గౌహతి నగర వీధుల్లో మగోన్మాద వికటాట్టహాసం


పురుషోన్మాదం గౌహతి నగర వీధుల్లో వికటాట్టహాసం చేసింది. నిస్సహాయ మహిళను ఒక వ్యక్తిగా చూడలేని నాగరికత తన దరికి చేరనేలేదు పొమ్మంది. స్నేహితులు భయంతో వదిలేసి పోగా బార్ ముందు ఒంటరిగా నిలబడిన నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వెకిలి చేష్టలతో సిగ్గు విడిచి ప్రవర్తించింది. పదహారేళ్ళ యువతి జుట్టు పట్టి లాగుతూ, ఒంటిపై బట్టలను ఊడబీకుతూ, వేయకూడని చోట చేతులేస్తూ వికృత చిత్తాన్ని బట్టబయలు చేసుకుంది. విలువల అభివృద్ధిని నటన మాత్రంగానైనా ప్రతిబింబించవలసిన ఒక రాష్ట్ర రాజధాని నడివీధుల్లో వలువలు ఊడదీసుకుంది.  రక్షణ పేరుతో వెయ్యిన్నొక్క భద్రతా బలగాలు కవాతు చేసినా తనకు సాటిరావని గేలి చేసింది. 

యువతి చేసిన పాపం మహిళ కావడమే. పుట్టిన రోజు పార్టీకి స్నేహితురాలు పిలవడంతో ఆమె గౌహతి, షిల్లాంగ్ రోడ్డు లో క్రిస్టియన్ బస్తీ లో ఉన్న ఒక పబ్ కి వెళ్లింది. మరో ముగ్గురు యువకులు కూడా ఆ పార్టీకి ఆహ్వానితులు. “అయితే, డబ్బులు చెల్లించాల్సి వచ్చేసరికి తాను ఎ.టి.ఎం కార్డు పోగుట్టుకున్నానని బర్త్ డే అమ్మాయి స్నేహితులకి చెప్పింది. దాంతో వారిలో వారికి తగాదా జరిగింది.  బార్ మేనేజర్ వారిని బైటికి పంపించాడు. బార్ నుండి బైటికి వచ్చాక కూడా వారు కొట్టుకున్నారు. (There was a physical fight among them.) దగ్గరిలో ఆటో స్టాండు దగ్గర ఉన్న కొంతమంది జోక్యం చేసుకున్నారు. కొద్ది సేపట్లోనే మరికొంతమంది గుమి కూడారు. బర్త్ డే అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు అక్కడినుండి పారిపోవడంతో ఈ అమ్మాయి ఒంటరి అయింది. ఈ పరిస్ధితిని అక్కడి జనం అవకాశంగా తీసుకుని లైంగికంగా వేధించారు (molested). సమీపంలోని హోటల్ నుండి ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు స్పాట్ కి వచ్చి అమ్మాయిని కాపాడారు” అని అస్సాం డిజిపి జయంతో నారాయణ్ చౌదరి ‘ది హిందూ’ కి తెలిపాడు.

అయితే ఐ.బి.ఎన్ లైవ్ వార్తా కధనం డిజిపి కధనంతో విబేధిస్తోంది. ఐ.బి.ఎన్ ప్రకారం బాధితురాలు స్నేహితులతో కలిసి ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి సిటీ లోని బార్ కి వెళ్లింది. అక్కడ ఒక వ్యక్తి అమ్మాయి పై అసభ్యకరంగా వ్యాఖ్యానం చేశాడు. పార్టీకి వెళ్ళిన మిత్రులు అసభ్యంగా వ్యాఖ్యానించినవారితో గొడవ పడ్డారు. క్రమంగా గొడవ పెరిగి పెద్దదయింది. పబ్ లో గొడవ వద్దంటూ బార్ మేనేజర్ బాధితుల్నే బైటికి నెట్టేశాడు. వారు బైటికి రాగా అసభ్య వ్యాఖ్యాత కూడా వారిని అనుసరించి పబ్ బైట కూడా తన దాడి కొనసాగించాడు. పార్టీకి వచ్చిన మిత్రులు తమలో తాము తగువుపడ్డారని డిజిపి చెప్పడం వల్ల సంఘటన అర్ధమే మారిపోయింది. పబ్ లోపలికి వచ్చిన అమ్మాయిలంతా అసభ్య వ్యాఖ్యలకు అనువుగా ఉంటారని భావించిన ఒక పురుష అహంభావి ఈ సంఘటనకి కారణం అని స్పష్టం అవుతోంది. అతనికి పబ్ బయట మరికొందరు జత చేరి తమ వ్యాఖ్యానాలను ధిక్కరించిన అమ్మాయి పై పగతీర్చుకున్న ఫలితంగానే ఈ సంఘటన జరిగింది.

‘హిందూస్ధాన్ టైమ్స్’ (హెచ్.టి) ప్రకారం సంఘటన జరిగింది పోష్ లోకాలిటీలో. 30 మందికి పైగా మగ పుంగవులు ఈ వీరోచిత కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలమంది చూస్తూ కూడా నివారించడానికి ముందుకు రాలేదు. జులై 10 తేదీన యూ ట్యూబ్ కి ఎక్కకపోతే ఈ ఘటనని ఎవరూ పట్టించుకునేవారే కాదు. స్ధానిక టి.వి చానెల్ ఫోటోగ్రాఫర్ సంఘటనను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో ఫుటేజ్ చూశాక దేశ వ్యాపితంగా నిరసనలు పెల్లుబుకాయి. పార్టీలకు అతీతంగా దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే సంఘటనకు దారి తీసిన సామాజిక పరిస్ధితుల అపసవ్యతపై మాత్రం పార్టీలేవీ నోరు మెదపలేదు. ఎవరికి వారు బాధ్యతను తుడిచేసుకుని డిమాండ్లు చేయడంపైనే దృష్టి పెట్టారు.

అన్నా బృందం సభ్యుడు అఖిల్ గొగోయ్ సంఘటనపై విరుచుకుపడ్డాడు. అస్సాంలో పరిస్ధితి ఘోరంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. రాష్ట్రంలో శాంతిబధ్రతల పరిస్ధితి విషమించిందని చెబుతూ బి.జె.పి గౌహతీలో ప్రదర్శన నిర్వహించింది. హెచ్.టి ప్రకారం సంఘటనను చిత్రీకరించి టెలికాస్ట్ చేసిన న్యూస్ లైవ్ టి.వి ఛానెల్ విలేఖరి ఇందులో ప్రత్యక్ష దోషి. “ఆ విలేఖరి, అతని స్నేహితులు బార్ వద్ద ఉన్నారు. అమ్మాయిలపైన వారు కామెంట్లు చేశారు. అమ్మాయి పై దాడి చేయాలని విలేఖరే తన స్నేహితులను రెచ్చగొట్టాడు” అని అఖిల్ గొగోయ్ తెలిపాడు. ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న అమర్ జ్యోతి కలిత విలేఖరికి స్నేహితుడేనని కూడా ఆయన తెలిపాడు. “విలేఖరికి చెందిన హ్యుండై కారులోనే వాళ్ళు బార్ కి వెళ్లారు. వారిని టి.వి చానెల్ యజమాని కాపాడుతున్నాడు” అని అఖిల్ గొగోయ్ అన్నాడు. న్యూస్ లైవ్ విలేఖరి ప్రత్యక్ష పాత్రని ధ్రువపరిచే సి.డి తన వద్ద ఉన్నదనీ, దానిని పోలీసులకీ, మీడియాకీ ఇస్తాననీ స్పష్టం చేశాడు.

సంఘటనకి సంబంధించి పోలీసుల స్పందనపై పలు విమర్శలు తలెత్తాయి. సంఘటన జరిగిన వెంటనే స్పందించడానికి పోలీసులు ఎ.టి.ఏం మిషనేమీ కారని డిజిపి వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు బాధితురాలిని కాపాడి జీపు ఎక్కించాక కూడా దుండగులు ఆమెను వేధించారని ఎన్.డి.టి.వి చెప్పడం గమనార్హం. పోలీసుల వైపు నుండి కూడా కొన్ని పొరబాట్లు దొర్లాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అంగీకరిస్తూ 48 గంటల లోపు నిందితులందరినీ అరెస్టు చేయాలని ఆదేశించాడని సదరు టి.వి చానెల్ తెలిపింది. సంఘటనను విచారించడానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎమిలీ చౌదరి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించి 15 రోజుల లోపు నివేదిక ఇవ్వాలని కోరింది.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మాంత్రి ఆకోన్ బోరా శనివారం బాధితురాలి ఇంటిని సందర్శించి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చాడు. “సంఘటన వల్లా, ఆ తర్వాత మీడియా కేంద్రీకరణ వల్లా అమ్మాయి తీవ్ర వేదనలో ఉంది. సంక్షేమ మంత్రిగా ఆమెకు సహాయం అందించడం నా బాధ్యత. ప్రభుత్వం ఆమెకు రక్షణ ఇస్తుందని హామీ ఇచ్చాను” అని బోరా తెలిపాడు. దుండగులనుండి తనను కాపాడినందుకు బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పిందని ఎన్.డి.టి.వి తెలిపింది. అనేకమంది చూస్తూ ఉన్నా భయం వల్ల జోక్యం చేసుకోలేదనీ తనను రక్షించడానికి బదులు ఎలక్ట్రానిక్ మీడియా ఘటనను షూట్ చెయ్యడంపైనే కేంద్రీకరించిందని ఆమె నిరసించినట్లు తెలిపింది. “నన్ను అవమానించారు. నా జీవితం నాశనం అయింది. ఇలాంటిది ఇంకెవరికీ జరగరాదు. నాకు న్యాయం కావాలి” అని బాధితురాలు డిమాండ్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుందామని భావించాననీ తన అక్క, తన కుటుంబం తనకు మద్దతుగా నిలవడంతో విరమించుకున్నాననీ ఆమె ఒక టి.వి చానెల్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా సంఘటనకు కారకులుగా మొత్తం 16 మందిని పోలీసులు గుర్తించారు. వీడియో ఆధారంగా గుర్తించి ఇప్పటివరకూ నలుగురుని అరెస్టు చేశారు. ‘అస్సాం పబ్లిక్ వర్క్స్’ అనే ఎన్.జి.ఓ సంస్ధ పోలీసుల సాయంతో ఆరుగురు నిందితుల ఫోటోలతో కూడిన రెండు భారీ హోర్డింగ్ లను పట్టణంలో ప్రదర్శించింది. అనేక ఫ్లెక్సీ బ్యానర్లను ముద్రించి పట్టణంలో ప్రదర్శిస్తోంది. వారిని చూసినవారు ఆచూకీ చెప్పాలని అందులో కోరారు.

ఐ.బి.ఎన్ కధనం, అఖిల్ గొగోయ్ వెల్లడి చేసిన వివరాలు ఒకదాకికొకటి సరిపోలుతున్నాయి. పబ్ లోపల అసభ్య వ్యాఖ్యానం చేసిన వ్యక్తే న్యూస్ వైర్ విలేఖరి అని అర్ధం చేసుకోవచ్చు. ఆ విలేఖరి బాధితులను వెంబడిస్తూ పబ్ బైటికి వచ్చాక తాను కారులో కలిసి వచ్చిన లంపెన్ శక్తుల తో కలిసి  బాధితురాలిని మరింతగా వేధించడానికి సిద్ధపడ్డాడు. సంఘటన జరుగుతుండగా నివారించడం మాని చిత్రీకరించడం ప్రారంభించడం కూడా అందుకే. పదహారు మంది నిందితులకు తోడు న్యూస్ వైర్ విలేఖరి ని ప్రధాన నిందితుడుగా చేర్చాలి. అసభ్య వ్యాఖ్యానం చేసి గొడవకు ప్రారంభకుడుగా నిలవడంతో పాటు శారీరకంగా, లైంగికంగా కూడా వేధించడానికి మిత్రులతో కలిసి సిద్ధపడిన ప్రధాన ముద్దాయి అయిన న్యూస్ వైర్ విలేఖరిని కఠినంగా శిక్షించాలి.

వ్యాఖ్యానించండి