కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు


గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ‘విపరీతంగా ఉందని’ కోర్టు వ్యాఖ్యానించింది.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా సుప్రీం కోర్టు అంగీకరించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ల కింద సమకూరిన హక్కులకు రక్షణ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. కూల్చివేతకు గురయిన నివాస స్ధలాలు, వ్యాపార భవనాలను మాత్రమే పునరుద్ధరించాలనీ, మతపరమైన స్ధలాలను పునరుద్ధరించకూడదనీ రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగానే నిర్ణయించిందనీ అయినప్పటికీ ప్రార్ధనా మందిరాల పునర్నిర్మాణం సెక్యులరిస్టు సూత్రాలకు భంగకరం అంటూ సూచించడం ‘విపరీతం’ (preposterous) గా ఉందని కోర్టు అభివర్ణించింది.

గుజరాత్ మారణకాండ సందర్భంగా మూకలు కూల్చిన 500 కి పైగా ప్రార్ధనా మందిరాల పునర్నిర్మాణానికి అనువుగా నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ హై కోర్టు ఫిబ్రవరి 8 తేదీన తీర్పు చెప్పింది. అప్పటికే మందిరాలను పునర్నిర్మించుకున్నట్లయితే, అలాంటి చోట్ల అయిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కూడా హై కోర్టు తీర్పు చెప్పింది. ‘ఇస్లామిక్ రిలీఫ్ కమిటీ ఆఫ్ గుజరాత్’ (ఐ.ఆర్.సి.జి) అనే సంస్ధ 2003 లో పిటిషన్ దాఖలు చేయగా 2012 ఫిబ్రవరిలో హై కోర్టు తీర్పు వెలువడింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ మందిరాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సిఫారసు చేసిందనీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సూత్రబద్ధ అంగీకారం తెలిపిందనీ ఐ.సి.ఆర్.జి కోర్టుకు తెలిపింది. 26 జిల్లాల జిల్లా కోర్టుల్లోని ప్రిన్సిపల్ జడ్జిలే మసీదుల కూల్చివేత పై నష్టపరిహారానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని హై కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దరక్షాస్తుల స్వీకరణ, నిర్ణయాలపై జిల్లా జడ్జిలు ఆరు నెలలలోపు తనకు నివేదిక అందించాలని కూడా హై కోర్టు ఆదేశించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక కోర్టులే ప్రార్ధనా స్ధలాల పునర్నిర్మాణానికి పూనుకోవలసి వచ్చిందన్నమాట.

ఫిబ్రవరి 8 న ఇచ్చిన తీర్పులో మోడి ప్రభుత్వాన్ని హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. 2002 గోధ్రా రైలు దహనం అనంతరం చెలరేగిన అల్లర్ల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియపరంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తత్ఫలితంగానే ప్రార్ధనా నిర్మాణాలు పెద్ద ఎత్తున వినాశనానికి గురయ్యాయని హై కోర్టు పేర్కొంది. ఇళ్లకూ, వ్యాపార నిర్మాణాలకూ నష్టపరిహారం చెల్లించినపుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రార్ధనా మందిరాలకు కూడా చెల్లించాల్సిందేనని పేర్కొంది.

హై కోర్టుకి తీర్పుకి వ్యతిరేకంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. హై కోర్టు తీర్పు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్ సూత్రాల ప్రకారం ఏ ప్రభుత్వం అయినా మత సంస్ధలకు నిధులు ఇవ్వకూడని గుర్తు చేసింది. ఆర్టికల్ 27 లోని ప్రాధమిక హక్కుల ప్రకారం మతాలను ప్రోత్సహించడానికి పౌరులపై పన్నులు వేయడం రాజ్యాంగ విరుద్ధం అని వాదించింది. అల్లర్ల సందర్భంగా మతపరమైన నిర్మాణాలు ధ్వంసం అయితే వాటి పునర్నిర్మాణానికి నష్టపరిహారం చెల్లించే విధానం ఏదీ లేదని వాదించింది. ఈ వాదనలను సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

ఓ వైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వేలమంది అమాయకుల ప్రాణాలను తీయడానికి అల్లరి మూకలను నిస్సిగ్గుగా ప్రోత్సహించిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తగుదునమ్మా అంటూ ‘సెక్యులరిస్టు సూత్రాలను’ ఆశ్రయించడం ‘విపరీతం’ కాక ఏమిటి?

One thought on “కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

  1. ‘దొడ్డికి కూర్చునేటప్పుడు తినకూడదు బాబూ’ అని చెప్తే, ‘అద్దుకుని తింటా, నీకేం’ అన్నాడట వెనకటికొకడు. మోడీ పని అలాగే ఉంది. 2002లో చేసిన వెధవపని కాస్తైనా సరిదిద్దుకోమని హైకోర్టు చెప్తే.. రాజ్యాంగం,లౌకిక వాదం లాంటి నంగనాచి మాటలు మాట్లాడుతూ సుప్రీంకోర్టుకి వెల్లాడు. అక్కడ బాగానే గడ్డి పెట్టారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s