ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే


ఆడవాళ్లపై అత్యాచారాలకు, అత్యాచార ప్రయత్నాలకు వారి కురచ దుస్తులే కారణమని పోలీసు బాసులు, ప్రభుత్వాధికారులు నుండి గ్రామ పెద్దల వరకు ఏకబిగిన వాపోతున్న సంగతి తెలిసిందే. ‘ఈవ్ టీజింగ్’ నేరానికి కూడా ఆడపిల్లల డ్రస్సులే ప్రేరణనిస్తున్నాయని తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ధారించాడు. అంతలోనే ఈవ్ టీజింగ్ కొత్తదేమీ కాదని కూడా సమర్ధించుకొచ్చాడు. మరోసారి నాలుక మడతేసి కురచ దుస్తులనూ అభినందించాడు. సొంత పార్టీ మంత్రులతో పాటు ప్రముఖులంతా తూర్పారబట్టినా సంరక్షకుడిగానే తానా మాటలన్నానని తనను తాను వెనకేసుకొచ్చాడు.

నార్త్ 24 పరగణాల జిల్లా లోని బరాసత్ లో శుక్రవారం సాయంత్రం ఒక విద్యార్ధిని ట్యూషన్ క్లాసుల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు వేధించడం ప్రారంభించారు. అదేమని ప్రశ్నించినందుకు ఆమె తండ్రిని కూడా వెకిలి చేష్టలతో వేధించారు. ఈ ఘటన జరిగిన నియోజకవర్గానికి తృణమూల్ ఎమ్మెల్యే చిరణ్ జిత్ చక్రబర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నందున విలేఖరులు ఆయన అభిప్రాయం కోరగా సదరు ఎమ్మెల్యే తన దివ్యాభిప్రాయాలను వ్యక్తం చేశాడు.

లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ కాలంలో సంవత్సరం క్రితం (ఫిబ్రవరి 2011) ఇదే నియోజక వర్గంలో మరొక దారుణ సంఘటన జరిగింది. తన అక్క రింకు దాస్ పై తాగుబోతు యువకుల వేధింపులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పదోతరగతి కుర్రాడు రజిబ్ దారుణంగా హత్యకు గురయ్యాడు. సమీపంలోనే ఓ బంగ్లాకు కాపలాగా ఉన్న పోలీసుల్ని రింకు శరణు వేడినప్పటికీ స్పందించకపోవడంతో కత్తిపోట్లకు గురయిన రజిబ్ చనిపోయాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపివేసింది. సి.పి.ఎం ప్రభుత్వ చేతగానితనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆడపిల్లలను కాపాడలేకపోతున్నదంటూ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై ఆగ్రహం చెందడంలో తృణమూల్ కాంగ్రెస్ ముందు పీఠిన నిలిచింది. ఇప్పుడు తనదాకా వచ్చేసరికి ఈవ్ టీజింగ్ కొత్తది కాకుండా పోయింది. బాధితుల పక్షాన నిలిచి ఆత్యాచారాలను అరికట్టడానికి నడుం బిగించడానికి బదులు ఆడపిల్లలనే తప్పు పట్టడానికి సైతం తృణమూల్ ఎమ్మెల్యే పూనుకున్నాడు.

చిరణ్‌జిత్ చక్రవర్తి, బరాసత్ ఎమ్మెల్యే

సినిమా ఆర్టిస్టు కూడా అయిన చిరంజీత్ ఇలా అంటున్నాడు, “నాకు చెప్పండి… విలన్ లేకుండా ఏ సినిమానైనా ఊహించగలరా? రావణుడి పాత్ర లేకుండా రామాయణం రాయగలరా? ఈవ్ టీజింగ్ చాలా పాతది… కానీ దానికి తగిన ఏర్పాట్లు మాత్రం అమ్మాయిలే చేస్తున్నారు” అన్నాడాయన. “అది (ఈవ్ టీజింగ్) అనేక సంవత్సరాలుగా సాగుతోంది. ఈవ్ టీజింగ్ ఘటనలు పెరిగిపోవడానికి ఒక ముఖ్య కారణం స్త్రీలు కురచ దుస్తులు, కురచ స్కర్టులు ధరించడం. ఇది యువకులను రెచ్చగొడుతోంది” అని చిరంజీత్ వ్యాఖ్యానించాడు.

ఎమ్మెల్యే గారు అంతటితో సరిపెట్టుకోలేదు. “కాలానుగుణంగా డ్రస్సులు మారిపోయాయి… మగవాళ్ళని ఆకర్షించడానికి స్కర్టులు కురచనయ్యాయి… దానిని అభినందించవలసిందే… కానీ ఎత్తిపుడుపులు, కామెంట్లు కూడా వస్తుండేసరికి ఈవ్ టీజింగ్ కేసుగా మారిపోతోంది… అది అభిలషణీయం కాదనుకోండి” అని ఎమ్మెల్యే చిరంజీత్ ముక్తాయించాడు. ఈవ్ టీజింగ్ పెద్ద నేరం కాదన్న తన వాస్తవ ఆలోచనను బయటపెట్టుకున్న ఎమ్మెల్యే దానికి విరుద్ధంగా ఉన్న తన పదవీ బాధ్యత గుర్తుకు వచ్చేసరికి అభిలషణీయం కాదంటూ తప్పుకున్నాడన్నమాట. చిరంజీత్ వ్యాఖ్యలపై స్పందన కోరగా నాకదేమీ తెలియదంటూ ముఖ్యమంత్రి మమత స్పందించడానికి నిరాకరించింది.

చిరంజీత్ వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు ఖండించారు. ప్రభుత్వం లోని వ్యక్తులు కూడా ఆయన వ్యాఖ్యలను తిరస్కరించారు. స్త్రీ, సాంఘిక సంక్షేమ మంత్రి సాబిత్రి మిత్రా వారిలో ఉంది. ఆడపిల్లల దుస్తులకు గానీ, స్టైల్ తో గానీ ఈవ్ టీజింగ్ కు సంబంధం లేదని ప్రకటించింది. మనః స్ధితే (state of mind) దానికి కారణమని వ్యాఖ్యానించింది. “అది ఒక మానసిక వైపరీత్యం (mental perversion). సామాజిక చెడుగు. దుస్తుల ధారణే దోషి అయితే చీరలు, సల్వార్ కమీజ్ లు ధరించే గ్రామీణ యువతులు వేధింపులు ఎదుర్కోకుండా ఉండాలి” అని సాబిత్రి వ్యాఖ్యానించింది. బరాసత్ ఘటనలో దోషులపై కేసులు మోపామని ఆమె తెలిపింది.

ఇంత జరిగినా చిరంజీత్ వాదన మారలేదు. తన అపసవ్య వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి బదులు ప్రజల సంరక్షకుడిగా (గార్డియన్) మాత్రమే తాను మాట్లాడానని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు. “టీనేజి యువతుల బాగుకోసమే నేనలా చెప్పాను. ఒక తండ్రి, ఒక అన్న, ఒక గార్డియన్ తమ టీనేజి కూతుళ్ళు, చెల్లెళ్ల కోసం పడే ఆందోళనలో భాగమే నా వ్యాఖ్యలు” అని తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నాడు. మానసిక వైపరీత్యంతో సిగ్గు మరిచి ప్రవర్తిస్తున్న యువకులలో తప్పు వెతకడానికి బదులు ఆడపిల్లలపై వేధింపులకు వారినే బాధ్యులుగా చేయడాన్ని ‘సంరక్షణ’ గా సమర్ధించుకున్నాడు. కురచ దుస్తులే వేధింపులకు కారణం అంటూనే కురచ దుస్తులను అభినందించే ద్వంద్వ బుద్ధులను ప్రదర్శించాడు. తన మనో చాంచల్యాన్ని సామాజిక ధోరణులకు సిద్ధాంతంగా ఆపాదించడానికి ప్రయత్నించాడు.

పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల జిల్లా స్త్రీలపై అత్యాచారాలకు పేరు మోసినట్లు కనిపిస్తోంది. 34 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో స్త్రీలపై అత్యాచారాలు ఎన్నడూ ఆగిందిలేదు. రజిబ్ హత్యానంతరం సామాజిక పరిస్ధితులకు అనుగుణంగా పోలీసులు సెన్సిటైజ్ కావాలని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య బోధలు చేశాడే తప్ప 34 సంవత్సరాల పాలనలో పోలీసుల సెన్సిటైజేషన్ కు తమ ప్రభుత్వం ఎందుకు పూనుకోలేకపోయిందో చెప్పలేదు. మూడు దశాబ్దాల పాలనలో కూడా పోలీసులను సెన్సిటైజ్ చేయలేని రాజకీయాధికారం కోసం లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు ఎందుకు పాకులాడాయో, ఇంకా ఎందుకు పాకులాడుతున్నాయో చెప్పవలసి ఉంది. ఆర్ధిక వర్గాల రద్దు సంగతి తర్వాత… తోటి అమ్మాయిలను వ్యక్తులుగా చూడలేని కుసంస్కారాన్ని యువకులలో, సమాజంలో ప్రోది చేయలేని రాజకీయాధికారం ద్వారా సి.పి.ఐ, సి.పి.ఎం తదితర పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఇన్ని దశాబ్దాలుగా ఏమి సాధించాయో కూడా చెప్పవలసి ఉంది.

పదవిలో లేనన్నాళ్లూ సి.పి.ఎం పాలనపైనా, ఆ పార్టీ గూండాయిజం పైనా నిప్పులు చెరిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంలో చేసిందేమీ లేదు. పైగా తృణమూల్ నాయకుల గూండాయిజాన్ని వివిధ పేర్లతో సమర్ధించుకుంటోంది. కలకత్తాలో కారుల్లోనే స్త్రీలపై అత్యాచారాలు జరిగినా జరగలేదని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి మమత బుకాయించింది. ఏ అత్యాచారం జరిగినా, ఏ నేరం జరిగినా సి.పి.ఎం కుట్రగా చెప్పి తప్పుకోవాలని ప్రయత్నిస్తోంది.

సామాజిక చైతన్యం ఉన్న చోట ఆర్ధిక నేరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. నిజానికి ఆధిపత్య వర్గాల ఆర్ధిక దోపిడీకి పుట్టినవే సామాజిక చెడుగులు. సామాజిక చెడుగులకు వ్యతిరేకంగా ప్రజానీకం చైతన్యం పొందిననాడు అటువంటి చైతన్యం అనివార్యంగా ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికే దారితీస్తుంది. అందుకే సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించడానికి, అభివృద్ధి చేయడానికి ఆధిపత్య వర్గాల సేవకులైన పాలకులు పూనుకోరు. అందులో భాగమే ఈవ్ టీజింగ్ లాంటి దుర్మార్గాలకు పాలకుల సమర్ధనలు కొనసాగుతాయి.

One thought on “ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే

  1. దీని గురించి బొందలపాటి గారి బ్లాగ్‌లో పెద్ద చర్చే జరిగింది: http://bondalapati.wordpress.com/2011/12/29/%E0%B0%85%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B0%82-%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95-average-tolerance/

వ్యాఖ్యానించండి