ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ ‘జూలియన్ అస్సాంజ్’ ను స్వీడన్ కు తరలించడానికి ఇంగ్లండు సుప్రీం కోర్టు అంగీకరించింది. జూలియన్ ను తమకు అప్పగించాలన్న స్వీడన్ ప్రాసిక్యూటర్ల కోరిక న్యాయబద్ధమేనని మెజారిటీ తీర్పు ప్రకటించింది. ‘రీ ట్రయల్’ కు జూలియన్ కోరవచ్చని తెలుస్తోంది. దానివల్ల తరలింపు మరింత ఆలస్యం అవుతుందే తప్ప ఆపడం జరగకపోవచ్చని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ పత్రికలు వ్యాఖ్యానించాయి.
డిసెంబరు 2010 లో జూలియన్ బ్రిటన్ లో అరెస్టయ్యాడు. ఒక మహిళను రేప్ చేసిన ఆరోపణలనూ, మరో మహిళపై లైంగిక దాడి జరిపిన ఆరోపణలనూ జూలియన్ ఎదుర్కొంటున్నాడు. ఆరోపణలను జూలియన్ తిరస్కరించాడు. కేసులు రాజకీయ ప్రేరేపితమైనవనీ, అమెరికా ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ను బహిరంగ పరిచినందున ఆ దేశం ఒత్తిడి మేరకు స్వీడన్ పోలీసులు తప్పుడు కేసు బనాహించారని ఆయన ఆరోపిస్తున్నాడు.
ప్రపంచ దేశాలలో నియమితులైన అమెరికా రాయబారులు ఆయా దేశాల్లో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ‘వికీ లీక్స్’ బైటపెట్టిన డిప్లొమేటిక్ కేబుల్స్ వెల్లడి చేశాయి. వివిధ దేశాలలో ఉన్న అమెరికా రాయబారులు అమెరికా విదేశాంగ విభాగానికి (స్టేట్ డిపార్ట్ మెంట్) కేబుల్స్ రూపంలో రాసిన ఉత్తరాలే ‘డిప్లొమేటిక్ కేబుల్స్.’ వివిధ దేశాలలోని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సంఘటనలలోనూ, విధానాల లోనూ, ప్రభుత్వ నిర్ణయాలలోనూ అమెరికా నిరంతరం చేస్తూ వచ్చిన జోక్యాన్ని ఈ కేబుల్స్ వెల్లడి చేశాయి.
అమెరికా కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా రాయబారులు ఆయా ప్రభుత్వాలతో చేసిన లాబీయింగ్, ఆర్ధిక విధానాలు ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు, ఆయా దేశాల రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా, అనుకూలంగా చేసిన లాబీయింగ్… మొదలైన అమెరికా దుర్మార్గాలను కేబుల్స్ వెల్లడి చేశాయి. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా సైనికులు చేసిన దుర్మార్గాలనూ, లక్షల మంది అమాయక పౌరులను చంపేసిన దారుణాలనూ కేబుల్స్ వెల్లడి ద్వారా లోకానికి తెలిసి వచ్చింది. ఈ రెండు యుద్ధాలలో అమెరికా ప్రభుత్వం చెప్పిన అనేక అబద్ధాలు కూడా కేబుల్స్ ద్వారా వెల్లడి అయ్యాయి. కేబుల్స్ వెల్లడి అడ్డుకోవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలం అయింది. వికీలీక్స్ కు నిధులు అందకుండా అన్నీ మార్గాలూ మూసేయించింది. ఆయా బ్యాంకులపైనా, ఇంటర్ నెట్ సంస్ధల పైనా ఒత్తిడి తెచ్చి వికీలీక్స్ కు నిధులు అందకుండా కట్టడి చేసింది. కేబుల్స్ వెల్లడి ద్వారా వివిధ దేశాల ప్రభుత్వాల నుండి సమస్యలు రాకుండా అయితే చూసుకోగలిగింది గానీ వికీలీక్స్ ను మూసేయడానికి చేసిన అన్నీ ప్రయత్నాల్లోనూ విఫలం అయింది.
జూలియన్ అస్సాంజ్ పై అమెరికా రహస్య విచారణ జరుపుతున్నట్లు పత్రికలు వెల్లడి చేశాయి. జూలియన్ అస్సాంజ్ పై స్వీడన్ పోలీసులు నమోదు చేసిన కేసులను మొదట ఆ దేశ పోలీసు ఉన్నతాధికారులే కొట్టివేశారు. ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని, అసలు కేసు లేదనీ చీఫ్ ప్రాసిక్యూటర్లు తేల్చారు. అప్పటికి జూలియన్ అస్సాంజ్ స్వీడన్ లో నే ఉన్నా, విచారణకు సహకరిస్తానని చెప్పినా అవసరం లేదని పోలీసులు చెప్పారు. అయితే అస్సాంజ్ లండన్ కి వచ్చాక స్వీడన్ లో మరో నగరంలో పోలీసులు కేసు తిరగదోడినట్లు పత్రికల ద్వారా తెలిసింది. కేసే లేదని తేల్చాక, దాన్ని తిరగదోడడం రాజకీయ లక్ష్యంతో జరిగిందనీ, అమెరికా ఒత్తిడి మేరకే అది జరిగిందనీ జూలియన్ ఆరోపిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో జూలియన్ ను స్వీడన్ కి అప్పగించవచ్చని ఇంగ్లండ్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సాంకేతిక కారణాలపై జూలియన్ తరలింపు చెళ్ళడాని ఆయన లాయర్లు వాదిస్తున్నారు. స్వీడన్ కోర్టు గానీ, ప్రభుత్వం గానీ జూలియన్ తరలింపు కోరలేదనీ, కేవలం ప్రాసిక్యూటర్ మాత్రమే సమన్లు జారీ చేశాడనీ, అదీ విచారణ కోసమే సమన్లు ఇచ్చాడనీ జూలియన్ లాయర్లు వాదించారు. స్వీడన్ ప్రాసిక్యూటర్లు మాత్రం వివిధ దేశాలలో ప్రొసీజర్ల మధ్య తేడా ఉండవచ్చనీ, స్వీడన్ న్యాయ సూత్రాల ప్రకారమే ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారనీ వాదించారు. వారి వాదనను లండన్ సుప్రీం కోర్టు అంగీకరించినట్లు తెలుస్తోంది. జూలియన్ తరలింపు సక్రమమేననీ సాంకేతిక అంశాలు సరిగానే ఉన్నాయనీ కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
-ది హిందూ, బి.బి.సి, ఎం.ఎస్.ఎన్.బి.సి వార్తల ఆధారంగా