అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా అన్న సమస్య వస్తే కంపెనీల ప్రయోజనాలే తమకు మిన్న అని చాటుకుంది.
“ఒక్కోటి 90,000 టన్నులు మోసే ట్యాంకర్లను లేదా సరుకులను మేము ఈ జులైలో దిగుమతి చేసుకోవలసి ఉంది. కానీ కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ (సి.ఐ.ఎఫ్) లకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో అందులో ఒక్కదానినే మేము దిగుమతి చేసుకోగలిగాము” అని ‘మంగుళూరు రిఫైనరీస్ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్’ (ఎం.ఆర్.పి.ఎల్) కంపెనీ ఎం.డి పి.పి.ఉపాధ్య శుక్రవారం విలేఖరుల సమావేశంలో చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
చెప్పేదొకటి, చేసేదొకటి
ఇరాన్ పై కత్తి కట్టిన పశ్చిమ దేశాలు ఐక్యరాజ్య సమితిని ఉపయోగించి ఆ దేశ వాణిజ్య ప్రయోజనాలపై నాలుగు విడతలుగా ఆంక్షలు విధింపజేశాయి. ఇరాన్ అసలు తయారు చేయని అణు బాంబును సాకుగా చూపి ఈ ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల పరిధిలోకి క్రూడాయిల్ వాణిజ్యం రాకపోవడంతో అమెరికా, యూరప్ లు ఇరాన్ పై సొంత ఆంక్షలు విధించడానికి పూనుకున్నాయి. ఈ సంవత్సరం జనవరి 1 తేదీన అమెరికా సొంత ఆంక్షలు ప్రకటించగా యూరప్ దేశాలు దానిని అనుసరించాయి. ఈ ఆంక్షలు జులై 1 నుండి అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి వేదికగా విధించిన ఆంక్షలను అమలు చేస్తాము తప్ప దేశాలు విధించే సొంత ఆంక్షలను అమలు చేయరాదన్న విధానాన్ని ఇండియా మొదటినుండీ అనుసరిస్తూ వచ్చింది. దానిలో భాగంగా అమెరికా, యూరప్ ల ఆంక్షలను అమలు చేయబోమని ప్రకటించింది. కానీ ప్రభుత్వ ప్రకటన వాస్తవంలో అమలు కావడం లేదని ఎం.ఆర్.పి.ఎల్ ప్రకటన స్పష్టం చేస్తోంది.
ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను ఇండియా సైతం తగ్గించాల్సిందేననీ, లేనట్లయితే ఆంక్షలు ఎదుర్కోవలసిందేననీ అమెరికా, యూరప్ దేశాలు ఒత్తిడి తేవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ ఒత్తిడిలకు తలోగ్గేది లేదని భారత విదేశాంగ మంత్రితో సహా అనేకమంది ప్రభుత్వ పెద్దలు వివిధ సందర్భాలలో చెబుతూ వచ్చారు. వాస్తవంలో మాత్రం ఈ సంవత్సరం ప్రారంభం నుండే ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులు తగ్గిపోతూ వచ్చాయి. ఈ తగ్గుదలకు మార్కెట్ నిర్ణయాలే కారణం తప్ప విధాన నిర్ణయం కాదని విదేశీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అనేకసార్లు ప్రకటించాడు. కొద్ది నెలల క్రితం అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా స్వయంగా ఇండియా సందర్శించి ఇరాన్ ఆయిల్ దిగుమతులను తగ్గించడానికి చర్చలు చేసి వెళ్లింది. పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణలో పశ్చిమ దేశాల ఒత్తిడిలకు తలొగ్గడం భారత పాలకుల విధానంగా మారింది.
పొమ్మనకుండా పొగబెట్టడం
ది హిందూ ప్రకారం, జులై 1 తేదీనుండి ఇ.యు ఆంక్షలు అమలులోకి వచ్చాక ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారానే క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడానికి ఎం.ఆర్.పి.ఎల్ తో పాటు ఇతర కంపెనీలకు అనుమతి ఇచ్చింది. సి.ఐ.ఎఫ్ ప్రాతిపదికన ఈ అనుమతి మంజూరు చేసింది. అప్పటివరకూ సరుకులకు ఇండియాకి చెందిన జి.ఐ.సి లాంటి ఇన్సూరెన్స్ సంస్ధలు భీమా కల్పించగా, ఆ తర్వాత నౌకలతో పాటు సరుకుకు ఇన్సూరెన్స్ కల్పించే పని కూడా ఇరాన్ కే ప్రభుత్వం వదిలిపెట్టింది. కానీ ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇరాన్ ప్రభుత్వ కంపెనీ ‘నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ’ కి చెందిన 58 నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. 2011-12 లో 7.3 మిలియన్ టన్నుల దిగుమతికి ఒప్పందం చేసుకున్నా ఎం.ఆర్.పి.ఎల్ 6.2 మిలియన్ టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంది. అమెరికా ఆంక్షల నుండి రాయితీ పొందడానికి ఇండియా ఈ కోత విధించుకుంది. కానీ ఈ రాయితీలో నౌకలు లేకపోవడంతో ఇరానియన్ నౌకలపై ఇండియా తాజా నిషేధం అమలు చేస్తోంది. పొమ్మనకుండా పొగబెడుతోంది.
అమెరికా సొంతగా ఆంక్షలు విధించడం, ఆ తర్వాత అదేదో దయ తలచినట్లు ఆంక్షలనుండి రాయితీ ఇస్తున్నట్లు చెప్పడం, ఆ రాయితీల కోసం భారత సార్వభౌమాధికార ప్రభుత్వం దేబిరించడం, దేబిరించినా ఫలితం లేకపోతే ఆంక్షలను అమలు చేయడం…. ఇదే భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాస్తవ విధానం. ఒక ఆధిపత్య దేశం ఒక స్వతంత్ర దేశంపై అక్కడి ప్రజల ప్రయోజనాలను దారుణంగా ఉల్లంఘిస్తూ ఆంక్షలు విధిస్తే మరో స్వతంత్ర దేశం వాటిని అమలు చేయడానికి సిద్ధపడడం సార్వభౌమ దేశాలు చేసే పని కాదు. పశ్చిమ దేశాల ఆంక్షలను వాడిపారేసిన రుమాలుతో పోల్చి తిరస్కరించడం ద్వారా ఇరాన్ పాలకులు తమ సార్వభౌమాధికారాన్ని తమ దేశ ప్రతిష్టనూ కాపాడుకోగా భారత దేశం లాంటి స్వతంత్ర దేశాల ప్రభుత్వాలు ఆంక్షలకు సాగిలపడడం సిగ్గుచేటైన విషయం.
ఉపాధ్య ప్రకారం, ఎం.ఆర్.పి.ఎల్ కంపెనీ ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 1.2 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇరాన్ నుండి తగ్గించిన క్రూడాయిల్ ను పూడ్చుకోవడానికి స్పాట్ మార్కెట్ నుండి కొనుగోళ్లను అది రెట్టింపు చేసింది. స్పాట్ మార్కెట్ నుండి గతంలో నెలకు ఒక లోడు మాత్రమే దిగుమతి చేసుకోగా ఇప్పుడు ప్రతి నెలా మూడు లోడులను దిగుమతి చేసుకుంటోంది. ఈ సంవత్సరం కొత్తగా ఇరాక్ నుండి 0.5 మిలియన్ టన్నుల దిగుమతులకు ఇండియా కాంట్రాక్టు కుదుర్చుకుంది. సౌదీ అరేబియా నుండి 2.5 మిలియన్ టన్నులు అబుదాబి నుండి మరో 2 మిలియన్ టన్నులు దిగుమతికి ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరాన్ ఆయిల్ రిఫైన్ చేయడానికి ఉద్దేశించబడిన భారత రిఫైనరీలు ఇతర దేశాల ఆయిల్ కోసం అదనపు ఖర్చు భరించవలసి ఉంటుంది. ఇరాన్ నుండి దిగుమతి అయ్యే చౌకైన, మేలైన క్రూడాయిల్ ను కూడా ఇండియా వదులుకుంది. ఈ త్యాగాల వెనుక భారత ప్రజల ప్రయోజనాలు లేకపోగా అందుకు వ్యతిరేకమైన పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలే ఉన్నాయి.
వనరులు, మార్కెట్ల కోసమే
పశ్చిమ దేశాలు ఇరాన్ ఆయిల్ వనరులను కొల్లగొట్టడానికి అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇరాన్ దేశీయ పెట్టుబడిదారులు పశ్చిమ దేశాల కంపెనీలకు తమ దేశ వనరులను, మార్కెట్ ను అప్పజెప్పడానికి దృఢంగా నిరాకరిస్తూ వచ్చారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా తదితర పశ్చిమ దేశాల ఆయిల్ కంపెనీలను ఇరాన్ నుండి తరిమి కొట్టారు. అప్పటినుండి ఇరాన్ లో జొరబడడానికి అమెరికాతో సహా యూరోపియన్ దేశాల కంపెనీలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇరాన్ అణు విధానాన్ని సాకుగా చూపి ఇరాన్ పెట్టుబడిదారులపై అణచివేత చర్యలకు పశ్చిమ దేశాలు తెగించాయి.
అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకందారు అయినప్పటికీ, అణుబాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు ఒక్క వీసమెత్తు సాక్ష్యం కూడా చూపలేనప్పటికీ పశ్చిమ దేశాలు ఆ దేశంపై దారుణమైన రీతిలో దశాబ్దాలుగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల గూఢచార సంస్ధలు సైతం అణుబాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నించడం లేదని అనేకసార్లు ప్రకటించాయి. అయినప్పటికీ అమెరికా, యూరప్ లు ఇరాన్ పెట్టుబడిదారులను లొంగదీసుకుని అక్కడి ఆయిల్ వనరులను కొల్లగొట్టే దుర్బుద్ధితో ఆంక్షలు అమలు చేయడమే కాక దురాక్రమణకు సైతం ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
ఇరాన్ ను బలహీన పరచడానికి దాని మిత్ర దేశమైన సిరియాలో కిరాయి తిరుగుబాటు నడిపిస్తున్నాయి. బయటి దేశాల కిరాయి సైనికులను సిరియాలో ప్రవేశపెట్టి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తూ టెర్రరిస్టు దాడులను, సామూహిక హత్యాకాండలను జరిపిస్తున్నాయి. తిరిగి హత్యాకాండల నెపాన్ని సిరియా ప్రభుత్వంపై మోపుతూ తమ పత్రికా సంస్ధల ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నాయి. తాజాగా సిరియా వద్ద రసాయన ఆయుధాల గురించి ప్రచారం చేస్తూ ఇరాక్ పై దాడికి ముందరి పరిస్ధితులను ఏర్పరుస్తున్నాయి.
మధ్య ప్రాచ్యంలో పశ్చిమ దేశాలు చేస్తున్న యుద్ధ ప్రయత్నాలు అన్నీ దేశాలలోనూ ఆయిల్ రేట్లు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. దానివల్ల సమస్త సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా వివిధ దేశాలలోని సంక్షోభ పరిస్ధితులు మరింత ముదురుతున్నాయి. అందువల్ల పశ్చిమ దేశాల ప్రతి దుర్మార్గ చర్య ప్రభావాన్ని ప్రపంచంలోని ప్రతి పౌరుడూ భరించవలసి వస్తోంది. కనుకనే ఆ దేశాల దుర్మార్గాలను ప్రతి దేశమూ, ప్రతి పౌరుడూ చురుకుగా ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది. భారత దేశ ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు కాదు.
Mana rajakeeya nayakulu mararu dabbu vunnanthavaruku.. vallaki Personnel ga doller souit case ledha direct amount swiss bank lo ki vellipothayi mana gurunchi(Prajalu ) vallaki avasaram ledhu…