పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నందున ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏదీ లేకపోయినా రాజకీయ సంక్షోభ పరిస్ధుతులను ఎదుర్కోవడానికి పార్టీకి నమ్మకమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉండవలసిన అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించినట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు.
మరో అనుమానం కూడా లేకపోలేదు. వివిధ కారణాల వల్ల ఆర్ధిక సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి. రిటల్ రంగం ప్రవేటీకరణ, ఇన్సూరెన్స్ ప్రవేటీకరణ వాటా పెంపు లాంటి బిగ్ టికెట్ బిల్లులు అటకెక్కాయి. కాంగ్రెస్ లోనే సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకత ఉందని కొద్ది రోజుల క్రితం ఎస్ & పి రేటింగ్ సంస్ధ ఎత్తిపొడిచింది. పశ్చిమ దేశాల బహుళ జాతి కంపెనీలకు కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తికి ఎస్ & పి ఎత్తిపొడుపు బలమైన సంకేతం. ఓల్డ్ గార్డ్ గా పేరుపడి, నెహ్రూవియన్ విధానాల మద్దతుదారుగా ప్రణబ్ ముఖర్జీ, బిగ్ టికెట్ ఆర్ధిక సంస్కరణల బిల్లుకు ఒకింత ఆటంకంగా పరిణమించడం వల్లనే రాష్ట్రపతి ఎన్నికలను అవకాశంగా తీసుకుని ఆయనని సాగనంపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
యూరోప్ రుణ సంక్షోభం, అమెరికా స్లో రికవరీ ల వల్ల బహుశజాతి కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులను ఇండియా లాంటి చోట్ల వనరులను కొల్లగొట్టడం తీవ్రం చేయడం ద్వారా అధిగమించాలని ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. అలాంటి పరిస్ధితుల్లో ప్రణబ్ లాంటి ఓల్డ్ గార్డ్ లు ఆర్ధిక శాఖ లాంటి కీలక మంత్రిత్వ శాఖలను పట్టుకుని వేలాడడం అమెరికా, పశ్చిమ దేశాలకు ఆమోదయోగ్యం కాదు. ‘అసలు ఈ ప్రణబ్ ముఖర్జీ ఎవరు? మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భారత ఆర్ధిక మంత్రి ఎందుకు కాలేదు?’ (వికీ లీక్స్) అంటూ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ చిరాకుపడిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
ద్రవ్యోల్బణం, అధిక ధరలు, జిడిపి వృద్ధి క్షీణత, కాంగ్రెస్ అంతర్గత సమస్యల పరిష్కారం, అనేక పార్లమెంటరీ కమిటీల సారధ్యం లాంటి ముళ్లు దండిగా ఉన్న కుర్చీకి అలవాటు పడిన ప్రణబ్ ముఖర్జీ ఒక్కసారిగా పూల పాన్పుపై పవళించవలసి రావడం కష్టమేనని ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఈ విధంగా కార్టూనికరించాడు.
–
సోనియా: మొదట్లో కష్టమే. కానీ, అలవాటైపోతుందిలెండి!
–
