18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒక లోక్ సభ నియోజకవర్గానికీ జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ చూసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీల నుండీ వైకాపా ఓట్లు గుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువగా ఈ సారి కాంగ్రెస్ కి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఓట్లు చేజిక్కించుకున్న వైకాపా తెలుగుదేశం నుండి కూడా ఓట్లను గణీయంగానే లాక్కోవడం విశేషం.
2009 లో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ప్రరాపా లకు కలిపి మొత్తం 16.13 లక్షలు ఓట్లు రాగా, ఈ రెండు పార్టీలు విలీనం అయ్యాక జరిగిన 2012 ఉప ఎన్నికల్లో కేవలం 6.10 లక్షలు మాత్రమే ఓట్లు సంపాదించాయి. 2009 లో గెలిచిన ఎమ్మెల్యేలే ప్రస్తుతం వైకాపా తరపున పోటీ చేసినందున నిజానికి వారి స్ధానాలు వారికి దక్కాయని మాత్రమే చప్పుకోవచ్చు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్సే అదనంగా రెండు స్ధానాలు లాభపడిందని చెప్పవచ్చు. కానీ తెలుగు దేశం పరిస్ధితే అర్ధం కాకుండా ఉంది. 2009 లో 7.84 లక్షల ఓట్లు సాధించిన తెదేపా, 2012 లో 6.66 లక్షలు మాత్రమే సాధించింది.
ప్రజారాజ్యం పార్టీ కి పడిన ఓట్లు కాంగ్రెస్ కి ఎందుకు తరలిపోలేదు? పాయకాపురం, పోలవరం, పత్తిపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, అనంతపూర్, తిరుపతి, పర్కాల లలో 2009 లో ప్రరాపా కి వచ్చినన్ని ఓట్లు కూడా 2012 లో కాంగ్రెస్ కి రాలేదు. అంటే చిరంజీవి చేరిక వల్ల కాంగ్రెస్ కి అదనంగా చేకూరిన లాభం ఏమీ లేనట్లేనా? ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ పైన అభిమానంతో నేరుగా ఓట్లు వేయడం, ఆ వ్యక్తి లేదా ఆ పార్టీ చెప్పిన లేదా బలపరిచిన వ్యక్తికి (పార్టీకి) ఓట్లు వేయడం రెండూ వేరు వేరని దీని ద్వారా స్పష్టం అవుతోంది.
ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరగడం ఒక విశేషంగా నిలిచింది. ఎప్పుడూ పోటీ చేసే పార్టీలయితే పెద్దగా ఓటర్లకు ఆసక్తి ఉండేది కాదేమో. పాత సారాతోనే అయినా, కొత్త సీసాతో పోటీ చేసిన వైకాపా వల్ల ఓటర్ల అదనపు సమీకరణ జరిగినట్లు కనిపిస్తోంది. ఓటర్లు భారీగా క్యూలు కట్టడం చూసి కొన్ని చానెళ్లు, దానిని ‘బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ గా అభివర్ణించడానికి కుతూహలం ప్రదర్శించాయి. కానీ డబ్బు, బంగారం, కులం, మతం, తాగుడు లాంటి అప్రజాస్వామిక అంశాలతో పాటు అవసరంలేని సానుభూతి కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఎన్నికల్లో ఓటర్ల క్యూలలో ప్రజాస్వామ్యాన్ని వెతకటం వృధా ప్రయాసే.
పై పట్టిక ను ‘ది హిందూ’ అందించింది.
మొన్న ఆటోలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఒక ప్రయాణికునితో అంటోంటే విన్నాను. సానుభూతి అనేది ఒక సారే ఉంటుంది కానీ ఎల్లప్పుడూ ఉండదు అని ఆ డ్రైవర్ అన్నాడు. అయినా 2014లో కాంగ్రెస్‌కి ఎన్నికలు డిఫికల్ట్ టాస్క్ అవుతాయి అని అన్నాడు.
నా అంచనాలో – 2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించే అమాయకుడే ఉండడు. కాంగ్రెస్ కి అభ్యర్థులు దొఱకడమే కష్టమవుతుంది. అప్పటికి 90 శాతం మంది కాంగీయులు వైకాపాలో దూరిపోయి ఉంటారు. కాబట్టి హోరాహోరీ పోటి ప్రధానంగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే నెలకొంటుంది. దివంగత వై.ఎస్. చూపిన మత సంకుచితత్వాన్ని జగన్ చూపకపోతే ఆ తరువాత అతనికి రెండో హయాం కూడా ఇస్తారు ప్రజలు.
జగన్ అంత సులభంగా గెలవడు. సానుభూతి అనేది ఒక సారి పని చేస్తుంది కానీ “మా నాన్నగారు చనిపోవడం వల్ల నన్ను కేసులలో ఇరికించారు” అని పది సార్లు చెపితే విన్నవాళ్ళకి బోర్ కొడుతుంది.