అమెరికా వేడి గాలులకి 42 మంది దుర్మరణం


అమెరికాలో వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పర్యావరణంలో మార్పుల ప్రభావంగా నిపుణులు చెబుతున్న ఈ వేడి గాలులు గత కొద్ది రోజులుగా అమెరికా లోని కనీసం డజను రాష్ట్రాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా మిడ్ వెస్ట్ నుండి తూర్పు తీరం వరకూ ఈ వేడి గాలులు వ్యాపించి ఉన్నాయని బి.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. పంటలు శుష్కించుకుపోగా, రోడ్లు, రైల్వే లైన్ల రూపు రేఖలు మారిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. వందల కొద్దీ ఉష్ణోగ్రతా రికార్డులు బద్దలయ్యాయని తెలిపింది.

వేడి గాలుల ఫలితంగా భూవాతావరణంలో తీవ్ర హెచ్చు తగ్గులతో వచ్చిన పెను తుఫాను సృష్టించిన విలయం నుండి కోలుకోకముందే ఆ ప్రాంతాలను వేడి గాలులు చుట్టుముట్టాయని ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి. శుక్ర, శనివారాలు అనేక రికార్డులు బద్దలయ్యాయని తెలుస్తోంది. మొత్తం మీద వేడి గాలుల వల్ల రికార్డు స్ధాయిలో 42 మంది మరణించారు. వేడి తీవ్రతకు నేరుగా మరణాలు సంభవించలేదనీ, విద్యుత్ కోతల వల్ల ఎ.సి లు పని చేయక అనేకమంది పెద్దవారు మరణించారనీ బి.బి.సి కధనం బట్టి తెలుస్తోంది.

చికాగో లో వేడి గాలుల వల్ల 10 మంది మరణించగా,తూర్పు రాష్ట్రాలైన వర్జీనియా, మేరీలాండ్ లలో పది మంది చొప్పున మరణించారు. విస్కాన్సిన్, ఒహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, టేన్నెస్సే లో ఇద్దరు మరణించారు. ఇండియానాలో నాలుగు నెలల పాపను ఎక్కువసేపు కారులో వదిలేయడంతో చనిపోయిందని తెలుస్తోంది.

శనివారం వాషింగ్టన్ డి.సి లో 1050 F (410 C) ఉష్ణోగ్రత నమోదు అయింది. వాషింగ్టన్ డి.సి లో ఇంతవరకూ నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత కంటే ఇది కొద్దిగా మాత్రమే తక్కువని బి.బి.సి తెలిపింది. సెయింట్ లూయిస్, మిస్సోరీ లలో అత్యధికంగా 460 C ఉషోగ్రత నమోదయింది. కెనడా లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది.

వెస్ట్ వర్జీనియా, వర్జీనియా, ఓహియో, న్యూ జెర్సీ, మేరీలాండ్, ఇండియానా తదితర రాష్ట్రాల్లో వందల వేలమంది కరెంటు కోతలతో బాధపడుతున్నారని కొద్ది రోజులుగా పత్రికలు, చానెళ్ళు చెబుతున్నాయి. వారం క్రితం సంభవించిన తుఫాను వల్ల విద్యుత్ సరఫరా దెబ్బతినడంతో అక్కడ ఇప్పటికీ విద్యుత్ ను పునరుద్ధరించలేకపోయారు. విద్యుత్ లేక ఎయిర్ కండిషనింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో ముఖ్యంగా పెద్దవారు తట్టుకోలేక మరణిస్తున్నారు.

అనేక నగరాలు కూలింగ్ సెంటర్లు తెరవడంతో పాటు ప్రభుత్వ ఈతకొలనులను తెరిచి ఉంచే సమయాలను పొడిగించారు. రిఫ్రిజిరేటర్లు పనిచేయకపోవడం వల్ల ఆహార పదార్ధాలు పాడైపోయినవారికి కొన్ని చోట్ల భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. చికాగోలో ఎ.సి లేక 21 భవనాల్లో సమ్మర్ స్కూళ్లను రద్దు చేస్తుకున్నారు. చికాగోలోనే ఒక ప్రధాన రోడ్డు రూపు మారిపోయింది. కొలంబస్ డ్రైవ్ వేవ్ మార్గంలో పగుళ్లివ్వడం,  ఉబ్బిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో శీతల వాతావరణం రానున్నప్పటికీ దానివెంటే వచ్చే తుఫానుల వల్ల ప్రమాదం ఉండవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.

One thought on “అమెరికా వేడి గాలులకి 42 మంది దుర్మరణం

వ్యాఖ్యానించండి