ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ


US, S Korea parchuting in N Koreaఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది.

దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్ గా పని చేస్తున్న ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ నీల్ టోల్లీ ఈ సంగతి వెల్లడించాడని ఎ.ఎఫ్.తెలిపింది. ఉత్తర కొరియా భూభాగం మీదికి అమెరికా, దక్షిణ కొరియా ల బలగాలు ఉత్తర కొరియాలోకి ప్రవేశించి నిర్దిష్ట మిలట్రీ వ్యవస్ధల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశాయని వార్తా సంస్ధ తెలిపింది.

“ప్రత్యేక గూఢచర్యం కోసం దక్షిణ కొరియా సైనికులనూ, అమెరికా సైనికులనూ మేము ఉత్తర ప్రాంతానికి పంపుతాము” అని అమెరికా కమాండర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. అమెరికా రాష్ట్ర ఫ్లోరిడాలోని తంపా నగరంలో జరిగిన ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్’ లో ప్రసంగిస్తూ నీల్ ఈ విషయం చెప్పాడని ఎ.ఎఫ్.పి తెలిపింది. కాన్ఫరెన్స్ గత మంగళవారం జరిగింది.

టోల్లీ ప్రకారం ఉత్తర కొరియా 1950 ల నాటి కొరియా యుద్ధం తర్వాత అనేక అండర్ గ్రౌండ్ సొరంగాలు తవ్వుకుంది. ఈ సొరంగాల్లో ఏముందో అమెరికా గూఢచర్య శాటిలైట్లు ఇంతవరకూ కనిపెట్టలేకపోయాయి. “50 సంవత్సరాల తర్వాత అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ సామర్ధ్యం ఏమిటో మాకింకా పెద్దగా తెలియదు” అని టోల్లీ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

సొరంగాలు తవ్వుకున్నా, కోట గోడలు కట్టుకున్నా అదంతా ఆయా దేశాల స్వంత వ్యవహారం. అమెరికా లాగా ఉత్తర కొరియా ఇతర దేశాల్లోకి జొరబడి పనికిమాలిన పనులు చేయడం లేదు. ఏ దేశంలోనూ వేలు పెట్టడం లేదు. తమ తమ దేశాల రక్షణ కోసం తమకు సాధ్యమైన చర్యలు చేపట్టడం ఆయా దేశాల సార్వభౌమాధికారం పరిధిలోనివి. కనుక ఉత్తర కొరియా తమ రక్షణ కోసం తమ భూభాగంలో తీసుకునే చర్యలను సాకు చూపి ఆ దేశంలోకి జొరబడి గూఢచర్యం చేపట్టడం అమెరికాకి తగని పని.

ఉత్తర, దక్షిణ కొరియాల తగాదాలు ఏమన్నా ఉంటే అవి ఆ రెండు దేశాలు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలే తప్ప వేలమైళ్ళ దూరంలోని అమెరికాకి అందులో వేలు పెట్టే హక్కు లేదు. అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధం. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఇతర దేశాలకు వర్తింపజేస్తుంది తప్ప తాను పాటించదు. దానికి అమెరికా మిలట్రీ అధికారి టోల్లీ ప్రేలాపనలే సాక్ష్యం.

ఓ పక్క విదేశాల్లో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడుతూ మరో పక్క ప్రజాస్వామ్యం గురించీ, మానవ హక్కుల గురించీ ప్రపంచ దేశాలకు నీతులు చెప్పే హక్కు అమెరికాకు ఎక్కడి నుండి వస్తుంది?

అమెరికా, యూరప్ తదితర దేశాల అణు దౌర్జన్యం ఎదుర్కొంటున్న దేశాలలో ఉత్తర కొరియా కూడా ఒకటి. ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ దేశాలతో పాటు ఉత్తర కొరియా పైన కూడా ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్’ కూటమి అణు పెత్తనం చెలాయిస్తోంది. ప్రపంచాధిపత్యం కోసం అమెరికా ఉపయోగించే అనేక ఎత్తుగడలలో అణు పెత్తనం కూడా ఒకటి. అలాంటి అణు పెత్తనం భరిస్తున్న ఉత్తర కొరియాకు ఇండియా లాంటి ప్రభావశీల దేశాలు తోడు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(జపాన్ కి చెందిన ఫారెన్ ఎఫైర్స్ పత్రిక ‘ది డిప్లొమేట్’ అమెరికా మిలట్రీ అధికారి ఒప్పుకోలును మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.)

14 thoughts on “ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ

  1. “అలాంటి అణు పెత్తనం భరిస్తున్న ఉత్తర కొరియాకు ఇండియా లాంటి ప్రభావశీల దేశాలు తోడు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.”

    ఉత్తర కొరయాకు భారత్ తోడు నిలవాలా?

    అమెరికా అణుపెత్తనం చెలాయిస్తున్న మాట నిజమే, కాని ఉత్తర కొరియా లాంటి దౌర్జన్య పాలనకు భారత దేశం ఏ రోజూ తోడు నిలవ కూడదు.

    ఉత్తర కొరియా, Nuclear Non-Proliferation Treaty నుండి స్వయంగా ఉపసంహరించుకున్నది. అందుకని అమెరికా, వారి అణు అస్త్రాలు గురంచి భయపడడం లో వింత లేదు. భారత దేశం లాగా “No First Use” పాలసీ కూడా ఉత్తర కొరియా అమలు చేయలేదు.

    ఇంకో విషయం, Korean War లో అమెరకా, దక్షిణ కొరయా తరపున పోరాడింది. ఆ యుద్దం తర్వాత ఆయా దేశాల మధ్య ఎటువంటి శాంతి ఒప్పందం లేదు. అంటే, ఆయా దేశాలు ఇంకా యుద్ధం లో ఉన్నట్లే లెక్క. అందుకని వారి గూఢాచారం చట్ట వ్యతిరేకం కాకపోవచ్చు. (గమనిక: నేను వారి గూఢాచారాన్ని సమర్ధించటం లేదు.)

  2. గౌతమ్ గారూ, అణు పెత్తనం ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. అందువల్ల ఉ.కొరియాకు ఇండియా తోడు నిలవాలి.

    ఎన్.పి.టి పై ఇండియా కూడా సంతకం చేయలేదు. అది ఇండియా హక్కు. ఎన్.పి.టి ని గొప్పగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అణ్వస్త్రాలని గుట్టలుగా పోగేసుకున్న అగ్ర రాజ్యాలే అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకంగా సుద్దులు చెప్పడం మోసం. ఆ మోసాన్ని ఇండియా గుర్తించి సంతకం చేయలేదు. ఎన్.పి.టి కూడా అణు పెత్తనానికి ఒక సాధనంగా ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్’ తయారు చేసుకున్నదే. తమ రక్షణ కోసం అణ్వస్త్రాలతో సహా ఏ ఆయుధాన్నైనా తయారు చేసుకునే హక్కు స్వతంత్ర దేశాలకు ఉంటుంది. అలాంటి హక్కు ఉ.కొరియా, ఇరాన్, ఇండియా లకు కూడా ఉంటుంది.

    ప్రపంచం అణ్వస్త్ర రహితం కావాలంటె ముందు ఆపనిని అమెరికా, రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, చైనా లాంటి దేశాలు చేయాలి. అది జరిగితే ఇతర దేశాలకు అణ్వస్త్రాలు తయారు చేసుకోవాల్సిన అగత్యం ఉండదు.

    ఏ దేశానికి కూడా, శతృ దేశం అయినా సరే, ఇతర దేశాల్లో గూఢచర్యం చట్టబద్ధం కాదు. అలా ఏ చట్టాలూ చెప్పవు. దానికి తగిన చట్టాలూ, శిక్షలు అన్ని దేశాలూ ఏర్పరచుకున్నాయి.

    మీకో ప్రశ్న. ఉత్తర కొరియా దౌర్జన్య పాలన అని ఎందుకు అంటున్నారు? ఏ దేశంపైనైనా దాడి చేసిందా? ఇరాన్ పై దాడి చేస్తానని బెదిరిస్తోందా? ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో దానికి భాగస్వామ్యం ఉందా? నాటో సభ్య దేశమా? సిరియాలో కిరాయి తిరుగుబాటు నడుపుతోందా? గాజాని ఆక్రమించిందా? టెర్రరిజం పేరు చెప్పి మరో దేశాన్ని ఆక్రమించిందా? ఎందుకలా అంటున్నారు?

  3. విశేఖర్ గారూ,

    ఈ విషయం మీద, నా అభిప్రాయాలు (అక్కడక్కడా ఆంగ్లం లో వ్రాశాను, క్షమించాలి,తెలుగు లో టైప్ చేయటం చాలా కష్టం):
    – మీరు ఇండియా నీ, ఉ కోరయా నీ ఒకే కోణంలో చూస్తున్నారు. భారత దేశం, NPT పై సంతకం చేయక పోయినా, భారత దేశం Nuclear Proliferation కు చాలా వ్యతిరేకం. దాంట్లో భారత దేశానికి చాలా మంచి రికార్డు ఉన్నది. పైగా, భారత్ స్వయం గా “No First Use” పాలసీ ని అవలంభించుకుంది. మరో వైపు ఉ. కొరియా, NPT  నుండి ఉపసంహరించుకున్నది (మీరన్నట్లు అది ఆ దేశం యోక్క హక్కు/ఇష్టం).
    కాని కొరయా తర్వాత No First Use కాని, మరే విధమైనటువంటి శాంతి చర్యలు తీసుకోవలేదు. పైగా అవసరమైతే, ద. కొరయా మీద ఎటువంటి ఆయుధాన్నయినా ఉపయోగిస్తామని తేల్చి చెప్పింది. ఇండియా పదే పదే నొక్కి చెప్పన విషయం, తాము NPT పై సంతకం చేయకపోయినా, (దానికి కారణం, 1967 Clause (i.e., only countries which tested nuclear weapons before 1967 are eligible to possess them, where as India tested in 1972) ) దానిలో ఉన్న Non Proliferation అంశాలన్నిటికీ భారత్, అంగీకరిస్తుంది.

    – ఇరాన్ విషయం లో మాత్రం నేను కేవలం అణు పెత్తనం కింద మాత్రమే భావిస్తాను. కాని ఇరాన్ దేశ అధ్యక్షుడు ఒకసారి, ప్రపంచంలో యాదులు (Jews) లేకుండా చేస్తానని శపధం చేశారు. అది శాంతికి అంత శుభ సూచకం కాదు.
    – ప్రపంచ దేశాలు అణు ఆయుధాలు వదులుకోవటం చాలా కష్టం. అది ఈ శతాబ్ధం లో అవుతుందని నాకైతే నమ్మకం లేదు. అణు ఆయుధాలు వ్యాప్తి ని నిరోధించడం ఇంకా కష్టం. అమెరికా, చైనా వంటి దేశాలు అణు ఆయుధాలు నాశనం చేసినా, మిగతా దేశాలు ఇకపై చేయవని నమ్మకం లేదు.
    – ఉత్తర కొరియా, దౌర్జన్య పాలన కన్నా దుష్ట పాలన అనడం సరి.
    For example, in N. Korea many people are indefinitely detained, tortured and killed without any judicial process (their own people). Their people are disconnected from the entire world. They’re brainwashed to believe that the rest of the world is under-developed and their school children are taught lies. The military controls every part of their life and more than half of the people are living in famine right now. They’ve tried to invade S.Korea many times in the past and they’ve hinted at using Nuclear weapons even if necessary. Unlike Syria, where the media and people are connected more to the outer world, N.Korea is very secluded. No atrocities can be detected by the rest of the world and there is no way to communicate with them. So yes, I *strongly* believe, India shouldn’t support N. Korea in any way possible.

    అమెరకా పెత్తనం చెలాయిస్తుందనటం లో సందేహం లేదు, కాని అమెరకా చేసే ప్రతీ పనిని తప్పు పట్టడం సరి కాదు. అలానే, భారత దేశం కూడా ఉ.కొరియా వంటి దేశాలతో చేతులు కలపటం మంచిది కాదు. ముఖ్యం గా అణు ఆయుధాల విషయంలో.

  4. గౌతం గారు, విషయంపై స్పష్టత కలిగి ఉంటూ ఆరోగ్యకరమైన చర్చ చేసినంతవరకూ ఏ భాష అయినా ఒకటే. కాకపోతే చర్చ బ్లాగ్ లో జరుగుతోంది గనక ఇతర పాఠకులకి కూడా అది అందుబాటులో ఉండాలంటే తెలుగుకి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. బాగా కష్టం అయితే తప్ప ఆ సంగతి దృష్టిలో ఉంచుకోగలరు.

    అమెరికా తదితర దేశాల అణు ఆధిపత్యంకి సంబంధించినంతవరకూ ఇండియా, ఉ.కొరియాలు ఒకటేనన్నది నా అభిప్రాయం. అమెరికా, యూరప్ లకి ఇండియా అంటే ప్రేమా లేదు. ఉ.కొరియా అంటే ద్వేషమూ కాదు. ఆ దేశాల కంపెనీలకి స్వేచ్ఛా అనుమతి ఇస్తే ప్రేమ చూపిస్తాయి. లేదంటే మీడియా స్వేచ్ఛ లేదనీ, హక్కులు లేవనీ, ఇనప గోడ అనీ, నియంతృత్వం అనీ ప్రచారం చేస్తాయి.

    ఉ.కొరియా ప్రభుత్వం తన ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకుంటోందన్న అభిప్రాయం నాకు లేదు. ప్రజలందరికీ సమాన హక్కులు ఇస్తోందన్న భ్రమ లేదు. కాని ఆ అంశాల ప్రాతిపదికన ఆ దేశాన్ని తప్పు పట్టే పద్ధతులు, దాని తప్పులను సవరించుకోవడానికి బైటి దేశాలు అనుసరించే పద్ధతులు వేరె ఉంటాయి.

    కొరియాలో కరువు ఉంది సరే. ఎక్కడ లేదు? ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ల్లో చాలా దేశాల్లో కరువు ఉంది. కరువు పేరు చెప్పి ఉ.కొరియాని సింగిల్ ఔట్ చేయడం సరైనదా? ఇండియాలో అన్ని స్వేచ్ఛలూ ఉన్నాయా? ఉంటే రైతుల భూముల్ని లాక్కుని కంపెనీలకి ఇష్టారాజ్యంగా అప్పజెప్పగలరా? ప్రవేటు ఆస్తి హక్కు పేదలకి బలహీనంగానూ, ధనికులకి తిరుగులేనిదిగానూ ఇండియాలో ఎందుకుంది? ఇంటర్నెట్లో సమస్త సర్వీసుల్ని (ఈ మెయిల్, ఫేస్ బుక్, చాట్, బ్లాగ్స్ ఇలా అన్నీ) స్క్రూటినీ చేసే చట్టాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టడానికి తగిన చట్టాలు ప్రభుత్వాలు చేసుకున్నాయి. దానికి దేశ ద్రోహం అనీ, టెర్రరిజం అనీ సవాలక్ష ముసుగులు తొడిగి నమ్మిస్తున్నాయి. ఇదంతా స్వేచ్ఛ అని భావించడం, భావించకపోవడం ఒకరి అవగాహనకీ, చాయిస్ కీ సంబంధించిన సంగతి.

    ఉ.కొరియా పైన మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాస్తవాలా కాదా అన్నది పరిశీలించాల్సి ఉంది. సి.ఎస్.ఎం లాంటి ప్రఖ్యాత పత్రిక చెప్పినా రష్యా విమానం పైన రష్యన్ల అనుమానాలని అనుమానించిన మీకు ఉ.కొరియా పైన ప్రచారం గురించి అనుమానాలు రాలేదా? ఒక సారి ఆ అంశాలు కూడా పరిశీలన చెయ్యండి. ఉ.కొరియా పైన మీకున్న overwhelmingly negative attitude ని మీరు చెక్ చేసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ లక్షణాలతో ఉ.కొరియా చేసేదేమీ లేదు. ఆ శక్తి దానికి లేదు. ఉ.కొరియా బాంబు వల్ల అమెరికాకి భయం ఉండడం సహజం అన్న మీ అభిప్రాయం వాస్తవాలకు తగినది గా లేదన్నది నా అభిప్రాయం.

    అమెరికా చేసే ప్రతిపనినీ తప్పు పట్టడం సరికాదు అని స్వీపింగ్ గా అనడానికి బదులు నేను తప్పు పట్టిన వివిధ అంశాలపైన చర్చ జరపడం ఉపయోగంగా ఉంటుంది.

    ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సంబంధాలు దేనికదే విడి విడిగా లేవు. అవన్నీ ఒక వ్యవస్ధలో భాగంగా ఉన్నాయి. ఆ వ్యవస్ధపైన ఒక అవగాన (తప్పయినా, ఒప్పయినా) లేకుండా ఆయా దేశాల ప్రకటనలని, వైఖరులని చర్చిస్తే అసమగ్రంగా ఉంటుంది.

  5. విశేఖర్ గారు,

    నేను సాధ్యమైనంత వరుకూ తెలుగులోనే వ్రాయటానికి ప్రయత్నిస్తాను.

    మీరన్నట్లు నేను, అమెరికా అణు ఆధిపత్యాని్న కాని, అణు పెత్తనాన్ని కాని మీతో ఎక్కడా విభేదించట్లేదు. కాని కోన్ని ముఖ్య విషయాలు మీరు గమనించండి.

    1. అణు అశ్త్రాలు చాలా విధ్వంసకరమైనవి. ఆవేశం వల్ల, లేక మూర్ఖత్వం వల్ల, లేక తప్పిదం వల్ల వాటిని ఉపయోగించినా, వాటి పరిణామాలు చాలా దారుణం గా ఉంటాయి. ఆదర్శ దృక్పధం తో చూస్తే, మీరన్నట్లు ప్రతీ దేశానికి అణు ఆయుధాలు చేశే హక్కు ఉన్నది. కాని వాస్తవిక దృక్పధం తో ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం కాకుండా నియంత్రత్వ పాలన లో ఉండే దేశాలకు అణు ఆయుధాలు ఉండడం మంచిదని మీరు భావిస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం ఒక్కటే కొలమానం కాదు, ఆ దేశ చరిత్ర, పూర్వ యుద్ధాలు అన్నీ పరిగణ లోకి తీసుకోండి. ఉ. కొరియా మాత్రమే కాదు, పాకిస్తాన్ కుడా ఆ కోవలోకే వస్తుంది. నా ఉద్దేశ్యం లో చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా మోదట నుండీ Nuclear disarmament జాగ్రత్తగా పాటించి వుంటే బాగుండేది. కాని చరిత్రను తిరగరాయటం అసాధ్యం.

    2. “ఇండియాలో అన్ని స్వేచ్ఛలూ ఉన్నాయా?”
    ఇండియా లోనే కాదు, అమెరికా లో కుడా అన్ని స్వేచ్ఛలూ లేవు. మీరు అన్నట్లు, నెమ్మదిగా ఎన్నో civil liberties నెమ్మదిగా ప్రభుత్వాలు హరించేస్తున్నాయి. కాని ఇండియా లో, అమెరకాలో ఒక రజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఒక judicial system అనేది ఉన్నది. అది ఎంతవరుకూ పేదలకు న్యాయం చేస్తుందో, దాన్లో ఎన్ని లోపాలున్నాయో అన్నది తరువాత విషయం. కనీసం మన రాజ్యాంగం, మన చట్టం ప్రజలకు ఆ హక్కులు ఉన్నాయని గుర్తిస్తాయి. కాని కొరియాలో అటువంటివి ఏమీ లేవు. మిలటరీ నాయకులు ఏదైనా చేయోచ్చు.

    3. “ఉ.కొరియా పైన మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాస్తవాలా కాదా అన్నది పరిశీలించాల్సి ఉంది”
    ఉ.కొరియా మీద, మీరన్నట్లు అమెరకా ప్రచారం ఉండచ్చు. కాని, ఎంతో మంది సాహసోపేతమైన జర్నలిష్టులు అక్కడికి వెళ్ళి ఎన్నో విషయాలు రహస్యం గా తెలుసుకుని వచ్చారు. మీరు నా వైఖరిని negative attitude అని తీసిపారేయవాచ్చు. కాని మీరు ఆ దేశ నాయకుల మాటలను, చేతలను అలా కొట్టి పారెయ్యలేరు, జర్నలిష్టుల వ్యాసాలను తీసిపాడెయ్యలేరు.

    http://www.csmonitor.com/World/Latest-News-Wires/2012/0219/North-Korea-threatens-to-attack-South-Korea-over-routine-drills

    http://www.csmonitor.com/World/Asia-Pacific/2011/1219/Kim-Jong-il-s-death-brings-end-to-era-of-cruelty-mystery

    http://www.csmonitor.com/World/Asia-Pacific/2011/1122/South-Korea-s-Yeonpyeong-Island-one-year-after-North-Korea-s-attack

    4. “ఉ.కొరియా బాంబు వల్ల అమెరికాకి భయం ఉండడం సహజం అన్న మీ అభిప్రాయం వాస్తవాలకు తగినది గా లేదన్నది నా అభిప్రాయం.”

    ఉ. కొరియా బాంబు వల్ల ముఖ్యంగా నష్టపోయేది ద. కొరియా. అటువంటి అవాంఛిత సంఘటన జరిగితే బోలెడు ప్రాణ నష్టం కలుగుతుంది. దానికి అమెరికా ఏ కాదు, మోత్తం ప్రపంచ దేశాలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనకెందుకులే, అది కేవలం వాళ్ళిద్దర మధ్య గొడవని వదిలేస్తే, అపార ప్రాణ నష్టం జరగొచ్చు.

  6. గౌతమ్ గారూ,

    1, చరిత్ర తిరగరాయడం సాధ్యం కాదు గనక తేలికగా కనపడుతున్న ఉ.కొరియా, పాకిస్ధాన్ ల అణ్వాయుధ హక్కుని తేలిక చేయవచ్చన్నమాట.

    చరిత్రలో ఎక్కువ యుద్ధాలు చేసింది, చేస్తున్నదీ, చేస్తామని బెదిరిస్తున్నదీ అమెరికా, ప్రధాన యూరప్ దేశాలు. ఇజ్రాయెల్ కూడా ఆ కోవలోనిదే. చరిత్రని తిరగరాయలేం గనక వీటిని వదిలెయ్యాలి. అవి ఎన్ని యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని దేశాలని బెదిరిస్తున్నా, స్వతంత్ర దేశాల్లోకి జొరబది డ్రోన్ విమానాలతో బాంబులేసి జనాన్ని ఇప్పటికీ చంపుతున్నా చూస్తూ ఊరుకోవాలి. పాకిస్ధాన్ లో ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు నడుస్తున్నా అవి నియంతృత్వ దేశమేనని తీర్మానించేసి దానికి అణ్వస్త్ర హక్కు లేదని నిర్ధారించాలి. బలవంతుడి దుర్మార్గాల్ని ఏమీ చెయ్యలేం గనక బలహీనుడి ప్రేలాపనలని హైలైట్ చేసి రాక్షసీకరించాలి. ఇది అసమ న్యాయం. ఈ అసమ న్యాయానికి మీరిస్తున్న సమర్ధనలు ఆక్షేపణీయం.

    ఒక దేశం తన రక్షణ కోసం చేసుకునే ఏర్పాట్లు ఆ దేశం నియంతృత్వమా, ప్రజాస్వామ్య దేశమా అన్న దానిపై ఆధారపడి ఉండదు. దేశ రక్షణ అంటే ప్రజల రక్షణ అన్నది దృష్టిలో ఉండాలి తప్ప పాలకుల రక్షణ అని కాదు.

    మీరు చెప్పిన చరిత్రే చూద్దాం. అణుబాంబులు వేసిన చరిత్ర, స్పెంట్ ఫ్యూయెల్ ని ఇరాక్ పై ప్రయోగించిన చరిత్ర, వియత్నాం పైన నాపాం బాంబులు వేసిన చరిత్ర, దేశాధ్యక్షుల ఇళ్లపైన బాంబులు వేసి చంపిన చరిత్ర, ఇతర దేశాల అధ్యక్షులను తన జైళ్లలో ఉంచిన (పనామా) ఉంచిన చరిత్ర, నియంతృత్వ ప్రభుత్వాలని సాకి కాపాడిన చరిత్ర, ప్రజాస్వామిక ప్రభుత్వాలను కుట్ర చేసి కూల్చిన చరిత్ర… ఇవన్నీ అమెరికాదే. అలాంటి అమెరికాని ఏమీ అనలేము గనక ఊరుకోవలసిందే.

    ఉ.కొరియా ఎన్ని యుద్ధాలు చేసింది? ఒక్క కొరియా యుద్ధం తప్ప. ఆ యుద్ధంలో ఇతర దేశాల్ని వదిలి ఒక్క ఉ.కొరియానే తప్పు పట్టడం ఏమిటి?

    పాకిస్ధాన్ ఎవరితో యుద్ధాలు చేసింది. ఇండియా కూడా ఆ యుద్ధంలో లేదా? పాకిస్ధాన్ వెనుక ఉన్న అమెరికాని ఎలా వదిలేస్తారు?

    ఈ అంశాలన్నీ ప్రపంచ ఆధిపత్యం కోసం (మార్కెట్ల ఆధిపత్యం కోసం) జరుగుతున్న రాజకీయాలలో భాగం కాగా దాన్నుండి వేరు చేసి చూసి దేశాల ప్రవర్తనలకు ఆపాదిస్తూ స్వతంత్ర దేశాలుగా వాటికి ఉన్న హక్కులను నిరాకరించడం, ఏ పేరుతో నైనా సరే, సరికాదు. అదే సరైందైతే, రేపు మనకీ అదే పరిస్ధితి వస్తుంది. అప్పుడేవ్వడూ తోడు రాడు.

    2. కొరియాలో మిలట్రీ ఏదైనా చెయ్యొచ్చా? రాజ్యాంగం, చట్టం లేవా?

    3.మీరిచ్చిన లింక్స్ లో ఉన్న మేటర్ కొత్తది గాదు గౌతమ్ గారూ. ఆ వార్తల వరకే చూసి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. ఈ విషయం మరోసారి పోస్ట్ ద్వారా చర్చించడానికి ప్రయత్నిస్తాను.

    4. అణు బాంబు ఉ.కొరియాకి ఉన్నా, ఇండియాకి ఉన్నా, పాక్ కి ఉన్నా అందరికీ నష్టమే. ఉ.కొరియాని వేరు చేయడమే కరెక్టు కాదు. ఆదర్శ దృక్పధం అటుంచి సాపేక్షిక దృక్పధం కూడా కాదది. కొరియాలని వాటిమానాన వాటిని వదిలేస్తే ఏ గొడవా ఉండదు. ఉ.కొరియా విషయంలో జరుగుతున్న ప్రచారం వెనుక చైనా, దాని చుట్టూ ఉన్న రాజకీయాలూ ఉన్నాయి. ఫైనాన్స్ లో చైనా అమెరికాకి పోటీగా ఎదిగింది. ఎమర్జింగ్ దేశాలని చైనా వాణిజ్యపరంగా కూడగడుతోంది. చైనా కేంద్రంగా ఏర్పడిన ఎస్.సి.ఒ ద్వారా కొంత రక్షణ ప్రయత్నాలు కూడా చైనా చేస్తోంది. అందువల్ల అమెరికా చైనాని సైనికంగా చుట్టుముట్టింది. అలా చుట్టుముట్టడంలో భాగమే ఉ.కొరియా విషయంలో మితిమీరిన జోక్యం. దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ గొడవలు కూడా దానిలో భాగమే. ఇందులో జపాన్ ప్రయోనాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఈ పరిస్ధితినుండి ఉ.కొరియా ప్రకటనలని వేరు చేసి చూస్తే తప్పు అభిప్రాయాలు కలుగుతాయి. అవి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

  7. విశేఖర్ గారు,

    1. “అవి ఎన్ని యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని దేశాలని బెదిరిస్తున్నా, స్వతంత్ర దేశాల్లోకి జొరబది డ్రోన్ విమానాలతో బాంబులేసి జనాన్ని ఇప్పటికీ చంపుతున్నా చూస్తూ ఊరుకోవాలి”

    -అమెరికా డ్రోన్ దాడులకీ, అణ్వస్త్రాలకు పోంతన లేదు. మీరు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. డ్రోన్ దాడులు ఖచ్ఛితంగా ఆ దేశ sovereignty ని ఉల్లంఘించినట్లే.

    2 “చరిత్రని తిరగరాయలేం గనక వీటిని వదిలెయ్యాలి”

    -కాదు. రష్యా, చైనా, అమెరికా దేశాలు CTBT పై సంతకం చేశాయి. అమెరికా 1992 తర్వాత అణు అస్త్ర ప్రయోగాలు చేయలేదు. CTBT తర్వాత అమెరికా కాంగ్రెస్ NPT కూడా రాటిఫై చేసంది.

    3. “పాకిస్ధాన్ ఎవరితో యుద్ధాలు చేసింది. ఇండియా కూడా ఆ యుద్ధంలో లేదా? పాకిస్ధాన్ వెనుక ఉన్న అమెరికాని ఎలా వదిలేస్తారు?”

    “ఈ అసమ న్యాయానికి మీరిస్తున్న సమర్ధనలు ఆక్షేపణీయం.”

    -మళ్లీ నేను చెప్పేది ఒక్కటే. ఇండియా “No First Use” పాలసీ అడాప్ట చేసుకుంది. అమెరికా, NPT సంతకారి కావటం తో వారు కూడా యుద్ధం లో అణ్వస్త్రాలను మోదట ఉపయోగించలేరు. పాకిస్తాన్ కు అటువంటి బంధాలేమీ లేవు. ఉ. కొరయా కు అంతే. మీరు నన్ను తప్పు అర్ధం చేసుకుంటున్నారు. ఇరాన్ దేశం NPT  సభ్యులు కాబట్టి వారు కూడా యుద్ధం లో మోదట అణు అస్త్రాలు ఉపయోగించలేరు.
    అంతే కాని అగ్ర రాజ్యం, చిన్న రాజ్్యం అన్న criteria కాదు.

    4.” కొరియాలో మిలట్రీ ఏదైనా చెయ్యొచ్చా? రాజ్యాంగం, చట్టం లేవా?”
    -ఉ. కొరియా లో రాజ్యాంగం , చట్టం ఉన్నాయా? నేరస్తుల కుటుంభాలకు కూడా శిక్షలు విధించే ప్రక్రియలు ఆ దేశం లో ఉన్నాయి. వారికి లిఖిత పూర్వం గా రాజ్యాంగం ఉందని నేను అనుకోవటం లేదు.

    5. “కొరియాలని వాటిమానాన వాటిని వదిలేస్తే ఏ గొడవా ఉండదు”
    -చాలా ఖచ్చితం గా చెప్తున్నారు. అలాగే ప్రపంచ దేశాలు హిట్లర్ కాలం లో జెర్మనీ ని మోదట్లో పట్టించుకోలేదు. లక్షలమంది యాదులను హిట్లర్ అంతం చేశాడు. అలాగని ఇరాక్ యుద్ధం లాగా అర్ధం పర్ధం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా యుద్ధానికి వెళ్ళడం కూడా సరికాదు.

    6. “మీరు చెప్పిన చరిత్రే చూద్దాం. అణుబాంబులు వేసిన చరిత్ర, స్పెంట్ ఫ్యూయెల్ ని ఇరాక్ పై ప్రయోగించిన చరిత్ర, వియత్నాం పైన నాపాం బాంబులు వేసిన చరిత్ర, దేశాధ్యక్షుల ఇళ్లపైన బాంబులు వేసి చంపిన చరిత్ర”

    -నేను చెప్పేది, అణు వ్యాప్తి చరిత్ర గురించి. గతం లో అమెరికా దుష్ట చర్యలు చేసంది, ఇప్పుడు మా వంతు అని చెప్పుకోవడం సరి కాదు. (గమనిక: అమెరికా ఆధిపత్యాని్న కాని, పెత్తనాన్ని కాని మీతో ఎక్కడా విభేదించట్లేదు. )

    7.”అణు బాంబు ఉ.కొరియాకి ఉన్నా, ఇండియాకి ఉన్నా, పాక్ కి ఉన్నా అందరికీ నష్టమే. ”
    -ఉ. కొరియా, పాకిస్తాన్ దేశాలను “No First Use” పాలసీ లాంటిది ఒక్కటైనా అలవరుచుకోమనండి, నేను మనసారా వాటి అణు హక్కులను defend చేస్తాను.

    మీరు బాగా గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే ” అణు అశ్త్రాలు చాలా విధ్వంసకరమైనవి. ఆవేశం వల్ల, లేక మూర్ఖత్వం వల్ల, లేక తప్పిదం వల్ల వాటిని ఉపయోగించినా, వాటి పరిణామాలు చాలా దారుణం గా ఉంటాయి”.

  8. గౌతం గారూ, ఇక్కడొక సమస్య వస్తోంది. పరస్పర సంబంధం ఉన్న అంశాలను నేను రాయగా మీరు వాటిని విడగొడుతున్నారు. అంటే ఆ అంశాలని కలిపి మీరు చూడడం లేదనుకుంటా. అయినా ఫర్వాలేదు. సంబంధం కలపడానికి ప్రయత్నిస్తాను. రేపు మళ్ళీ చర్చను కొనసాగిద్దాం.

  9. గౌతం గారూ,

    మీరు చర్చిస్తున్న అంశం కి సంబంధించి నేను రాస్తున్న వివరాలను మీరు విడదీసి చూస్టున్నట్లు కనిపిస్తోంది. దానివల్ల నేను డైవర్ట్ చేస్తున్నట్లు మీకు కనిపిస్తున్నట్లుంది. పరస్పర సంబంధంతో నేను రాస్తున్న అంశాలను ఒకటిగా చూడడానికి ప్రయత్నించండి.

    ప్రపంచ రాజకీయాల్లో వివిధ అంశాలన్నీ ఒకే లక్ష్యానికి లోబడి ఉంటాయి. వ్యాపార ప్రయోజనాలే ఆ లక్ష్యం. దానికి అనుగుణంగానే అణు విధానాలు, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం-నియంతృత్వం, స్వేచ్ఛ, బాలలు స్త్రీల హక్కులు మొదలయిన అంశాలలో ఆయా దేశాల విధానాలు ఉంటున్నాయి. ఈ అంశాలను విడిగా చూస్తూ ఆదర్శ దృక్పధంతో చూస్తే ఆయా దేశాల నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలు వాస్తవ అర్ధంలో స్వీకరించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి.

    పెత్తందారీ దేశాలు తమ ఆధిపత్యాన్ని విస్తరించుకోవడానికి తర తమ స్ధాయిల్లో ఎత్తుగడలు వేస్తుంటే బలహీన దేశాలు తమను తాము రక్షించుకోవడానికీ, పెత్తందారీ దేశాలకు తలొగ్గుతూనే ఉన్నంతలో తమ హక్కుల్ని, దేశాల సార్వభౌమత్వాన్నీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆధిపత్యం కోసం చేసే రాజకీయాలనీ, రక్షణ రీత్యా చేసే బలహీన రాజకీయాలనీ ఒకే స్ధాయిలో చూస్తూ ఆయా దేశాల అణ్వస్త్ర హక్కులను నిరాకరించడం సరికాదు.

    పెత్తందారీ దేశాలు చెప్పే నీతులు, సూత్రాలు అన్నీ పెత్తనాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరుచుకోవడానికి ఆయా అంశాలను వినియోగిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లోని ఏ అంశాన్ని తీసుకున్నా ఈ నేపధ్యంలోనే పరిశీలించాలి. లేకుంటే వాస్తవాలను అర్ధం చేసుకోవడం అసాధ్యంగా ఉంటుంది.

    సి.టి.బి.టి పైన ఎన్.ఎస్.జి దేశాలు ఆమోదించడం ముఖ్యం. సంతకం చేస్తే సరిపోదు. నాకు తెలిసి అమెరికా, చైనా లాంటి ఎనిమిది ఎన్.ఎస్.జి దేశాలు దాన్ని ఆమోదించలేదూ. ఒబామా ఎన్నికల్లో సి.టి.బి.టి ఆమోదం కూడా ఒకటి. అదింకా జరగనే లేదు. ఇలా ముఖ్య దేశాలు ఆమోదించని ఒప్పందాలలో ఉ.కొరియా ని సింగిల్ ఔట్ చేయడం సరికాదని నేను చెప్పాను. ఈ అంశానికి సంబంధించి నేను ఎన్ని చెప్పినా ఈ అవగహానలోనిదే.

    “అణు అశ్త్రాలు చాలా విధ్వంసకరమైనవి. ఆవేశం వల్ల, లేక మూర్ఖత్వం వల్ల, లేక తప్పిదం వల్ల వాటిని ఉపయోగించినా, వాటి పరిణామాలు చాలా దారుణం గా ఉంటాయి”

    ఈ విషయం నిజమే. అణ్వస్త్రాలని, రసాయన ఆయుధాలని, నాపామ్ బాంబుల్నీ ప్రయోగించి లక్షల మందిని చంపిన అమెరికాకి ఇది బాగా వర్తిస్తుంది.

    అమెరికా, ఇ.యు ల ప్రపంచాధిపత్య రాజకీయాలకు ఎన్.పి.టి ఒక సాధనగా మారాక దానికిక రిలవెన్స్ ఉంటుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఉ.కొరియా బలహీన దేశం. దాని విదేశీ విధానానికి తనకి ఉన్న నాలుగైదు అణు బాంబుల్నే కేంద్రంగా చేసున్నట్లు కనిపిస్తోంది. అవి తప్ప దానికి బలం లేదు. చైనా అండ ఉన్నా మిలట్రీ పరంగా చూస్తే ఆ అండ వల్ల పెద్ద ఉపయోగం ఉండడం లేదు. అణ్వస్త్రాలతో పాటు, ఇతర విధ్వంసక ఆయుధాలు ప్రయోగించిన చరిత్ర ఉన్న అమెరికాను వదిలి ఉ.కొరియా లాంటి బలహీన దేశాలను సింగిల్ ఔట్ చేయడం సరికాదన్నది నా అభిప్రాయం. నేను ప్రపంచాధిపత్య రాజకీయాలని కేంద్రంగా చేస్తున్నాను. దాని ఫాల్ ఔటే అణు రాజకీయాలపైనా ఉంది. దీనికి భిన్నంగా మీ అవగాహన ఉంది. అణు వ్యాప్తిని ప్రపంచ ఆధిపత్య రాజకీయాల నుండి వేరు చేస్తే సమగ్ర దృక్పధం సాధ్యం కాకపోవచ్చు.

    ఇదంతా ఒకే అవగాహనలో భాగం విడదీయ కుండా కలిపి చూస్తూ స్పందించడానికి ప్రయత్నించండి.

  10. విశేఖర్ గారూ,

    నేను, మీ చర్చను విడదీసినట్లు మీకు అనిపించవచ్చు. కాని, నేను కీలకమైన అంశాలను highlight చేసి నా అభిప్రాయాలు రాస్తున్నాను.

    ప్రపంచ రాజకీయాలు అన్నింటికీ వ్యాపార ప్రయోజనాలు ప్రధానం అని మీరంటున్నారు, నేను దానిని పెద్ద గా విభేదించట్లేదు. దేశాలు వాణిజ్య ప్రయోజనాలను చాటున పెట్టి, humanitarian ద్రుక్పధం తో, నాగరికత నేర్పిస్తున్నామని, అబద్ధాలు చెప్పి, ఆయా దేశాలలో దుష్ప్రచారం చేసి, ఆసియా, ఆఫ్రికా దేశాలను, ఐరోపా దేశాలు ఆక్రమం గా colonize చేశారు.
    కాని ఎన్నో ఉద్యమాల వల్ల, ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల వచ్చిన మార్పు ని మీరు అంత తేలికగా తీసి పాడేయ్యలేరు. ఇప్పటికీ అగ్రరాజ్యాలకు చాటున ఆ వ్యాపార ధృక్పధం ఉండొచ్చు, కాని స్వేచ్ఛనీ, మార్పునీ, నియంత్రత్వ పాలనా దేశాలలో advocate చేయ్యటం తప్పుకాదు. అది నజమైన స్వేచ్ఛనా, లేక illusion of choice అనేది తరువాత విషయం. కనిసం ప్రజలకు ఒక చట్టం, judicial process, fair trial అనే హక్కులు ప్రతీ దేశం లో ఉండడం అవసరం. మళ్ళీ, అది ఎంత వరకూ న్యాయం చేస్తుందో, దాన్లో ఎన్ని లోపాలున్నాయో అన్నది తరువాత విషయం.

    మీరు ఉ.కొరియా విదేశీ విధానానికి అణు బాంబులే కీలకం అని చెప్తున్నారు. కాని, వాస్తవం గా ద. కొరియా కన్నా కూడా, ఉ.కొరియా కే సైనిక బలం ఎక్కువ. మీరన్నట్లు అగ్ర రాజ్యాలు, చిన్న రాజ్యాలపై పెత్తనం చెలాయించడం, వాటికి అనుగుణంగా treaties వ్రాయించుకోవడం జరుగుతోంది. కాని, నేను ఉ. కొరియా ని NPT కాని CTBT కాని సంతకం చేయమని చెప్పట్లేదు. కేవలం అణు విజ్ణానాన్ని, శాంతి యుతంగా వాడుకుని, “No First Use” పాలసీ లాంటిదాన్ని స్వచ్ఛందంగా ప్రకటించమని చెబుతున్నాను. ఇండియా కుడా అటువంటి ప్రకటన చేయకుండా, తనకి హక్కు ఉన్నది కనుక, అవసరమేతే అణు అస్త్రాలను కూడా సంధిస్తామని తేల్చి చెప్పొచ్చు, కాని అలా చేయడం వల్ల, దేశాల మధ్య అనుమానాలు విపరీతంగా పెరిగి, తీవ్రమైన arms race కి దారి తీస్తుంది. (Although, we might heading for an asian arms race). ఇవన్నీ దేశాల మధ్య confidence పెంచుకోవటానికి ఉపయోగపడే చిన్న చిన్న steps. అలా చేయని దేశం, శాంతియుతం అణు విజ్ణానాన్ని ఉపయోగిస్తుందని గుడ్దిగా నమ్మటం సరికాదు. అగ్ర రాజ్యాలు అటు వంటి పాలసీలు అమలు చేయకుండా మేమెందుకు చేయాలి అని బెట్టుసరిగా ఉంటే, పొట్టేలు వెళ్ళి కొండను ఢీ కొట్టినట్టే. ఇక్కడ అమొరికా ఆధిపత్యం చెలాయిస్తుందనడం లో సందేహం లేదు. కాని ఇంట్లో పెద్ద వాడు చెడ్ద పని చేస్తే, నేను మంచి పని ఎందుకు చేయాలి అని భైఠాయించుకుని ఉన్నట్లు ఉంటుంది.

  11. ఉ కొరియా కి సైనిక సామర్ధ్యం ద. కొరియా కంటే ఎక్కువ వుండొచ్చు అని CSM వ్యాశాలు.
    http://www.csmonitor.com/World/Latest-News-Wires/2012/0104/North-Korea-military-has-an-edge-over-South-but-wouldn-t-win-a-war-study-finds

    http://www.csmonitor.com/World/Asia-Pacific/2012/0415/Kim-Jong-un-speaks-North-Korea-to-keep-military-first

  12. గౌతం గారూ, మీ ఈ వ్యాఖ్య సమగ్రంగా ఉంది.

    “కాని ఎన్నో ఉద్యమాల వల్ల, ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల వచ్చిన మార్పు ని మీరు అంత తేలికగా తీసి పాడేయ్యలేరు.”

    భేషైన మాట. అయితే ఇందులో ‘మీరు’ అన్నదాన్ని తొలగించాలి. ఎందుకంటే నేనలా తేలిగ్గా తీసిపారెయ్యను గనక. తీసిపారేస్తే అశేష ప్రజానీకం చేసిన త్యాగాలని తేలిక చేసినట్లే. ప్రజలు నిర్మించిన చరిత్రను తృణీకరించినట్లే.

    కొరియాల వరకే ద్వైపాక్షికంగా తీసుకుని చూస్తే ఉ.కొరియా తన ‘అణ్వస్త్ర పాటవం’ గురించి చేసే ప్రకటనలు తగనవి. జనరల్ సెన్స్ తో చూసినా ఆ ప్రకటనలను హర్షించలేము. అయితే ద.కొరియాలో అమెరికా సైన్యం ఉంది. ప్రపంచంలో అతి పెద్ద దురాక్రమణ దారు అమెరికా సైన్యాన్ని పక్కనబెట్టుకుని ఏ దేశమైనా శాంతితో బతగ్గలదా? అదీ తమపైన అమెరికా కత్తులు నూరుతున్నపుడు.

    ప్రాంతీయంగా (అంతర్జాతీయంగా కూడా) ఉ.కొరియా, దానికి మద్దతుగా ఉన్న చైనాలను అమెరికా సైనికంగా చుట్టుముట్టింది. నిజానికి చైనాని టార్గెట్ లో చెయ్యడంలో భాగమే ఉ.కొరియాపై అమెరికా వ్యతిరేకత. చైనా ఆర్ధిక ప్రయోజనాలని దెబ్బతీయడానికి అమెరికా, యూరప్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉ.కొరియా అగ్రెసివ్ పోస్చర్ ఉందన్నది గమనించాలి. అందువలన ఉ.కొరియా ధోరణి పైన ఒక అభిప్రాయానికి వచ్చే ముందు అంతర్జాతీయ రాజకీయాలను పరిగణించకుండా సింగిల్ ఔట్ చేయరాదనే నేను మొదటి నుండీ చెబుతోంది.

    మీరు చెప్పిన అర్ధంలో ఉ.కొరియా “No First Use” ను ప్రకటించవచ్చు. దాని చుట్టూ ఉన్న ఇతర అంశాలని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మీరు ప్రస్తావించిన ఇతర అంశాలతో నాకు విభేధం లేదు.

  13. విశేఖర్ గారు,

    మీరన్నట్లు అమెరికా ద. కొరియా లో తిష్ట వేసినందుకు, ఉ. కొరియా అటువంటి కఠినమైన వైఖరిని అవలంభించిందనుకుందాము. అలాంటప్పుడు అది అమెరికా, ద. కొరియా, మరియు ఉ. కొరియా మధ్యనున్న త్రైపాక్షిక సమస్య. భారత్ కు దాంతో ఎటువంటి సంబంధం లేదు. భారత్ కు సంబంధించిన వరకు, ఉ. కొరియా ఎటువంటి శాంతి పాలసీలూ అడాప్ట్ చేసుకోవలేదు. అందుకని ససేమిరా వారికి మద్దతు ఇవ్వకుడదు. పాకిస్తాన్ విషయం లో కూడా నా అభిప్రాయం అంతే. అమెరికా లాగా ద్వంద ప్రణామాలు పాటించడం మంచిదికాదు.

    కాని, ఇరాన్ విషయం లో అమెరికా ఎంత ఒత్తిడి పెట్టినా, ఇండియా ప్రతీ సారీ ఇరాన్ హక్కును defend చేసింది. (India voted against sanctions on Iran in the UNSC and still defends its right to use Nuclear technology peacefully).

    నాకు మన దేశ రాయబారుల (and diplomats) మీద చాలా గౌరవం. అగ్ర దేశాల నుండి ఎంతో వత్తిడి వచ్చినా, దేశ ప్రయోజనాలనూ, ఆదర్శ నియమాలను (idealistic policies) ఎన్నో సార్లు వారికి సాధ్యమైనంత పరిధి లో చాలా కష్టపడి కాపాడుకుంటూ వచ్చారు. శివ శంకర మీనన్, శంకర్ బాజ్ పాయ్ వంటి గప్ప వ్యక్తులు రాయబారులు కావటం మన అదృష్టం.

    నాదో చిన్న విన్నపం. అమెరికా చాటు నుండి ప్రమాదకరమైన trade agreements ఎన్నో చేస్తుంది. దాన్లో ముఖ్యమైనది ACTA. (http://en.wikipedia.org/wiki/ACTA)

    క్లుప్తం గా చెప్పాలంటే, చాలా దేశాలలో IP Laws (Intellectual Property Laws) అమెరికా లో కన్నా పౌరులకు హక్కులు ఎక్కువ వుండి, Abstract Items కి పెటెంట్స (patents) వుండవు లేదా మరింత సరళంగా ఉన్నాయి. (For example France doesn’t have Software Patents, India doesn’t have drug patents). కాని అమెరికా బలవంతముగా, బెదిరించి, చాలా దేశాల చేత sign చేయించింది. దీనిపై అందరికీ అవగాహన వచ్చేట్టు కుదిరితే ఒక వ్యాసం వ్రాయండి.

    http://arstechnica.com/tech-policy/2010/06/india-launches-offensive-against-acta-cites-due-process/

    http://arstechnica.com/tech-policy/2010/06/india-vows-to-sabotage-acta/

    http://arstechnica.com/tech-policy/2012/02/acta-is-part-of-a-multi-decade-worldwide-copyright-campaign/

    http://arstechnica.com/tech-policy/2012/05/acta-deathwatch-profs-call-process-unconstitutional-europe-revolts/

    http://arstechnica.com/tech-policy/2012/02/impeach-obama-for-bribery-anti-acta-spin-reaches-new-lows/

    ఇంకా ఎన్నో లింకులు వెతికితే.

  14. వి.శేఖర్ గారు, గౌతం మేకా గార్లకి ఇద్ధరికి ధన్యవాధములు. మీ చర్చ వల్ల ఉ.కొరియా, అమెరికా దేశాల గురించి చాలా సమాచారం తెల్సింది.

వ్యాఖ్యానించండి