కుదంకుళం అణు కర్మాగారం పట్ల స్ధానిక ప్రజల భయాలు ఎంత నిజమో తెలిసి వస్తోంది. విదేశీ అణు కంపెనీల ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వంలో విలువలేదని తెలిపే సంఘటన వెల్లడయింది. 2010 లో భారత ప్రభుత్వం చేసిన ‘అణు ప్రమాద పరిహార’ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సరైన అణు పరికరాలను సరఫరా చేయకపోవడం వల్ల ఏర్పడే అణు ప్రమాదాలకు నష్టపరిహారాన్ని పరికరాల సరఫరాదారు కంపెనీలు కూడా భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని కుదంకుళంలో రష్యా నిర్మిస్తున్న అణు విద్యుత్ కర్మాగారంలోని మూడు, నాలుగవ యూనిట్లకు ఈ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలని, రష్యా ఒత్తిడి మేరకు, అణు విద్యుత్ శాఖ ప్రధానిని కోరినట్లు ఎన్.డి.టి.వి వెల్లడించింది.
అణు విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రధాని మన్మోహన్ తన శాఖ కోరిన కోరిక చట్ట వ్యతిరేకం కనుక నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి బదులు చట్టం విధించిన నిబంధనలను ఎలా పక్కన పెట్టవచ్చో చెప్పాలని అణు విధ్యుత్ శాఖను కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయమై న్యాయ మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ లను సంప్రదించవలసినదిగా ప్రధాని తన శాఖను కోరినట్లు ఎన్.డి.టి.వి వెల్లడి చేసింది. ‘ది హిందూ’ ఇలా పేర్కొంది.
According to NDTV, the Prime Minister asked the DAE how the provisions of the 2010 Act could be overruled and suggested the matter be referred to the Ministries of Law and Justice and External Affairs. In his notings, he also expressed the fear that other supplier nations would demand that NPCIL grant them a similar exemption from those provisions of the law that they did not like.
ఎన్.పి.సి.ఐ.ఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), భారత ప్రభుత్వ సంస్ధ. కనుక దానికి భారత ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. కానీ రష్యా అణు కంపెనీల ప్రయోజనాల కోసం అది పరితపిస్తోందని ఎన్.డి.టి.వి కధనం రుజువు చేస్తోంది.
కుదంకుళం అణు కర్మాగారం కోసం ఇండియా, రష్యాల ప్రభుత్వాల మధ్య 2008 లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం 1, 2 రెండు యూనిట్ల నిర్మాణం జరిగిపోయింది. అప్పటికి అణు ప్రమాద పరిహార చట్టం (న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్) రాలేదు గనక 1,2 యూనిట్లలో ప్రమాదం జరిగితే, దానికి పరిహారం చెల్లించదలిస్తే, ఆ బాధ్యత మొత్తం యూనిట్లను నిర్వహిస్తున్న ఎన్.పి.సి.ఐ.ఎల్ కంపెనీయే భరించాలి. అంటే భారత ప్రభుత్వమే భరించాలి. పనికిమాలిన అణు పరికరాలు సరఫరా చేయడం వల్ల ప్రమాదం జరిగినా భారత ప్రభుత్వ కంపెనీయే నష్టం అంతా భరించాలి. మన వేలితో మన కన్నే పొడవడం అన్నమాట.
3,4 యూనిట్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. దానికంటే ముందు అణు ప్రమాద నష్ట పరిహార బిల్లు నుండి 3, 4 యూనిట్లకు కూడా మినహాయింపు కావాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ఆమేరకు భారత ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తోంది. ఈ ఒత్తిడికి ఎన్.పి.సి.ఐ.ఎల్ కంపెనీ, భారత అణు విద్యుత్ శాఖ తలోగ్గాయని ఇప్పుడు తెలుస్తోంది. 1, 2 యూనిట్లకు వర్తించే నష్ట పరిహార నిబంధనలే 3, 4 యూనిట్లకు కూడా వర్తింపజేయడానికి గత నెలలోనే ఎన్.పి.సి.ఐ.ఎల్, అణు విద్యుత్ శాఖలు అంగీకరించాయని ఎన్.డి.టి.వి వెల్లడి చేసింది. ప్రమాదం జరిగితే నష్టపరిహారం పూర్తిగా భరించడానికి 2008 లోనే ఇండియా అంగీకరిచింది గనక సదరు అంగీకారం 3, 4 యూనిట్లకు కూడా వర్తింపజేయవచ్చని అణు విద్యుత్ శాఖ, భద్రత పై నియమించబడిన కేబినెట్ కమిటీకి నచ్చజెపుతూ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై అనుమానాలు (మాత్రమే) వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి అణు విద్యుత్ శాఖకు ప్రశ్నలు పంపాడని ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
అణు విద్యుత్ కర్మాగారాలలో జరిగే ప్రమాదాలకు నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి భారత పార్లమెంటు ‘నష్టపరిహార బిల్లు’ సందర్భంగా చర్చించింది. నష్టపరిహారం మొత్తం భారత ప్రభుత్వమే భరించాలన్న నిబంధనకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధపడింది. కానీ బి.జె.పి తో పాటు ఇతర పార్టీలన్నీ వ్యతిరేకించడంతో నామ మాత్ర నష్టపరిహారాన్ని (రు. 1500 కోట్లు) చట్టంలో పొందు పరిచారు. అది కూడా కేవలం 5 సంవత్సరాల లోపు ప్రమాదం జరిగితేనే. ఆ తర్వాత ప్రమాదం జరిగితే రష్యాకి పూచీలేదు. పనికిరాని పరికరాల వల్ల ప్రమాదం జరిగినా సరే.
ఒక్కసారి ఫుకుషిమా ప్రమాదాన్ని ఊహించుకోండి. అది స్ధాపించి 30 యేళ్ళ తర్వాత మాత్రమే ప్రమాదం జరిగింది. దానివల్ల దాదాపు రెండు లక్షలకు పైగా ప్రజలు ఇళ్లూ, వాకిళ్లూ వదిలేసి ప్రభుత్వం పంచన పడిఉండవలసి వచ్చింది. అనేకమంది ఇకా హోటళ్ళలో, బంధువుల ఇళ్ళలో, ప్రభుత్వ తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు ఫుకుషిమా రేడియేషన్ వల్ల జపాన్ ప్రజలు ఎలాంటి ప్రభావానికి గురికానున్నారో ఇంకా పూర్తిగా తెలియలేదు. ప్రభావం బయటపడి, అధ్యయనాలు జరిగి నిర్ధారణ జరిగేసరికి సంవత్సరాలే కాదు దశాబ్దాలే గడిచినా ఆశ్చర్యం లేదు. ప్రమాదాల ప్రభావాన్ని తక్కువ చేసి చెప్పడానికీ, అసలు ప్రభావమే లేదని చెప్పడానికి ప్రభుత్వాలు, కంపెనీలు ఎలా తాపత్రయపడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అటువంటి ప్రభుత్వాల ద్వారా రేడియేషన్ ప్రమాదాల అసలు ప్రభావం ఎప్పటికీ తెలిసేను? భోపాల్ ప్రమాదం జరిగి ముప్ఫై యేళ్ళు పూర్తయినా బాధితులకు నష్టపరిహారం సంగతి అటుంచి పరిసరాలనుండి విష ప్రభావాన్ని తుడిచిపెట్టడానికే ఇంతవరకు ప్రభుత్వాలు పూనుకోలేదు. అక్కడి నీటి వనరులను శుభ్రం చేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత స్ధానిక ప్రజల్లో కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజల్లో అలజడి బయలుదేరింది. అణు కర్మాగారంలో ప్రమాదం సంభవిస్తే తమ గతి ఏమిటన్న ప్రజల భయాలకు ప్రభుత్వం ఇంతవరకూ సమాధానం చెప్పలేదు. అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నామని పొడి మాటలు చెప్పడమే తప్ప ఏయే జాగ్రత్తలు తీసుకుందో వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపలేదు. ప్రమాదం జరిగిన పక్షంలో స్ధానిక ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఇప్పటికే డ్రిల్ ను జరపవలసి ఉన్నప్పటికీ ఆ ఊసే లేదు. సమాచార హక్కు చట్టం ప్రయోగించినా రష్యాతో కుదుర్చుకున్న ఒప్పంద వివరాలనూ, ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యల వివరాలనూ చెప్పడానికి నిరాకరిస్తున్నారు.
ఆందోళనకు సమాధానం చెప్పే బదులు కుదంకుళం ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. గుర్తొచ్చినప్పుడల్లా గ్రామాల్లో పారామిలట్రీ బలగాల చేత కవాతు చేయిస్తున్నాయి. గ్రామాలకు బంధు, మిత్రుల రాకను నిషేధించాయి. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలను సైతం నిత్యం ప్రశ్నలతో, చెకింగ్ లతో వేధిస్తున్నారు. పోలీసులకు, పారా మిలట్రీ బలగాలకు భయపడి అనేకమంది పిల్లలు స్కూళ్లకు వెళ్ళడం మానుకున్నారు. పొలాలకు వెళ్లాలన్నా, పనుల నిమిత్తం, సంపాదన నిమిత్తం సమీప పట్నాలకు వెళ్లాలన్నా నిషేధాజ్ఞల వల్ల కుదరడం లేదు. అనేక కుటుంబాలకు సంపాదన మూలన పడిపోయింది. రష్యన్ కంపెనీల సంపాదన కోసం, విద్యుత్ ఉత్పత్తి పేరు చెప్పి ప్రజల కదలికలపైనే నిఘా పెట్టి నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ప్రజల కడుపుకొడుతున్న ప్రభుత్వాలను కుదంకుళం ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.
ప్రధానమంత్రి బాధ్యత వహిస్తున్న శాఖ అణు విద్యుత్ శాఖ. ఆ శాఖ మంత్రికే అనుమానాలుంటే ప్రజలకు ఇంక ఎన్ని భయాలు ఉండాలి. అణు పరిహార చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాల్సిందే. అందులో ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదు. ఇప్పటికైనా ఏలిన వారికి అణువిద్యుత్ ఒప్పందం ఫలితాలు తెలియరావడం కొంతవరకైనా సంతోషించాల్సిందే. అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం విషయంలో ఆనాడు వామపక్షాలు సరిఅయిన సూచనలే చేశాయనడానికి ఇది నిదర్శనం.