అమెరికాలో కరువు, గత పాతికేళ్లలో ఇదే తీవ్రం


గ్లోబల్ వార్మింగ్ కు అన్ని దేశాల కంటే అధికంగా కారణంగా నిలిచిన అమెరికా ఫలితం అనుభవిస్తోంది. అనావృష్టి వలన గత పాతికేళ్ళలోనే అత్యంత తీవ్రమైన స్ధాయిలో కరువు ఏర్పడిందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపాడు. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బ తిని ఆహార ద్రవ్యోల్బణం తీవ్రం కానున్నదని అమెరికా వ్యవసాయ కార్యదర్శి టాం విల్సక్ బుధవారం పత్రికల సమావేశంలో చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. విస్తార ప్రాంతాల్లో మొక్క జొన్న, సోయా బీన్స్ లాంటి పంటల దిగుబడి తగ్గిపోయిందని అత్యవసర చర్యలు తీసుకోవడానికి పధకాలు రూపొందిస్తున్నామని విల్సక్ తెలిపాడు.

విల్సక్ సమాచారం ప్రకారం అమెరికా భూభాగంలో మొత్తం మీద 61 శాతం కరువు ప్రాంతంగా వర్గీకరించబడిన పరిస్ధితులకు ప్రభావితమై ఉంది. వైట్ హౌస్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఆయన అనావృష్టి ప్రభావం నేరుగా పంటలపైన పడుతోందని వివరించాడు. “దుర్భిక్ష ప్రభావంలో ఉన్న ప్రాంతంగా చెప్పిన భూభాగంలో 78 శాతం మొక్క జొన్న పంట పండిస్తున్నారు. సోయా బీన్స్ పండే భూభాగంలో 77 శాతం దుర్భిక్ష ప్రాంతంలోనే ఉంది” అని విల్సక్ తెలిపాడు. “ఇతర కమోడీటీల పరిస్ధితి కూడా అలాగే ఉందన్నది స్పష్టమే. మొక్క జొన్న పంటలో 38 శాతం ‘పూర్ నుండి వెరీ పూర్’ గా వర్గీకరించగా, సోయాబీన్స్ లో 30 శాతం ‘పూర్ నుండి వెరీ పూర్’ గా భావిస్తున్నారు” అని విల్సక్ చెబుతూ ఈ సంవత్సరం దిగుబడి తగ్గే సూచనలు స్పష్టంగా ఉన్నాయని తెలిపాడు.

“దీని వల్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. జూన్ 1 తర్వాత మొక్క జొన్న ధరలు 38 శాతం పెరగగా, ఒక మొక్క జొన్న బుషెల్ (అమెరికన్ కొలత) ధర 7.88 డాలర్లుగా ఉంది. ఒక బుషెల్ సోయాబీన్ ధర 24 శాతం పెరిగింది” అని విల్సక్ తెలిపాడు. రైతులకు సాయపడడానికి పశువులను మేపడం కోసం ‘కన్సర్వేషన్ రిజర్వ్ ప్రోగ్రాం’ కింద అత్యవసర కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపాడు. “పశువుల దాణా ధర పెరగడం వల్ల ఉత్పత్తిదాఋఌ తమ పశువుల సంఖ్యను తగ్గించుకుంటారు. దానివల పశువులు, కోళ్ళు, పందుల దాణా ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత అవి పెరుగుతాయి” అని తెలిపాడు. ఈ సంవత్సరం ఆఖరుకి గాని, వచ్చే సంవత్సరం ప్రారంభానికి గాని ధరలు పెరుగుతాయి. పంటల దిగుబడి తగ్గడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ ధరలు కూడా, బహుశా 2013 కల్లా, పెరుగుతాయి” అని విల్సక్ తెలిపాడు.

దుర్భిక్షం వల్ల అమెరికా వ్యవసాయ ఎగుమతులు కూడా తగ్గిపోతాయని విల్సక్ స్పష్టం చేశాడు. ఎగుమతులు ఎంతవరకు తగ్గేదీ అప్పుడే చెప్పలేననీ, పంటలు చేతికి వస్తే తప్ప అంచనా వెయ్యడం సాధ్యం కాదని తెలిపాడు. అమెరికా స్ధాయిలో కాకపోయినా కెనడా, యూరప్ లలో కూడా అనావృష్టి నెలకొందని ఇతర పత్రికల ద్వారా తెలుస్తోంది. కెనడాలో 40 శాతం వ్యవసాయ భూముల్లో వర్షాలే కురవకపోవడమో లేక అతి తక్కువ వర్షపాతం నమోదు కావడమో జరిగిందని కెనడాకు చెందిన మెట్రో న్యూస్ వెబ్ సైట్ తెలిపింది. అమెరికాలో మొక్క జొన్న ఉత్పత్తి పడిపోవడం వల్ల కెనడా, యూరప్ లలో ధరలు పెరిగాయనీ దానివల్ల రైతులు స్వల్పకాలికంగా లాభపడుతున్నారని తెలిపింది.

పశ్చిమ దేశాల్లో వ్యవసాయం ప్రధానంగా పెట్టుబదారీ కంపెనీల చేతుల్లో ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో వ్యవసాయ కంపెనీలకు ప్రభుత్వంలో భారీ స్ధాయి పలుకుబడి ఉంది. అమెరికా వ్యవసాయ కంపెనీల వల్లనే ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి దోహా రౌండ్ చర్చలు సుదీర్ఘ కాలంపాటు వాయిదాపడిపోయాయి. ఆ చర్చలు మళ్ళీ మొదలవుతాయన్న ఆశలు ఇండియా, మలేషియా లాంటి మూడో ప్రపంచ దేశాలకు అడుగంటిపోయాయి. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ కంపెనీలకు ఇస్తున్న భారీ సబ్సిడీలపై మూడో ప్రపంచ దేశాలు చర్చలు లేవనెత్తడమే దోహా చర్చలు వాయిదా పడడానికి కారణం. మూడో ప్రపంచ దేశాల వనరులను దోపిడీ చేయడానికి అవకాశం ఇస్తున్న చర్చలు, ఒపందాలు శరవేగంతో సాగినప్పటికీ సమ న్యాయం పాటించవలసి వచ్చేసరికి అభివృద్ధి చెందిన దేశాలు మొహం చాటేశాయి.

ఈ నేపధ్యంలో అమెరికా వ్యవసాయ రంగానికి కష్టం వస్తే అమెరికా ప్రభుత్వం అర్జెంటుగా స్పందిస్తుంది. ఆ స్పందన వ్యవసాయరంగంలోని చిన్న, సన్నకారు రైతులకు చేరదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

One thought on “అమెరికాలో కరువు, గత పాతికేళ్లలో ఇదే తీవ్రం

  1. పరిస్థితులు ఇలాగే ఉంటే, భారత దేశంలో కూడా కార్పొరేట్ వ్యవసాయం మొదలు కావడానికి ఎన్నో రోజులు పట్టదనిపిస్తుంది. ఆటువంటి రోజు రాకుండా చెయడానికి అందరూ కృషి చెయాల్సి ఉంది.

వ్యాఖ్యానించండి