కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్


తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం సంపాదించి దూరమైన పదవిని చేజిక్కించుకోగలిగాడు. మరో 11 నెలలు మాత్రమే మిగిలి ఉన్న సి.ఎం పదవి కోసం మరొక బి.జె.పి తల తెగిపడింది.

అధిష్టానానికీ యెడ్యూరప్పకీ మధ్య కుదరని సయోధ్య; పదకొండు నెలలకే చెడిన సదానంద, యెడ్యూరప్పల సయోధ్య; పదకొండు నెలల్లో బాగుపడిన షట్టర్, యెడ్యూరప్పల అవగాహన… ఇన్ని విభేదాల ముందు బి.జె.పి ‘అవినీతి వ్యతిరేక ఫోజు’ వెల వెల బోయింది. అవినీతి ఆరోపణలతో పదవికి దూరమైన యెడ్యూరప్ప ఇప్పటికీ కర్ణాటక బి.జె.పిని శాసిస్తున్నపుడు బి.జె.పి ఇక అవినీతి గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం.  అందుబాటులోకి వస్తుందో లేదో తెలియని ప్రధాని పీఠం కోసం అగ్రనాయకుల విభేదాలు కొనసాగుతుండగా గుజరాత్ లో మోడి ని ఓడించడానికి బి.జె.పి మాజీ ముఖ్యమంత్రులు ఇప్పటికే ఉమ్మడి ప్రచారం ప్రారంభించారు. ‘మీ ప్రధాని ఎవరు?’ అని ఒకప్పుడు కాంగ్రెస్ ని ప్రశ్నించిన బి.జె.పి ఇప్పుడు అదే ప్రశ్నకు జవాబు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.

వ్యాఖ్యానించండి