అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా అధ్లెట్ పింకి ప్రామాణిక్ పట్ల ఆసుపత్రులు, పోలీసులు, సమాజం ఎంత క్రూరంగా, దయా రహితంగా వ్యవహరించారో గత కొన్ని రోజులుగా పత్రికలు వెల్లడిస్తున్నాయి. పాతిక రోజులు జైలులో గడిపి బుధవారం బెయిలు పై బైటికి వచ్చిన తర్వాత పింకీ వెల్లడించిన నిజాలు పత్రికల కధనాలను బలపరిచాయి. పోలీసు కష్టడీలో ఉండగా వేధింపులకు గురయ్యాననీ, ప్రవేటు ఆసుపత్రి వైద్యులు కాళ్ళు, చేతులు కట్టేసి లింగ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహించారని పింకీ ప్రామాణిక్ బెయిల్ పై విడుదల అయిన అనంతరం తెలిపింది.
“మెడికల్ పరీక్షలను ప్రతిఘటించడంతో నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. మెలకువ వచ్చి చూస్తే నా కాళ్ళు, చేతులు కట్టేసి ఉన్నాయి… ప్రవేటు నర్సింగ్ హోమ్ లో నా చేతులు, కాళ్ళు కట్టేశాక బలవంతంగా నాపై వైధ్య పరీక్షలు నిర్వహించారు” అని జైలునుండి బైటికి వచ్చిన కొద్ది నిమిషాల అనంతరం పింకీ విలేఖరులకు తెలిపింది. బెంగాల్ 24 పరగళాల జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన అనంతరం డమ్ డమ్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుండి పింకీ ని బుధవారం విడుదల చేశారు.
విడుదల తర్వాత కూడా పింకీ కష్టాలు కొనసాగాయి. తన ఫ్లాట్ తాళాలు తనకు తిరిగి ఇవ్వడానికి పోలీసులు గంటల తరబడి స్టేషన్ లో కూర్చోబెట్టారని పింకీ ఆరోపించింది. “బాగిహతి పోలీసు స్టేషన్ లో ఇంతకు ముందు కూడా నన్ను వేధించారు. వారు ఇంకా నన్ను వేధిస్తూనే ఉన్నారు. పోలీసులు ఈ విధంగా నిరంతరాయంగా ఎందుకు వేధిస్తున్నారో నాకు తెలియదు” అని పింకీ తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని పౌర హక్కుల సంస్ధలు పింకీ పై పోలీసులు సాగించిన వేధింపుల విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనేక భారతీయ జాతీయ, అంతర్జాతీయ అధ్లెట్లు సైతం పింకీ కి మద్దతు పలికారు.
ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెపై సాగిన వేధింపులపై చర్యలు తీసుకోవాలని అనేకమంది అధ్లెట్లు, కోచ్ లు డిమాండ్ చేశారు. ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్టు జ్యోతిర్మయి సిక్దార్ (సి.పి.ఎం పార్టీ ఎం.పి), భారత మహిళా ఫుట్ బాల్ టీం మాజీ కెప్టెన్ కుంతల ఘోష్, లాంగ్ డిస్టెన్స్ మాజీ స్విమ్మర్ బులా చౌదరి, మాజీ ఫుట్ బాలర్ మరియు కోచ్ సుబ్రత భట్టాచార్య లు పింకీ కి మద్దతు తెలిపిన 30 మంది ప్రఖ్యాత క్రీడాకారుల్లో ఉన్నారు. పింకీ కి మద్దతుగా కలకత్తా హై కోర్టులో ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ కూడా దాఖలయింది.
తప్పుడు కేసు
తనపై తప్పుడు కేసు నమోదు చేశారని పింకీ ఆరోపిస్తోంది. తప్పుడు కేసులో ఇరికించారనీ, ఇరికించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయనీ, మహిళకు కూడా ఆ ప్రయత్నాల్లో భాగం ఉందనీ ఆమె తెలిపింది. తనపై కేసు పెట్టిన మహిళ తనకు ఇంటిలో పనులు చేసి పెట్టేదని చెబుతూ కేసులో సరైన విచారణ జరగాలని పింకీ కోరింది. తన తండ్రి దుర్గాచరణ్ ప్రామాణిక్ ఇప్పటికే క్రీడా మంత్రి ని కలిసిందనీ తాను కూడా త్వరలో కలుస్తాననీ తెలిపింది.
పింకీ ప్రామాణిక్ పై వైద్య పరీక్షలు జరుపుతున్న సందర్భంగా దొంగ చాటుగా తీసిన వీడియో కొద్ది రోజుల క్రితం ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. తన కూతురి పై వైద్య పరీక్షలు జరుగుతుండగా వీడియో తీయడం దానిని నెట్ లో పెట్టడం సిగ్గు చేటైన విషయం గా పింకీ తండ్రి అభివర్ణించాడు. ఈ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. వీడియో బహిరంగం చేసినవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు పింకీ తెలిపింది.
పింకీ తనపై అనేకసార్లు అత్యాచారం చేసిందని చెబుతూ మహిళ ఒకరు జూన్ 14 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మహిళా పింకీ తో సహజీవనం చేస్తున్నట్లు మొదట పత్రికలు చెప్పాయి. అయితే ఆమె పింకీ పొరుగింటిలో నివసిస్తున్న మహిళగా ‘ది హిందూ’ బుధవారం పేర్కొంది. తనపై అత్యాచారం జరిపి హింస పెట్టిందని, పింకీ వాస్తవానికి మగవాడనీ సదరు మహిళ ఫిర్యారు చేయడంతో ఒక ప్రవేటు నర్సింగ్ హోమ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలోనూ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎస్.ఎస్.కె.ఏం ఆసుపత్రిలోనూ పరీక్షలు నిర్వహించారు.
కోర్టు చేతికి వైద్య నివేదిక
కోర్టు ఆదేశాల మేరకు ఎస్.ఎస్.కె.ఎం ఆసుపత్రి అధికారులు 11 మందితో వైద్య బృందం నియమించారు. అందుబాటులో ఉన్న అన్నీ పరీక్షలు నిర్వహించినప్పటికీ పింకీ లింగ నిర్ధారణ చేయడంలో వైద్యులు విఫలం అయ్యారు. పింకీ లింగ నిర్ధారణ అంత సులభం కాదని వైద్యులు చెప్పినట్లుగా వివిధ వార్తా సంస్ధలు, స్వతంత్ర పరిశీలకులు ఇంటర్నెట్ లో వార్తా కధనాలను ప్రచురించారు. వారి ప్రకారం పింకీ శరీరంలో ఆడ, మగ కు సంబంధించిన రెండు లక్షణాలు (elements) ఉన్నాయి. ఏ లక్షణాలు ప్రధానంగా ఉన్నది మామూలు పరీక్షల్లో తేలలేదు. దానికి ప్రత్యేకంగా ఉన్న ‘క్రోమోసోమల్ టెస్ట్’ (కర్యో టైపింగ్) పరీక్ష జరపవలసి ఉంటుంది. ఎస్.ఎస్.కె.ఎం.ఎస్ లో సదరు పరీక్ష జరపడానికి సౌకర్యం లేనందున వేరే చోట చేయవలసి వచ్చింది. క్రోమోసోమల్ పరీక్ష పూర్తయిన నివేదిక కోర్టుకి మంగళ వారం చేరింది. ఆ నివేదిక అందిన తర్వాతే పింకీ కి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ కుట్ర?
ఇదిలా ఉండగా ఒక భూ వివాదంలో పింకీ ఇరుక్కొని ఉందని పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి మదన్ మిత్ర పత్రికలకు తెలిపాడు. భూమి అమ్మకానికి సంబంధించిన ఒప్పందం పై వివాదం తలెత్తినందువల్లనే పింకీ పై అత్యాచారం కేసు బనాయించబడి ఉండవచ్చునని ఆయన సూచించాడు. “రాష్ట్ర ప్రభుత్వం అనేకమంది క్రీడాకారులకు మూడు కొట్టాల భూమి కేటాయించింది. పింకీ కూడా అందులో లబ్దిదారు. నగరంలో ప్రైమ్ ల్యాండ్ గా భావించే చోట ఆ భూమి ఉంది” అని మంత్రి తెలిపాడు. ఒప్పందం గురించిన పూర్తి వివరాలు తనకు తెలియదనీ, అయితే ఒక ప్రమోటర్ తో ఒప్పందం కుదుర్చుకోవడం మాత్రం తెలుసనీ ఆయన తెలిపాడు.
“వ్యక్తిగత వినియోగం కోసం పింకీ కి భూమిని కేటాయించారు. దానినుండి లాభం పొందరాదు. లాభం కోసం పింకీ దానిని విక్రయించినట్లయితే అది చట్ట విరుద్ధం. అక్కడికి వెళ్ళినవారెవరైనా అయిదంతస్ధుల భవనాన్ని చూడవచ్చు. భవనం యజమాని ఎవరో మున్సిపల్ రికార్డుల్లో చూడవచ్చు” అని మంత్రి తెలిపాడు. సి.పి.ఎం ఎం.పీ జ్యోతిర్మయి సిక్దర్ ని కూడా భీవివాదంలోకి మంత్రి లాగాడని పత్రికలు తెలిపాయి. చూడబోతే తృణమూల్ పార్టీ, సి.పి.ఎం పార్టీలకు చెందిన రియల్ వ్యాపారుల తగాదాలే పింకీ ప్రామాణిక్ వైపుకి ఈ రూపంలో మళ్లినట్లు కనిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ ఆస్తులపై వ్యాపారాలు సాగించే కామందుల క్రూరత్వం అందరికీ తెలిసినదే. రాత్రికి రాత్రి కుటుంభాలను వీధుల్లోకి నెట్టడంతో పాటు అత్యంత పాశవికంగా హత్యా రాజకీయాలు సాగించడంలో వారు ఏమాత్రం వెనుకాడరు. అలాంటి వారు దేశానికి గౌరవ ప్రతిష్టలు తెచ్చి పెట్టిన క్రీడాకారుల వ్యక్తిగత సున్నిత వ్యవహారాలను స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. పోలీసులు, ఆసుపత్రులు లాంటి వ్యవస్ధలు సైతం పింకీ పై వేధింపులు సాగించిన తీరును గమనిస్తే ఈ కేసులో భూ కామందుల పాత్ర, వారితో పోలీసులు, డాక్టర్లు కుమ్మక్కు అయిన పరిస్ధితిని గ్రహించవచ్చు.
రొటీన్ కి భిన్నమైన లక్షణాలతో కనిపించే వ్యక్తుల పట్ల సానుభూతి చూపి దగ్గరికి తీసుకుని సమాజం పట్లా, జీవితం పట్లా విశ్వాసం పెంచే బదులు ఈ విధంగా స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం క్షమించరాని విషయం.