ఎంబసీ నుండి బైటికి వస్తే అస్సాంజ్ అరెస్టు ఖాయం


జూలియన్ అస్సాంజ్ ఈక్వెడార్ ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేయడానికి లండన్ పోలీసులు ఎంబసీ ముందు కాపు కాశారు. ఎంబసీ లోకి ప్రవేశించడం ద్వారా కోర్టు బెయిల్ షరతులలో ఒకటయిన ‘రాత్రి పూట కర్ఫ్యూలో ఉండవలసిన’ నిబంధనను జులియన్ ఉల్లంఘించాడని లండన్ పోలీసులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకూ తనకు నిర్దేశించిన ఇంటినుండి అస్సాంజ్ బైటికి రాకూడదనీ, కానీ ఆయన మంగళవారం మొత్తం ఈక్వెడార్ ఎంబసీలో గడిపాడనీ, ఆందువల్ల అరెస్టు చేయవలసి ఉందనీ లండన్ పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల్లో స్వీడన్ తరలింపు ఖాయం అనుకుంటుండగా లండన్ లో ఈక్వెడార్ ఎంబసీ శరణు వేడిన జూలియన్ అస్సాంజ్ ఎత్తుగడ పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈక్వెడార్ ఎంబసీ లో కొనసాగుతూ ‘అమెరికా కు అప్పగించకుండా ఉండేలా’ స్వీడన్ తో బేరసారాలు సాగించే ఎత్తుగడతో జులియన్ ఎంబసీ శరణు వేడినట్లు ఆయన స్నేహితులు చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. మానవ హక్కుల లాయర్, అస్సాంజ్ లీగల్ టీం లో మాజీ సభ్యురాలయిన హెలెనా కెన్నెడీ ఈ విషయం చెప్పినట్లు పత్రిక తెలిపింది. స్వీడన్ అధికారుల నుండి హామీ లభించినట్లయితే ఆసాంజ్ స్వయంగా స్వీడన్ వెళ్లవచ్చని హెలెనా తెలిపింది.

రాజకీయ ఆశ్రయం కోసం అస్సాంజ్ చేసుకున్న దరఖాస్తును తాము ‘అధ్యయనం చేస్తున్నామనీ, విశ్లేషిస్తున్నామనీ’ ఈక్వెడార్ ప్రకటించినట్లు బి.బి.సి తెలిపింది. బ్రిటన్, స్వీడన్, అమెరికా లతో సంప్రదించాక అస్సాంజ్ దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఈక్వెడార్ చెప్పినట్లు కూడా ఆ సంస్ధ తెలిపింది. స్వీడన్ వెళ్ళినట్లయితే ఆ దేశం తనను అమెరికాకి అప్పగించవచ్చని జులియన్ అనుమానిస్తున్నాడు. జులియన్ ను మరణ శిక్షతో శిక్షించగల కేసులతో అమెరికా సిద్ధంగా ఉన్నట్లు పత్రికలు వెల్లడి చేశాయి. జులియన్ అస్సాంజ్ పైన స్వీడన్ పోలీసులు ఇంతవరకూ ఎటువంటి నేరారోపణలనూ నమోదు చేయలేదు. కేవలం ప్రశ్నించడానికి మాత్రమే స్వీడన్ రావాలని వారు కోరుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అంత సింపుల్ గా మాత్రం కనిపించడం లేదు.

బ్రిటన్ లో అస్సాంజ్ కు దాదాపు న్యాయ అవకాశాలన్నీ అడగుంటిపోయాయి. యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కోర్టు లో అప్పీలు చేసుకునే ఒక్క అవకాశం మాత్రమే ఆయనకి మిగిలి ఉండి. అయితే అది జూన్ 28 లోపు చేయవలసి ఉండని బి.బి.సి తెలిపింది. హ్యూమన్ రైట్స్ కోర్టుకు వెళ్ళేదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. ఆ అవకాశాలను అస్సాంజ్ పరిశీలిస్తున్నట్లు మాత్రమే పత్రికలు తెలిపాయి. అమెరికాలో “అమానవీయమైన లేదా హీనపరిచే (degrading) ట్రీట్ మెంట్ గానీ లేదా వివక్షాపూరితమైన త్రయల్స్ ఎదుర్కొనే అవకాశం గానీ ఉన్నట్లయితే ఇ.యు హ్యూమన్ రైట్స్ కోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలుస్తోంది.

జులియన్ అస్సాంజ్ ను అరెస్టు చేయడానికి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు సిద్ధపడడం “another extraordinary twist in a truly extraordinary tale” గా బి.బి.సి లీగల్ కరెస్పాండెంట్ క్లైవ్ కోల్ మన్ అభివర్ణించాడు. ఈక్వెడార్ ‘రాజకీయ శరణు’ మంజూరు చెయ్యాలంటే, తన రాజకీయ భావాల కారణంగా ఆస్ట్రేలియాలో వేధించబడుతున్నట్లుగా అస్సాంజ్ సాక్ష్యాలు సమర్పించవలసి ఉంటుంది. అయితే జులియన్, ఆస్ట్రేలియా నుండి నేరుగా అటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సూచనలేవీ లేవు. కనుక ఈక్వెడార్ ప్రభుత్వాన్ని ఒప్పించడం కూడా అస్సాంజ్ కి కష్టం కావచ్చు.

తాను వేధింపులకు గురవుతున్నట్లుగా ఈక్వెడార్ అధ్యక్షుడు కొర్రీయా కు అస్సాంజ్ లేఖ రాసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈక్వెడార్ లో అమెరికా రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కి రాసిన లేఖలో ‘ఈక్వెడార్ పోలీసులలో అవినీతి విస్తృతంగా ఉంది’ అని రాసినట్లుగా వికీలీక్స్ వెల్లడించిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయింది. ఈ వెల్లడి తర్వాత ఏప్రిల్ 2011 లో అమెరికా రాయబారిని ఈక్వెడార్ ప్రభుత్వం బహిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘రష్యా టుడే’ ఛానెల్ లో ఈక్వెడార్ అధ్యక్షుడు కొర్రీయాను అస్సాంజ్ స్వయంగా ఇంటర్వ్యూ చేసినట్లు బి.బి.సి తెలిపీంది. ఈ సందర్భంగానే ఇరువురు మధ్య ‘సహానుభూతి’ పెంపొందినట్లు ఈక్వెడార్ పత్రికను ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.

వ్యాఖ్యానించండి