పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్


మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని గ్రహిస్తే దాని అభివృద్ధి రూపాలను ‘ది ఎకనమిస్ట్’ అందించిన ఈ కార్టూన్ చక్కగా ప్రతిబింబిస్తోంది.

రాతి ఆయుధాలతో ప్రకృతితో పోరాటం ప్రారంభించిన మానవుడు, తమలో తాము వైరుధ్యాన్ని రగుల్చుకుని ప్రకృతిని ధ్వంసిస్తూ స్వయం విధ్వంసానికి కూడా తెగించాడు. ఫలితంగా వేలాది అంతర్యుద్ధాలు, స్వజాతి దోపిడీలు, విజాతి హననాలు, అణచివేతలు, జైత్రయాత్రలు సాగిస్తూ అనేక దశల మీదుగా మొరటు రాతి ఆయుధాన్ని చేతి వేళ్లలో ఒదిగిపోయే నాజూకు ఎలక్ట్రానిక్ మీట స్ధాయికి అభివృద్ధి చేసుకున్నాడు. తద్వారా పెన్ను విధ్వంసాన్ని రెప్పపాటులో సృష్టించగల మీటల్ని, కంప్యూటర్ కీల ని సిద్ధం చేసుకున్నాడు. ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని అంతర్గత వైరుధ్యాలను ఉపశపింపజేసుకుని తిరిగి ఉన్నత స్ధాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.

2 thoughts on “పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

  1. కార్టూన్ చాలా బాగుంది. యుద్ధోన్మాదం రూపం మార్చుకుంటోంది కానీ తగ్గటం లేదు. పైగా విధ్వంస తీవ్రత, వ్యాప్తి, ప్రమాదస్థాయి అపరిమితంగా పెరిగిపోతోంది!

  2. “ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని అంతర్గత వైరుధ్యాలను ఉపశపింపజేసుకుని తిరిగి ఉన్నత స్ధాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.”

    ఇక్కడ ప్రకృతితో పోరాటం అనే భావన నాకు అంత సరిగా అర్థం కాలేదండి. ప్రకృతిని జయించడం, ప్రకృతిని తన అవసరాలకు వినియోగించుకోవడం అనేవి రెండూ విరుద్ధ భావనలనుకుంటాను. ప్రకృతిని జయించడం అనే భావనను ప్రస్తుతం పర్యావరణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుంది.

    ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుకోవాలని మనిషి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ ప్రకృతి దానికి వ్యతిరేకంగా తన ప్రభావం చూపిందని, కసి తీర్చుకుందని ఎంగెల్స్ “వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర” అనే రచనలో చెప్పాడు.

    ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని …. తిరిగి ఉన్నతస్థాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం మిగిలే ఉందనడంలో ఏదో అపశబ్దం ధ్వనిస్తున్నట్లుంది.

    “మానవుడు, తమలో తాము వైరుధ్యాన్ని రగుల్చుకుని ప్రకృతిని ధ్వంసిస్తూ స్వయం విధ్వంసానికి కూడా తెగించాడు.”

    అర్థవంతమైన వ్యక్తీకరణ…

    కానీ, ‘తమలో తాము’ అన్నప్పుడు వాక్యం బహువచన రూపంలోనే ముగించాలనుకుంటాను. మానవులు…. తెగించారు… అని వాక్యం ఉంటే సరిపోయేది. లేదా ‘తనలో తాను’ అని మారిస్తే అలా కూడా సరిపోతుంది.

వ్యాఖ్యానించండి