అక్రమాస్తుల కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సి.బి.ఐ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ అరెస్టు అయినట్లు 7:20 గంటలకు ఆయన పార్టీ నేతలు ప్రకటించారు. అరెస్టు కు ముందు పోలీసులు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ‘ది హిందూ తెలిపింది. అరెస్టయిన జగన్ ఈ రాత్రికి దిల్ కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంటాడని ఎన్.డి.టి.వి తెలిపింది. “సి.బి.ఐ జగన్ మోహన్ రెడ్డి ని 7:15 కి అరెస్టు చేసింది” అని సి.బి.ఐ ప్రతినిధి చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. అరెస్టు కు నిరసనగా రాష్ట్ర బంద్ కి వై.కా.పా పిలుపునిచ్చింది.
ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్టుతో జగన్ అరెస్టు ఖాయంగానే అందరూ భావించారు. సోమవారం జగన్ కోర్టుకి హాజరు కానున్నందున అరెస్టు చేయకపోవచ్చంటూ కొన్ని పత్రికలు విశ్లేషించాయి. అయితే జగన్ సోమవారం కోర్టుకి హాజరు కావలసిన సందర్భం, ఆదివారం ఆయన అరెస్టు అయిన సందర్భం వేరు వేరని చానెళ్ల ద్వారా తెలుస్తోంది. సి.బి.ఐ దాఖలు చేసిన మొదటి చార్జి షీటు మేరకు విచారణ కోసం జగన్ సోమవారం కోర్టుకి హాజరు కావలసి ఉండగా, వాన్ పిక్ కోసం చేసిన అక్రమ భూకేటాయింపుల కేసు విచారణలో భాగంగా ఆదివారం అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.
సాక్షులను బెదిరిస్తున్నందుకూ, సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకూ ఆదివారం జగన్ ను అరెస్టు చేసినట్లు సి.బి.ఐ చెప్పిందని బొబ్బిలి ఎమ్మెల్యేను ఉటంకిస్తూ ‘ఏ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చానెల్ చెబుతోంది. నాల్గవ చార్జీ షీటు అంశాలపై విచారణ కోసం అరెస్టు జరిగినట్లు ‘ఈ టి.వి’ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర రాజకీయాల్లో మూడవ ప్రత్యామ్నాయం లేకుండా చేసేందుకే జగన్ అరెస్టు జరిగిందని ‘సాక్షి టి.వి’ చెబుతోంది. జగన్ ను కలిసేందుకు వెళ్ళిన జగన్ తల్లి వై.విజయ, భార్య, చెల్లెలు మరో ఇద్దరు మహిళలు దిల్ కుషా గెస్ట్ హౌస్ ముందే ధర్నాకి దిగారు. వారిని తొలగించడానికి పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.
వై.కా.పా కార్యకర్తల నుండి సమస్యలను ఊహించిన పోలీసులు రాష్ట్రమంతటా ప్రధాన పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూలాంటి పరిస్ధితి విధించారని ‘ది హిందూ’ తెలిపింది. భద్రతా బలగాలు కొన్ని నగరాల్లో ఫ్లాగ్ మార్చి కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. కడప లాంటి చోట్ల షాపులు మూసేయించారు. పోలీసుల సూచనలతో ఆర్.టి.సి బస్సు సర్వీసులను గణనీయంగా తగ్గించారు. కొన్ని పట్నాల్లో వై.కా.పా నేతలు గృహ నిర్భంధంలో ఉంచారు. అరెస్టు ప్రకటించకమునుపే జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనీల్ కుమార్ లు జగన్ ను కలవడానికి హడావుడిగా వెళ్లారని ‘ది హిందూ’ తెలిపింది. సోమవారం జగన్ ను సి.బి.ఐ కోర్టులో హాజరుపరుస్తారు.
జగన్ అరెస్టు తర్వాత ఆయనకు చెడ్డపేరు తెచ్చే పనులేవీ చేయవద్దని ఆయన పార్టీ నాయకులు సబ్బం హరి, జూపూడి ప్రభాకర్ లు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా తమ నిరసనలు తెలియజేయాలని వారు కోరారు. 18 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని హింసాత్మక ఆందోళనలు చేయవద్దని జగన్ తన పార్టీ వారిని కోరినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. సోమవారం రాష్ట్ర వ్యాపిత బంద్ కి వై.కా.పా పిలుపు ఇచ్చినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆందోళనకు విజయమ్మ నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ప్రకటించాడు.
అరెస్టు అడ్డుకోవడానికి ముందస్తు బెయిల్ కు జగన్ దరఖాస్తు చేయగా ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు దానిని తిరస్కరించింది. మరో బెయిల్ పేటిషన్ సోమవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సి.బి.ఐ ని ఇప్పటికే కోరింది.
సాక్షి టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ సంస్ధలలో కొన్ని పెట్టుబడులకు సంబంధించి జగన్ ను మూడు రోజుల పాటు విచారించామనీ, తమ ప్రశ్నలకు జగన్ చెప్పిన సమాధానాలు నమ్మదగ్గవిగా లేవనీ సి.బి.ఐ చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. “టాక్స్ హేవెన్స్ అయిన మారిషస్, ఐసిల్ ఆఫ్ మన్ లాంటి దేశాల నుండి కొన్ని నిధులు వచ్చినట్లు కనుగొన్నాము. ఆయన టి.వి చానెల్, పబ్లికేషన్స్ లోకి ‘క్విడ్ ప్రో కో’ ప్రాతిపదికన పెట్టుబడులు వచ్చినట్లు దాని ద్వారా తెలుస్తున్నది. ప్రముఖ ‘ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్ మెంట్ పార్క్’ లో భూములను సదరు కంపెనీలకు కేటాయించారు” అని సి.బి.ఐ చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి తెలిపింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే పలువురిని సి.బి.ఐ అరెస్టు చేసింది. రెండవ ముద్దాయి గా ఉన్న విజయ సాయి రెడ్డి, వాన్ పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, ఐ.ఏ.ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి లను ముందు పెట్టి మూడవ రోజు జగన్ ను విచారించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఒంటరిగా కొన్ని సార్లు, ఇతర నిందితులతో కొన్ని సార్లు జగన్ విచారించిన సి.బి.ఐ ఆయనను ముప్పు తిప్పలు పెట్టినట్లు ఏ.బి.ఎన్ చానెల్ తెలిపింది. జగన్ సమాధానాలు ఇతర ముద్దాయిలు చెప్పిన సమాధానాలతో సరిపోలలేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్ తెలిపింది.
జగన్ విచారణ జరుగుతుండగానే రాష్ట్రంలో కొన్ని రాజకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే అనూహ్యంగా వై.కా.పా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ కే చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని రెండు రోజుల నుండి జగన్ వెన్నంటే ఉన్నాడు. మరింత మంది కాంగ్రెస్, తెదేపా ఎమ్మేల్యేలు తమలో చేరనున్నట్లు సంకేతాలిచ్చినట్లు జగన్ చెప్పుకున్నాడు. దానితో ఇరు పార్టీలు జాగ్రత్తలో పడినట్లు పత్రికలు చెబుతున్నాయి. జగన్ అరెస్టు తిరిగి ఆయన పార్టీకే లాభించనున్నదని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. అయితే రాజకీయంగా చైతన్యం కలవారని దేశంలో తెలుగువారికి పేరు. ఆ పేరు జగన్ విషయంలో పని చేస్తుందో లేదో ఉప ఎన్నికలు సూచించనున్నాయి.
మా పట్టణంలో ఎక్కడా బంద్ జరగలేదు. ఉదయం తొమ్మిది గంటలకే అందరూ షాప్‌లు తెరిచేశారు.
పింగ్‌బ్యాక్: https://teluguvartalu.com/2012/05/27/---/ « satyakumar1
manchi pani jagan ki alage kaavali prajala aasthulni dobbi innirojulu enjoy chesthaada