ఆందోళన చెందవలసిన సమయంలో సైతం ధైర్యం కోల్పోకుండా 48 మంది విమాన ప్రయాణీకులను భద్రంగా గమ్యం చేర్చిన మహిళా కెప్టెన్ ఉదంతం ఇది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఒకటి సిబ్బందితో సహా 52 మంది ప్రయాణికులతో సిల్చార్ నుండి గౌహతి వెళ్లడానికి టేక్ ఆఫ్ అవుతుండగానే ముందు చక్రాలలో ఒకటి ఊడి పడిపోయింది. అయినప్పటికీ విమానాన్ని భద్రంగానే గౌహతీ లో దింపి, కెప్టెన్ ఊర్మిళ పలువురు ప్రశంసలు అందుకుంది.
ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఎటిఆర్ 9760 విమానం గౌహతి వెళ్లడానికి సిల్చార్ నుండి ఆదివారం ఉదయం బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అవుతుండగానే ముందు చక్రాలలో ఒకదానిని విమానం కోల్పోయిందని ‘ది హిందూ’ తెలిపింది. విమానం ముక్కు భాగానికి ఉండే చక్రం ఊడిపోయిందని ఎన్.డి.టి.వి తెలిపింది.
ముందుగానే విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేసిన కెప్టెన్, వైస్ కెప్టెన్ లు ప్రయాణీకులకు లాండింగ్ గేర్ విఫలం అయినట్లు చెప్పారు. గౌహతిలోని ‘లోకో ప్రియ గోపీనాధ్ బార్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నామని చెప్పి పరిణామాలకు వారిని సిద్ధం చేశారు. ఎయిర్ పోర్ట్ మీద అనేక సార్లు చక్కర్లు కొట్టి విమానంలో ఇంధనం పూర్తిగా అయిపోయేలా చేశారని ఎన్.డి.టి.వి తెలిపింది.
విమానంలో ఉన్నవారిలో 48 మంది ప్రయాణీకులు కాగా నలుగురు సిబ్బంది. విమానం ఎమర్జెన్సీ పరిస్ధితుల్లో ల్యాండ్ అయినప్పటికీ ఎవరూ గాయపడలేదు.
అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, కెప్టెన్ ఊర్మిళ యాదవ్, వైస్ కెప్టెన్ యషు లకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాడు. 52 మంది ప్రయాణాలు కాపాడారని ప్రశంసించాడు. కష్ట సమయంలో ధైర్యము, అప్రమత్తత, నేర్పు చూపారని అభినందించాడు. “మీ ధైర్య, సాహసాలు ప్రయాణీకుల విలువైన ప్రాణాలను కాపాడాయి. అందుకు హేట్సాఫ్ చెబుతున్నాను” అని వారికి ఫోన్ లో తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది.
మహిళలు అన్నీ రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటున్నారని చెప్పడం చర్వితచరణమే కాక వారినింకా అబలలుగా చూస్తూ అవమానించడమే అవుతుంది. ఇక్కడ విషయం అది కాదు. ప్రమాదకర సమయంలో సైతం ధైర్యం కోల్పోకుండా, ప్రయాణీకులను బెంబేలెత్తించకుండా అవసరమైన పనిని విజయవంతంగా పూర్తి చేయడమే ఇక్కడ ప్రశంసనీయమైన సంగతి. అంతా బాగున్నపుడు విమానాలను నడపడం పైలట్లందరూ చేయగల పనే. అనుకోని ఉపద్రవం ఎదురయినపుడే ఆయా వ్యక్తుల ప్రతిభ వెల్లడి అవుతుంది. కెప్టెన్, ఊర్మిళ, వైస్ కెప్టెన్ యషు తమకా ప్రతిభ ఉందని రుజువు చేసుకున్నారు.