‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్


భారత దేశ ‘రాజకీయ వ్యవస్ధ’, ‘బ్యూరోక్రసీ’ ల అవినీతి పై ‘ఉద్యమాస్త్రం’ ఎక్కు పెట్టిన అన్నా బృందాన్ని విడదీసి తేలిక చేయడంలో ఇరు వ్యవస్ధలూ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా అన్నా బృందం తాజాగా ఆరోపణలు చేయగా, సదరు ఆరోపణలను అన్నాయే ఆమోదించడం లేదని ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే మన్మోహన్ పై ఆరోపణలను నమ్మలేకున్నాడు. స్వామి అగ్నివేశ్ తో సహా అనేకమంది బృందం సభ్యులు ఇప్పటికే ఉద్యమం బైటికి వెళ్లిపోవడంతో పాటు బృందానికి వ్యతిరేకులుగా కూడా మారిపోయారు. ఇతర ప్రముఖ సభ్యులు అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లు మాత్రం మన్మోహన్ పై ఆరోపణలకు కాగ్ నివేదికే సాక్ష్యం అని గట్టిగా వాదిస్తుండగా, బృందం నాయకుడు వేరే దిక్కు చూస్తుండడంతో బృందం పయనం ఎటువైపో తెలియకుండా ఉంది. ప్రజా ఉద్యమాలను పక్కదారి మళ్లించడంలో ఆధిపత్య వర్గాల ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా సఫలం అయ్యాయి. అదే పరిస్ధితి ఇండియాలోనూ కనిపిస్తోంది. అసలు అన్నా బృందం ఉద్యమమే ప్రజా ఉద్యమాలకు ‘సేఫ్టీ వాల్వ్’ అన్న ఆరోపణ ఎటూ ఉంది.

-ది హిందూ నుండి.

One thought on “‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్

  1. అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మా పట్టణంలో ఆయనకి మద్దతుగా ఒక రోజు నిరాహార దీక్ష చేసి సాయింత్రం శిబిరం ఎత్తేశారు. ఇలా చెయ్యడం వల్ల నీతిగా బతకగలిగేది అన్నా హజారే లాంటి ఒకరిద్దరు వ్యక్తులేననే అభిప్రాయం కలుగుతుంది తప్ప అవినీతి మాయం అవ్వదు. అయితే, పత్రికలలో మాత్రం అన్నా హజారే దీక్షకి పట్టణంలో ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చారని వ్రాసారు. కానీ నేను నా కళ్ళతో చూసినది గార్ధభాండమే తప్ప బ్రహ్మాండం కాదు. ఉదయం కనిపించిన శిబిరానికి ఫొటోలు తీసి పేపర్‌లలో వేశారు కానీ సాయింత్రం శిబిరం ఎత్తేసిన విషయం వ్రాయనే లేదు.

వ్యాఖ్యానించండి