అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అప ప్రధ మూట కట్టుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టడానికి సంకోచించడం లేదు. పెట్రోల్ ధరలు లీటర్ కి ఏకంగా రు. 7.54 లు పెంచడం ఆ కోవలోనిదే. ఓ పట్టాన దిగిరాని ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రజలకు ఉపశమనం చేకూర్చడానికి బదులు మరింత భారాన్ని మోపడానికే మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇరాన్ అణు బాంబు విషయంలో పశ్చిమ దేశాలు, ఇరాన్ ల మధ్య చర్చలు జరుగుతుండడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకారం మార్చి నెలలో బ్యారెల్ కు 135 డాలర్లకు పైగా పలికిన క్రూడాయిల్ ఇప్పుడు 105 డాలర్లకు దిగిపోయింది. ఈ తగ్గుదలను ప్రజలకి చేర్చడానికి బదులు మరింతగా ధరలు పెంచడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కుట్రగా కనిపిస్తోంది. పైగా రూపాయి విలువ తగ్గితే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం మరో మోసంలా కనిపిస్తోంది. పెట్రోల్ ధరలను డీ కంట్రోల్ చేసినందున అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఆ తగ్గుదలను ప్రజలకు చేరాలి. రూపాయి విలువ తగ్గడం గత రెండు మూడువారాల పరిణామంగా ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలని బట్టి తెలుస్తోంది. అలాంటిది మార్చి నెలనుండి క్రూడాయిల్ ధర తగ్గినా అది ప్రజలకి చేరకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది? ధరలు తగ్గుతున్న సమయంలో అర్జెంటుగా పెట్రోల్ ధరలు ఎందుకు పెంచింది? అంతటితో ఆగకుండా వంట గ్యాస్, కిరోసిన్, డీజెల్ ధరలను కూడా పెంచడానికి ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ సమావేశం కూడా జరపి ఆ వైపు సన్నాహాలు చేస్తుండడం ఎవరి ప్రయోజనం కోసం?
–
ఆహా! కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడెంత తేలికయిందో కదా….
–
ఈ కార్టూన్ ని ‘ది హిందూ’ అందించింది.
