“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’ ను ఈ ఎగ్జిబిషన్ ప్రతిబింబిస్తోంది. ‘ఇండియన్ హై వే’ అన్న టైటిల్ అర్ధం ‘ఇన్ఫర్మేషన్ సూపర్ హై వే’ అని కాఫా తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం చైనా ప్రేక్షకులకు ప్రజాస్వామ్య భారత దేశంలోని ప్రజాస్వామిక అభిప్రాయాల వైవిధ్యం గురించి తెలియజేయడానికి ఈ ప్రదర్శనను ఉద్దేశించారు.
భారత దేశంలోని గొప్ప సృజనాత్మక కళా ద్రష్టలు ముప్ఫై మంది వరకు ఈ ప్రదర్శనలో తమ కళను ప్రదర్శించారట. శిల్పం, వీడియో, ప్రతిష్టాపన (ఇన్‌స్టలేషన్), పెయింటింగ్ మరియు అభినయం (పెర్ఫార్మెన్స్) లు ఈ కళా ప్రదర్శనలో ఉంచారు. సమకాలీన భారతీయ పరిస్ధితులకు సంబంధించిన సామాజిక, రాజకీయ అంశాలతో పాటు ఎన్విరాన్మెంటలిజమ్, రెలిజియస్ సెక్టేరియనిజం, జెండర్, సెక్సువాలిటీ, వర్గం (క్లాస్) మున్నగు అంశాలను ఎగ్జిబిషన్ సృజించిందట. ‘అట’ అనడం ఎందుకంటే ఈ కళాకృతులు ఒకపట్టాన అర్ధం కాలేదు గనక. చైనాలో భారతీయ కళా ప్రదర్శన జరుగుతున్నదని చెప్పడానికీ, పొరుగు దేశాల మధ్య కళా సంబంధాలు పెంపొందడానికి కృషి జరుగుతోందని చెప్పడానికీ ఈ పోస్టు ఉద్దేశించబడింది. దానితో పాటు భారతీయ ఆధునిక కళ పేరుతో విదేశాలలో ప్రదర్శితమవుతున్న కళ, కళాకృతులు ఎలా ఉన్నాయో సమాచారం ఇవ్వడం కూడా ఈ పోస్ట్ ఉద్దేశ్యం. ఇందులోని కళాకృతులు గానీ ఇతర ప్రదర్శితాలు గాని పాఠకులకు ఎవరికైనా అర్ధం అయితే తమ వ్యాఖ్యలలో వివరించినవారికి అడ్వాన్స్ కృతజ్ఞతలు.



































