మంగుళూరు దాడి నాయకుడు నరేంద్ర మోడీకి పరమ భక్తుడు


ఎడమ: 2012 హోమ్ స్టే దాడి, కుడి: 2009 పబ్ దాడి

మంగుళూరులో ‘హిందూ సంస్కృతి’ పరిరక్షణ కోసం అంటూ బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకులపై నీచమైన రీతిలో దాడి చేసిన మూకలకు నాయకత్వం వహించిన సుభాష్ పాడిల్ గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి పరమ భక్తుడని ‘ది హిందూ’ వెల్లడించింది. 2009 లో పబ్ పై దాడి చేసి అమ్మాయిలపై చేయి చేసుకున్న బృందంలో కూడా సుభాష్ పాడిల్ చురుకయిన సభ్యుడని తెలిపింది. 2009 దాడిలో టి.వి చానెళ్ళు, పత్రికల ద్వారా బహుళ ప్రచారం పొంది వీధి నాయకుడినుండి పట్టణ నాయకుడిగా సుభాష్ ఎదిగాడని తెలిపింది. అనంతరం బిల్డర్లు, భూ ఆక్రమణదారులకు ఇష్టుడయిన గూండాగా ఎదిగి, హిందూ సంస్ధలలో ప్రత్యర్ధి నాయకులతో పోటీ పడుతూ, నాయకత్వ స్ధానాన్ని సుస్ధిరం చేసుకోవడానికే ‘మోర్నింగ్ మిస్ట్ హోమ్ స్టే’ పై దాడికి పాల్పడ్డాడని తెలిపింది. 2005 నుండి దొమ్మీ, బలవంతపు వసూళ్లు, ఆస్తుల విధ్వంసం కేసుల్లో సుభాష్ నేరస్ధుడని ఇతర పత్రికల ద్వారా తెలుస్తోంది.

‘శ్రీరామ సేన’ వీధి నాయకుడుగా మంగుళూరు పబ్ పై దాడి చేసిన సుభాష్ వాస్తవానికి ఒక గూండా. ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాల కి పని ముట్టు. అతడి ముసుగు ‘హిందూ సంస్కృతి పరిరక్షణ.’ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బి.జె.పి పార్టీ హిందూ ముసుగు వేసుకున్నట్లే హిందూత్వ రాజకీయాల్లో ఎదగడానికి, తద్వారా తన గూండా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికీ ‘హింసాత్మక మోరల్ పోలీసింగ్’ ను వృత్తిగా స్వీకరించిన వర్ధమాన గూండా. మన్మోహన్ సింగ్ దర్శకత్వంలో భారత దేశ పాలకవర్గాలు ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాల పర్యవసానంగా ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాల ద్వారా  విచ్చలవిడిగా వచ్చిపడుతున్న అక్రమ సంపాదనలో వాటా కోసం తాపత్రయపడుతున్న అనేకమంది ‘హిందూ గూండా’లలో ఒకడు.

‘హిందూత్వ సంస్కృతి పరిరక్షణ’ ఒక గూండా ఎదుగుదలకు రహదారి

‘ది హిందూ’ ప్రకారం ఒక రైతు కుటుంబంపై దాడి చేసినందుకు గత మే 25 తేదీన పోలీసులు సుభాష్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అతనితో పాటు కాంట్రాక్టర్లు, మంగుళూరు స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) అధికారుల పై కూడా ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదయింది. మంగుళూరు సెజ్ కోసం రైతుల భూములను కర్ణాటక బి.జె.పి ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంది. భూముల స్వాధీనాన్ని వ్యతిరేకించిన రైతు కుటుంబంపై ప్రభుత్వాధికారులు, సెజ్ కాంట్రాక్టర్లు, హిందూత్వ గూండా కలిసి ఉమ్మడిగా దాడి చేయడాన్ని బట్టి ఈ దేశంలో హిందూత్వ ఎవరికోసమో, ప్రభుత్వాలు ఎవరి పక్షమో స్పష్టం అవుతుండగా, హిందూత్వ చాంపియన్ల చేతిలో దేశ ప్రజల భవిష్యత్తు ఏమి కానున్నదో మరో సారి తెలిసి వస్తోంది. అంతే కాదు. నూతన ఆర్ధిక విధానాలకు ప్రతిరూపం అయిన సెజ్ లు ఎవరి సంపదలను పెంచుతున్నాయో, ఏ సంస్కృతిని అణచివేస్తున్నదో కూడా స్పష్టం అవుతోంది.

హోమ్ స్టే పై దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు జులై 26 మధ్యాహ్నం సుభాష్ పాడిల్ అనుచరులు పక్క ఊరి నుండి మంగుళూరు కు బస్సులో ప్రయాణిస్తున్న ఒక ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి లను కిడ్నాప్ చేసి చితకబాదారు. తర్వాత ఆ జంటను బుందేర్ పోలీసులకు అప్పగించగా సుభాష్ ముఠాపై పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు. 2006 నుండే శ్రీ రామ సేన లో సభ్యుడుగా పని చేస్తూ మంగుళూరు పబ్ పై దాడి ద్వారా పాలకవర్గాలకు ఇష్టుడైన గూండాగా ఎదిగిన సుభాష్ అనుచరులకు పోలీసుల నుండి సమస్యలు రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. వారు ఏ మానవ సంస్కృతిని చెరబట్టినా, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నా, ఇద్దరు యువతీ యువకుల స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించినా…  అది అనవసరం. మావోయిస్టులు ప్రజల తరపున చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఉగ్రవాదం, హిందూత్వ గూండాలు ప్రజలకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే సంస్కృతీ పరిరక్షణ!?

మోడీ భక్తాగ్రేసరుడు

గుజరాత్ మారణకాండ లో భజరంగ్ దళ్ నిర్వహించిన పాత్ర 18 యేళ్ళ సుభాష్ లో గొప్ప స్ఫూర్తిని నింపిందనీ, వెనువెంటనే 2002 లో ఆ సంస్ధలో చేరిపోయాడనీ సుభాష్ మిత్రులు ఇచ్చిన సమాచారం. “ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఫోటోను తన ఇంటిలో ఉంచుకుని అతను పూజించేవాడు” అని సుభాష్ మిత్రుడు సుదత్తా జైన్ ని ఉటంకిస్తూ హిందూ విలేఖరి సుదీప్తో మండల్ తెలిపాడు. సుభాష్ కి సంవత్సరం ముందు జైన్ భజరంగ్ దళ్ లో చేరాడు. బాల్య స్నేహితులైన వీరిద్దరిని బజరంగ్ దళ్ లో చేర్పించింది శ్రీరామ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్. అయితే 2005 లో ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి లనుండి ముతాలిక్ విడిపోయి శివ సేన కర్ణాటక విభాగాన్ని స్ధాపించాక సుభాష్, జైన్ లు అతనిని అనుసరించారు.

“బజరంగ్ దళ్, ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి లు హిందూత్వ విషయంలో మృదువుగా వ్యవహరిస్తున్నాయని మేము ఆ సమయంలో భావించాము. భారీ స్ధాయి నిర్వాకం ఏదైనా తలపెట్టాలని భావించాము” అని జైన్ తెలిపాడు. జైన్ ఇప్పుడు ‘అఖిల భారతీయ కార్మిక సేన’ కు నాయకుడు. హిందూత్వ గ్రూపులకు తాను దూరం అని ఇప్పుడు చెబుతున్నాడు. “నేనింకా హిందూత్వ నమ్ముతాను. కానీ హింసను ఇష్టపడను. కానీ సుభాష్ చాలా అత్యాశపరుడు. శారీరకంగా బలవంతుడు. పెద్ద నాయకుడు కావాలని అతని ఆశ” అని జైన్ తెలిపాడు. 2009 పబ్ దాడిలో నాయకత్వ పాత్ర పోషించినప్పటికీ శ్రీరామ సేన నాయకుడు ప్రసాద్ అత్తవర తనను తొక్కిపెడుతున్నట్లు సుభాష్ భావించాడు. అంతర్జాతీయ స్ధాయిలో బలవంతపు వసూలు (extortion) రాకెట్ ను నడుపుతున్నట్లు బయటపడడంతో 2010 మధ్యలో ప్రసాద్ అత్తవర తన అనుచరులతో సహా అరెస్టయ్యాడు. దానితో జైన్, సుభాష్ లు సేన ను వదిలి కొన్నాళ్లు అర్ధ అజ్ఞాతంలోకి వెళిపోయారు. జైన్ ట్రేడ్ యూనియన్ ని స్ధాపించగా, సుభాష్ పాడిల్ ఫిబ్రవరి 2011 లో తన అనుచరులు సురేష్ పాడిల్, శరత్ లతో సహా ‘హిందూ జాగరణ వేదిక’ లో చేరాడు. తద్వారా ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి లతో తిరిగి సంబంధాలను పునరిద్ధరించుకోవాలని సుభాష్ ఆశించాడు.

హిందూత్వ నాయకత్వ పోటీ

సంఘ పరివార్ పరిధిలో సుభాష్ పాడిల్ తనకు పోటీగా ఎదుగుతున్నాడని బజరంగ్ దళ్ నాయకుడు శరణ్ పంప్వెల్ ‘ది హిందూ’ విలేఖరితో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. మంగుళూరు లో శరణ్ కు పవర్ బేస్ గా ఉన్న పంప్వెల్ సెంటర్ లో తన కార్యాలయం స్ధాపించడానికి సుభాష్ పది రోజుల క్రితం ప్రయత్నం చేశాడు. ఇది శరణ్ కి నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. చివరికి అయిష్టంగానే పంప్వెల్ బదులు శివ్ బాగ్ లో ఆఫీసు తెరవడానికి సుభాష్ నిర్ణయించుకున్నాడు.

“అది జరిగినప్పటినుండీ సుభాష్ తానేమిటో నిరూపించాలనుకున్నాడు. ఆ రోజు (శనివారం) రాత్రి దాడి కూడా ప్రత్యర్ధి హిందూత్వ సంస్ధలకు ఒక సందేశం ఇవ్వడానికి ఉద్దేశించినదే” అని పరివార్ లో మరొక నాయకుడు చెప్పినట్లు హిందూ విలేఖరి తెలిపాడు. తన పేరు రాయడానికి అతను ఇష్టపడలేదని విలేఖరి తెలిపాడు.

2008 లో రామ సేతు వివాదానికి సంబంధించి మంగుళూరు లో షాపులను మూసివేయించడానికి శ్రీరామ సేన పిలుపు ఇచ్చింది. ఆ సందర్భంలో మూయకుండా తెరిచి ఉంచిన షాపులను సుభాష్ పాడిల్ అతని అనుచరులు విధ్వంసం కావించడం ప్రారంభించారు.  ఆ దృశ్యాన్ని పట్టుకున్న  ‘ది హిందూ’ విలేఖరి సుదీప్తో మండల్, మరో తెలివిజన్ జర్నలిస్టు ఎజ్ఞెల్ రోడ్రిగేజ్ లను త్రిశూలంతో పొడవడానికి సుభాష్ ముందుకురికాడు. అక్కడే ఉన్న శ్రీరామ సేన నాయకుడు ప్రసాద్ అత్తవర పరిస్ధితి గమనించి సుభాష్ ని అడ్డుకుని చెంపదెబ్బ కొట్టాడు. “మీరు మా మిత్రులు. మీరు (మీడియా) మేమూ కలిసి పని చేయవలసిన అవసరం ఉంది” అని ప్రసాద్ విలేఖరులతో అన్నాడు. ఆ విధంగా పత్రికల గురించిన తెలివిడి వల్ల త్రిశూల ధారి అయిన గూండా నుండి ఇద్దరు విలేఖరులు రక్షణ పొందారు.

గుజరాత్ ప్రజలను కుల, ,మత, ప్రాంత వివక్షలకు అతీతంగా కన్నబిడ్డల్లా పాలించవలసిన స్ధానంలో ఉండి కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బజరంగ్ దళ్ ద్వారా నెలల తరబడి ముస్లిం ప్రజలపై హత్యాకాండ సాగించిన నరేంద్ర మోడి సుభాష్ పాడిల్ కి ఆరాధ్య దైవం. పాలిత ప్రజలపై మతోన్మాద గూండాలను ఉసి కొల్పి హత్యాకాండ జరిపించిన వ్యక్తిని దైవంగా పూజించే సుభాష్ పాడిల్ తన దైవం నిలబడిన స్ధానానికి చేరుకోవాలని ఆశించడంలో ఆశ్చర్యం లేదు. హిందూత్వ ప్రణాళికకు ప్రయోగశాలగా మార్చిన గుజరాత్ లో మత విద్వేషమే పునాదిగా అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న మోడీ మార్గమే సుభాష్ కి శిరోధార్యం.

అమెరికా, యూరప్ ల కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా గుజరాత్ వనరులతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ వనరులను కూడా స్వదేశీ ప్రవేటు కంపెనీల ముసుగులోని విదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పనంగా అప్పగించి ‘అభివృద్ధి కాముకుడి’గా పశ్చిమ దేశాల చేత ప్రశంసలను మోడీ అందుకోవడంలోని అంతరార్ధాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. నూతన ఆర్ధిక విధానాలకు అనుగుణంగా విదేశీ ప్రవేటు కంపెనీలపై అన్నీ రకాల నియంత్రణలు, నిబంధనలు ఎత్తివేసి రాష్ట్రం నిండా సెజ్ లు నింపి పెద్ద మొత్తంలో లాభాలు తరలించుకువెళ్లడానికి మోడీ అనుమతించిన ఫలితమే అతనికి లభిస్తున్న విదేశీ ప్రశంసలు. భారత దేశ దళారీ పెట్టుబడిదారుల గుంపులోని ఒక ముఠా వేసుకున్న ముసుగే హిందూత్వ. ఈ హిందూత్వ కు ప్రజల పట్ల, వారి ప్రయోజనాల పట్లా గౌరవం లేదు. శ్రద్ధాశక్తులు అసలే లేవు. ప్రజలపై గౌరవం ఉన్నవాడెవ్వడూ మతం పేరుతో వారిని విడదీయడు.

ఆర్ధిక దోపిడీ వాటా కోసం ముఠాల పోటీ

కాంగ్రెస్ ముసుగులో ఉన్న భారత దళారీ పెట్టుబడిదారీ, భూస్వామ్య శక్తుల నుండి గణనీయమైన వాటా పొందడమే హిందూత్వ ముఠా ప్రధాన లక్ష్యం. అశేష భారత ప్రజల స్వాంతంత్ర్య పిపాసే పెట్టుబడిగా ఎదిగి పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలతో కుమ్మక్కై భారత ప్రజల ప్రయోజనాలను హరించివేస్తున్న కాంగ్రెస్ వలెనే బి.జె.పి కూడా. ఒక ముఠా సెక్యులర్ ముసుగులో ఉంటే మరొక ముఠా హిందూత్వ ముసుగు ధరించింది. రాజకీయ భావాల స్కేల్ పై ఒకటి ‘లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్’ స్ధానంలో నిలబడి సెంట్రిస్టు పార్టీలతో, వీలయినప్పుడు రివిజనిస్టులయిన పార్లమెంటరీ లెఫ్ట్ తో కూటమి కడుతుంటే,  మరొకటి రైట్ నుండి ఫార్ రైట్ వరకూ ఆక్రమించి వీరంగం ఆడుతూ వీలయినప్పుడు సెంట్రిస్టు పార్టీలతో కూడా కూటమి కట్టగలుగుతోంది. పార్లమెంటరీ స్కేల్ పై ఆ చివరి నుండి ఈ చివరి వరకూ నిలబడ్డ పార్టీలన్నీ ప్రజలకు ద్రోహం చేస్తున్నవే. వీరి లక్ష్యం ప్రజలను దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాద దేశాల దోపిడిలో వాటా పొందడమే.

ఈ వాటాలో అతి చిన్న పీపీలికమంత వాటా కోసం సుభాష్ పాడిల్ లాంటి సంఘ వ్యతిరేక లంపెన్ శక్తులు ఆతృత పడుతున్నాయి. వాటా వేటలో క్రిక్కిరిసిపోయిన కాంగ్రెస్ సముద్రంలో స్ధానం దొరకక, ప్రాంతీయ పార్టీల ఇరుకు సందుల్లో దూరలేక, ప్రత్యామ్నాయంగా అంతో ఇంతో విశాలంగా కనిపిస్తున్నట్లున్న హిందూత్వ గల్లీలోకి వీరు దూరుతున్నారు. ఆ గల్లీలో స్ధానంకోసం ప్రసాద్ అత్తవర, సుదత్తా జైన్, శరణ్ పంప్వెల్ లాంటి ఛోటా మోటా లంపెన్ లతో పోటీ పడుతూ పోటీలో విజయం కోసం హిందూ సంస్కృతీ పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతిని, మానవ నాగరికత సాధించిన విలువలను విధ్వంసం కావించడానికి తెగిస్తున్నారు. పాలకవర్గాలు బార్లా తెరిచిన తలుపులనుండి దూసుకు వస్తున్న విచ్చలవిడి సంస్కృతిని అమాయకంగా అనుకరిస్తున్న లేత ప్రాయాలను టార్గెట్ చేసుకుని తాలిబాన్ మత సంస్కృతిని అమలు చేస్తున్నారు.

నిజానికి అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణను ఎదిరిస్తున్న తాలిబాన్ తో వీరిని పోల్చడం తాలిబాన్ తెగువకు అవమానమే కావచ్చు. పస్ధూన్ సంస్కృతీ పరిరక్షణ కోసం, ఆఫ్ఘన్ దేశ వనరుల స్వాయత్తం కోసం అమెరికా ఉన్మత్త గజంతో తలపడుతున్న తాలిబాన్ కు వీధి గూండాల స్ధాయిలో అమాయక యువతీ, యువకుల ను చెరబట్టి నీచంగా విరగబడుతున్న సుభాష్ లాంటి గూండాలకు పోలిక లేదు. వీరు నిజంగా తాము భావించే హిందూ సంస్కృతీ పరిరక్షకులే అయితే మొదట పాలకులు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలనూ, ఆ విధానాల వెంటే దిగబడుతున్న విదేశీ సంస్కృతినీ వ్యతిరేకించాలి. ఆర్ధిక విధానాల పర్యవసానంగా వెల్లువెత్తుతున్న విదేశీ సంస్కృతి నుండి దేశీయ సంస్కృతిని రక్షించుకోవాలంటే దానికి మూలమైన ఆర్ధిక విధానాలపై పోరాడాలన్న విచక్షణ ఉండాలి. అక్రమ సంపాదనలో పీపీలిక వాటా కోసం ఆతృత పడుతున్న లంపెన్ లకు ఈ విచక్షణ ఉంటుందనుకోవడం అత్యాశే. ఇలాంటి పీపీలికాల ద్వారా ఏ సంస్కృతీ పరిరక్షణా జరగదు గాక జరగదు.

4 thoughts on “మంగుళూరు దాడి నాయకుడు నరేంద్ర మోడీకి పరమ భక్తుడు

  1. గతంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా సమర్థించిన స్వతంత్ర పార్టీ అనే పార్టీ ఉండేది. ఆ పార్టీ భారతీయ జన సంఘ్‌లో విలీనమైంది, జన సంఘ్ బిజెపిలో విలీనమైంది. బిజెపి పూర్వ చరిత్రే సామ్రాజ్యవాద అనుకూల చరిత్ర. ఆ పార్టీ విధానాలు దానికి జన్మనిచ్చిన స్వతంత్ర పార్టీ & జన సంఘ్‌ల విధానాలకి భిన్నంగా ఉండవు.

  2. మన సంస్కృతి మనం అనుకునేంత గొప్పది కాదు. నిన్న నేను రెస్టారెంట్‌లో ఉండగా వెనుకాల ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. అతని బావమరిదికి ఒక సంబంధం చూశారట, ఆ అమ్మాయి అతని కంటే వయసులో పెద్దదట, వయసులో పెద్దైన అమ్మాయినీ లేదా విడాకులు తీసుకున్న అమ్మాయినీ చేసుకోవద్దని వీడు సలహా ఇచ్చాడట! ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్న యుగం అని చెప్పుకుంటూనే వయసు, ఎత్తు లాంటి పట్టింపుల పేరుతో స్త్రీలని కించపరిచే సంస్కృతిని కొనసాగిస్తున్నారు.

  3. హిందూత్వని ఇంత బలంగా సమర్థిస్తున్న నరేంద్ర మోడీ ఏ అగ్రకులంవాడో కాదు. అతను తేలీ (నూనె తీసేవాళ్ళ) కులానికి చెందినవాడు. వోట్ల కోసమే అతను మత రాజకీయాలు నడుపుతున్నాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s