సవాలు చేయాలన్నదే తమ అభిమతమని తెలిపాడు. పార్టీకి వచ్చిన విరాళాలని వెబ్ సైట్లో ఉంచుతామనీ, అప్పుడిక ఇతర పార్టీలు కూడా అనుసరించక తప్పదని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అయితే రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి అన్నా బృందంలోని వారందరూ అనుకూలంగా లేనట్లు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలనీ, గొప్ప ఉద్దేశ్యాలతో రాజకీయ పార్టీ పెట్టేవారు మధ్యలోనే విరమించుకోవడమో లేక పెద్దగా ఏమీ సాధించలేకపోవడమో జరుగుతుందనీ మేధా పాట్కర్ వ్యాఖ్యానీంచ్చిందని ఎన్.డి.టి.వి తెలిపింది. అన్నా బృందం రాజకీయాల్లో చేరడం తనకిష్టం లేదనీ, అన్నా ఉన్నది రాజకీయాల కోసం కాదనీ మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే అన్నాడు. జంతర్ మంతర్ వేదిక వద్ద హాజరైనవారిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని సదరు టి.వి తెలిపింది. అన్నా బృందం రాజకీయ పార్టీ వ్యవహారం సంఘ్ పరివార్ కి కూడా నచ్చలేదని అజ్ఞాత పరివార్ నాయకులను ఉటంకిస్తూ చానెల్ తెలిపింది. అవినీతి వ్యతిరేక నినాదాన్ని అన్నా పార్టీ తమ వద్దనుండి లాగేసుకుంటుందని బి.జె.పి తో పాటు ఇతర సంఘ్ పరివార్ సంస్ధల ఉద్దేశ్యంగా ఉంది. బి.జె.పి పాలిత రాష్ట్రాలయిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో త్వరలో ఎన్నికలు జరగనున్నందున అన్నా పార్టీ ప్రచారం తమ అవకాశాలను దెబ్బతీస్తుందని కూడా వారు భయపడుతున్నారు. దానితో అన్నా బృందానికి ఇస్తున్న మద్దతును ఇప్పటికీ నిలిపేయడానికి సంఘ్ పరివార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇన్ని ప్రతికూలతల మధ్య అన్నా బృందం రాజకీయ ప్రయాణం ‘డెకాధ్లాన్’ పరుగుపందెంతో సమానమని ‘డి హిందూ’ కార్టూనిస్టు కేశవ్ ఇలా వివరిస్తున్నాడు.

One thought on “టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్

  1. అన్నా పార్టీకి వోట్లు పడతాయని నేను అనుకోను. సమాజంలో వ్యక్తివాదం ప్రబలంగా ఉంది. “ముందు ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు, ఎవరి ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటే సమాజం అదంతట అదే బాగుపడుతుంది” అనే భావం సమాజంలో ప్రబలంగా ఉన్నప్పుడు అన్నా హజారే నడిపే ఉద్యమాన్ని (అది కూడా ఆర్థిక అంశాల గురించి ఏమీ చెప్పని ఉద్యమాన్ని) ఎంత మంది పట్టించుకుంటారు?

వ్యాఖ్యానించండి