జగన్ చిరునవ్వు వెనక… -కార్టూన్


జగన్ జైలు వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. జగన్ అవినీతి అంతా ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వం ఫలితమే. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలోని ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన కీర్తిని ఆ పార్టీయే ఆయనకి ఆపాదించింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తేవడమే కాక కేంద్ర పార్టీకి 33 మంది ఎం.పిలను సరఫరా చేసిన కీర్తి కూడా వై.ఎస్.ఆర్ ఖాతాలోనే ఉంది. రాజశేఖర రెడ్డితో ఇన్ని అనుబంధాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన పాల్పడిన అవినీతితో తనకు సంబంధం లేదని ఎలా తప్పించుకోగలదు? అందువల్లనే ఇన్నాళ్లూ ఊగిసలాడిన కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఎదుర్కోవడానికి తన మంత్రులను బలి పెట్టడానికి సిద్ధపడక తప్పలేదు. మంత్రుల కోసం ఆగితే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా కళ్లముందే ఎదుగుతున్న జగన్ ను చూస్తూ ఉండవలసిందే. లేదా జగన్ ను పిలిచి సి.ఎం పదవి అప్పగించాలి. ఆ పరిస్ధితి ఎలాగూ దాటిపోయింది గనక కత్తిమీది సాముకి కాంగ్రెస్ అయిష్టంగానైనా సిద్ధపడినట్లు కనిపిస్తోంది.

జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపుకి దిగుతోందన్న ఆరోపణలు అర్ధరహితం. ఆయన అవినీతి నిజం. సదరు అవినీతి వల్ల ప్రజలు బాధలు పడ్డది నిజం. తన కంపెనీలలో పెట్టుబడులు పొందడానికి పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రజల భూములను, ఇళ్లనూ అప్పనంగా కట్టబెట్టడంలో తండ్రితో కుమ్మక్కయిన జగన్ నిందార్హుడు, శిక్షార్హుడు కూడా. అలాంటి అవినీతిపరుడి విచారణలో మరొక పార్టీ లబ్ది పొందితే అది బై ప్రొడక్టే అవుతుంది తప్ప ప్రధాన ఉత్పత్తి కానేరదు. జగన్ అవినీతి విచారణను తనకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు తిరిగి ఆ పార్టీకే అనివార్యంగా ఎదురు తిరగడం యాదృచ్ఛికమేమీ కాదు. జగన్ అవినీతిని కట్టడి చేయడం కంటె కక్ష సాధిస్తున్న ముద్రే కాంగ్రెస్ పొందుతోంది. ఆ వైపుగా జగన్ చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోవడం కాంగ్రెస్ బలహీనత. ఆ పార్టీ మంత్రులే జగన్ అవినీతికి మార్గం వేయడం ఆ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ. జగన్ అవినీతి విచారణలో చిత్తశుద్ధిని తిరుగులేని విధంగా రుజువు చేసుకుంటే తప్ప ఈ మొత్తం ఎపిసోడ్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారడం కష్టం. ఒకవేళ కాంగ్రెస్ కి అనుకూలంగా మారితే అది ప్రజల చైతన్యం అవుతుంది తప్ప కాంగ్రెస్ గొప్ప కాదు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అడకత్తెరలో పోకచెక్క పరిస్ధితే జగన్ చిరునవ్వు వెనక అంతరార్ధం కావచ్చు.

ఈ కార్టూన్ ను ‘ది హిందూ’ అందించింది.

4 thoughts on “జగన్ చిరునవ్వు వెనక… -కార్టూన్

  1. విశెఖర్ గారూ. పై లైనులో (పేరాలో) కాంగ్రెస్ పార్టీ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తన మంత్రులను బలిపెడుతోందనీ అందుకే సి.బి.ఐ ని ప్రయోగించిందని అనే అర్ధం వచ్చేలాగ రాశారు.

    కింద లైనుకు (పేరాకి) వచ్చేటప్పటికి కాంగ్రెస్ (ది) కక్షసాధింపు (అనడం) అర్దరహితం, జగన్ అవినీతి చేశాడు కనుకనే సి.బి.ఐ ని దర్యాప్తు చేపట్టిందనీ దానిలో భాగంగా కాగ్రెస్ కు లబ్ది చేకూరితే చేకూరవచ్చునని రాశారు.

    మీరు చెప్పిన దానిలో ఒకదానికి ఒకదానికి వైరుధ్యం వుందనిపిస్తుంది.

  2. రామ్మోహన్ గారూ, బలి పెట్టడం అన్నది ‘కాంగ్రెస్ పార్టీ దృష్టి’ లో నుండి వాడిన పదజాలం. కాంగ్రెస్ కి ‘అవినీతి ఆరోపణలతో’ మంత్రిని కోల్పోవడం అంటే నష్టమే తప్ప లాభం కాదు. కాని దానిని మించిన రాజకీయ లబ్ది కోసం ‘మంత్రిని కోల్పోవడం’ అనే నష్టాన్ని భరించిందన్నమాట. మంత్రి అవినీతి, జగన్ తో ఆయన కుమ్మక్కు కాంగ్రెస్ కి లెక్క కాదు. అది అవినీతి గా కాంగ్రెస్ కి కనిపించదు. దాని దృష్టంతా రాజకీయంగా ఎదురయ్యే లాభ, నష్టాలపైనే. ఆ విధమైన దృక్పధం నుండి ‘బలిపెట్టడం’ గా నేను చెప్పాను. ఇందులో మంత్రికి సానుభూతి లేదు.

  3. బ్యాంక్ ఉద్యోగి లక్ష రూపాయలు ఫ్రాడ్ చేస్తే అతని దగ్గర ఆ లక్ష రూపాయలు తిరిగిరాబట్టుకోవడంతో పాటు చెరసాలలో ఊచలు లెక్కబెట్టిస్తారు. కానీ జగన్ లాంటి VIP నలభై వేల కోట్లు ఫ్రాడ్ చేసినా, అతని దగ్గర రూపాయి కూడా తిరిగి రాబట్టరు.

వ్యాఖ్యానించండి