జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ


jagan_arrestప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పైన దాఖలైన రెండవ, మూడవ ఛార్జీ షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనపై పి.టి (ప్రిసనర్ ట్రాన్సఫర్) వారంట్ జారీ చేసి సోమవారం ఇతరులతో పాటు కోర్టుకి రప్పించుకుంది. మే 27 నుండి జగన్ చంచల్ గూడ జైల్లో కొనసాగుతున్న సంగతి విదితమే.

నార్కో పరీక్షలు?

జూన్ 3 నుండి 7 వ తేదీ వరకూ జగన్ ని 5 రోజుల పాటు కోర్టు సి.బి.ఐ కస్టడీకి అప్పగించింది. కస్టడీ చివరి రోజున మరో రెండు రోజుల కస్టడీకి లంచ్ అవర్ మోషన్ ద్వారా సి.బి.ఐ కోరినప్పటికీ కోర్టు నిరాకరించి తదుపరి రోజున రెగ్యులర్ పిటిషన్ వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో రెండు రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతి మంజూరు చేసింది.

అయితే విచారణ సందర్భంగా జగన్ సహకరించలేదనీ, అంతా విజయసాయి రెడ్డి కే తెలుసని చెప్పి తప్పించుకున్నాడనీ సి.బి.ఐ కోర్టులో చెబుతూ ‘నార్కో అనాలసిస్’ లాంటి శాస్త్రీయ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరిందని ఈ టీవి, ఎబిఎన్ టి.వి లాంటి చానెళ్లు తెలిపాయి. అనేక ప్రశ్నలకు జగన్ నిజాలు చెప్పడానికి బదులు, తెలివిగా సమాధానాలు చెప్పాడని సి.బి.ఐ కోర్టులో ఆరోపించింది. నార్కో పరీక్షలకు సంబంధించి ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

జగన్ కి జైలే ఇష్టం

జగన్ రిమాండ్/బెయిల్ కి సంబంధించి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎం.పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఆసక్తి కరమైన సంగతి తెలిపాడు. తనకి బెయిల్ అవసరం లేదని చెబుతూ జగన్ కోర్టుకి నోట్ అందించాడని ఆయన ఒంగోలు లో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం తెలిపాడు. జగన్ కి తాను స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడాని కంటే తన తల్లి ప్రచారం ద్వారానే ఎక్కువ ఓట్లు వస్తాయని నమ్ముతున్నాడని అరుణ్ కుమార్ విశ్లేషించాడు.

అరుణ్ కుమార్ మరి కొన్ని సంగతులు కూడా ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఆయన చెప్పినదాని ప్రకారం జగన్ బెంగుళూరుకే పరిమితం కావాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ఆదేశిస్తుండేవాడు. జగన్ ఎప్పుడయినా ఆంధ్ర వస్తే వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. తండ్రీ, కొడుకులకు సర్ధి చెప్పలేక వై.విజయ సతమతమవుతూ ఉండేది. తండ్రీ, కొడుకుల ఘర్షణ విషయం మాజీ ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య వద్ద వెళ్లబోసుకుని ఆమె వాపోతూ ఉండేది.

ఓపిక పడితే సి.ఎం అయ్యేవాడే

జగన్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం అవసరం. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్-చార్జి, కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన సంగతి విదితమే. ఆయన చెప్పిన వివరాల ప్రకారం జగన్ ఓపిక పట్టి ఉంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి పొందేవాడు. మరి కొంత కాలం ఓపిక పట్టి ఉంటే అసలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు.

జగన్ ఎంత అవినీతి పరుడైనా, ఆయన తండ్రి సాయంతో ప్రజాధనాన్ని ఎంత దోచుకుని తిన్నా, కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏమీ లేదని ఆజాద్ కుండ బద్దలు కొట్టాడన్నమాట. ఆమాట కొస్తే ఈ దేశాన్ని అత్యధిక కాలం పాటు ఏలిన పార్టీ కాంగ్రెస్సే. అన్నాళ్లూ దేశం నుండి లక్షల కోట్ల ప్రజాధనాన్ని విదేశాలకు తరలించుకున్నది ఆ పార్టీ పెద్దలే. అలాంటి కాంగ్రెస్ పార్టీకి జగన్ అవినీతి పట్ల అభ్యంతరం ఉందంటే ఎవరూ నమ్మరు. ఉన్న అభ్యంతరం అల్లా అధిష్టానాన్ని ధిక్కరించి ముఖ్యమంత్రి పదవిని వారసత్వ హక్కుగా డిమాండ్ చెయ్యడం పైనే కావచ్చు.

అవినీతి సోమ్మంతా జగన్ కే

వై.ఎస్ హయాంలో జరిగిన అక్రమ కేటాయింపుల ద్వారా సమకూరిన అవినీతి సోమ్మంతా జగన్ ఖాతాలకే తరలి వెళ్లిందని సి.బి.ఐ కోర్టుకు చెప్పింది. అక్రమ సంపాదనను విదేశాలకు తరలించుకు వెళ్ళిన కుట్రను తాము విదేశాలలో కనుగొన్నామని సి.బి.ఐ చెప్పినట్లు ‘ది హిందూ’ తెలియజేసింది. జగన్ అక్రమాలు విదేశాల్లో సుదీర్ఘ చాయను (long trail) ఏర్పరిచాయని సి.బి.ఐ తెలిపింది. పెట్టుబడిదారులకు వివిధ మేళ్ళు  చేయడం ద్వారా వారి నుండి అక్రమ పద్ధతుల్లో తమ కంపెనీలలోకి పెట్టుబడులు ప్రవహించేలా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ని జగన్ ప్రభావితం చేశాడని సి.బి.ఐ ఆరోపించింది.

One thought on “జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ

వ్యాఖ్యానించండి