పెట్టుబడిదారుల అక్రమ డబ్బు రు. 1155 లక్షల కోట్లు


ప్రపంచ దేశాలన్నింటికీ చెందిన ధనికులు దాచిన అక్రమ సొమ్ము విలువ 21 ట్రిలియన్ డాలర్లని ‘టాక్స్ నెట్ వర్క్ జస్టిస్’ (టి.ఎన్.జె) సంస్ధ చెప్పింది. ఈ సొమ్ము 1155 లక్షల కోట్ల రూపాయలకి (1 ట్రిలియన్ = లక్ష కోట్లు, 1 డాలర్ = 55 రూపాయలు) సమానం. ఇది కేవలం కనీస మొత్తం (conservative estimates) మాత్రమే. వాస్తవ మొత్తం 32 ట్రిలియన్ డాలర్లు (రు. 1760 లక్షల కోట్లు) ఉండవచ్చని సదరు సంస్ధ తెలిపింది. ఇందులో ద్రవ్య విలువే తప్ప ఇతర భౌతిక సంపదల (ప్రాపర్టీస్, నీటి నివాసాలయిన యాచ్ట్ లు) విలువ కలిసి లేదు. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్ధ మెకిన్సే లో చీఫ్ ఎకనామిస్ట్ గా మని చేసిన జేమ్స్ హెన్రీ టి.ఎన్.జె తరపున ఈ గణాంకాలు ప్రకటించాడు.

ప్రపంచ ఆర్ధిక, ద్రవ్య సంస్ధల నుండి సేకరించిన గణాంకాల ద్వారా హెన్రీ ఈ లెక్కలు తయారు చేశాడు. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్, ఐ.ఏం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్ మరియు జాతీయ ప్రభుత్వాల నుండి గణాంకాలు సేకరించబడ్డాయని బి.బి.సి తెలిపింది. బ్యాంకులు, ఇతర పెట్టుబడి ఖాతాల నుండి మాత్రమే హెన్రీ వివరాలు సేకరించాడనీ భౌతిక సంపదల వివరాలు ఇందులో కలిసి లేవనీ సదరు వార్తా సంస్ధ తెలిపింది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత పన్నుల ఎగవేత, నల్ల డబ్బు, మనీ లాండరింగ్ తదితర అంశాలపై పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నట్లు నటిస్తున్న నేపధ్యంలో హెన్రీ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అక్రమ ధనాన్ని దాచి పెట్టదానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్న పెట్టుబడిదారులు ఎంత శక్తివంతులుగా మారారంటే వారి వివరాలు సంపాదించడానికి జర్మనీ లాంటి దేశాల ప్రభుత్వాలు సైతం డబ్బు చెల్లిస్తున్నాయి. బ్యాంకుల నుండి సమాచారం దొంగిలించినవారి నుండి నల్లడబ్బు దారుల వివరాలను ప్రభుత్వాలు సంపాదిస్తున్నాయి. వివరాలు పొందిన తర్వాత కూడా పెట్టుబడిదారుల అక్రమ ఆస్తులపై ప్రభుత్వాలు వేలు కూడా పెట్టలేకపోతున్నాయి. ప్రభుత్వాలే పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నందున అదేమీ పెద్ద ఆశ్చర్యం కాదు.

పెట్టుబడిదారుల డబ్బును దాచి పెట్టుకోవడానికి వృత్తిగతంగానే సౌకర్యాలు సమకూర్చడానికి ప్రవేటు బ్యాంకులు, చట్టపరమైన లొసుగులను ఉపయోగించి పెట్టడంలో ఆరి తేరిన వివిధ సంస్ధలు, ఎకౌంటింగ్ కంపెనీలు కృషి చేస్తున్నాయని హెన్రీ తెలిపాడు. వీరి ద్వారా సంపన్నులు తమ డబ్బును ప్రపంచ వ్యాపితంగా తరలిస్తున్నారని ఆయన తెలిపాడు. పెట్టుబడిదారులు దాచి పెట్టుకున్న డబ్బుతో అనేక దేశాలను సమస్యలనుండి బైటికి తేవచ్చని తెలిపాడు. అత్యంత ధనిక దేశాల్లో మొదటి, మూడు స్ధానాల్లో ఉన్న అమెరికా, జపాన్ దేశాల జి.డి.పిలు మొత్తం కలిపినా ప్రపంచ సంపన్నుల అక్రమ డబ్బు కంటే తక్కువేనని హెన్రీ తెలిపాడు.

వ్యాఖ్యానించండి