స్వేచ్ఛా పతనంలో ‘రూపాయి’ -కార్టూన్


రూపాయి జారుడుకి అంతులేకుండా పోతోంది. అమెరికన్ డాలర్ కి రు. 57.01/02 పై (రాయిటర్స్) వద్దకు రూపాయి విలువ చేరింది. 2011 మధ్య నుండి ప్రారంభం అయిన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పతనాన్ని అడ్డుకోవడానికి మధ్య మధ్యలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు లు పలు చర్యలు చేపట్టినా అవేవీ పని చేయలేదు. 2012 లోనే దాదాపు 7 శాతం వరకూ రూపాయి పతనం అయిందని బిజినెస్ పత్రికలు లెక్క కట్టాయి. ఆసియాలో భారత కరెన్సీ ఉన్నంత బలహీనంగా మరే ఇతర ప్రధాన కరెన్సీ లేదని రాయిటర్స్ తెలిపింది. పతనం ఆపడానికి ఆర్.బి.ఐ సోమవారం మరో విడత చర్యలు ప్రకటిస్తుందని ప్రణబ్ ముఖర్జీ చెప్పాక సోమవారం ట్రేడింగ్ లో రూపాయి కొంత కోలుకున్నా చర్యలు ప్రకటించాక మళ్ళీ పడిపోయింది. అంటే ఆర్.బి.ఐ చర్యలు మార్కెట్లకు సంతృప్తి కలిగించలేదన్నమాట.

మార్కెట్లంటే మరెవరో కాదు. ఎఫ్.ఐ.ఐ లు (ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్), స్వదేశీ, విదేశీ ప్రవేట్ ఫండ్లు (సావరిన్ వెల్త్ ఫండ్స్, ఎండోమెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొ.వి) వివిధ దేశాల కరెన్సీలతో జూదం ఆడుకునే విదేశీ ప్రవేటు బ్యాంకులు, వాల్ స్ట్రీట్ తరహా కంపెనీలు ఇవే మార్కెట్లంటే. వీరిలో దేశ ప్రజలు ఏ కోశానా కనిపించరు. మధ్యాదాయ వర్గాల ప్రజలు షేర్ల రూపంలో, ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపంలో, బ్యాంకుల డిపాజిట్ల రూపంలో, చిట్ ఫండ్స్ చెల్లింపుల రూపంలో దాచుకున్న డబ్బుతో వీళ్ళు జూదం ఆడతారు. జనం డబ్బుతోనే జనం ప్రయోజనాలకు విరుద్ధంగా దేశ ఆర్ధిక పరిస్ధితిని తమకు అనుకూలంగా ప్రభావితం చేస్తుంటారు. అందుకే తాజాగా ఆర్.బి.ఐ ప్రకటించిన రక్షణ చర్యలు కూడా వారిని సంతృప్తి పరచడానికే ఉద్దేశించారు.

ఉదాహరణకి ప్రభుత్వ సావరిన్ బాండ్లలో ఎఫ్.ఐ.ఐ ల పెట్టుబడుల పరిమితిని 20 బిలియన్ డాలర్లకు పెంచుతూ ఆర్.బి.ఐ నిర్ణయం తీసుకుంది. సావరిన్ బాండ్లు ఆంటే ప్రభుత్వం చేసే అప్పు. ఎఫ్.ఐ.ఐ ల వద్ద తీసుకునే అప్పు పరిమితిని ప్రభుత్వం పెంచుకుంది. ఈ పరిమితి ఎంత పెంచితే దేశీయ సావరిన్ అప్పు పరిస్ధితి అంత అస్ధిరంగా మారుతుంది. ఎఫ్.ఐ.ఐ లు గుంపుగా తరలిపోవడం వల్లనే 1996 లో ఆసియా టైగర్లుగా పేరు గాంచిన ఆగ్నేయాసియా దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఎఫ్.ఐ.ఐ లను అతిగా రాకుండా చేయడానికి చైనా చర్యలు ప్రకటిస్తుంటే, ఇండియా మాత్రం మరింతగా ఆహ్వానిస్తోంది. ఇది కాక, రూపాయి అప్పులని తీర్చడానికి చేసే విదేశీ అప్పుల పరిమితిని ఆర్.బి.ఐ 10 బిలియన్ డాలర్లకు పెంచింది. స్వదేశీ అప్పులు తీర్చడానికి విదేశీ అప్పులు పెంచడం అన్నమాట. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగం, మౌలిక నిర్మాణ రంగాలలో ఉన్న కంపెనీలు కూడా విదేశీ అప్పులు తీసుకోవచ్చు. దానర్ధం దేశీయ కంపెనీలను అప్పుల రూపంలో విదేశీ కంపెనీలకు మరింతగా కట్టిపడేసే చర్య ఇది.

ఈ చర్యలన్నీ వాల్ స్ట్రీట్ తరహా కంపెనీలు, బ్యాంకులను ఇతర ద్రవ్య కంపెనీలనూ సంతృప్తి పరిచేవే తప్ప ప్రజల కోసం కాదు. కంపెనీల కోసం రూపాయి ని కాపాడుకునే రక్షణ చర్యలు ప్రకటిస్తారు గానీ దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వారి ఆదాయాల్లో మరింత భాగం కనీస అవసరాల సరుకుల కోసం వెళ్లిపోతోందన్న ధ్యాసే లేదు. రూపాయి పతనం వల్ల పెట్రోల్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్ ధరలు భారత దేశంలో మాత్రం పెరిగిపోయాయి. కారణం ఏమిటంటే రూపాయి పతనం. పతనాన్ని నేరుగా ప్రజలపై రుద్దిన ప్రభుత్వం అదే రూపాయి పతనం నుండి కంపెనీలను కాపాడడానికి బిలియన్ల కొద్ది డాలర్లను విదేశాలనుండి అప్పులు తేవడానికి సిద్ధపడింది. రూపాయి పతనం వల్ల కంపెనీలకు బహుమతులు రాగా, ప్రజలకు అధిక ధరలు. ఇలాంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఎలా అనగలం?

One thought on “స్వేచ్ఛా పతనంలో ‘రూపాయి’ -కార్టూన్

  1. ప్రభుత్వం ఎన్ని సార్లు చమురు ధరలు పెంచి ప్రజలని ఇంత బహిరంగంగా దోచుకుంటున్నా “నాకేమిటి? గ్లోబలైజేషన్ వల్ల నా చేతులలోకి సెల్‌ఫోన్‌లు వచ్చాయి కదా, అది చాలు” అని అనుకునే స్థితిలోనే ఉన్నారు మన దేశంలోని ఎలైట్ క్లాస్‌వాళ్ళు.

వ్యాఖ్యానించండి