కుకీలు వ్యాపార కంపెనీల గూఢచారులు, తస్మాత్ జాగ్రత్త!


 

  • కష్టమర్ కి తెలియకుండానే యునీక్ ఐ.డి కేటాయింపు
  • ఇంటర్నెట్ నిఘా ఇక బాగా తేలిక
  • కుకీలతో జాగ్రత్త! ఫ్లాష్ కుకీలతో మరింత జాగ్రత్త!!

వివిధ వ్యాపార వెబ్ సైట్లు వ్యక్తిగత కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసిన కుకీలు వ్యాపార కంపెనీల తరపున గూఢచర్యం చేస్తున్న సంగతిని నిపుణులు వెల్లడి చేశారు. మార్కెట్ల కోసం ప్రపంచ ప్రజలపై యుద్ధాల్ని రుద్దుతున్న కంపెనీలే ఇంటర్నెట్ వినియోగదారుల కంప్యూటర్ల ద్వారా నట్టింటిలోకి జొరబడి ప్రైవసీని దొంగిలిస్తున్న దారుణంపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత అలవాట్లు, ఆసక్తులు, ఇష్టా యిష్టాలు మొదలయిన వాటన్నింటిపైనా బ్రౌజర్ల ద్వారా మాత్రమే కాక ‘ఫ్లాష్ కుకీ’ ల ద్వారా కంప్యూటర్లలో సైతం తిష్ట వేసి నిఘా పెడుతున్న విషయాన్ని వారు బట్టబయలు చేశారు. ఇంటర్నెట్ వినియోగదారుల అనుమతి లేకుండానే ‘యూనీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ల’ను కేటాయించి వారి కదలికలపై కూడా నిఘా పెడుతున్నారని వెల్లడి చేశారు.

ప్రఖ్యాత జర్మనీ వార్తా సంస్ధ డి.పి.ఎ సౌజన్యంతో ‘ది హిందూ’ పత్రిక వాణిజ్య కంపెనీల ప్రైవసీ చౌర్యం పై సంచలనాత్మక నిజాలు వెల్లడి చేసింది. పత్రిక కధనం ప్రకారం కస్టమర్ల అనుమతి లేకుండా వ్యాపార కంపెనీలు వారికి ప్రత్యేక ప్రొఫైల్స్ ను తయారు చేస్తున్నాయి. సదరు ప్రొఫైల్స్ కి యూనీక్ ఐడెంటిఫికేషన్ ను కేటాయించి వాటి ఆధారంగా ఇంటర్నెట్ లో ఎక్కడికి వెళ్ళినా గుర్తు పట్టి కదలికలను రికార్డు చేసే విధంగా టెక్నాలజీ ని కంపెనీలు అభివృద్ధి చేసుకున్నాయి. పేరుకి వ్యాపార ప్రయోజనాలే ఇందులో ఉన్నాయని చెప్పినా అవి అంతిమంగా ప్రజల రాజకీయ, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలపై కూడా నిఘా పెట్టడంగా వినియోగదారులు గుర్తించాలి.

డేటా లాకర్లు

ఇంటర్నెట్ లో విస్తృతంగా సంచరిస్తున్న ప్రకటనల (అడ్వర్టైజింగ్) ఏజన్సీలు వినియోగదారుల డేటాను వారి అనుమతి లేకుండా సేకరిస్తున్నాయి. వెబ్ సైట్లను వినియోగదారులు సందర్శించినపుడు వారిని ప్రకటనలతో ఆకర్షించడం వరకే సదరు ఏజన్సీలు పరిమితం కావడం లేదు. ప్రతి వెబ్ సైట్ ను సందర్శించే ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత డేటాను కూడా అవి సేకరించి రికార్డు చేస్తున్నాయి.

ఈ డేటా ను ‘లాకర్ ఆఫ్ డేటా’ గా పత్రిక సంబోధించింది. బ్యాంకుల్లో లాకర్లు పూర్తిగా కష్టమర్ల నియంత్రణలో ఉంటాయి. కానీ తమ వ్యక్తిగత వివరాలు, అలవాట్లు, ఆసక్తులు, రాజకీయ, సామాజిక అభిప్రాయాలతో కూడిన డేటా లాకర్లు ఇంటర్నెట్ లో ఉన్నాయనీ, వాటికి యునీక్ ఐ.డి కేటాయించబడిందనీ, యునీక్ ఐ.డి సాయంతో తన కదలికలన్నీ రికార్డు చేయబడుతున్నాయనీ కష్టమర్లకు ఏమాత్రం తెలియకపోవడమే ‘డేటా లాకర్ల’ ప్రత్యేకత.

ఈ లాకర్లలో ప్రతి వినియోగదారుడి ఇంటర్నెట్ వినియోగ చరిత్ర అంతా భద్రపరచబడుతుంది. ఈ మెయిల్స్ (యూజర్ నేమ్, పాస్ వర్డ్ లతో సహా), ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ వెబ్ సైట్ల ప్రొఫైళ్ళు, బ్లాగులు, పుట్టిన రోజు మెట్టిన రోజు అంటూ భద్రపరుచుకున్న ఫోటోలు, సోషల్ వెబ్ సైట్లలోని సంభాషణలు, బ్యాంకుల లావాదేవీలు, జాతీయ అంతర్జాతీయ వెబ్ సైట్లలో రాసే వ్యాఖ్యలు, పుస్తకాలో లేక వినియోగ సరుకులో కొనుగోలు చేసిన లావాదేవీల రికార్డులు… ఇలా సమస్తం డేటా లాకర్లకు అనుబంధించబడి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విధంగా సేకరించిన డేటాతో ప్రతి వినియోగదారుడికీ, వారికి తెలియకుండానే (చెప్పకుండానే), ప్రొఫైల్స్ తయారు చేసే పనికి ప్రకటనల కంపెనీలు పూనుకుంటున్నాయి. ఇంటర్నెట్ లో ఏ లావా దేవీ జరిపినా, ఏ వస్తువు కొన్నా, ఏ బస్సుకో రైలుకో రిజర్వేషన్ చేసినా, ఏ బ్లాగ్ తెరిచినా, ఏ వ్యాఖ్య రాసినా, ఏ రాజకీయాభిప్రాయం చెప్పినా, ఏ బ్యాంక్ ఖాతాలో లాగిన్ అయినా ఈమెయిల్ తప్పనిసరి అన్నది తెలిసిందే. ఆ ఈమెయిళ్లకు అనుభంధంగా వినియోగదారులే వివిధ సోషల్ నెట్ వర్క్ సైట్లలో ప్రొఫైల్స్ ను తయారు చేసి అప్పనంగా అప్పజెబుతున్న సంగతీ తెలిసిందే. కనుక ఒక వినియోగదారుడి సమస్త వివరాలు వారి వారి రాజకీయ అభిప్రాయాలతో సహా యునీక్ ప్రొఫైళ్లు తయారు చేయడం ప్రకటనల ఏజన్సీలకు పెద్ద పని కాదని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ‘డేటా సేకరణ’ ను వినియోగదారుల ప్రొఫైళ్ళ నిర్ణయానికి శక్తివంతమైన పరికరంగా కంపెనీలు అభివృద్ధి చేసుకున్నాయన్నమాట.

సౌకర్యం కాదు నిఘా

డేటా సేకరణ కొత్తదేమీ కాదు. ఇంటర్నెట్ లేని కాలంలో కూడా ‘వినియోగదారుల సౌకర్యం కోసం’ అన్న పేరుతో సర్వేలు చేసి డేటా సేకరించే పనికి ఏజన్సీలను వ్యాపార కంపెనీలు నియమించి నిర్వహించాయి. పేరుకి వినియోగదారుల సౌకర్యం కోసం అని చెప్పినా వాస్తవంగా అది కంపెనీల సౌకర్యం కోసమే అన్నది తర్వాత సంగతి. అయితే ఒక నిర్దిష్ట డేటా సెట్ ద్వారా వినియోగదారులను వ్యక్తిగతంగా గుర్తించడమే ఇటీవలి కాలంలో తలెత్తిన ప్రమాదకర పరిణామం.

కష్టమర్ల వ్యక్తిగత వివరాలు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారి వారి అవసరాలను గన్ షాట్ గా తీర్చగలమని కంపెనీలు పైకి చెప్పే మాట. వినియోగదారుల అవసరాల మేరకు తాము ప్రకటనలను వారి దగ్గరికి చేర్చగలం అని ప్రకటనల ఏజన్సీలు చెప్పే మాట. కానీ ఈ పని వినియోగదారులకు చెప్పకుండా, వారి అనుమతి లేకుండా అనేక ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించి మరీ ఎందుకు సాగుతోందన్నదే అసలు సమస్య. డేటా సేకరణ చేయడమే కాక ఆ డేటాకి చెందిన కష్టమర్ ని గుర్తించి, అతని/ఆమె కదలికను ట్రాక్ చేసి రికార్డు చేయడంతోనే మరిన్ని ప్రయోజనాలను కంపెనీలు ఆశిస్తున్నాయని గుర్తించాలి.

ఫ్లాష్ కుకీ లు

వినియోగదారుడు ఒక వెబ్ సైట్ ను తెరిచినపుడు అతని కంప్యూటర్ లో సంబంధిత కుకి ఇన్ స్టాల్ అవుతుంది. కేచ్ పేరుతో వెబ్ సైట్ కంటెంట్ కూడా కొంత వరకు కంప్యూటర్ లో భద్రపరచబడుతుంది. వెబ్ సైట్ ను తెరిచిన ప్రతిసారీ కొత్తగా కంటెంట్ ను డౌన్ లోడ్ చేయడం వల్ల ఆలస్యం అవుతుందనీ కుకీలు, కేచ్ ఇన్ స్టాల్ చేస్తే వేగంగా సదరు వెబ్ సైట్  లోడ్ అవుతుందనీ ఆయా వెబ్ సైట్లు వినియోగదారులకు చెబుతాయి. కానీ అది పాక్షిక నిజమేనని తెలుస్తోంది. కుకీ లు వాస్తవానికి ఇంటర్నెట్ ట్రాకర్లని, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంటర్నెట్ లో ప్రవేశించిన ప్రతిసారీ వినియోగదారుడిని గుర్తించడానికి కుకీ లని పరికరాలుగా అభివృద్ధి చేశారనీ తాజా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

“అడ్వర్టైజింగ్ నెట్ వర్క్ లు వినియోగదారుల సర్ఫింగ్ బిహేవియర్ ని సేకరించి వారికి ప్రపంచవ్యాపితంగా గుర్తించగల ‘యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్’ ను కేటాయిస్తున్నాయి” అని జర్మనీ కి చెందిన స్వతంత్ర డేటా సెక్యూరిటీ సెంటర్ అయిన ‘ష్లేస్ విగ్ హోల్ స్టీన్’ సంస్ధ ప్రతినిధి క్రిస్టియన్ క్రాస్ తెలిపాడు. “అలాంటి నెంబర్ కలిగిన వినియోగదారులను ఇక ఇంటర్నెట్ లో ఎల్లప్పుడూ గుర్తించడం సాధ్యపడుతుంది” అని హోల్ స్టీన్ తెలిపాడు. తద్వారా ఒక ఆన్ లైన్ స్టోర్ ని సందర్శించే ముందే ఒక వినియోగదారుడు ఇంటర్నెట్ లో ఏ వెబ్ సైట్ ను చూసి వచ్ఛిందీ, అక్కడ ఏమి చేసిందీ పసిగట్టడం సాధ్యం. అంతవరకే అయితే పెద్దగా ప్రమాదం లేకపోవచ్చేమో. కానీ ఆ తర్వాత ఏ ఫేస్ బుక్ లోనో, గూగుల్ ప్లస్ లోనూ ఈమెయిల్ ను వినియోగించి లాగిన్ కావలసిన అవసరం వచ్చినపుడు అప్పటివరకూ సేకరించబడిన డేటా అంతా ఆ ఈమెయిల్ కు అనుబంధించబడుతుంది. అంటే ఆ వినియోగదారుడెవరో తెలిసే వ్యక్తిగత వివరాలు కూడా ప్రకటనల ఏజన్సీల చేతుల్లోకి వెళ్లిపోతాయి. “సమస్య ఏమిటంటే, ఈ డేటా అంతా మీ పేరుకి అస్సైన్ చేయబడుతుంది” అని అదే సంస్ధకు చెందిన తిలో వీచెర్ట్ తెలిపాడు.

వినియోగదారుల ప్రైవసీ పరి రక్షణకు పాటుపడుతున్న సంస్ధలు ఈ కారణం వల్లనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే ఇలా సేకరించబడిన డేటా ప్రకటనల ఏజన్సీలకే పరిమితం అయిపోదు. కస్టమర్ల నేపధ్యం పై కూడా కన్నేసిన కంపెనీలకు ఈ డేటా కావాలి. కష్టమర్ల ఆర్ధిక వనరులు, బ్యాంకు బ్యాలెన్సు లు కూడా అలాంటి కంపెనీలకు కావాలి. ఆ కంపెనీలకు తమ దగ్గరున్న డేటాను ప్రకటనల ఏజన్సీలు అమ్మేస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అక్కడితోనే ఆగదు. ఆ డేటా అంతా ప్రభుత్వాల వద్దకు కూడా చేరిపోతుంది. ఇంటర్నెట్ కంపెనీలు తమ వద్ద ఉన్న వినియోగదారుల వివరాలన్నీ ప్రభుత్వాలకు అప్పజెప్పే విధంగా అమెరికా, బ్రిటన్, ఇండియా లాంటి అనేక దేశాలు ప్రజా వ్యతిరేక చట్టాలను తెస్తున్న విషయాన్ని ఈ నేపధ్యంలోనే అర్ధం చేసుకోవాలి.

జామిట్ (Xamit) అనే కన్సల్టింగ్ ఏజన్సీ ప్రకారం వినియోగదారుల డేటా కోసం డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. డేటా సెక్యూరిటీ విభాగంలో ఈ సంస్ధ ప్రత్యేక కృషి చేస్తున్నది. దీని ప్రకారం 2011 లో పరిశీలించిన వెబ్ సైట్లలో 29.9 శాతం వెబ్ సైట్లు వినియోగదారుల కదలికలపై నిఘా పెట్టే కంపెనీల సేవలను అనుమతించాయి. సంవత్సరం ముందు ఈ ఆంకే 24.7 శాతం మాత్రమే. డేటా ట్రాకింగ్ కి అనుమతించిన నిఘా కంపెనీలలో 75 శాతం డేటా సెక్యూరిటీ ప్రమాణాలను గాలికి వదిలేశాయని జామిట్ వెల్లడించింది. అంతే కాకుండా టాప్ రేటింగ్ ఉన్న వంద వెబ్ సైట్లలో 50 కి పైగా ఇలాంటి డేటా ట్రాకింగ్ కుకీలను యధేచ్ఛగా అనుమస్తున్నాయని ఇతర పత్రికలు వెల్లడి చేశాయి. (ఇందులోనూ గూగుల్ టాప్ అనీ గూగుల్ నిఘా ను అడ్డుకోవడానికి గూగుల్ క్లీన్ పేరుతో సాఫ్ట్ వేర్ కూడా ఉన్నదని కొన్ని సంస్ధలు తెలిపాయి) సాధారణ కుకీలు 4 KB వరకూ మాత్రమే హార్డ్ డిస్క్ స్పేస్ ఆక్రమిస్తే ఫ్లాష్ కుకీ మాత్రం 100 KB వరకూ ఆక్రమిస్తుందని ది హిందూ తెలిపింది. ఫ్లాష్ కుకీ లను ఎల్.ఎస్.ఒ (Local Shared Objects) అని పిలుస్తారని తెలుస్తోంది.

అయితే కుకీలను అనుమతించడం, అనుమతించకపోవడం ఇప్పటివరకూ వినియోగదారుల చేతుల్లో ఉందని భావిస్తుండగా అది నిజం కాదని తెలుస్తోంది. దాదాపు బ్రౌజర్లన్నీ కుకీలను నియంత్రించే పరికరాలను (ఉదాహరణకు ఫైర్ ఫాక్స్ లో టూల్స్>ఆప్షన్స్>ప్రైవసీ ) వినియోగదారులకు అందుబాటులో ఉంచాయి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని కుకీ లను ఎప్పటికప్పుడు కంప్యూటర్లనుండి తొలగించడం వీలవుతుంది. అయితే ఈ సౌకర్యం సాధారణ కుకీలకు మాత్రమే వర్తిస్తుంది. నిఘా కంపెనీలు ఇప్పుడు (నాలుగైదేళ్ళుగా) ‘ఫ్లాష్ కుకీ’ లను వినియోగిస్తూ వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.

ఈ ఫ్లాష్ కుకీలను బ్రౌజర్లతో సంబంధం లేకుండానే కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేయడానికి కంపెనీలు తెగించాయని డేటా సెక్యూరిటీ నిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్లాష్ ప్లేయర్ కి చెందిన సెటింగ్స్ మేనేజర్ లో వీటిని డీయాక్టివేట్ చేయాలని వారు సలహా ఇస్తున్నారు. సిస్టమ్ కంట్రోల్స్ లో సదరు సెటింగ్స్ ను కనుగొనవచ్చని వారు తెలిపారు. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులు ‘బెటర్ ప్రైవసీ’ (Better Pravacy) అనే యాడ్-ఆన్ (add-on) ని ఇన్ స్టాల్ చేసుకుని ఫ్లాష్ కుకీ లనుండి రక్షణ పొందవచ్చని కూడా వారు తెలిపారు. ఘోస్టరీ (Ghostery) పేరుతో ఉన్న మరొక యాడ్-ఆన్ ద్వారా ఇంటర్నెట్ కంపెనీల నిఘా నుండి రక్షణ పొందవచ్చని కూడా వీరు తెలిపారు. వినియోగదారుల కార్యకలాపాలపై నిఘా పెట్టిన కంపెనీలు ఏమిటో ఘోస్టరీ యాడ్-ఆన్ చూపిస్తుందనీ తద్వారా నిఘా కంపెనీల సమాచారం తెలుసుకోవచ్చనీ వారు తెలిపారు. ఘోస్టరీ యాడ్-ఆన్ అద్భుతంగా పని చేస్తున్నదని క్రాస్ తెలిపాడు.

మరో రక్షణ పద్ధతి ని నిపుణులు సూచించారు. దాని ప్రకారం రెండు బ్రౌజర్లను వినియోగదారులు ఉపయోగించాలి. ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్లను సందర్శించడానికి ఒక బ్రౌజర్ నూ, ఇతర కార్యకలాపాలకు మరొక వెబ్ సైట్ నూ వినియోగదారులు ఉపయోగిస్తే వ్యక్తిగత వివరాలకు ఇంటర్నెట్ బిహేవియర్ తో జత చేయకుండా కంపెనీలను నిరోధించవచ్చు. అయితే ఏదో ఒక సమయంలో అవసరం కొద్దీ ఒకే బ్రౌజర్ లో ఈ రెండింటినీ జత చేసే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అవకాశాల కోసం నిరంతరం పొంచి ఉండే నిఘా కంపెనీలకు ఇలాంటి అవకాశాలు ఒకటి రెండు చాలు.

‘అణచివేత’ మేడ్ ఈజీ

వినియోగదారుల ఆర్ధిక లావాదేవీలను రికార్డు చేసే ప్రమాదం ఒక కోణం మాత్రమే. అసలు ప్రమాదం ఇతర కోణాల్లో పొంచి ఉందని వినియోగదారులు గుర్తించాలి. ప్రభుత్వాలు నడుపుతున్న వ్యక్తులకు, వర్గాలకు మెచ్చని రాజకీయ అభిప్రాయాలూ, కార్యకలాపాలు కూడా కష్టమర్ల ప్రొఫైల్స్ లో రికార్డు కావడమే ఈ ప్రమాదం. ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తకో, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో పాల్గొంటున్న కార్యకర్తకో లేదా వివిధ బహుళజాతి వ్యాపార కంపెనీల ప్రజా వ్యతిరేక కుట్రలకు వ్యతిరేకంగా తిరగబడుతున్న ప్రజలతో సంబంధం ఉన్న కార్యకర్తకో యునీక్ ఐడెంటిఫికేషన్ ను కేటాయించాక ఆ కార్యకర్త కదలికలపై నిఘా పెట్టడం సో కాల్డ్ భద్రతా సంస్ధలకు, మిలట్రీ గూఢచార సంస్ధలకు ఇక అత్యంత తేలిక అవుతుంది. అలాంటి వ్యక్తి ఇంటర్నెట్ లో ఎక్కడ ప్రవేశించినా వారిని గుర్తించే అరెస్టులు చేసే అవకాశం, కొండొకచో మాయం చేసే అవకాశం కూడా పొంచి ఉంటుంది.

అలాంటి ప్రమాదం ఆందోళనకారులకే గదా అని ఉదాసీనత తో ఉండే అవకాశం లేదు. అదే భావాలను ఆవేశంతోనో, అన్యాపదేశంగానో కేవలం చర్చకు మాత్రమే ఇంటర్నెట్లో వ్యక్తం చేసినా అరెస్టు చేయవలసిన/మాయం చేయవలసిన వ్యక్తుల జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్ధలు ఇచ్చిన సమాచారంతో ఇజ్రాయెల్ ఎంబసీ కారు పేలుడు కేసులో అరెస్టయిన ఒక విలేఖరి ఉదంతం ఇందుకు సాక్ష్యం. ఆ విలేఖరి విచారణ లేకుండా, నేరమేమిటో తెలియకుండా, కనీస సాక్ష్యం లేకుండా, కుటుంబ సభ్యులకు ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాలుగు నెలలుగా గూఢచార ఏజన్సీల చెరలో మగ్గుతున్నట్లు పత్రికలు వెల్లడి చేశాయి. ఇంటర్నెట్ లో ఆయన రాసిన ఆర్టికల్స్, అరబ్ దేశాలకు ఆయన చేసిన పర్యటనలే అతని పై అనుమానానికి కారణం అని అవి తెలిపాయి. నాసా, ఎస్మా, టాడా లాంటి నల్ల చట్టాలను తెచ్చి వేలమందిని మాయం చేయగలిగిన ప్రభుత్వాలకు ఇప్పుడు ఆ పని మరింత సులువు. ఇన్నాళ్లూ అలాంటి కార్యకర్తలను దొరకబుచ్చుకోవడం సమస్య గా ఉన్నట్లయితే ఇంటర్నెట్ వినియోగం ద్వారా ఆ సమస్య పరిష్కారం అయినట్లే. దేశంలోనే కాదు ప్రపంచలో ఏ మూల ఉన్నా ఫ్లాష్ కుకి ల ద్వారా వారు వివిధ ప్రభుత్వాల భద్రతా సంస్ధలకు కూతవేటు దూరంలోనే ఉన్నట్లు లెక్క.

One thought on “కుకీలు వ్యాపార కంపెనీల గూఢచారులు, తస్మాత్ జాగ్రత్త!

  1. ) …నేను ప్రస్తుతం ఘోస్టరీ (Ghostery) ఇన్స్టాల్ చేసుకున్నాను ..ఎవరు మన సమాచారన్ని తెలుసుకుంటున్నారో ఏ ఏ సైట్లకు సమాచారం పంపబడుతున్నదో ఇక్కడ తెలియచేస్తుంది..తెలియచేయడమే కాక, ఘోస్టరీ (Ghostery) ..అలా సమాచారాన్ని సేకరించకుండా నిలిపివేస్తుందా అన్నది నాసందేహం…?

వ్యాఖ్యానించండి