తమ దేశ గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన టర్కీ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని సిరియా శుక్రవారం పొద్దు పోయాక ప్రకటించింది. ప్రతిగా ‘అవసరమైన చర్యలను నిశ్చయాత్మకంగా తీసుకుంటాం” అని టర్కీ ప్రకటించింది. ఇరు దేశాల ప్రకటనలతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఉద్రిక్తతను ఇంకా పొడిగించడానికి సిరియా మరింత ప్రయత్నం చేయబోదని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ సిరియాలో ‘కిరాయి తిరుగుబాటు’ కు సాయం చేయడానికి టర్కీ లో గూఢచార బలగాలతో తిష్ట వేసిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ఉద్రిక్తతలు రెచ్చగొట్టకుండా ఊరుకోవు.
వేగంగా అతి తక్కువ ఎత్తులో ఎగురుతున్న గుర్తు తెలియని గగనతల లక్ష్యాన్ని సిరియా మిలట్రీ గుర్తించిందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్ధ ‘సనా’ ను ఉటంకిస్తూ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తెలిపింది. “విమాన వ్యతిరేక ఫిరంగులతో సిరియా గగతల రక్షణ బలగాలు స్పందించి నేరుగా లక్ష్యాన్ని ఢీకొన్నాయి” అని సనా తెలిపింది. “సిరియా గగనతలంలోకి చొరబడిన లక్ష్యం టర్కీ మిలట్రీ విమానం అని తెలిసింది. అటువంటి కేసుల్లో ఎలా స్పందించాలో అదే విధంగా సమాధానం ఇవ్వబడింది” అని సనా తెలిపింది.
శుక్రవారం రాత్రి టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. సిరియా బలగాలు తమ విమానాన్ని కూల్చాయని తర్వాత ఒక ప్రకటన ద్వారా తెలిపాడు. ఇద్దరు పైలట్ల ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది. “సంబంధిత సంస్ధలు అందజేసిన డేటా ప్రకారమూ, సిరియాతో కలిసి ఉమ్మడిగా జరిపిన వెతుకులాట ద్వారానూ సిరియా మా విమానం కూల్చిందని అర్ధమ్మయింది” అని టర్కీ ప్రకటన తెలిపింది. అవసరమైన చర్యలు తీసుకుంటామని టర్కీ చెప్పినప్పటికీ అవేమిటో చెప్పలేదు. అసలు తమ మిలట్రీ విమానం సిరియాలో ఎందుకు జొరబడిందో చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు.
సిరియాలో సాయుధ మూకలను చొప్పించి కిరాయి తిరుగుబాటు ను ప్రోత్సహిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. సిరియా సరిహద్దుకు సమీపంలో మిలట్రీ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి సౌదీ అరేబియా, ఖతార్, యు.ఎ.ఇ, బహ్రెయిన్ లాంటి దేశాల నుండి సేకరించిన కిరాయి మూకలకు శిక్షణ ఇస్తున్నట్లు సిరియా ఆరోపిస్తున్నది. దానికి సంబంధించి పత్రికలు కూడా అనేక దృష్టాంతాలు వెల్లడి చేశాయి. కిరాయి తిరుగుబాటు లో పాత్రధారి అయిన సిరియన్ నేషనల్ ఆర్మీ కి టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ప్రధాన కార్యాలయం ఉంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు చెందిన మిలట్రీ గూఢచార బలగాలు కిరాయి మూకలకు శిక్షణ ఇస్తున్నట్లు కూడా వెల్లడయింది. సిరియాలో టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతూ పౌరులను ఊచకోత కోస్తున్న కిరాయి మూకలకు సి.ఐ.ఎ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని శుక్రవారం న్యూయార్క్స్ టైమ్స్ పత్రిక వెల్లడించింది కూడా. టైమ్స్ వెల్లడి తర్వాత తాము మానవతా సాయం మాత్రమే చేస్తున్నామని అమెరికా తమ ఆయుధ సరఫరాని సమర్ధించుకుంది.
కూలిపోయిన విమానం వివరాలు టర్కీ చెప్పలేదు. అయితే అది ఘూఢచార విమానమేనని టర్కీ టి.వి లు చెప్పాయని ‘ది హిందూ’ తెలియజేసింది. టర్కీకి చెందిన ‘ఎఫ్-4 ఫాంటమ్’ ఫైటర్ జెట్ విమానాన్ని సిరియా కూల్చివేసినట్లు తెలుస్తోందని బి.బి.సి తెలిపింది. విమానం కూల్చివేత పట్ల సిరియా విచారం వ్యక్తం చేసినట్లు టర్కీ ప్రధాని ప్రారంభంలో చెప్పినట్లు కూడా బి.బి.సి తెలిపింది. అయితే, ఎమర్జెన్సీ సమావేశం అనంతరం సిరియా విచారాన్ని పట్టించుకోనట్లుగా టర్కీ ప్రధాని స్వరం ధ్వనించిందని ఆ సంస్ధ తెలిపింది.