పాకిస్ధాన్ కి ఇస్తున్న సాయంలో భారీ కోత విధించడానికి అమెరికా సిద్ధపడుతునంట్లు కనిపిస్తోంది. 650 మిలియన్ డాలర్ల కోత విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ కి మెజారిటీ సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో సీనియర్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘టెడ్ పో’ ప్రవేశ పెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. పాకిస్ధాన్ ను అమెరికా విప్లవంలో విద్రోహిగా ముద్ర పడిన “బెనెడిక్ట్ ఆర్నాల్డ్” గా ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడొకరు అభివర్ణించడాన్ని బట్టి పాకిస్ధాన్ ను రాక్షసీకరించే ప్రక్రియ అమెరికాలో ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగాక పాకిస్ధాన్ కు 20 బిలియన్ డాలర్ల వరకూ అమెరికా సాయం అందించింది. పేరుకు సాయమే అయినా ఇందులో మెజారిటీ భాగం కన్సల్టెన్సీ ఫీజులు లాంటి వివిధ రూపాల్లో అమెరికాలోనే ఉండిపోయిందని అమెరికా కాంగ్రెస్ సభ్యులే గతంలో వివరించిన సందర్భాలు ఉన్నాయి. సంవత్సరానికి సగటున 2 బిలియన్ డాలర్లు పాక్ కి అందుతున్నట్లు పత్రికలు అంచనా వేస్తాయి. ఇందులో 1.3 బిలియన్ డాలర్లు కోత పెట్టాలని ‘టెడ్ పో’ ప్రతిపాదించగా అందులో సగం 650 మిలియన్ డాలర్ల కోతకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
“టెర్రరిజం పై యుద్ధం లో పాకిస్ధాన్ ‘బెనెడిక్ట్ ఆర్నాల్డ్’ లాంటిది. వారు అవిధేయులు, మోసకారులు. అమెరికాకి ప్రమాదకారులు” అని హౌస్ ఫారెన్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు కూడా అయిన టెడ్ పో అభివర్ణించాడు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో 1780 ల్లో బ్రిటిష్ పక్షం చేరిన తర్వాత బెనెడిక్ట్ ను ద్రోహి గా అభివర్ణించడం సర్వ సాధారణంగా మారింది. అప్పటివరకూ అమెరికా తరపున బెనెడిక్ట్ సాధించిన విజయాలన్నీ మరుగున పడినట్లే, దశాబ్ద కాలంగా అమెరికా సాగిస్తున్న ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి పాకిస్ధాన్ అందించిన ధన, ప్రాణ, మిలట్రీ సహాయం అంతా ఇప్పుడు సోది లోకి కూడా లేకుండా పోయింది.
“ఈ సో-కాల్డ్ మిత్రుడు అమెరికా అందించే బిలియన్ల కొద్దీ సహాయాన్ని తీసుకుంటూనే మనపై దాడులు చేసే మిలిటెంట్లకు నిధులిస్తాడు. అయినా మనం నిధులిస్తూనే ఉంటాం. పంపు కట్టేసే సమయం వచ్చింది” అని టెడ్ పో, దుర్మదాంధ కూతలు కూశాడు. నిజానికి పశ్చిమ దేశాలు చేసే సహాయంతో కమిషన్ల రూపంలో లబ్ది పొందేది పాక్ లోని కొద్ది మంది దళారీ పెట్టుబదుదారులు, రాజకీయ శక్తులు మాత్రమే. కమిషన్లు మింగిన రాజకీయులు అమెరికా సహాయానికి అనేక రెట్లు ప్రతిఫలాన్ని కాంట్రాక్టుల రూపంలో, నయా వలస సేవల రూపంలో అమెరికాకీ, దాని కంపెనీలకీ తరలిస్తారు. బహుశా విచ్చలవిడిగా అమెరికా కంపెనీలకు వనరులను దోచి పెట్టడం తగ్గించి చైనాతో మిత్రత్వం నెరపడానికి పాక్ పాలకులు ప్రయత్నించడమే అమెరికా ఆగ్రహానికి కారణం అయి ఉండవచ్చు.
EPPUDU CHUSINA AMERICA AFGHANISTAN NU AKRAMICHINDANI RASTARU………
MARI CHINA TIBET NU AKRAMICHINA SAGATI ENDUKU RAYARU………
వసంత కుమార్ గారూ, ఎందుకంటే ఆక్రమణదారులందరికీ అమెరికా నాయకుడు గనక.
దురాక్రమణల్లో అమెరికాదే ప్రధాన పాత్ర అయినప్పటికీ ఇతర దేశాల పాత్ర లేదనలేము. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా తదితర మూడో ప్రపంచ దేశాలపై దురాక్రమణ దాడి చేయడానికి అమెరికాదే ప్రధాన ప్రోద్బలం. కాగా, అక్రమణ తర్వాత ఒనగూరే వాణిజ్య ఫలితాలు పంచుకోవడానికి జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ తదితర దేశాలన్నీ అమెరికాకి సహకరిస్తాయి. ఇవన్నీ చురుకుగా సహకరించే దేశాలు కాగా రష్యా, చైనా సహకారం పాసివ్ గా ఉంటుంది. అమెరికా, యూరప్ ల మంద బలాన్ని ఎదుర్కొనే ధైర్యం చైనా, అమెరికాలకు లేదు. తమ దాకా వచ్చేదాకా అవి స్పందించవు.
ప్రపంచ ఆధిపత్యం సాధించడానికి అనేక శిబిరాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాది ఒక శిబిరం. యూరప్ (యూరోపియన్ యూనియన్) మరొక శిబిరం. చైనా నాయకత్వంలో మరో శిబిరం అభివృద్ధి అవుతోంది. (ఇది పదేళ్లనుంది అభివృద్ధి అవుతున్న కొత్త శిబిరం) మరో పక్క జపాన్ నాయకత్వంలో మరో శిబిరం ఏర్పడి ఉంది. ఈ శిబిరాలన్నంటికీ అమెరికా నాయకుడు. అమెరికా నాయకత్వాన్ని ఇతరుల మనస్ఫూర్తి అంగీకారం వల్ల వచ్చినది కాదు. పోటీపడలేనితనం వల్ల వచ్చిన అంగీకారం అది. అమెరికా ని అధిగమించడానికి ఇతర శిబిరాలు నిరంతరం వివిధ రూపాల్లో పోటీ పడుతుంటాయి. తగిన పోటీ ఇవ్వలేకపోవడం వల్లనే ఇతరులు సబార్డినేట్ గానూ, అమెరికా నాయకుడుగానూ ఉంటున్నాయి.
ఇవన్నీ అమెరికా ఆధిపత్య విస్తృతిని చెప్పడానికి రాసాను.
కాశ్మీర్ మనకి ఎలాగో టిబెట్ చైనాకి అలాగ. నిజానికి రెండూ చారిత్రకంగా స్వతంత్ర రాజ్యాలు. ఇండియా ఆక్రమణ పైన కాశ్మీర్ ప్రజలు పోరాడుతున్నట్లె చైనా ఆక్రమణపైన టిబెటన్లు పోరాడుతున్నారు. అమెరికా ఆక్రమణలను వ్యతిరేకించడం అంటే చైనా, ఇండియాల ఆక్రమణలను సమర్ధిస్తున్నట్లు కాదు. టిబెట్ చైనాలో భాగం కాదని చెబుతూ, కాశ్మీరు మాత్రం ఇండియాలో భాగమేనని చెప్పడం ద్వంద్వ విధానం. కాశ్మీరు, టిబెట్ లు కేవలం భూభాగాలుగా కాకుండా అక్కడ మనుషులు నివసిస్తున్నారనీ, వారికీ రాజకీయంగా, సాంస్కృతికంగా స్వతంత్ర ఆకాంక్షలు ఉంటాయనీ అంగీకరిస్తే సమస్య ఏమిటో ఎక్కడ ఉందో స్పష్టంగా అర్ధం అవుతుంది.