అన్నా బృందం బ్రహ్మాస్త్రం సంధించినట్లు కనిపిస్తోంది. సత్య సంధుడుగా యు.పి.ఏ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని’ ఆరోపించింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో పాటు మరో 13 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికను ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఆధారంగా చూపింది. రిటైర్డ్ న్యాయమూర్తులతో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది. అన్నా బృందం ఆరోపణలను కాంగ్రెస్ తిరస్కరించింది. ‘ఆధారరహిత కూతల’కు సమాధానం చెప్పేది లేదు పొమ్మంది.
తమ డిమాండ్లకు తలొగ్గకపోతే జులై 25 నుండి ‘ఆమరణ నిరాహార దీక్ష’ కు కూర్చుంటామని అన్నా బృందం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఇంతవరకూ ప్రధాని మన్మోహన్ పైన ఆరోపణలు చేయని అన్నా బృందం ఇపుడా సరిహద్దును చెరిపేసుకుంది. అన్నా బృందం ఆరోపణలు చేసిన మంత్రులు వీరే: ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, శరద్ పవార్, ఎస్.ఎం.కృష్ణ, కమల్ నాధ్, ప్రఫుల్ పటేల్, విలాస్ రావ్ దేశ్ ముఖ్, వీరభద్ర సింగ్, కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, జి.కె.వాసన్, ఫరూక్ అబ్దుల్లా, ఎం.ఆళగిరి, సుశీల్ కుమార్ షిండే.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండగా జరిగిన అవకతవకలపై ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఐ.జి – కాగ్) మార్చి నెలలో నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక పత్రికలకు లీక్ అయింది. దాని ప్రకారం బొగ్గు గనుల కేటాయింపుల్లో 10.6 లక్షల కోట్లు కేంద్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. అయితే నివేదిక లీక్ అయ్యాక అది అంతిమ నివేదిక కాదని కాగ్ అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అయితే నాలుగు రోజుల క్రితం మళ్ళీ కాగ్ నివేదికను ఉటంకిస్తూ పత్రికలను వార్తలు ప్రచురించాయి. ప్రవేటు కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపుల వల్ల 1.8 లక్షల కోట్లు కేంద్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తేల్చినట్లు పత్రికలు తెలిపాయి. అంటే 10.6 లక్షల కోట్ల నుండి 1.8 లక్షల కోట్లకు నష్టాన్ని కాగ్ తగ్గించింది. నివేదిక తనకింకా అందలేదని ప్రస్తుతం కేంద్రం చెబుతోంది.
2004-2009 మధ్య వేలం లేకుండా జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల వల్ల ఖజానాకు 1.8 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ అంతిమ నివేదిక తేల్చినట్లు పత్రికలు చెబుతున్నాయి. ఆదాయం సరిపడినంతగా లేకపోవడం వల్ల ‘ఫిస్కల్ డెఫిసిట్’ (బడ్జెట్ లోటు) పెరిగిపోతోందని ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు ఓవైపు సంవత్సరాల తరబడి ఆందోళన వ్యక్తం చేస్తూ విచ్చలవిడిగా పెట్రోల్ రేట్లు డజన్ల సార్లు పెంచుతూ పోతున్న క్రమంలోనే ఖజానాకి లక్షల కోట్ల రూపాయల నష్టం తెచ్చే కేటాయింపులు ప్రధాన మంత్రి చేసినట్లు కాగ్ నివేదిక ద్వారా, అన్నా బృందం ఆరోపణల ద్వారా అర్ధం అవుతోంది. దరిద్రులు కాకపోవడానికి రోజుకు పాతిక రూపాయల ఆదాయం చాలని చెబుతూ, ఆ పరిమితిని పెంచడానికి తెగ నీలుగుతున్న మంత్రులు లక్షల కోట్లను ప్రవేటు కంపెనీలకి అప్పజెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉండడం అత్యంత నీచం.
కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం పట్ల మే 22 న ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేసాయి. అయితే బొగ్గు కేటాయింపులను బొగ్గు మంత్రి జైస్వాల్ సింగ్ సమర్ధించుకున్నాడు. 1993-2004 వరకూ బహిరంగ ప్రకటనలు ఏవీ లేకుండానే కేటాయించారనీ, తాము మాత్రం ప్రకటనలు ఇచ్చి కేటాయించామనీ గొప్పలు పోయాడు. ప్రకటనలు ఇస్తే విచ్చలవిడిగా ప్రజల సొమ్ముని స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు దారాదత్తం చేయవచ్చని కాబోలు! ఇప్పుడేమో ‘ఆధార రహిత కూతలకు’ సమాధానం చెప్పేది లేదని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న రాజకీయ పార్టీకి ఉన్న బాధ్యతను ఒక్కసారిగా నేలకు విసిరి కొట్టాడు.
సమాధానం చెప్పడానికి బదులు మనీష్ తివారీ ‘shooting the messenger’ సూత్రాన్ని పాటించాడు. ఆరోపణలు చేసిన అన్నా బృందంపై ప్రత్యారోపణలకు తెగబడ్డాడు. అన్నా బృందం సభ్యురాలు కిరణ్ బేడీ, అన్నా కు రాసిన లేఖను తివారీ ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ నడుపుతున్న ఎన్.జి.ఓ సంస్ధలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ బేడీ రాసిన లేఖను ప్రస్తావించాడు. ఈ ఆరోపణలను అన్నా బృందం తిరస్కరిస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను విచారణ చేసుకోవచ్చని సవాలు విసిరింది.
ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో సిట్ నియమించి మంత్రులపై వచ్చిన ఆరోపణలను నిగ్గు దేల్చాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ఆరుగురు జడ్జిలను కూడా బృందం సూచించింది. వారు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఏ.కె.గంగూలీ, ఏ పి షా, కుల్దీప్ సింగ్, జె ఎస్ వర్మ, ఎం ఎన్ వెంకటాచలయ్య. ఈ ఆరుగురిలో ముగ్గురిని ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ గా నియమించి విచారణ జరిపించాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. 15 మంది కేంద్ర మంత్రులతో పాటు ఇతర పార్టీల నాయకులైన మాయావతి, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్, జయలలిత లపై కూడా విచారణ చేయాలని కోరింది. తద్వారా ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప దాదాపు ఇతర ప్రధాన పార్టీలపై అన్నా బృందం అవినీతి ఆరోపణలు చేసినట్లయింది. జులై 24 వరకూ చూసి సీట్ ఏర్పాటు చేయనట్లయితే జులై 25 నుండి ఆమరణ దీక్షకు దిగుతామని అల్టిమేటం ఇచ్చింది. అయితే ఎవరు దీక్షకు కూర్చుంటారనేదీ తెలియరాలేదు.
ఈ దీక్షని కూడా ఆరంభ శూరత్వం చేస్తారేమో?