ఎస్ & పి రేటింగ్ సంస్ధ పరిమితులను దాటుతోంది. ఎకనమిక్ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తూ పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులకు మార్గదర్శకత్వం వహించే పాత్ర పరిమితులను దాటిపోయింది. ఇండియా క్రెడిట్ రేటింగ్ ని ‘ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్’ కంటే తగ్గిస్తామని హెచ్చరిస్తూ ఈ కంపెనీ, భారత ప్రభుత్వ నాయకత్వ సామర్ధ్యం పై కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది. జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలను మన్మోహన్ నాయకత్వంలోనూ, సోనియా గాంధి చొరబాటులోనూ వెతకడానికి ప్రయత్నించింది. రేటింగ్ ఇచ్చే పేరుతో భారత దేశ సార్వభౌమ నిర్ణయాలను తప్పుపట్టే సాహసానికి పూనుకుంది.
స్టాండర్డ్ & పూర్ కంపెనీ కేవలం ఒక రేటింగ్ కంపెనీ. జాతీయ, అంతర్జాతీయ మదుపుదారులు ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చో, ఏ దేశ సావరిన్ అప్పు బాండ్లను కొనుగోలు చేయవచ్చో ఇత్యాది విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి కంపెనీలు ఇచ్చే రేటింగ్ లను ఒక మార్గదర్శకంగా చూస్తారు. అంటే ఆయా కంపెనీల, దేశాల ఆర్ధిక ప్రమాణాలు, మార్పులు, నిర్ణయాలను ఇవి పరిగణిస్తాయని భావిస్తాము. కాని మూడు రోజుల క్రితం ఎస్ & పి వెలువరించిన నివేదిక చూస్తే అది తన పరిమితులను దాటిపోయిందని అర్ధం అవుతుంది.
ఆర్ధిక సరళీకరణ ముందుకుపోవడానికి రాజకీయ సమస్యలు ఎదురుకావడానికి, కేంద్ర ప్రభుత్వంలోని నాయకత్వం స్వభావమే కీలకంగా పని చేస్తున్నదే తప్ప ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్లనో, కూటమి మిత్రులు గోల చేయడం వల్లనో కాదని, ఎస్ & పి చొరబాటు ధోరణి ప్రదర్శించింది. ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయిందనీ, పెద్ద ఎత్తున సరళీకరణ చేపట్టడానికి అధికార పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదనీ చెబుతూ రాజకీయ పార్టీల నాయకత్వంలోకి కూడా చొరబడింది.
అంతటితో ఆగకుండా రాజకీయంగా ‘శక్తివంతమైన’ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ‘నియమించబడిన’ ప్రధాన మంత్రి ల మధ్య అధికారాల విభజన వల్ల ‘విధానాల నిర్ణయాల చట్రం బలహీనపడింది’ అని పేర్కొంది. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధి వద్ద, కేంద్ర కేబినెట్ లో ఎటువంటి పదవీ లెకుండానే, అపరిమితమైన రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉండగా, ‘ఎన్నుకోబడని’ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కి ఎటువంతి రాజకీయ పునాది లేకుండా పోయిందని ఎస్ & పి వ్యాఖ్యానించింది.
ఎస్ & పి నివేదిక భారత దేశ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారాలు, రాజకీయ ఆధికారం అన్నీ లోబడి ఉండాలని పరోక్షంగా ప్రతిపాదిస్తోంది. రాజకీయ పార్టీల అంతర్గత నిర్ణయాలలోకి కూడా చొరబడాలని ప్రయత్నిస్తోంది. ఎవరు ప్రధానిగా ఉండాలో, ప్రధాని, సోనియాల వద్ద ఏయే అధికారాలు ఉండాలో తానే నిర్ణయించాలని ఉబలాటపడుతోంది. దేశీయ వనరులమీద, అశేష మానవ వనరుల మీద ఆధారపడకుండా, ‘పెట్టుబడులు, పెట్టుబడులు’ అంటూ భారత ప్రభుత్వ నాయకత్వం అంగలార్చడం వల్ల ఏర్పడిన దుష్పరిణామం ఇది. ప్రజల ప్రయోజనాల కంటే కంపెనీల ప్రయోజనాలను ఉన్నత స్ధాయిలో చేర్చుతూ పశ్చిమ దేశాల ఆదేశాలకు ‘జీ హుకుం’ చెప్పడం వల్ల వచ్చిపడిన దుష్ఫలితం ఇది.

S&P నాటకాల గురించి నీహారిక గారి ప్లస్‌లో చదివాను: https://plus.google.com/103145057876600078379/posts/BbR6b3cQt5D
Very informative and thought provoking write-up
మూర్తిగారూ, ధన్యవాదాలు, మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను. ఇంతకుముందు కూడా ఓసారి చూశాను. కానీ పేరూ అదీ చూడలేదు. చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పడం బాగుంది.