శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అధికారంలో ఉన్న సెక్షన్, ప్రత్యర్ధి పాలకవర్గానికి కూడా ఆర్ధిక, వాణిజ్య వెసులుబాట్లు కల్పిస్తే అది ప్రజలందరికీ దక్కిన ప్రజాస్వామ్యంగా ప్రచారం పొందుతోంది. అలా కాక ఆర్ధిక, వాణిజ్య అవకాశాలన్నింటినీ పాలక వర్గాలలోని ఒకే సెక్షన్ బలవంతంగా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రజలందరికీ నియంతృత్వంగా ప్రజలముందు ప్రదర్శితమవుతోంది. నిజమైన అర్ధంలో ప్రజలవైపు నుండి చూస్తే ఈ రెండు సెక్షన్ల పాలనలో ప్రజలు ఎప్పుడూ పాలకవర్గాల నియంతృత్వ పీడితులే.
పాకిస్ధాన్ లో మిలట్రీ వెనుక ఉన్న పాలకవర్గాలే ఆదినుండీ ఆధిపత్యం వహిస్తున్నాయి. వారికి పోటీగా ఎదిగిన పాలకవర్గాలు ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ ముసుగు వేసుకుని మిలట్రీ వెనుక ఉన్న డామినెంట్ పాలకవర్గాలతో తలపడుతున్నాయి. పాకిస్ధాన్ ఆర్ధిక వనరులను సొంతం చేసుకోవడానికి ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణే వారి ముసుగులైన ‘మిలట్రీ’, ‘ప్రజాస్వామ్యం’ ల మధ్య జరుగుతున్న ఘర్షణ గా ప్రజలు ముందు కనపడుతోంది. మిలట్రీ వెనుక ఉన్న పాలకవర్గాలు మరోసారి ఆధిపత్యం నిరూపించుకున్న ఫలితంగానే పాక్ ప్రధాని ‘యూసఫ్ రజా గిలాని’ పదవీచ్యుతుడు కావలసి వచ్చింది. పాక్ కోర్టులు సైతం మిలట్రీ మద్దతుగల పాలకవర్గాలకే దన్నుగా నిలిచిన ఫలితమే గిలాని పదవీచ్యుతి. తమతో తెగేదాకా లాగినట్లయితే ఏం చేయడానికైనా సిద్ధమని ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో ఉన్న పాలకవర్గాలకు, ‘మిలట్రీ’ ముసుగులో ఉన్న పాలకవర్గాలు కోర్టు తీర్పు ద్వారా హెచ్చరిక పంపారు.
ప్రధాని పదవికి గిలానీ అనర్హుడంటూ తీర్పు ఇవ్వడం ద్వారా పాక్ సుప్రీం కోర్టు తన పరిమితులను అధిగమించిందని భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ‘మార్కండేయ కట్జూ’ వ్యాఖ్యానించాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైన కార్యనిర్వాహక వ్యవస్ధ (బ్యూరోక్రసీ), శాసన వ్యవస్ధ (పార్లమెంటు), న్యాయ వ్యవస్ధ (కోర్టు)ల మధ్య సమాన అధికారాలు ఉంటాయనీ, పార్లమెంటు అధికారాల్లో న్యాయ వ్యవస్ధ జోక్యం తగదనీ ఆయన అన్నాడు. ప్రధాని కొనసాగడమా లేదా అన్నది పార్లమెంటుకే వదిలేయాలి తప్ప ఒక మూల స్తంభంలో మరొక మూల స్తంభం జోక్యం చేసుకోవడం అంటే మూల స్తంభాల తగవుగా అది మారిపోతుందనీ, దానివల్ల వ్యవస్ధ కూలిపోతుందనీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సూత్రీకరిస్తుంది. ఈ సూత్రాన్ని పాక్ కోర్టు ఉల్లంఘించిందన్నది కట్జూ విశ్లేషణ. అయితే మూలస్తంభాలుగా పేర్కొంటున్న వివిధ అంగాల వెనుక చేరిన పాలక వర్గాలు ఇందులో ప్రజల పాత్రను నామమాత్రం చేశాయన్నది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఆ దృష్ట్యా ఈ మూల స్తంభాలు ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి పాలకవర్గాల ఘర్షణకు వేదికలుగా మారాయి.
(కార్టూన్: ది హిందూ)
