ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస


ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది.

“ప్రపంచ స్ధాయిలో తీవ్ర స్ధాయిలో ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ, చైనా ఆర్ధిక వ్యవస్ధ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ను సాధించినట్లు కనిపిస్తోంది” అని బీజింగ్ తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన నివేదిక పేర్కొందని ‘ది హిందూ’ తెలిపింది. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన చైనా ఇతర దేశాలతో ఉన్న భారీ వాణిజ్య మిగులును తగ్గించుకుందనీ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిందని నివేదిక వ్యాఖ్యానించింది. అయితే మరీ ఎక్కువగా బ్యాంకులు అప్పులు ఇచ్చినందున ఆర్ధిక స్ధిరత్వ సాధనకు మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

చైనాకు అమెరికా, యూరోపియన్ యూనియన్ లతో పాటు ఇండియాతో సహా అనేక దేశాలతో వాణిజ్య మిగులు భారీగా ఉంటూ వచ్చింది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం ఈ వాణిజ్య మిగులు తగ్గించుకోవాలని అమెరికా, ఇ.యు లు అదే పనిగా చైనాపై ఒత్తిడి తెచ్చాయి. 2010 వరకు పశ్చిమ దేశాల ఒత్తిడిలను ప్రతిఘటించిన చైనా, అనంతర కాలంలో ఆ దేశ వాణిజ్య మిగులులో తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల ఒత్తిడులకు లొంగడం వల్ల అని చెప్పడం కంటే సంక్షోభ దరిమిలా కొన్ని జాగ్రత్తలను చైనా చేపట్టడం వల్ల మాత్రమే సంభవించిందని కొందరు ఆర్ధికవేత్తలు విశ్లేషించారు.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ఎగుమతులపై అధికంగా ఆధారపడడం తగ్గించడానికి చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడినట్లయితే ఇతర దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సంక్షోభం ఎదుర్కొంటున్నపుటు దాని ప్రభావం అనివార్యంగా దేశ ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూలంగా పడుతుంది. ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా ఆదాయం పొందడం కంటే దేశీయ మార్కెట్ ను మెరుగుపరుచుకుని దేశీయ ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా గతంలో అనేకసార్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్ ను మెరుగుపరుచుకునే వ్యూహంలో భాగంగానే చైనా తన ఎగుమతులను తగ్గించుకోవడం వల్ల వాణిజ్య మిగులు లో తగ్గుదల సంభవించిందన్నది విశ్లేషకులు అంచనా. వివిధ సందర్భాలలో చైనా నాయకులు చేసిన ప్రకటనలు కూడా ఈ విశ్లేషణను సమర్ధించేవిగా ఉన్నాయి.

చైనా కరెన్సీ యువాన్ విలువ కూడా ప్రపంచ ఆర్ధిక రంగంలో ఒక హాట్ టాపిక్. చైనా సరుకులు అంతర్జాతీయంగా పోటీ పడడానికి వీలుగా చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా, యూరప్ లు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నది. అమెరికా, యూరప్ ల ఆర్ధిక సమస్యలకు పరిష్కారాన్ని తమ దేశాల్లోనే వెతుక్కోవాలి తప్ప చైనా కరెన్సీ విలువలో కాదని చైనా ప్రభుత్వం వాదిస్తుంది. గత మే నెలలో కూడా యువాన్ విలువ పెరగడానికి అనుమతించాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ చైనాను కోరాడు. యువాన్ విలువ పెరిగితే దేశీయ మార్కెట్ పెరుగుతుందని గీధనర్ నమ్మబలికినా, స్వల్ప స్ధాయిలో మాత్రమే (1 శాతం) యువాన్ విలువను మార్కెట్ శక్తులకు చైనా ప్రభుత్వం అప్పగించింది. విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం ద్వారా వివిధ కరెన్సీలతో యువాన్ విలువను తాను అనుకున్న స్ధాయిలో నియంత్రిస్తుందని చైనా పై ఆరోపణలున్నాయి.

ఈ నేపధ్యంలో, చైనా ఆర్ధిక వ్యవస్ధ పెద్ద సమస్యలు లేకుండానే ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని, ఆ తర్వాత పశ్చిమ దేశాల మంద వృద్ధినీ అధిగమించిందన్న ఐ.ఎం.ఎఫ్ ప్రశంస పరిశీలనార్హం. పశ్చిమ దేశాల ఒత్తిడులకు లొంగి దేశీయ కరెన్సీలను విచ్చలవిడిగా డీ వాల్యూ చేసినట్లయితే ప్రభుత్వాధినేతలకు పశ్చిమ దేశాల ప్రశంసలు దొరకవచ్చు గానీ దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆమేరకు ప్రమాదంలో పడడం ఖాయం. కనీసం దేశీయ పెట్టుబడిదారులకైనా లబ్ది చేకూర్చే విధానాలు భారత ప్రభుత్వం అవలంబించడం లేదు. బొగ్గు గనులు కేటాయించినా, బాక్సైట్ ఖనిజాలు అమ్మేసినా, స్పెక్ట్రమ్ వనరులు చౌకగా కట్టబెట్టినా అంతిమంగా అవి విదేశీ బహుళజాతి కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భారత ప్రభుత్వ నాయకులు ఎప్పటికైనా భారత ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తారన్న నమ్మకం పెట్టుకోవడం వృధా అని నానాటికీ స్పష్టం అవుతోంది.

వ్యాఖ్యానించండి