మన్మోహన్ ప్రభుత్వానికి బరువవుతున్న చిదంబరం -కార్టూన్


కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న పి.చిదంబరం పై ‘అక్రమ ఎన్నిక’ కేసు కొనసాగించడానికి మద్రాసు హై కోర్టు నిర్ణయం తీసుకుంది. తన ఎన్నికపై పిటిషన్ ని కొట్టివేయాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దానితో కేంద్ర మంత్రిగా చిదంబరాన్ని కొనసాగించాలా లేదా అన్నది మన్మోహన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అవసరాన్ని ప్రధాని గుర్తించాడో లేదో గానీ, గుర్తించకపోతే పుటుక్కున తెగి నెత్తిపైనే పడడం ఖాయంగా కనిపిస్తోంది.లేదంటే, రాజీనామా చేయాలన్న బి.జె.పి డిమాండ్ ని తిరస్కరిస్తూ చిదంబరం చేసిన వాదన అంత బలహీనంగా ఎందుకుంటుంది?

మొత్తం 28 పేరాల పిటిషన్ లో 25 పేరాలు కొట్టివేయాలని చిదంబరం కోరగా ప్రభుత్వాధికారులపై ఆరోపణలున్న రెండు పేరాలను మాత్రమే కోర్టు కొట్టివేసి చిదంబరం పై ఆరోపణలున్న మిగిలిన భాగాన్నంతటినీ అనుమతించింది. ఆరోపణలపై విచారణకు కోర్టు అనుమతించినందున రాజీనామా చేయాలని ప్రత్యర్ధులు కోరుతుండగా, రెండు పేరాలు కొట్టివేసినందున రాజీనామా అనవసరం అని చిదంబరం వాదిస్తున్నాడు. అంటే 23 పేరాలు అనుమతించినందున రాజీనామా చేయాలనే గదా? ఈ విషయాన్ని మాత్రం కుంటి సాకుతో ఆయన దాటవేసాడు. విలువలు ఎలాగూ లేవు గనక రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టే అవకాశమే లేదంటే చెప్పేదేముంటుంది గనక?

వ్యాఖ్యానించండి