జూలియన్ అస్సాంజ్ మరో పాచిక, ఈక్వెడార్ ఎంబసీ లో ఆశ్రయం


ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్న జూలియన్ అస్సాంజ్, తనను స్వీడన్ కు తరలించాలన్న లండన్ సుప్రీం కోర్టు తీర్పుని ఎదుర్కోవడానికి మరో పాచిక విసిరాడు. అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్న ఈక్వెడార్ తనకు ఆశ్రయం ఇవ్వాలని జూలియన్ దరఖాస్తు చేశాడు. అందులో భాగంగా బ్రిటన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని శరణువేడాడు. ఈక్వెడార్ అధ్యక్షుడు గతంలో జూలియన్ కు ఆశ్రయం ఇవ్వజూపిన నేపధ్యంలో అస్సాంజ్ విసిరిన పాచిక సంచలనం కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న పరిస్ధితి మారాలని కాంక్షిస్తున్న ఈక్వెడార్, జూలియన్ దరఖాస్తుకు ఇంకా స్పందించవలసి ఉంది.

జలియన్ దరఖాస్తును పరిశీలిస్తున్నట్లు ఈక్వెడార్ విదేశాంగ మంత్రి రికార్డో పాటినో ప్రకటించాడు. వామపక్ష ప్రభుత్వంగా పరిగణించబడుతున్న ఈక్వెడార్ ప్రభుత్వం తరచుగా అమెరికాతో ఘర్షణ పడుతున్నట్లుగా వార్తలు వస్తుంటాయి. లాటిన్ అమెరికా ఖండంలో చాలా చిన్న దేశమైన ఈక్వెడార్ ప్రజలు అమెరికా దుర్మార్గాలను అనేకం ఎదుర్కొన్నారు. లాటిన్ అమెరికాను తన పెరటి దొడ్డిగా భావిస్తూ అమెరికా సాగించిన వ్యాపార, మిలట్రీ దాడులపై వారు వీరోచితంగా పోరాడారు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలలో అమెరికా సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలను వెల్లడి చేసిన వికీ లీక్స్ అధినేత జూలియన్, అలాంటి దేశంలో రక్షణ కోరడం అత్యంత సహజ పరిణామం. ఈక్వెడార్ ఎంబసీ లో రక్షణ కోరిన అస్సాంజ్ కోర్టు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లా కదా అన్నది తెలియలేదు.

బ్రిటన్ లో జూలియన్ కి చట్టపరమైన అవకాశాలన్నీ అడుగంటిపోయాయి. స్వీడన్ లో ఇద్దరు మహిళలు మోపిన అత్యాచారం కేసులను జూలియన్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేసులలో ప్రాధమిక సాక్ష్యాధారాలు లేవని మొదట తేల్చిన స్వీడన్ పోలీసులు తనను ప్రశ్నించమని జిలియన్ కోరినా అవసరం లేదని చెప్పారు. స్వీడన్ నుండి బ్రిటన్ కి వచ్చాక మరో నగరానికి చెందిన పోలీసులు మళ్ళీ అవే కేసులు మోపి అతన్ని ‘ప్రశ్నించే నిమిత్తం’ స్వీడన్ కు పంపాలని బ్రిటన్ ని కోరారు. ఈ మార్పు వెనుక అమెరికా ఒత్తిడి ఉందని జూలియన్, అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జూలియన్ పైన రహస్యంగా కేసు మోపి, అతని పరోక్షంలోనే పూర్తి జ్యూరీ చేత అమెరికా విచారణ జరిపిస్తున్నట్లు వెల్లడయిన నేపధ్యంలో జిలియన్ అనుమానాలు ఆధారరహితమేమీ కావు.

వారం రోజుల క్రితం జూలియన్ ను స్వీడన్ కి తరలించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. రెండు సంవత్సరాల పాటు సాగిన విచారణా కాలంలో జిలియన్ అస్సాంజ్ దాదాపు ‘గృహ నిర్బంధం’ లో గడిపాడు. తీర్పు అనంతరం కేసును మళ్ళీ విచారించాలని జూలియన్ కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. పునర్విచారణకు తిరస్కరించిన అనంతరం ఇక జూలియన్ ని తరలించడమే మిగిలి ఉంది. ఈ లోపే జిలియన్ అస్సాంజ్ బ్రిటన్ లోని ఈక్వెడార్ ఎంబసీ శరణు కోరాడు. తనకు ఈక్వెడార్ లో ఆశ్రయం కల్పించవలసిందిగా దరఖాస్తు చేశాడు.

ఈక్వెడార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ ఎంబసీలోనే జూలియన్ కొనసాగుతాడు. అయితే తాజా పాచిక ద్వారానైనా జూలియన్ రక్షణ పొందగలడా లేదా అన్నది స్పష్టం కాలేదు. ‘ది హిందూ’ పత్రిక ప్రకారం బ్రిటన్ లోని సంబంధిత నిపుణుల అభిప్రాయాల మేరకు జూలియన్ పాచిక పారే అవకాశాలు పెద్దగా లేవు. అమెరికాతో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు జూలియన్ పై కక్ష కట్టి ఉన్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఈక్వెడార్ ప్రభుత్వం ముందు తక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్వెడార్ లో మూడొంతుల కంటే తక్కువ మందికే ఇంటర్నెట్ వినియోగం అందుబాటులో ఉందని ‘ది హిందూ’ తెలిపింది. అయితే జూలియన్ రక్షణ కోరడానికి అదేమీ అడ్డంకి కాదన్నది స్పష్టమే. రాజకీయంగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈక్వెడార్ జూలియన్ కి ఆశ్రయం ఇచ్చినట్లయితే అది పెద్ద సంచలనమే కాగలదు. రక్షణ ఇవ్వజూపడం, నిజంగా రక్షణ ఇవ్వడం ఒకటా కాదా అన్నది, జూలియన్ కి సంబంధించి, ఈక్వెడార్ ప్రభుత్వమే చెప్పవలసి ఉంది.

“అస్సాంజ్ లక్ష్యానికి గొప్ప మద్దతుగా నిలిచిన కొద్ది దేశాల్లో ఈక్వెడార్ ఒకటి. (ప్రపంచ రాజకీయాల సమతూకంలో) యధాతధ పరిస్ధితికి జూలియన్ గట్టి విమర్శకుడుగా కొర్రీయా (ఈక్వెడార్ ఆధ్యక్షుడు) భావిస్తున్నాడు. అతను (జూలియన్) అమెరికానే సవాలు చేస్తున్నాడు. కొర్రీయా దానిని ఇష్టపడతాడు” అని ఈక్వెడార్ లోని ఫ్లాక్సో యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రేస్ జరమిల్లో వ్యాఖ్యానించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.

“అస్సాంజ్ దరఖాస్తు పరిశీనలో ఉన్న ఈ సమయంలో అతను ఈక్వెడోరియన్ ప్రభుత్వ రక్షణలో మా ఎంబసీ లోనే కొనసాగుతాడు” అని ఈక్వెడార్ ఎంబసీ ప్రకటించింది. సమస్యను పరిష్కరించడానికి ఈక్వెడోరియన్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. జూలియన్ ఈక్వేడార్ లో రాజకీయ ఆశ్రయం కోరినట్లు వికీలీక్స్ సంస్ధ ట్విట్టర్ పోస్టు ద్వారా ధృవీకరించింది. ఆశ్రయం ఇవ్వవలసిందిగా జూలియన్ వ్యక్తిగతంగా ఈక్వెడార్ అధ్యక్షుడు కొర్రీయాను కోరాడని ఆ దేశ విదేశాంగ మంత్రి పాటినో కూడా ధృవీకరించాడు.

జూలియన్ అస్సాంజ్ ఆస్ట్రేలియా దేశస్ధుడు. అయితే జూలియన్ కి రక్షణ కల్పించడానికి ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్ గతంలో నిరాకరించింది. అస్సాంజ్ ను విదేశాల చట్టాల నుండి కాపాడడం తమ వల్ల కాదని ఆమె ప్రకటించింది. అయితే అది వాస్తవ విరుద్ధం. దేశ పౌరులు విదేశాల్లో న్యాయ సంబంధమైన చిక్కుల్లో ఇరుక్కున్నపుడు ప్రతి దేశమూ సహాయానికి ముందుకు వస్తుంది. భారత జాలర్లను కాల్చి చంపిన ఒక ఇటలీ ప్రవేటు నౌక గార్డులను భారత దేశ కోర్టుల విచారణ నుండి కాపాడడానికి ఇటలీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే ఇలాంటి రక్షణలు వాణిజ్య కంపెనీలకూ, వాటి ఉద్యోగులకూ ఇచ్చినంత త్వరగా సాధారణ పౌరులకు ప్రభుత్వాలు ఇవ్వజూపడం కూడా అరుదైన విషయమేనని చెప్పుకోవచ్చు. తమ యజమాని అమెరికా ఆధిపత్యానికి కి వ్యతిరేకంగా పని చేస్తూ దాని దుర్మార్గాలను వెల్లడిస్తున్న జూలియన్ లాంటి వ్యక్తి తమ దేశ పౌరుడే అయినా రక్షించడానికి ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుందని భావించడం వృధా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s