ఒంటి కాలి ఆత్మ స్థైర్యం ఈ పెద్దాయనది


కష్టాల కడలి ఈదడానికి ఆత్మ స్ధైర్యానికి మించింది లేదని పాతికేళ్ళ తిరుపాలు ఒంటికాలి జీవితం ప్రత్యక్ష సాక్ష్యం. ఈనాడు పత్రిక వెలికి తీసిన ఈ మట్టి మనిషి నిరోశోపహతులకు స్ఫూర్తి ప్రదాత అనడంలో సందేహం లేదు. రాజస్ధాన్ కృత్రిమ అవయవ తయారీ గురించి బహుశా ఇతనికి తెలియదో లేక ఖర్చు భరించలేకపోయాడో తెలియదు గానీ వడ్రంగి చేసిచ్చిన చేతి కర్ర ఇతనికి మరోకాలుగా మారిపోయింది. పాతికేళ్ళ శ్రమ జీవితంలో ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా పూర్తి చేసి శరీరానికి అంగవైకల్యమే కానీ మనో స్థైర్యానికి ఏ వైకల్యమూ లేదు పొమ్మన్నాడు.

7 thoughts on “ఒంటి కాలి ఆత్మ స్థైర్యం ఈ పెద్దాయనది

  1. “శరీరానికి అంగవైకల్యమే కానీ మనో స్థైర్యానికి ఏ వైకల్యమూ లేదు”

    ఆశలన్నీ నేలరాలి చావు తప్ప మరోమార్గం లేదనుకునే వాళ్లకు కూడా బతుకుమీద ఆశ చిగురింపజేసే మహోన్నతమైన చిత్రం అందించారు…

    పాతికేళ్ళ శ్రమ జీవితంలో ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా పూర్తి చేశారా ఈయన..

    మనలో భావోద్వేగం హద్దుమీరి మానవేతర శక్తిమంతుడిగా ఈయనను పొగడవచ్చు కాని ఆయన శ్రమైక మూర్తిమత్వాన్ని, శ్రమతోడుగా పండించుకున్న నిండు జీవితాన్ని అది అవమానించినట్లే కాగలదు.

    ఈ శ్రామిక మాననీయుడికి జాతి మొత్తంగా చేతులెత్తి మొక్కాలి.

    కానీ… ఎక్కడో కలుక్కుమంటోంది…

    మనిషిగా పుట్టినందుకు ఇంతటి విపత్కర స్థితిలోనూ మనిషి ఇలాంటి కష్టం చేయవలసిందేనా?

    భూమిని ఒంటికాలి ఊతతో పెళ్లగిస్తున్న ఈ మనీషికి శత సహస్ర వందనాలు.

  2. శారీరక శ్రమల్లో కూడా ఈ తిరుపాలు చేసే మట్టి పని చాలా కష్టమైనది. అలాంటిది ఒక కాలు లేకపోయినా అంతటి కష్టం చేయటం సామాన్యమైన సంగతి కాదు.

    ఈ ఫొటో ఈనాడులో మొదట (బహుశా మే 8న) చూసినపుడు నమ్మశక్యం కానంత ఆశ్చర్యం వేసింది. చిన్నకష్టానికే కుంగిపోయేవాళ్ళకు గొప్ప ప్రేరణనిచ్చే ఫొటో!

    ఈనాడు వెలిగండ్ల విలేఖరి మొహియుద్దీన్ వృత్తిలో భాగంగా ఉపాధి హామీ పనుల వివరాలు సేకరిస్తుంటే వెలిగండ్లకు 3 కిలోమీటర్ల దూరంలోని జిల్లెలపాడులో ఈ వేటగిరి తిరుపాలు తారసపడ్డారు. వివరాలు సేకరించి ఫొటో పంపితే, మెయిన్ ఎడిషన్లో వేశారు.

    ఇప్పటికీ తిరుపాలు ఒంటికాలుతోనే తాటి చెట్టు ఎక్కి, ముంజెలు కోయటం, చింతచెట్టు ఎక్కి చిగురు కోయటం చేస్తారట. అయితే ఈ వృద్ధాప్యంలో ఏదో చిన్న బడ్డీ కొట్టులాంటిదేమైనా పెట్టుకుంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కానీ దానిక్కూడా స్థోమత లేదట. తిరుపాలుకు ఫోన్ లేదు దూరప్రాంతంలో ఉన్నవారు కాంటాక్టు చేయటం కష్టమే. ఆయనకు ఏమైనా సాయం చేయదల్చినవారు ఈనాడు విలేఖరిని ఈ-మెయిల్ – arshiya1978@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

  3. వేణు గారు, మధు మోహన్ గారి సూచన మేరకు సాయం గురించి ప్రయత్నిద్దామా అన్న ఆలోచన వచ్చింది. కాని పాతికేళ్ళుగా శ్రమ జీవితం సాగిస్తూ, కుటుంబాన్ని పోషించడమే కాక పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేసిన తిరుపాలుకు సాయం చేయడం అంటె అతన్ని అవమానించడం అవుతుందని మరో పక్క పీకింది. అయితే వృద్ధాప్యాన్ని సమీపించినందున ఏమన్నా సాయం చేయవచ్చని కూడా అనిపిస్తోంది.

    తిరుపాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే అందరము తలా చెయ్యి వెయ్యవచ్చు. తెలుగు బ్లాగర్ల ద్వారా ఒక మంచి పని జరిగినట్లూ ఉంటుంది. చేసే సాయం తిరుపాలుని శ్రమ భారం నుండి తప్పించేదిగా ఉంటే ఉపయోగం. చూద్దాం! ఇతర బ్లాగర్లు కూడా ఎవరైనా స్పందిస్తారేమో.

    ఈనాడు కటింగ్, మీరిచ్చిన సమాచారం కలిపి చూస్తే ఈ చిరునామా వస్తోంది.

    వేటగిరి తిరుపాలు
    జిల్లెలపాడు, గోకులం పంచాయితీ,
    వెలిగండ్ల మండలం,
    ప్రకాశం జిల్లా.

    ఈ చిరునామాకి నేరుగా ఎం.ఒ చేసినా అందుతుందేమో కదా.

    లేదా మీరిచ్చిన ఈ మెయిల్ ను సంప్రదించడం మరో పద్ధతి.

  4. విశేఖర్ గారూ,
    నిజమే! పోస్టల్ చిరునామా మీరు పేర్కొన్నది సరిపోతుందనుకుంటాను. పల్లెటూరు కాబట్టి తిరుపాలు పేరు అందరికీ తెలిసివుంటుంది, పైగా పేపర్లో కూడా వచ్చింది కదా. ఉత్తరాల ద్వారా కాంటాక్టు చేశాకే, ఎంఓ లాంటి ప్రయత్నాలు చేయవచ్చు.

  5. ఆలస్యమయింది. విశేఖర్ గారూ, వేణు గారూ,
    మదుమోహన్ గారి సూచన మంచిదే. ముందుగా వార్త సేకరించి పంపిన మొహియుద్దీన్ గారిని సంప్రదించండి. ఆయన ఒప్పుకుంటే ఎవరి శక్తిమేరకు వారు సహాయం చేద్దాం. కానీ మనం ఎంతగా ముందుకొచ్చినా, ఇలాంటి సందర్భాలకు వ్యక్తుల సహాయం సరిపోదు. ముందుగా ఆయనను సంప్రదించిన తర్వాతే ఆయన అభిప్రాయానుసారం చేయవచ్చు.

వ్యాఖ్యానించండి