బి.జె.పి లుకలుకలు: అధ్యక్షుడి పై అద్వానీ అసంతృప్తి?


advani_sushma_jaitley_gadkaబి.జె.పి లో లుకలుకలు గణనీయ స్ధాయికి చేరినట్లు ఆ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.  బి.జె.పి జాతీయ కార్యవర్గం సమావేశాలు ముగిశాక గత శుక్రవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో అద్వానీ, సుష్మా పాల్గొనకపోవడం పై ఊహాగానాలు సాగుతుండగానే, అద్వానీ తన బ్లాగ్ ద్వారా తన అసంతృప్తిని మరోసారి వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ తెలిపింది. అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హయాంలో జరిగిన వివిధ తప్పులను ఎత్తిచూపుతూ పార్టీలో అంతర్మధనం అవసరమని అద్వానీ చెప్పినట్లు పత్రిక తెలిపింది.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అవినీతి ఆరోపణలపై మాయావతి తొలగించిన మంత్రులను హడావుడిగా బి.జె.పి లో చేర్చుకోవడం, జార్ఘండ్, కర్ణాటకలలో సంక్షోభాలను పరిష్కరించిన విధానం… ఇవన్నీ బి.జె.పి అవినీతి పై చేస్తున్న పోరాటాన్ని పలుచన చేశాయని అద్వానీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ నితిన్ గడ్కారీ హయాంలో జరిగినవే. ముఖ్యంగా మాయావతి బహిష్కరించిన మాజీ మంత్రి కుశభావ్ ను ఓ.బి.సి ల నాయకూడని చెబుతూ బి.జె.పి లో చేర్చుకోవడం లో గడ్కారీ టి ముఖ్య పాత్ర. అందువల్ల అద్వానీ విమర్శ, అసంతృప్తి గడ్కారీ పైనే అని భావిస్తున్నారు.

ముంబై కార్యవర్గ సమావేశాలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అంతా తానై నడిపినట్లు పత్రికలు రాశాయి. రావడానికి ఆలస్యంగా వచ్చినా వచ్చాక సమావేశాలను ఆయన తన చేతుల మీదుగానే నడిపాడని రాశాయి. ముఖ్యంగా గడ్కారీ రెండో సారి పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం వెనుక నరేంద్ర మోడిదే ముఖ్య పాత్ర అని రాశాయి. పార్టీ రాజ్యాంగం ప్రకారం రెండోసారి అధ్యక్షుడు కావడానికి వీలు లేనప్పటికీ రాజ్యాంగాన్ని సవరించి మరీ గడ్కారీ అధ్యక్షుడు కావడంలో మోడి ముఖ్య పాత్ర పోషించాడని పత్రికలు తెలిపాయి.

2014 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని బి.జె.పి ఆశీస్తోంది. బి.జె.పి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరన్నది తీవ్ర చర్చగా ఉంది. బి.జె.పి సహజ ఎంపిక అద్వానీ అని చాలా కాలం భావించారు. కానీ కొద్ది సంవత్సరాలుగా మోడీ కూడా పోటీకి రావడంతో బి.జె.పి లో విభేధాలు ఊపందుకున్నాయని తెలుస్తోంది. పర్యవసానంగానే అద్వానీ, మోడీల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్నట్లు పత్రికా కధనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అద్వానీ తన బ్లాగ్ లో రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.

“కోర్ గ్రూప్ మీటింగ్ లో నేనొక సంగతి చెప్పాను. ఈ రోజు ప్రజలు యు.పి.ఏ ప్రభుత్వం పట్ల కోపంగా ఉన్నట్లయితే, వారు బి.జె.పి పట్ల కూడా అసంతృప్తి గా ఉన్నారు. ఈ పరిస్ధితి అంతర్మధనాన్ని కోరుతోంది” అని అద్వానీ వ్యాఖ్యానించాడు. “… ఈ రోజు వరుస కుంభకోణాల వల్ల మీడియా వ్యక్తులు యు.పి.ఏ ప్రభుత్వంపై దాడి చేస్తున్నా, ఎన్.డి.ఏ పరిస్ధితికి తగ్గట్లు స్పందించడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. మాజీ విలేఖరి కూడా అయిన నేను వారు ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తున్నారని భావిస్తున్నాను” అని అద్వానీ తన బ్లాగ్ లో రాశాడు. పార్టీలో ఉత్సాహకరమైన వాతావరణం లేదని అద్వానీ వాపోయాడు.

మోడీ అండతో నితిన్ గడ్కారీ రెండో సారి అధ్యక్షుడు కావడం అంటే పార్టీపైన మోడీకి పట్టు పెరుగుతున్నదనే అర్ధం. పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ప్రధాని పదవి చేజిక్కించుకోవడానికి ఈ పట్టు తప్పనిసరిగా సహాయ పడవచ్చు. బహుశా ఈ అంశమే బి.జె.పి సీనియర్ నాయకుడు అద్వానీ పార్టీ విభేదాలను బహిరంగపరచడానికి ప్రోద్బలించి ఉండవచ్చు.

వ్యాఖ్యానించండి