ఓణీ, పరికిణీ భారతీయ అందం. ముఖ్యంగా భారతీయ పల్లెల అందం. పశ్చిమ దేశాల దుస్తుల్లోని సులువుకి ప్రపంచం యావత్తూ తల ఒగ్గినప్పటికీ భారత స్త్రీల సంప్రదాయ దుస్తులైన ఓణీ, పరికిణీ, చీరల అందం తిరుగులేనిది. ఫ్యాంటు, షర్టుల్లో దుస్తుల అందాన్ని పదిలపరుచుకుంటూ విస్తృత మార్పులు తీసుకు రాగల అవకాశం పరిమితం. ఆ పరిమితిని అధిగమించడానికి కాబోలు… దుస్తుల్లో చూపలేని అందం శరీర ప్రదర్శనలోకి దిగిపోయింది. రక రకాల పేర్లతో అంతకంతకూ కురచగా మారడమే తప్ప ((ఫ్యాంటు, షార్టు, నిక్కరు… ఇలా) నవ్యతకి అవకాశం తక్కువ. భారతీయ దుస్తులకు ఆ పరిమితి లేదు, లేదా చాలా తక్కువ. ఆరు మూరల చీరలో పేర్చగల అందాలు ఎన్నని? ప్రకృతికి ఎన్ని రంగులో చీర, ఓణీలకి అన్ని అందాలన్నా అతిశయోక్తి కాదేమో. అలాంటి అపరిమిత అందాల్ని కుంచెతో అద్భుతంగా పట్టి మన ముందు ఉంచారు ఇళయరాజా.
చీర, ఓణి, పరికిణీ ల శబ్దంలోనే ఒక అందాన్ని ఆస్వాదించవచ్చు. నేటివిటీ పట్ల ఉండే గౌరవపూర్వకమైన సానుకూలత దానికి కారణమేమో. ‘అందం స్త్రీల సొత్తు’ అన్న నానుడి నిజమేనేమో అన్నట్లుగా భారతీయ స్త్రీల వద్ద ప్రకృతి అందం అంతా కుప్పగా చేరిపోయినట్లు కనిపిస్తుంది. పట్టు పురుగుల దారాల్ని క్రమ పద్ధతిలో పేర్చిన చీరలు కావచ్చు, పూలరాశులు వేలాడే సిగ ముడులు కావచ్చు, ఘల్లు, ఘల్లు మంటూ మనో స్పందనలను ప్రేరేపిస్తూ హృదయ సవ్వడులతో పోటీ పడే కాలి పట్టాల కువ కువలు కావచ్చు, సిగ్గు, భయం, మొహమాటం, అనందాశ్చర్యాలలను పూర్తిగా ఒలికించలేక అదిమిపట్టి కొత్త అందాల్ని ప్రతిఫలించే నగుమోములు కావచ్చు… మనసు ఒగ్గి అస్వాదించగలిగితే, భారతీయ స్త్రీ అందానికి ప్రకృతే సలాము కొడుతుంది.
అంతే కాదు. శ్రమ సౌందర్యాన్ని మనసుకి హత్తుకునే రూపంలో భారత స్త్రీలలోనే చూడగలం. ఎందుకంటే శ్రమ కోసం పశ్చిమ, ఉత్తర దేశాల్లో ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. వంట చేస్తే ఏప్రాన్, పిల్లాడిని ఎత్తుకుంటే టాడ్లర్ కేరియర్, చీపుర్లని గెంటేసిన డస్ట్ క్లీనర్స్… ఇలా. కాని భారత శ్రామిక మహిళ చీర కట్టి ఏ పనైనా చేయగలదు. చీర కట్టు శ్రమలకి అనుగుణంగా తన రూపాన్ని అప్పటికప్పుడే మార్చుకోగలదు. ఏ పనికైనా చీర దోపి నడుం బిగించాల్సిందే. ‘నడుం బిగించడం’ అంటూ స్త్రీ శ్రమని సూచించే పదబంధం స్త్రీ, పురుషులు చేసే సకల శ్రమల ప్రారంభాన్ని సూచించేదిగా మారడం అందుకే కాబోలు.
పొగ గొట్టం ఊది నిప్పు రాజేసినా, బియ్యం నుండి రాళ్లు మట్టిగడ్డలను ఏరివేసే ప్రాసెసింగ్ శ్రమ అయినా, ఇంటి నిట్రాడుకి తాడేసి కవ్వం చిలికి వెన్న మజ్జిగలు తీసినా, ఆన్నం, కూర, మజ్జిగ సిద్ధపరిచి పొలమెళ్ళిన మగని కోసం వాకిట అభిసారికగా మారినా, కొడవలిని చలాగ్గా దిగేసి పైరు పొలంలో కలుపు ఏరేసినా, చీర కుప్పలో ఒద్దికగా ఒదిగి పూల మాలలల్లినా, చంటి పిల్లాడిని ఎత్తుకుని చందమామకు కబురంపినా, చివరికి తోచడానికి లేక మునివేళ్లతో చుబుకాన్ని ఎత్తిపట్టి గోడవారగా పక్కింటి ఇల్లాలితో చెతురు ముచ్చట్లాడినా అది భారత స్త్రీ అందాన్ని ద్విగుణీకృతం చేసే శ్రమ సౌందర్యమే. ఆ శ్రమ సౌందర్యానికి మెరుపులు అద్దేదీ చీర, ఓణీ, పరికిణీలే. చీర, ఓణి పరికిణీలు భారత స్త్రీ ఆస్తి. పంచుకునే కొద్దీ పెరుగుతూ పోయే సంపద. ఇళయరాజా గీసిన ఈ పెయింటింగ్ లు ఆ విషయాన్ని ఎంతో చక్కగా చెపుతున్నాయి. ఫొటోలకి ఏ మాత్రం తగ్గని ఈ చేతి చిత్రణ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రతి అంగుళం పైనా శ్రద్ధపెట్టి గోడలు, కుండలు, పొయ్యిలు, చెక్కలు, అరుగులు కూడా మాట్లాడుతున్నట్లున్న పెయింటింగ్ ల గురించి ఇంకా చాలా చాలా చెప్పుకోవచ్చనిపిస్తుంది.
–
–




















మీరు కూడా సంప్రదాయవాదం వైపు పోతున్నారని అనుమానం వస్తోంది. చీర కట్టుకుంటే నడుము పక్క భాగం, వెనుక భాగం కనిపిస్తాయి. బస్సులలో లేదా ట్రైన్‌లలో ప్రయాణిస్తున్నప్పుడు కొంత మంది పోకిరీ యువకులు అటు చూసి ఆనందించడం జరుగుతుంది. అందుకే కొందరు స్త్రీలు ప్రయాణాలు చేసే సమయంలో చూడీదార్-సల్వార్‌లు వేసుకోవడం జరుగుతోంది. ఎవరి సంస్కృతివాళ్ళకి గొప్పగానే కనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి పాశ్చాత్య సంస్కృతికి ఇండియాకి వచ్చింది, మన ఇండియావాళ్ళు వలస పాలనలు చెయ్యలేదు కాబట్టి మన సంస్కృతి గురించి పాశ్చాత్య దేశాలవాళ్ళకి తెలియదు. అంతే కానీ బ్రిటిష్ సంస్కృతి గొప్పదనో, భారతీయ సంస్కృతి మార్మికమైనది లేదా విశిష్టమైనది అనో అనుకోలేము.
ప్రవీణ్, అవును. ఎవరి సంస్కృతి వారికి గొప్పది. భారతీయ వస్త్ర ధారణే అన్ని దేశాలకంటే గొప్పదని నా భావన కాదు. అలా అని చెప్పలేదు కదా.
శరీర అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో చీర, ఓణి, పరికిణి లు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయన్నది నా పరిశీలన. శరీర భాగాల్చి చూపడం కంటె వాటిని కప్పుతూ సౌందర్యాన్ని ప్రతిఫలించపజేయడంలో భారతీయ సంప్రదాయ దుస్తులు సాటిలేనివి. కొన్ని పనులకి చీర కట్టు ఆటంకంగా, కొండొకచో ప్రమాదకరంగా కూడా ఉంటున్న సందర్భాలు తప్ప ప్రధానంగా చీర కట్టు దృశ్య మనోహరం. ఇక నడుము, వీపు కూడా నగ్నత్వంగా చూసే వారిని పోకిరీలని మీరే అంటున్నారుగా. వారి గొడవ అప్రస్తుతం.
సంప్రదాయం అయిన ప్రతీదీ చెడ్డది కాదు. ఆధునికం అయిన ప్రతిదీ గొప్పది కాదు. పాతలో నిలుపుకోదగిన లక్షణాలు అనేకం ఉంటాయి. ఆధునికతలో తిరస్కరించదగినవీ చాలా ఉంటాయి. ఏది స్వీకరించినా ఆయా వ్యక్తుల, సమూహాల సమగ్రతను, ఆచరణీయతనూ గౌరవించేదిగా ఉండాలి. ఒకరిపై మరొకరి ఆధిపత్యాన్ని తిరస్కరించడమే పరమావధిగా ఉన్నంతవరకూ, సమానత్వాన్ని ఉన్నత విలువగా అంగీకరించినంతవరకూ సంప్రదాయాన్నైనా గౌరవించడంలో తప్పు లేదు.
ఇలయ రాజ అంటే మ్యుజిక్ దైరెక్టర్ రాజన?
కుంచెలో ఒదిగిన ఓణీ, పరికిణీల శ్రమ సౌందర్యం అంటూ ఒక తమిళ చిత్రకారుడి చిత్రోహలకు మీరు అద్దం పట్టారు. మీరు మరికాస్త సమయం కేటాయించి మీ ఈ కథనాన్ని ఇంగ్లీషులోకి అనువదించి నాకు పంపారంటే నేరుగా ఇళయరాజాగారికే పంపించవచ్చు. నిజంగా చాలా గొప్ప కథనం ఇది. బహుశా తన చిత్రాలకు ఇంత గొప్ప ప్రశంసను ఆయనకు తన మిత్రబృందమే కాదు తమిళ బ్లాగర్లు కూడా పంపి ఉండరనుకుంటాను.
ప్రవీణ్ మరీ ఆధునికంగా ఆలోచిస్తున్నారేమో.. కొంపదీసి ఆయన కోరుకుంటున్న రాజ్యం వస్తే మహిళలందరినీ షర్టూ, ప్యాంటూ వేసుకోవలసిందిగా ఆర్డర్ జారీ చేస్తారేమో. సరదాకే లెండి.
భారతీయ శ్రామిక మహిళల ముగ్ధత్వాన్ని రమణీయంగా చిత్రించిన ఇళయరాజా గారి ప్రతిభా సహజత్వాన్ని పరిశీలించడానికే ఇక్కడ పరిమితమైతే చాలనుకుంటాను.
“:ఒకరిపై మరొకరి ఆధిపత్యాన్ని తిరస్కరించడమే పరమావధిగా ఉన్నంతవరకూ, సమానత్వాన్ని ఉన్నత విలువగా అంగీకరించినంతవరకూ సంప్రదాయాన్నైనా గౌరవించడంలో తప్పు లేదు.”
చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమయిన తర్వాత మావోకి ఇష్టమైన రెడార్మీ యూనిఫార్మ్ మీద మక్కువతో కోట్లాది మంది యువతీ యువకులు అక్కడ సాంప్రదాయిక దుస్తులను వదిలిపెట్టి యూనిఫాం ధరించసాగారన్నది వాస్తవం. అది వ్యవసాయ క్షేత్రాల్లో, కర్మాగారాల్లో పనికి చాలా సౌకర్యంగా ఉపయోగపడటం కూడా వాస్తవమే. కాని ఇది అన్ని దేశాల్లో, అలాగే అమలవాలంటే కష్టమే. పైగా దేశమంతా ఒకే యూనిఫాం లేదా ఒకే దుస్తులు ధరించడంలో ఎంత గొప్ప నవజీవన స్పూర్తిని చూపినప్పటికీ ఒక జాతి వస్త్ర ధారణ మూసకు గురికాకూడదు. జీవితంలో అన్ని కోణాలలోనూ వైవిధ్యపూరితమైన సౌందర్యం, ఆచరణ, ప్రదర్శన, అలవాట్లు మానవ సమాజానికి ఆరోగ్యకరం, అవసరం కూడా.
అలా అని చైనా మహిళల పట్ల సహస్రాబ్దాలుగా సాగించిన నిర్బంధపూరిత పొట్టి పాదాల సంస్కృతి -china foot- ని ఎవరూ బలపర్చనవసరం లేదు. ఆ అవసరం లేకుండానే అది చరిత్రలో కలిసిపోయింది. ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించాలన్నా అది చరిత్రలో నిలబడదు.
మరోసారి. శ్రామిక మహిళ దుస్తుల సౌందర్యాన్ని ఇంత రమణీయంగా ఎవరూ వర్ణించి ఉండరనుకుంటాను. ధన్యవాదాలు.
“దేశమంతా ఒకే యూనిఫాం లేదా ఒకే దుస్తులు ధరించడంలో ఎంత గొప్ప నవజీవన స్పూర్తిని చూపినప్పటికీ ఒక జాతి వస్త్ర ధారణ మూసకు గురికాకూడదు. జీవితంలో అన్ని కోణాలలోనూ వైవిధ్యపూరితమైన సౌందర్యం, ఆచరణ, ప్రదర్శన, అలవాట్లు మానవ సమాజానికి ఆరోగ్యకరం, అవసరం కూడా. ”
రాజుగారూ, చాలా గొప్పగా చెప్పారు. జీవన వైవిధ్యం వైరుధ్యాల జీవనంలో సహజాతి సహజం. ప్రకృతిలో ఎన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలు ఉన్నాయో మానవ సమాజంలోనూ అన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలు ఉంటాయి. ఉన్నాయి కూడా. ఆధిపత్య వైరుధ్యాన్ని సహజ వైరుధ్యాలలోకి చేర్చడమే సమస్య.
ఆంగ్ల అనువాదానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ రాసింది ఉన్నది ఉన్నట్లు ఆంగ్లంలోకి అనువదించడం నాకైతే కష్టమే.
చందుగారూ, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా, పెయింటర్ ఇళయ రాజా వేరు వేరు. ఇద్దరూ ఒకటి కాదు. పెయింటర్ ఇళయ రాజా గారి గురించి రాజు గారే సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన లింక్ ద్వారా ఈ ఫొటోల్ని ఇక్కడ ఉంచాను.
వస్త్రధారణ గురించి రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం చదివాను. పీర్ సాహెబ్ గారు చనిపోయినప్పుడు ఆయన శవాన్ని చూడడానికి రంగనాయకమ్మ గారు ప్రకాశం జిల్లాకి వెళ్ళిన రోజులలో అక్కడి మహిళలు తమకి చూడీదార్-సల్వార్ వేసుకునే ధైర్యం కూడా లేదని చెప్పారు. ఎక్కువ దూరం నడిచేటప్పుడు చీరలో ఉండడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలిసినా, సంప్రదాయాల వల్ల కొత్త రకం దుస్తులు వేసుకోలేకపోతున్నారట! సంప్రదాయాలు మారడం లేదు అనే బాధ ఒక వైపు ఉండగా మీరు సంప్రదాయాలలోని విశిష్ఠతని చూపడం నాకు అదోలా అనిపించింది.
చాలా బాగున్నాయి. అయితే ఇలాంటి దృశ్యాలు (ఆ వయసు లో ఉన్న యువతులు ఆ బట్టలలో కనపడటం) ఓ పది సంవత్సరాల కిందటి కాలానికి చెందినవి. ఇప్పుడు పల్లెలలో కూడా సల్వార్ లు వేసుకొంటున్నారు. ఆడవారుసాంప్రదాయకమైన పనిలో నిమగ్నమైఉన్నపుడు అందు లో అందం ఉన్నదని నాకు అనిపిస్తుంది.
ఓణీ అయినా చీర, సల్వార్ అయినా వస్త్రాలదేముందికాని
ఆయన చిత్రించిన ముఖకవళికలు మాత్రం మహాద్భుతం.
నేను ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు ఈ పెయింటింగ్స్ ని చూస్తూ అవి చిత్రించినవి ఆయనచేతులా లేక వంద మెగాపిక్స్ ఉన్న లెన్స్ లా! అని ఆశ్చర్యపోతుంటాను.
థ్యాంక్సండి…..మా ద్రోణాచార్యులవంటి( క్షమించాలి నేను ఏకలవ్యునిగా) గురువుగారిపై ఇంత మంచి పోస్ట్ వ్రాసినందుకు.
బొందలపాటి గారూ, అవున్నిజమే. ఇప్పుడు పల్లెల్లో కూడా సల్వార్ లు వేసుకుంటున్నారు. కాని అది ఒక వయసు వరకే (బహుశా పెళ్ళి వయసు వరకూ) అనుకుంటాను. ఆ వయసు దాటాక యువతులు కూడా చీరల్లోకే వచ్చేస్తున్నారు. టెన్త్, లేదా ఇంటర్ చదివి ఆపేస్తున్నవారు (పెళ్ళి వలన) చీరల్లోకి వచ్చేస్తున్నట్లు కనిపిస్తొంది. పై చదువులకి వెళ్ళి నగర జీవనంలో స్ధిరపడితే తప్ప సల్వార్ లలో స్త్రీలు స్ధిరపడడం లేదు. అలా స్ధిరపడిన వారు కూడా చీరల పైన మక్కువ వదులుకోలేక పార్టీలకీ, ఫంక్షన్లకీ చీరలు కడుతూనే ఉన్నారు. ప్రధాన జీవన కార్యక్రమాలనుండి చీరల్ని వదిలేసే సాహసానికి పల్లెలు ఇప్పట్లో పూనుకోవనే అనిపిస్తుంది. అమెరికా, యూరప్ లలోనూ ఆ దేశాల స్త్రీలు సైతం కొన్ని పార్టీల్లో చీరలు కట్టడం కొన్ని సార్లు చూశాను. ఇంగ్లీషు సినిమాల్లోనూ, నెట్ లో అక్కడక్కడా కనపడే పార్టీల ఫొటోల్లోనూ తెల్లజాతి స్త్రీలు చీరలు కట్టడం చూశాను. బహుశా ఇవన్నీ ఏదోమేరకు చీరల శాశ్వతత్వాన్ని పట్టిచ్చేవేనేమో.
పద్మార్పిత గారు, ముఖ కవళికల గురించి నేను ప్రస్తావించలేదు. మీ ప్రస్తావన అదనపు చేర్పు. నేను ఫొటోల్లో ప్రధానంగా గమనించింది భారతీయ స్త్రీల వస్త్రధారణలోని ముగ్ధత్వాన్ని కనుక నా వివరణ కూడా ఆ కోణంలో సాగింది.
అయితే పెయింటింగ్ అన్నాక ప్రతీదీ లెక్కలోకి వస్తుంది కదా. బొమ్మ గీసేటపుడు కేంద్ర స్ధానంలో ఉండే వ్యక్తిని చిత్రీకరించడం ఒక ఎత్తైతే, ఆ వ్యక్తి చిత్రణను పరిపూర్ణం చేసే పరిసరాల చిత్రణ మరొక ఎత్తు. మనిషి ఎప్పుడూ పరిసరాలతో సజీవ సంబంధంతో ఉంటాడు గనక పరిసరాలకు కూడా ఆ ప్రాముఖ్యత ఉంటుంది కాబోలు.
First of all, ivi paintings kaavu. Chakkati Photoshop chesina work idi.
Please give me the source, where did you get it from? If the source is forwarded mail forget it.