కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖే తాను ప్రధాన మంత్రికి రాసిన లేఖను లీక్ చేసిందని ఆర్మీ ఛీఫ్ జనరల్ వి.కె.సింగ్ శనివారం ఆరోపించాడు. కొంత సమాచారాన్ని ఎంచుకుని మరీ లీక్ చేసి తనను ఇరికించాలని ప్రయత్నించిందని ఆరోపించాడు. మరో ఐదు రోజుల్లో రిటైర్ కానున్న వి.కె.సింగ్ తాజా ఆరోపణల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఢీ కొన్నట్లయింది. వివిధ టి.వి చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన న్యాయ వ్యవస్ధను కూడా తప్పు పట్టాడు. గాలివాటుతో పాటు తననూ వెళ్ళమని న్యాయమూర్తి తనను కోరడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పుట్టిన రోజు ధృవీకరణ పత్రంపై వి.కె.సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను గత ఫిబ్రవరిలో వి.కె.సింగ్ ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు లేవని చెబుతూ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచి సలహా ఇవ్వడంతో ఉపసంహరించుకోక తప్పలేదు. ఇద్దరు జడ్జిలలో ఒకరైన సీనియర్ జడ్జి ఆర్.ఎం.లోధా తనను గాలితో పాటు వెళ్ళమని కోరాడని ఆయన తెలిపాడు. “మనమంతా గాలివాటున వెళ్ళడం మొదలు పెడితే మనం వీధి దొంగలం అవుతాము. అవినీతిపరులుగా మిగులుతాము” అని వి.కె.సింగ్ ‘టైమ్స్ నౌ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
“గాలితో పాటు వెళ్ళేవారు తెలివిగలవారు. మీలాంటి అధికారిని కలిగి ఉన్నందుకు మేము గర్వపడతాము. క్రెడిట్ మీకే చెందాలి” అని జస్టిస్ లోధా వ్యాఖ్యానించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
సుప్రీం కోర్టు ఏ నిర్ణయమూ చెప్పకపోవడంతో తాను వయసు పై వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నానని వి.కె.సింగ్ ‘సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. “వారు నిరంకుశంగా తేల్చడానికి ప్రయత్నించారు. (They tried to arbitrate.) నేను వ్యవస్ధతో పోరాడుతున్నానని అప్పుడు అర్ధమైంది” అని ఆయన వ్యాఖ్యానించాడు. కేవలం లాబీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా పని చేయడం లేదనీ “మౌలికంగానే తప్పులు చేస్తున్నవారిని రక్షించడానికి కొందరు ప్రయత్నిస్తున్నార”నీ వ్యాఖ్యానించాడు.
తన వయసుకి సంబంధించిన పత్రాలను కూడా “చట్టవిరుద్ధంగా” రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని సింగ్ ఆరోపించాడు. ఆర్.టి.ఐ నిబంధనల కిందయినా కొన్ని పత్రాలను ఎప్పటికీ విడుదల చేయకూడనప్పటికీ విడుదల చేశారనీ, అందులో రెండు పేజీలను మంత్రిత్వ శాఖే ‘టాప్ సీక్రెట్’ గా నిర్ధారించినా విడుదల చేశారనీ ఆరోపించాడు. పత్రాలను ఎవరు విడుదల చేశారన్న ప్రశ్నకు ‘మంత్రిత్వ శాఖ’ అని సింగ్ సమాధానం ఇచ్చాడని ‘ది హిందూ’ తెలిపింది. మిమ్మల్ని ఇరికించడానికే ఎన్నుకున్న పత్రాలను విడుదల చేశారా అన్న ప్రశ్నకు సింగ్, “ఖచ్చితంగా” అని సమాధానం ఇచ్చాడు.
సైన్యంలో ఉన్న లోపాలనూ, తక్కువ సరఫరాలనూ ఎత్తి చూపుతూ ప్రధాన మంత్రి కి రాసిన లేఖను పత్రికలకు లీక్ కావడం పట్ల సింగ్ తన ఆగ్రహాన్ని దాచుకోలేదని ‘ది హిందూ’ తెలిపింది. సదరు చర్య “దేశ ద్రోహంతో కూడిన చర్య” అని సింగ్ వ్యాఖ్యానించాడు. జాయింట్ సెక్రటరీ స్ధాయి అధికారి సింగ్ లేఖను లీక్ చేసినట్లుగా ప్రభుత్వం నిర్ధారించినట్లు పి.టి.ఐ వార్తా సంస్ధ తెలియజేసింది. ఆ వార్తను ప్రభుత్వం తిరస్కరించింది. పి.టి.ఐ తన వార్తా కధనాన్ని సొంతగా తయారు చేయదనీ “ఎవరో వారికి చెప్పి ఉండాలి. అధికారికంగా నిర్ధారించగలవారెవరైనా” అని సింగ్ అన్నాడు. “జనరల్ వి.కె.సింగ్ లీక్ చేస్తున్నాడన్న అభిప్రాయం కలగజేసే లక్ష్యంతోనే లీక్ చేశారు” సింగ్ చెబుతూ “ప్రభుత్వంలో ఉన్నవారికి ఎవరికో ఒక ఎజెండా ఉంది” అని ఆరోపించాడు.
జనరల్ సింగ్ రాజకీయాల్లో చేరవచ్చన్న పుకార్లకు ఆయన స్పందించాడు. మే 31 న రిటైరయ్యాక రాజకీయాల్లో చేరవచ్చన్న వార్తలకు స్పందిస్తూ “ఏ విషయమూ నిర్ణయించుకోలేదు” అని బదులిచ్చాడు. యోగా గురు బాబా రాందేవ్ తో కలవొచ్చన్న ఊహాగానాలకు స్పందిస్తూ “నేనలా అనుకోవడం లేదు. ఇదంతా గాలిపటాలు ఎగరేసే ఊహాగానాలకు సంబంధించినది. ఇలాంటి గాలిపటాలు ఎగరేయడంతో నేను వెళ్ళను” అని సింగ్ బదులిచ్చాడు.
టాట్రా ట్రక్కుల కొనుగోలు కోసం తనకు రిటైర్డ్ ఆర్మీ అధికారి తేజీందర్ సింగ్ లంచ ఇవ్వజూపిన ఆరోపణల విషయమై సింగ్ సమాధానాలిచ్చాడు. ఈ విషయంలో సర్వీస్ నిబంధనల ప్రకారం తాను రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని తెలిపాడు. ఆంటోనీ ఏ చర్యా తీసుకోకపోవడంపై సింగ్ వ్యాఖ్యానించాడు. “ఆయన సి.బి.ఐ విచారణకు ఆదేశించాడు. అదేదో ముందే చేసి ఉండాల్సింది” అని అన్నాడు. తనవైపు నుండి ఏ చర్యా లేకపోవడంపై వ్యాఖ్యానిస్తూ “చర్య తీసుకోమని నాకు చెప్పి ఉన్నట్లయితే చర్య తీసుకుని ఉండేవాడ్ని. జరగాల్సింది జరిగి ఉండేది” అని అన్నాడు. అయితే ఆంటోనీ ‘బ్లెస్సింగ్స్’ వల్ల టాట్రా ట్రక్కుల కొనుగోలు క్లియర్ కాలేదని సింగ్ తెలిపాడు.
జనరల్ సింగ్ ను ఇరికించడానికే ఆయన లేఖను లీక్ చేశారన్న ఆరోపణను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆర్మీ వ్యవస్ధపై తమకు గౌరవం ఉన్నదని చెబుతూ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపణలకు సమాధానం ఇస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ విలేఖరులతో వ్యాఖ్యానించాడు. అయితే కాంగ్రెస్ లోని మాజీ సైనికుల విభాగం సింగ్ ను విమర్శించింది. ఆయన వ్యవస్ధతో ఆడుకుంటున్నాడని సదరు విభాగం కార్యదర్శి కెప్టెన్ ప్రవీణ్ దావర్ విమర్శించాడు. జనరల్ సింగ్ ‘లక్ష్మణ రేఖ దాటాడని” విమర్శించాడు. ఆయన వైఖరి వల్ల ఆర్మీ వ్యవస్ధకు సరిదిద్దుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వెలిబుచ్చాడు.
వ్యవస్ధలో లోపాలను వెల్లడించినపుడు సవరించుకునే చర్యలు చేపట్టే బదులు లోపాలు ఎత్తి చూపడాన్నే వినాశనకారిగా ముద్ర వేయడంలో పాలకులు సిద్ధ హస్తులు.