“నేను పత్రాలు చూశాను. నాకు అనుమానం ఉంది. నాకూ అనుమానాలు వచ్చాయి. ఆయన పరిశుభ్రమైన ప్రధాన మంత్రి నేను ఎల్లప్పుడూ భావించాను. కానీ ఫైళ్ళు చదివాక… అక్కడ ఏదో తప్పు జరిగింది.” ఇవీ అన్నా హాజరే మాటలు. “ఆయన సామాన్యమైన వ్యక్తి” అని రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కి సర్టిఫికేట్ ఇచ్చిన అన్నా హజారే సోమవారం అన్న మాటలు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా, మన్మోహన్ ని సమర్ధిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్నీ, బొగ్గు కుంభ కోణంపై విచారణ చేయాలన్న డిమాండునీ కాంగ్రెస్ వ్యతిరేక కుట్రగా అభివర్ణించిన సోనియా ప్రకటనను ఖండిస్తూ అన్నా హజారే ఈ మాటలన్నాడు. బొగ్గు కుంభ కోణం పై కాగ్ ఇచ్చిన నివేదికను చూశాక మన్మోహన్ నిజాయితీని ని శంకిస్తున్నానని అన్నా విలేఖరులతో మాట్లాడుతూ అన్నట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.
ప్రధాని, యు.పి.ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ లపై ఆధారరహిత ఆరోపణలు చేయడాన్ని కుట్రగా సోనియా కొట్టి పారేయడాన్ని అన్నా తిరస్కరించాడు. “అన్నీ ఆధారాలతో మా బృందం సిద్దం చేసిన ఫైళ్లను ఆమెకు పంపిస్తాం. ఆ తర్వాత తన ఆరోపణలే ఆధార రహితమని ఆమె అర్ధం చేసుకుంటుంది” అని అన్నా చెప్పాడు.
నిజాయితీ గల గొప్ప ప్రధాని అంటూ మన్మోహన్ కి ఉన్న ముద్ర వెనుక కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ షెల్టర్ తీసుకుంటూ వచ్చింది. భారత దేశ సహజ వనరులను, అత్యంత చౌకగా ఇష్టానుసారంగా స్వదేశీ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు వీలు కల్పించిన ‘నూతన ఆర్ధిక విధానాల’కు డాక్టర్ మన్మోహాన్ సింగ్ రూప కర్త. భారత దేశాన్ని గ్లోబలైజ్డ్ అభివృద్ధి బాట పై పరుగులు పెట్టిస్తానని చెబుతూ మన్మోహన్ తెచ్చిన ఆర్ధిక విధానాలు కోట్లాది సామాన్యులకు, శ్రమ జీవులకూ బతుకు గ్యారంటీ అనేది లేకుండా చేసినా, ఆర్ధిక అంతరాలను అనేక రెట్లు పెంచినా ఆయన మాత్రం సచ్ఛీలుడుగా కొనసాగాడు.
అన్నా హజారే ఒప్పుకోలుతో నైనా బుద్ధి జీవులకు ఆ నమ్మకం సడలేనా? లేక మన్మోహన్ ని కాంగ్రెస్ మనిషి కింద కొట్టి పారేస్తూ అదే విధానాలను మరింత వేగంతో, ఉత్సాహంతో కొనసాగించిన బి.జె.పి సచ్ఛీలతపై భ్రమలు పెరిగేనా?
ప్రధానమంత్రికి తెలియకుండా కేంద్ర మంత్రులు ఇంత అవినీతి చెయ్యగలరంటే ఎవరూ నమ్మరు. సినిమాలలో ముఖ్యమంత్రిని నిజాయితీపరునిగా, మంత్రులని మాత్రమే అవినీతిపరులుగా చూపిస్తారు. అన్నా హజారేని చూస్తోంటే అతను సినిమాలు చూసి నాటకాలు ఆడుతున్నాడేమో అనిపిస్తోంది.